పలుకుబడి – కాలమానము II

యజుర్వేదంలో కూడా అహోరాత్రం, అర్ధమాసం, మాసము, ఋతువులు, సంవత్సరాల వివరాలు ఆనాటి స్థూల కాలవిభజనగా మనకు కనిపిస్తాయి.

అర్ధమాసాస్తే కల్పంతాం, మాసాస్తే కల్పంతాం । ఋతవస్తే కల్పతాం సంవత్సరస్తే కల్పతాం ॥ (యజుర్వేద 27.45)

అయితే, ఋతువులు, కాలాల గురించి వేదవాఙ్మయంలో పరస్పర విరుద్ధమైన భావనలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఋగ్వేదంలోని పదవ మండలం పురుష సూక్తంలో వసంతం, గ్రీష్మం, శరత్తు అన్న మూడు ఋతువుల ప్రస్తావనే కనిపిస్తుంది. యజుర్వేదంలో ఒకచోట (యజుర్వేద 7.3.8) అయిదు ఋతువులను పేర్కొంటే, మరోచోట (యజుర్వేద 4.4.11) ఆరు ఋతువులను పేర్కొన్నారు. శతపథ బ్రాహ్మణంలో మూడు, అయిదు, ఆరు ఋతువులతో పాటు ఒకచోట ఏడు ఋతువుల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొత్త సంవత్సరం దక్షిణాయనంతో (summer solstice) ప్రారంభమైతే, మరికొన్ని చోట్ల ఉత్తరాయణంతో (winter solstice) ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల సంవత్సరాన్ని 360 రోజులుగా వర్ణిస్తే, మరోచోట చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికి తేడా 12 రోజులుగా వర్ణించడం కనిపిస్తుంది. (అంటే సంవత్సరానికి 366 రోజులుగా పరిగణించారిక్కడ). ఇటువంటి పరస్పర విరుద్ధమైన భావనల ద్వారా, భారతీయ కాలమాన లక్షణాలు వైదికకాలానికి పూర్తిగా అభివృద్ధి చెందలేదని మనం చెప్పుకోవచ్చు.

ఆలస్యంగా అభివృద్ధి చెందిన యుగసిద్ధాంతం

అంతేకాక, వైదిక వాఙ్మయంలో ఎక్కడా కల్ప, మహాకల్పాల గురించి గానీ, యుగ, మహాయుగాల గురించి గానీ ప్రస్తావన లేదు. యజుర్వేదంలో నిజానికి యుగం అంటే అయిదు సంవత్సరాల ఆవర్తనం. “సంవత్సరో౽సి, పరివత్సరో౽సి, ఇదావత్సరో౽సి, ఇడ్వత్సరో౽సి, వత్సరో౽సి” అన్న యజుర్వేద శ్లోకం(27.45) ప్రకారం “సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, ఇడ్వత్సర, వత్సర” అంటూ ఈ ఆవర్తంలోని ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో పేరుతో పిలిచేవారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో “పంచవత్సరో యుగమితి (అర్థశాస్త్ర ఈఈ.20)”, వేదాంగమైన జ్యోతిశ్శాస్త్రంలో “యుగం భవేద్ వత్సరపంచకేన,” అన్న నిర్వచనాలే కనిపిస్తాయి.

అయితే, కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల ప్రస్తావన, కల్ప, మహాకల్పాల కాలవిభజన మనకు మొట్టమొదటిసారిగా మహాభారతంలో కనిపిస్తుంది. అయితే, ఈ ప్రస్తావనలు కూడా మహాభారతానికి చిట్టచివర దశలో చేర్చిన భాగాలలో, తరువాత చేర్చిన ప్రక్షిప్తాలలో ఎక్కువగా కనిపించడం విశేషం. ఉదాహరణకు, 75 వేల శ్లోకాలున్న మహాభారతంలో కలియుగ ప్రస్తావన కేవలం తొమ్మిది సార్లు మాత్రమే కనిపిస్తుంది. ఇవి మహాభారతంలో ప్రక్షిప్తాలుగా చెప్పుకునే శాంతిపర్వంలోని నారాయణీయంలోనూ, అరణ్యపర్వంలోని మార్కండేయ విభాగంలోనూ ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఇవి మహాభారత మూలకథలో భాగం కాదని పండితుల వాదన. భగవద్గీతలో కృష్ణుడు “సంభవామి యుగే, యుగే” అంటాడు కాని, ఎక్కడా కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల పేర్లు చెప్పలేదు. దశావతారాల ప్రసక్తి కూడా భగవద్గీతలో లేదు. అలాగే, ‘కల్ప’ ప్రస్తావన భగవద్గీతలో ఒకే ఒక్క శ్లోకంలో కనిపిస్తుంది (9.7).

సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం (భగవద్గీత 9.7)

కౌంతేయా! కల్పక్షయమయ్యే ప్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. మరల కల్పాదియందు వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.

అదీ గాక, పురాణాల్లో ఒక కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల ఆవర్తానికి మహాయుగమని పేరు. అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే అది ఒక కల్పం అవుతుంది. కానీ, మహాభారతంలో నాలుగు యుగాల ఒక్క ఆవర్తానికే కల్పమని పేరు (12.291.14). పురాణాలు రామాయణ, మహాభారతాది ఇతిహాసాల తరువాతి కాలంలో వెలువడిన కావ్యాలు. అష్టాదశపురాణాలు సుమారు క్రీస్తుశకం 4వ శతాబ్ది నుండి 12/15వ శతాబ్దం వరకూ రాయబడ్డవని పండితుల ఊహ. గుప్తుల కాలంలోనూ, ఆ తరువాతి కాలంలోనూ రాయబడ్డ పురాణాల్లోనే మనకు యుగసిద్ధాంతము, కల్ప, మహాకల్ప కాలమానాల విభజన మొదలైన అంశాలను విపులంగా చర్చించారు. విష్ణుపురాణం మొదటి విభాగంలోని మూడవ అధ్యాయంలో ఈ యుగసిద్ధాంతపు వివరాలు కనిపిస్తాయి. అలాగే, 4వ శతాబ్దికి చెందిందిగా భావించబడే సూర్య సిద్ధాంతంలో వివరించిన స్పష్టమైన కాలవిభజన ఆతరువాతి కాలాలలో ప్రామాణిక భారతీయ కాలమానంగా స్థిరపడిపోయింది.

