ఆ తరవాత నుంచి భీమనన్న ప్రతి మాట నిజమవడం మొదలయింది. ఒకసారి బ్రాహ్మలంతా ఒక సంతర్పణ చేసుకుంటూ భీమనని పంక్తిలో కూర్చోనివ్వలేదు. వెంటనే భీమన
అన్నం అంతా సున్నమవాలి
అప్పాలన్నీ కప్పలవాలి
అయ్యలందరూ కొయ్యలవాలి
అని శపించాడు. మరు క్షణంలో అన్నం అంతా సున్నం అయ్యింది. విస్తళ్ళలో కప్పలెగరడం మొదలు పెట్టాయి. భోజనం చేస్తున్న బ్రాహ్మలందరూ కొయ్యబొమ్మల్లా తయారయ్యారు. ఆ చుట్టూ వున్న ఇతర బ్రాహ్మలు ఈ కుర్రవాడు పెట్టిన శాపం వల్లే జరిగిందని గ్రహించి అతని కాళ్ళమీద పడి అనుగ్రహించమని వేడుకున్నారు. అతను వెంటనే
సున్నం అంతా అన్నమవాలి
కప్పలన్నీ అప్పాలవాలి
కొయ్యలన్నీ అయ్యలవాలి
అని తన శాపానికి విరుగుడు చెప్పాడు. [చాగంటి శేషయ్య, 1959-1971, Vol. 1, 208-265]
భీమనని గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో వున్నాయి. పదిహేనవ శతాబ్దపు శ్రీనాథుడు [శ్రీనాథుడు, 1969] భీమన పేరు తెలుగు కవుల వరసలో మొదటి పేరుగా చెప్పాడు. పదహారవ శతాబ్దపు పింగళి సూరన [సూరన, 1968] భీమన రాఘవపాండవీయం అనే ద్వ్యర్థి కావ్యం రాశాడనే ప్రఖ్యాతి ఉందని చెప్పాడు. పదిహేడవ శతాబ్దపు అప్పకవి నన్నయని గురించి చెప్పిన కథలో నన్నయకీ భీమనకీ ఉన్న వైరాన్ని గురించి ప్రస్తావించాడు. అయితే వీళ్ళెవ్వరూ భీమన గురించి చారిత్రకంగా నిర్ధారించుకోవడానికి కావలసిన సమాచారం ఇవ్వలేదు. వాళ్ళ కాలం నాటికి ప్రచారంలో వున్న కథల ఆధారంగానే వాళ్ళు భీమనను గురించి చెప్పారనుకోవాలి. దీన్ని గురించి మనకు తెలిసే విషయం ఏమిటంటే పదిహేనవ శతాబ్ది నాటికే భీమన కథల్లో వుండే కవి అయిపోయాడు. అంచేత నిజంగా భీమన అనే కవి ఉన్నాడో లేదో మనకు తెలియదు. అయితే ఈ భీమన బద్దెనల కర్తృత్వంలో వున్న వైరుధ్యాన్ని మనం ఎలా బోధ పరుచుకోవాలి?
ఒకే పేరుతో వున్న పుస్తకానికి ఇద్దరు కర్తలు ఉండే వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఒక పద్ధతి: పేరు ఒకటే అయినా అవి రెండు పుస్తకాలుగా చూడడం. సుమతి శతకం వాగ్వ్యవహారంలో ప్రచారం అయిన పాఠం ఒకటి, లిఖిత పూర్వకంగా ప్రచారమైన పాఠమొకటి రెండు పాఠాలు ఉన్నాయని, సౌలభ్యం కోసం ఒకదానికి వావిళ్ళ సుమతి శతకమని, రెండవ దానికి బ్రౌన్ సుమతి శతకమని పేరు పెట్టి వాటిని పరిశీలించానని మీరు గమనించారు. లౌకికంగా పైకి రావడానికి సాధికారమైన గ్రంథంగా సుమతి శతకం వుండాలని పూనుకున్న కరణాలు తమ పాఠానికి బద్దెన పేరు పెట్టుకున్నారు. వివేకవంతుడైన రాజ్య పరిపాలకుడుగా బద్దెనకు ఉన్న ప్రఖ్యాతి అతను కర్త అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక పోతే వాగ్వ్యవహారంలో కరణాలకన్నా ఎక్కువ మందిలో పేరు తెచ్చుకున్న సుమతి శతకానికి శాస్త్ర స్థాయి రావాలంటే భీమన్న పేరు పనికొస్తుంది. ఉదాహరణకి అప్పటికి శాస్త్రాలుగా పేరు పొందిన పుస్తకాలన్నీ చారిత్రకంగా ఫలానా అని చెప్పడానికి వీలులేని ఒక గొప్ప వ్యక్తి పేరుతో వున్నవే. మనువు, కౌటిల్యుడు, భరతుడు, వాత్సాయనుడు, వీళ్ళందరు ఋషులనే పేరే కాని వాళ్ళ చారిత్రక వ్యక్తిత్వాలని గురించి మనకేమి తెలియదు. ఆలా తెలియక పోవడం వల్లనే ఆ శాస్త్రాలకి అంత ప్రామాణికత వచ్చింది. భీమన పేరు అలాటిది. శాపానుగ్రహ సమర్థుడైన భీమన వశ్యవాక్కు కాబట్టి అతని పేరు ఈ సుమతి శతకానికి శాస్త్ర స్థాయిని సంపాదించి పెడుతుంది. అతనెప్పుడు పుట్టాడో, ఎన్నాళ్ళు బతికాడో, ఎక్కడ ఉన్నాడో చారిత్రకంగా తెలియక పోవడం, అతనికి అతి మానవమైన శక్తులు ఉండడం ఈ శతకానికి శాస్త్ర స్థాయి రావడానికి అవసరం.
