కతికితే అతకదు

రెండు వారాలు ఆగి మళ్ళీ ఫోన్ చేసేడు రామం. క్లుప్తంగా మాట్లాడి, తను మరో రెండు నెలల్లో బయల్దేరుతున్నట్టూ, కాస్త బిజీగా ఉండడం వల్ల మళ్ళీ బయల్దేరేదాకా ఫోన్ చేయడం కుదరదన్నీ చెప్పేడు నీతతో.

బయల్దేరే ముందు అందరికీ ఫోన్ చేసి ప్లేన్ ఎక్కేడు రామం. కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తూ అనుకున్నాడు, వచ్చేటప్పుడు తనకి పట్టాభిషేకం అయిపోతుందా? చిన్నగా నవ్వొచ్చింది ఆ ఆలోచనకే. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.

మూడు ప్లేన్లూ, గోదావరి ఎక్స్ ప్రెస్సూ, ఓ బస్సూ ఎక్కి దిగేక అమలాపురం చేరేడు రామం పీక్కుపోయిన మొహంతో. కుశలప్రశ్నలయ్యేక దీక్షితులు చెప్పేడు రామంతో,

“ఇప్పుడు నీకు పెళ్ళి కుదరకపోతే ఇంక అంతే. అవధాన్లు గార్ని పిల్చి ముహుర్తం పెట్టించేను ఆల్రెడీ. నీకు అమ్మాయి నచ్చినట్టేనా?”

ఒక్క సారి దిమ్మ తిరిగినట్టైంది రామానికి. “ఏ అమ్మాయి?” అన్నాడు కళ్ళు చికిలించి.

“అనకాపల్లె అమ్మాయి, నీత. నువ్వు చాలా సార్లు మాట్లాడావుగా ఫోన్ మీద?”

“రెండు మూడు సార్లు మాట్లాడేను నిజమే. కానీ అసలు అమ్మాయిని చూడకుండా ముహుర్తం ఏమిటీ?”

“మేము చూశాం. మాకు నచ్చింది. నీకు నచ్చుతుంది కూడా. అన్నీ చూసుకుని ముహుర్తం పెట్టుకోవాలంటే టైం సరిపోవద్దూ? అందుకే ముహుర్తం ముందు పెట్టేశాం.”

“మీకు నచ్చేస్తా చాలా? అలా అయితే నేనెందుకూ ఇంక చూడ్డం? ఓ మంగళ సూత్రం, ఆ అమ్మాయినీ అమెరికా పంపిస్తే అక్కడే పెళ్ళి చేసుకుని ఉండేవాడ్ని కదా?” నవ్వేడు రామం.

“ఏడిశావ్ లే. మనం వచ్చే సోమవారం అనకాపల్లె వెళ్తున్నాం అమ్మాయిని చూడ్డానికి.”

“ఇంకా నయం, జాతకాలు చూడాలి అన్నారు కాదు. నేను ముందే చెప్పాను కదా, జాతకాలూ అవీ చూస్తానంటే ఇప్పుడే చెప్పండి. అసలు నేను అమ్మాయిని చూడ్డానికే రాను.”

“లేదులే అంతవరకూ రాలేదింకా. ముందిది అవనియ్యి చూద్దాం.”

నాన్న గురించి తెల్సు కనక “సరే” అని వంటింట్లోకి తప్పుకున్నాడు రామం.

అనకాపల్లె వెళ్ళే ముందే రామం నారాయణకి ఫోన్ చేసి చెప్పటం చేత, నారాయణ స్టేషన్‌కి వచ్చేడు. నారాయణ ఇంటిలోనే మకాం ఉండే రెండు రోజులూను. నారాయణ టెలిఫోన్ డిపార్ట్ మెంట్లో జేరేడు బీఎస్సీ అవగానే. కాలేజీ కబుర్లూ అవ్వీ అయ్యేక సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి బయల్దేరేరు. రామం చెప్పేడు నారాయణ వాళ్ళావిడతో,

“రాత్రికి ఏమీ వంట చెయ్యొద్దు మీరు. మేము అక్కడే భోజనం చేసి వస్తాం.”

“అదేమిటి? వాళ్ళు ఒప్పుకోవద్దూ?”