ఈ ఆధారాలను బట్టి యుగసిద్ధాంతం వైదిక వాఙ్మయంలో ఛాయామాత్రంగానైనా కనిపించదనీ, ఆపై మహాభారత రచనలో కనిపించినా, అది కథాంశంలో అంతగా ప్రధానమైనది కాదని మనం కచ్చితంగా చెప్పవచ్చు. తరువాతి రోజుల్లో మహాభారతానికి చేర్చిన ప్రక్షిప్తాల ద్వారా కురుక్షేత్ర యుద్ధానికి కలియుగ ఆరంభానికి లంకె పెట్టే ప్రయత్నం జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. ఈ అంశంపై మరిన్ని వివరాలకు Luis González –Reimann రాసిన పరిశోధనా పత్రం చదవండి.

సూక్ష్మ కాల విభజన

భారతీయ కాలమానంలో మనకు ఎక్కువగా కనిపించే సూక్ష్మ కాల పరిమాణం నిమేషము. నిమేషము అంటే రెప్పపాటు కాలం. అయితే, నిమేషము అంటే రెప్పపాటు అన్న అర్థం ఋగ్వేదకాలం నాటినుండి ఉన్నా, ఆ పదాన్ని ఋగ్వేదంలో కాలపరిమాణానికి వాడిన గుర్తులు కనిపించవు. ఋగ్వేదంలో రెప్పపాటు లేనివారు, దేవతలు అన్న అర్థాలలో ‘అనిమిష’, ‘అనిమేష’ అన్న ప్రయోగాలు మాత్రమే మనకు కనిపిస్తాయి.

ఉపనిషత్తుల కాలంలో మాత్రం కలా, ముహూర్త, కాష్ఠ అన్న సూక్ష్మ కాలవిభజనలు కనిపిస్తాయి. ఉదాహరణకు మాండుక్యోపనిషత్తులోని ఈ శ్లోకం చూడండి:

కలా ముహూర్తాః కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః
అర్ధమాసా మాసా ఋతవస్ సంవత్సరశ్చ కల్పంతాం (మాండుక్యోపనిషత్తు ఈ. 2.3-4)

కలా, ముహూర్త, కాష్ఠ, అహోరాత్రాలు అన్నీ కలిసి అర్ధమాస, మాస, ఋతు, సంవత్సరాలుగా అయి ఉన్నవి.

క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిందిగా చెప్పుకునే శతపథబ్రాహ్మణంలో మాత్రం విభిన్నమైన సూక్ష్మకాల విభజన కనిపిస్తుంది (శతపథ బ్రా. 12.3.2.5). ఆ విభజన ప్రకారం:

1 ముహూర్తం = 15 క్షిప్రలు
1 క్షిప్ర = 15 ఏతర్హీలు
1 ఏతర్హి = 15 ఇదానీలు
1 ఇదాని = 15 ప్రాణాలు
1 ప్రాణ = 1 నిమేషము (రెప్పపాటు)

అయితే, ఈ విభజన అంతగా ప్రాచుర్యం చెందినట్టుగా కనిపించదు. తరువాతి సాహిత్యంలో మాండుక్యోపనిషత్తులో వాడిన కలా, ముహూర్త, కాష్ఠ శబ్దాలే కాని, శతపథబ్రాహ్మణంలో వాడిన క్షిప్రలు, ఏతర్హీలు, ఇదానీలు కనిపించవు.

సూక్ష్మ కాల పరిమాణాల గురించి విపులంగా వివరించే మహాభారతం లోని శాంతిపర్వంలో కనిపించే ఈ శ్లోకాలు చూడండి:

కాష్ఠా నిమేషా దశ పంచ చైవ
త్రింశత్తు కాష్ఠా గణయేత్కలాం తాం
త్రింశత్కలాశ్చాపి భవేన్ముహూర్తో
భాగః కలాయా దశమశ్చ యః స్యాత్
త్రింశన్ముహూర్తశ్చ భవేదహశ్చ
రాత్రిశ్చ సంఖ్యా మునిభిః ప్రణీతా
మాసః స్మృతో రాత్ర్యహనీ చ త్రింశ
త్సంవత్సరో ద్వాదశమాస ఉక్తః
(మహాభారతం శాంతిపర్వం 12.224.12-16)

పై శ్లోకాల ప్రకారం:

1 నిమేషము = రెప్పపాటు కాలం
15 నిమేషములు = 1 కాష్ఠం
30 కాష్ఠములు = 1 కళ
30 కళలు = 1 ముహుర్తం
30 ముహుర్తాలు = 1 దివారాత్రి (ఒక రోజు)
30 దివారాత్రులు = 1 మాసం
12 మాసాలు = 1 సంవత్సరం

మను ధర్మశాస్త్రంలో, అర్థశాస్త్రంలో కూడా సుమారు ఇదే విభజన ఉంటుంది, కానీ వాటిలో 18 నిమేషాలు ఒక కాష్ఠం అవుతాయి. ఈ కాలంలో దాదాపు అన్ని కావ్యాలలో ఒకరోజును 30 భాగాలుగా విభజించడం కనిపిస్తుంది.