భీమన పేరుతో శాస్త్ర స్థాయికి వచ్చిన పుస్తకం సుమతి శతకం ఒక్కటే కాదు. కవిజనాశ్రయమనే ఛందో గ్రంథానికి కూడా భీమన ఛందమనే మొన్నటివరకు పేరు. అది మల్లియ రేచన అనే వైశ్యుడైన జైన కవి రాశాడని, దాన్ని భీమనకి బ్రాహ్మలు అంట కట్టారని వీరేశలింగం, ఆరుద్ర కష్టపడి వాదించారు. ఆ పేరు వెనకాల కుల మత సందర్భాలు పట్టుకు రావడం కన్నా ఆ పుస్తకానికి శాస్త్ర స్థాయిని సంపాదించడానికి భీమన పేరు అవసరమైందని ప్రతిపాదించడమే ఎక్కువ తర్క సహజమైన ఊహ.
ఏది ఎలా వున్నా సుమతి శతకాన్ని తమ శతకంగా చేసుకుని బద్దెన పేరు పెట్టుకున్న నియోగులు, ఆ పుస్తకానికి పరిమితమైన తమ సమాజాన్ని దాటి ఎక్కువ మందిలో ప్రచారం రావడం అభ్యంతరకరంగా భావించలేదు. వాళ్ళు చదువుకున్న పుస్తకానికి బద్దెన కర్త అని వాళ్ళు పేరు పెట్టుకున్నా వాగ్వ్యవహారంలో ఉన్న సుమతి శతకానికి భీమన కర్త కావడం నిరాఘాటంగా కొనసాగింది. బద్దెన కర్త అని చెప్పే సుమతి శతక పద్యం బిగువైన లిఖిత శైలిలో వుండడం, సుమతి శతకానికి భీమన కర్త అని చెప్పే పద్యం వాక్ శైలిలో ఉండడం ఈ సందర్భంలో గమనించదగిన అంశం.
ముగింపు
సుమతి శతకం లౌకికార్థంలో నీతిని చెప్పే దశ నుంచి ఆధునికార్థంలో సుగుణాలను చెప్పే దశకి ఎంత దూరం ప్రయాణం చేసిందో మనం చూశాం. ఇప్పుడు తెలుగులో నీతి అనే మాటకి ఒకటే అర్థం. పూర్వం నీతి అనే మాటకి వేరే అర్థం ఒకటి ఉందని మనం దాదాపుగా మర్చిపోయాం. వలసవాద కాలపు భావాల ప్రభావం మనమీద ఎంత గాఢంగా వుందో చెప్పడానికి ఇదొక ముఖ్యమైన గుర్తు.
సుమతి శతకాన్ని ఉదాహరణగా తీసుకుని పుస్తక పాఠాల గురించి, పుస్తకాల కర్తృత్వాల గురించి, వాటిమీద వలసకాలపు భావాల ప్రభావం ఎంత గాఢంగా వుందో చర్చించాను. పుస్తకాల కర్తలని గురించిన కథలు కట్టుకథలుగా కొట్టి పారేయకూడదని, అవి మన పుస్తక సంస్కృతిని బోధ పరుచుకోవడానికి ప్రధానమైన ఉపకరణాలని గమనించమని నా కోరిక.