“ఎందుకొప్పుకోరూ? పోనీ ఒప్పుకోపోతే మనందరం హోటల్ కి పోదాం. బయట హొటల్లో తిని చాలా కాలం అయ్యింది నాకు.”

ఇల్లు పెద్దదే. బానే సంపాదించేరులా ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్లో, అనుకున్నాడు రామం. నిశ్శబ్దంగా గేటు తీసి లోపలకెళ్తూంటే పక్క గదిలోంచి మాటలు వినపడ్డాయ్!

“కాస్త నోరు అదుపులో ఉంచుకోండి మీరు. అబ్బాయి అసలే అమెరికా నుంచి వస్తున్నాడు. అక్కడ తెలుగు మాట్లాడతాడో లేదో? అసలిప్పుడు ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళకే తెలుగు రాయడం, చదవడం నామోషీ. ఇంక మాట్లాడ్డం ఎక్కడ?

“ఏం, అతను అమెరికాలో పుట్టేడా? తెలుగు రాకపోవడానికీ, సంకర తెలుగు మాట్లాడ్డానికీ? అమలాపురంలో పుట్టిపెరిగినవాడు తెలుగు మాట్లాడలేకపోతే ఇంకెందుకూ? ఓ నాలుగు సంవత్సరాలు అమెరికా వెళ్ళగానే పెద్ద పండితుడైపోతాడా? తెలుగు మర్చిపోవడానికి అదేమైనా బేంక్ అక్కౌంట్ నెంబరా ఏవిటి?”

“చాలు చాలు వాళ్ళు వచ్చే టైం అయ్యింది.”

పరిచయాలయ్యేక పెద్దవాళ్ళందరూ రామాన్ని, నీతనీ వదిలేసి వేరే రూములోకెళ్ళేరు. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పేక రామం అడిగేడు – యధాలాపంగా “మిమ్మల్ని ఈ సంబంధం ఒప్పుకోమని ఎవరైనా బలవంతం చేస్తున్నారా?”

నీత కంగారుగా అంది “లేదు, ఎందుకలా అనుకుంటున్నారు?”

“మొదటినుండీ అంటీ అంటనట్టు మాట్లాడుతుంటే నాకు అలాగ అనిపించింది.”

“ఓ అదా,” నీత పెదాలమీద కనీ కనపడని నవ్వు. కాసేపు కూర్చున్నాక రామం అడిగేడు,

“నా గురించి ఏమైనా కావలిస్తే అడగండి.”

“ఏమీ లేదండి. మీ అమ్మగారూ, నాన్నగారూ, మా వాళ్ళూ చెప్పారు. ఇంకేవుంది మాట్లాడ్డానికి?”

రామం లేచి వేరే రూములోకెళ్ళి చెప్పేడు “నాన్నా నేను మాట్లాడ్డం అయిపోయింది.”

అందరూ లోపలకొచ్చేక రామం తండ్రి చెప్పేడు. “శాస్త్రి గారు, మాకు అమ్మాయి ముందే నచ్చింది. ఇప్పుడు అబ్బాయి చూసేడు. ఇంక మీదే ఆలస్యం. వీడు అమెరికా వెళ్ళిపోయేలోపల పెళ్ళి చేద్దాం అనుకున్నాం కదా? ఇప్పుడు చెప్పండి. ఏమిటి మీ ఆలోచన?”

రామం కొంచెం గుర్రుగా చూసేడు తండ్రి కేసి. అమ్మాయి ఫర్వాలేదు కానీ తనకి నచ్చినట్టు చెప్పలేదు. అడిగిన ప్రశ్నలకి ఏదో తూ తూ మంత్రంలాగా సమాధానం చెప్తోంది కానీ… ఓ! తన ఇష్టం ఎప్పుడు ఏడిసింది కనక? ఇప్పుడు ఇష్టం లేదంటే తండ్రి తన మొహం పగిలేలా చివాట్లు పెట్టడూ? అమ్మకేసి చూసేడు. ఆవిడికేవీ పట్టినట్టు లేదు, శాస్త్రి గారు ఏమి చెప్తారా అని చూస్తోంది ఆవిడ.

శాస్త్రి గారు అన్నారు “జాతకాలు చూడాలి కదండీ, మా పంతులుగారు ఈ శుక్రవారం చూస్తానని చెప్పేరు. నేను శనివారం మీకు ఫోన్ చేసి చెప్తాను. ఏమంటారు?”

“జాతకాలలో నాకు నమ్మకం లేదు. అవి చూస్తానంటే నేను ఒప్పుకోను.” చటుక్కున అన్నాడు రామం.

“ఏం? అబ్బాయి జాతకంలో ఏదైనా దోషం ఏదైనా ఉందా?” నిదానంగా అడిగేరు శాస్త్రి గారు.

“వాడి మొహం. వాడి మాటకేవిటండీ? అమెరికాలో ఉన్నాడు కదా మన పద్ధతులు నచ్చవు అంతే తప్ప వాడి జాతకానికేమీ ఢోకా లేదు.” దీక్షితులు చెప్పేడు. ఈ మాటలు ఇలా సాగుతూండగా, ఈ లోపుల మళ్ళీ ఇంకోసారి ఫలహారాలు వచ్చేయి.

“తీసుకోండి. ఈ స్వీటు మా అమ్మాయే చేసింది” చెప్పింది నీత అమ్మగారు.

“అవునా, ఫలహారాలతో సరి పెట్టేస్తున్నారే? మేమింకా రాత్రి భోజనం ఇక్కడే చేద్దామనుకుంటున్నామే,” సర్దాగా అన్నాడు రామం. ఎవరూ నవ్వినట్టు కనిపించలేదు.

శాస్త్రి గారు ఒక సారి చురుగ్గా చూసేడు రామం కేసి. ఫలహారాలు అయ్యేక శాస్త్రి గారు చెప్పేరు స్థిరంగా, “చూడండీ, మీతో మాకు సంబంధం ఇష్టమే కానీ ఆచారాలన్నీ గంగలో కలపమంటే కుదరదు. కతికితే అతకదు అన్న సామెత ఊరికే వచ్చిందా? అంచేత మీకు ఈరోజు మా ఇంట్లో భోజనం కుదరదు. మీరేమనుకున్నా సరే.” అగ్నిహోత్రావుధాన్లు “మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలుపడదు” అని గిరీశంతో అన్నట్టూ వినిపించింది రామానికి ఆ డయలాగు.

“శాస్త్రి గారూ మావాడి మాటలు పట్టుకుని చెప్తున్నారే? వాడేదో అంటాడు. మీ సంగతి నాకు తెలియదా? అవన్నీ మనసులో పెట్టుకోకండి. జాతకాలు చూసేక మాకు చెప్పండి. వెళ్ళొస్తాం.” అంటూ లేచేడు దీక్షితులు. రామం పలకరింపుగా నవ్వేడు బయటకొస్తూ.

నారాయణ ఇంటికొచ్చేక కూర్చుంటూ అడిగేడు రామం, “నువ్వు చెప్పొరే, రాత్రి భోజనానికి ఏ హోటల్ పోదాం?”

ఈ లోపుల వెనక గదిలోంచి నారాయణ వాళ్ళావిడ, ఇంకో అమ్మాయి బయటకొచ్చేరు. వీళ్ళని చూసి నారాయణ చెప్పేడు రామం వాళ్ళతో, “ఈ అమ్మాయి నిర్మల అనీ, మా పిన్ని గారు కూతురు. ఈ మధ్యే కాకినాట్లో ఎం.డి. పూర్తి చేసింది. ఇక్కడ మెడికల్ కాలేజీలో ఏదో పని ఉందని వచ్చింది.”

పరిచయాలయ్యేక నారాయణ వాళ్ళావిడ చెప్పింది రామం అమ్మగారితో, “ఎందుకండీ ఆ హోటళ్ళకీ? అక్కడ పెట్టే గడ్డి తిన్నాక మళ్ళీ రోగాలు రొస్టులూనూ, నేను వండేశాను. ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేద్దాం.”

రామానికి ఇంక తప్పలేదు. భోజనం చేశాక నారాయణని బయటకి బయల్దేరదీసేడు రామం, “అలా బయటకెళ్ళి గాలి పీల్చుకొద్దాం రా” అంటూ.