(ఈ వ్యాసం ఆంగ్ల మూలం నుంచి అనువదించబడి, ఆపైన కొన్ని మార్పులు చేర్పులు చేయబడింది. మూల వ్యాసం: Multiple lives of a text: The Sumati Satakamu in colonial Andhra in “Ritual, Caste, and Religion in Colonial South India”; M. Bergunder, H. Frese, and U. Schröder (Eds); Halle: 2010.
ఈ ప్రయత్నంలో ఎంతగానో సహకరించిన పరుచూరి శ్రీనివాస్‌కు నా కృతజ్ఞతలు.)
గ్రంథసూచి
- Anantamatyudu, Bhojarājīyamu, Madras: Vavilla Ramaswamy Sastrulu & Sons, 1962.
- Appakavi, Kakunuri, Appakavīyamu. Ed. Gidugu Ramamurti, and Utpala Venkata Narasimhacharyulu, and Ravuri Dorasami Sarma, Madras: Vavilla Ramaswamy Sastrulu & Sons, 1962.
- Aqil, Raziuddin and Partha Chatterjee. History in the Vernacular. Ranikhet: PermanentBlack. 2008.
- Arudra. Samagra Andhra Sahityam. (Revised Edition, four volumes). Hyderabad: Telugu Akadami, 2002.
- Baddena. Nitisastramuktavali. Ramakrishna Kavi, Manavalli. Ed. Tanuku. Narendranatha Sahitya Mandali. 1962.
- Bhimakavi, Vemulavada. Kavijanāśrayamu. Ed. Jayanti Ramayya, Kakinada: Andhrasahityaparishattu. (1917) Third edition, 1959.
- Brown, C.P. Editor and Translator. Sumati Satakam, Ed. C.R. Sarma. Hyderabad: Andhra Pradesh Sahitya Akademi. 1973.
- Brown, C.P. Āndhragīrvanacchandamu: The Prosody of the Telugu and Sanskrit Languages Explained. Madras: The College Press, 1827.
- Bangorey. Ed, Literary Autobiography of C.P. Brown. Tirupati: Sri Venkateswara University, 1978.
- Haridasu, Macca. Tathaymu Suamti : Parisodhana Vyasalu. Karimnagar: Indu Pracuranalu, 1984.
- Narayana Rao, Velcheru and David Shulman. A Poem at the Right Moment: Remembered Verses from Premodern South India. Berkeley: University of California Press, 1998.
- Olivelle, Parick. Tr. Pancatantra. New York: Oxford University Press, 1997.
- Paparaju, Kankanti. Uttara Ramayanamu. Madras: C.V.Krishna Book Depot, 1970.
- Ryder, Arthur W. Tr. The Panchatantra, Chicago: University of Chicago Press,(1956) 1962.
- Schmitthenner, Peter. Telugu Resurgence: C.P. Brown and Cultural Consolidation in Nineteenth-century South India, Delhi: Manohar, 2001.
- Seshayya, Caganti. Āndhra Kavitaraṅgiṇi, (14 volumes.) Kapilesvarapuramu: Hindu Dharmasastragranthanilayamu, 1959-1971.
- Srinathudu. Kaśīkhaṇḍamu, Madras: Vavilla Ramaswami Sastrulu & sons, 1969.
- Sumati Śatakamu.
- Sumatī Śatakamu. Cennapaṭṭaṇamu: Adisarasvati nilaya mudraksharasala, 1870.
- Sumatī Śatakamu. Ed. Scholars. Kakinada: Karra Accayya, 1913.
- Sumati Śatakamu. Ed. With a commentary by Gundu Raghava Diskshitulu. Bezawada:Marutiram and Companay. 1922.
- Sumati Śatakamu, Madras: Vavilla Ramaswami Sastrulu & Sons, 1962.
- Surana, Pingali. Rāghavapāṇḍavīyamu, Madras: Vavilla Ramaswamy Sastrulu & Sons, 1968.
- Venkata Rao,Nidadavolu. Satakasamputamu, Part I. Hyderabad, Andhra Pradesh Sahitya Akadami. 1966.
- Venkatarayakavi, Polipeddi “Venugopala Satakamu,” in K. Gopalakrishna Rao, Adhiksepa Śatakamulu, Hyderabad: Andhra Pradesh Sahitya Akadami. 1982. Pp. 76-123.
- Virabhadra Rao, Kottapalli. Telugu Sahityamupai Inglishu Prabahvamu. (2nd revised edition) Secunderabad: Published by author, 1986.
- Viresalingam, Kandukuri. Andhra Kavula Caritramu. Hyderabad: Visalandra Publishing House, 2005.