సుమతి శతకం ఎంత మందికి తెలుసు?
అర్థశాస్త్రంలో డబ్బు విలువ లెక్క కట్టడానికి Quantity theory of money అని ఒక సిద్ధాంతముంది. సరిగ్గా ఎంత డబ్బు వాడుకలో వుంది అని తెలుసుకోవాలంటే ఒక కాలంలో వున్న డబ్బు విలువ మదింపు వేస్తే చాలదని, అది ఒక చేతి నుంచి మరో చేతికి మారే వేగం కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఫిషర్ అనే ఆయన పేరుతో వున్న ఒక సూత్రం ప్రతిపాదిస్తుంది.
M*V = P*T అనేది సూత్రం. ఇందులో
M అంటే దేశంలో వున్న డబ్బు; V అంటే ఆ డబ్బు చలామణి అయ్యే వేగం; P అంటే దామాషా మీద ధరల స్థితి; T అంటే ఆర్ధిక వ్యవస్థలో బేరసారాల మొత్తం.
ఎవరి దగ్గరన్నా ఒక కోటి రూపాయలున్నాయనుకోండి. అవి ఇంట్లో ఇనప్పెట్టెలో ఒక ఏడాది పాటు దాచి ఉంటే ఆ యేడాది పాటు వాటి ఆర్ధిక విలువ సున్న. ఎవరి దగ్గరన్నా ఒక రూపాయి ఉందనుకొండి. ఆ రూపాయి ఏడాదిలో కోటి చేతులు మారిందనుకొండి. ఆ ఏడాదిలో ఆ రూపాయి ఆర్థిక విలువ కోటి రూపాయిలతో సమానం. ఈ సూత్రాన్ని సమాజం మీద సాహిత్యం యొక్క ప్రభావాన్ని మదింపు వేయడానికి కూడా వర్తింప చేయచ్చు. ఒక ప్రౌఢ కవి రాసిన కావ్యం చాలా కొద్ది మంది పండితులు మాత్రమే చదివారనుకొండి. ఒక మామూలు కవి రాసిన శతకం లాంటి పద్యాలు కొన్ని లక్షల మంది చదివారనుకొండి. ఈ మామూలు కవి రాసిన పద్యాలకి ఆ ప్రౌఢ కవి రాసిన కావ్యం కన్నా సమాజం మీద ఎక్కువ ప్రభావం వుందని మనం తేలిగ్గా చెప్పొచ్చు. సమాజం మీద సాహిత్య ప్రభావం లెక్క వేసేటప్పుడు వావిళ్ళ సుమతి శతకం కోటి చేతులు మారిన ఒక్క రూపాయి లాంటిది. ఒక ప్రౌఢ కవి రాసిన క్లిష్టమైన పద్యం ఇనప్పెట్టెలో దాచిన కోటి రూపాయిల లాటిది.
ఈ కాలంలో పుస్తకం యొక్క ప్రభావం అమ్ముడు పోయిన పుస్తకాల ప్రతులను బట్టి నిర్ణయించే పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతి మౌఖిక సాహిత్య సంప్రదాయానికి నప్పదు. వావిళ్ళ సుమతి శతకం యొక్క ప్రచార బాహుళ్యం అందులో వున్న అభిప్రాయాలకి ఆ సమాజంలో వున్న ఒప్పుదలని బట్టి మాత్రమే చెప్పగలం. ఇందులో కొన్ని పద్యాలు ఈ సుమతి శతకం ప్రచారంలో వున్న సమాజంలో చెప్పుకునే సామెతలకి పద్య రూపాలుగానో వాళ్ళలో జీర్ణించుకుపోయిన కొన్ని విశ్వాసాల ప్రతిబింబాలగానో తరచు కనిపిస్తాయి. కొన్ని పద్యాలు మాత్రం కవి తన అనుభవం మీద చెప్పిన మంచి మాటల్లా కనిపిస్తాయి. ఈ పద్యాలలో వినిపించే సాధికారమైన గొంతుక, క్లుప్తంగా చేయబడిన సూత్రీకరణ, అన్నింటికన్నా వెంటనే అర్థమయిపోయే భాష, తరుచు చాలా సందర్భాలలో ఉటంకించడానికి వీలైన పద్యరూపం — ఇవన్నీ వావిళ్ళ సుమతి శతకానికి ఒక శాస్త్రానికున్న గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
సుమతి శతకం పరిష్కృత ప్రతి, దాని కర్తృత్వం
బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో మన విద్యావంతులకు అలవాటైపోయిన ఒక భావం ప్రతి పుస్తకానికి చారిత్రకంగా గుర్తించదగిన ఒక కర్త ఉండాలి అనేది. కర్త పేరు తెలియక పోతే, ఆ కర్త ఏ కాలం వారో, ఏ ప్రదేశం వారో తెలియక పోతే వాళ్ళ తల్లిదండ్రులు, కులం, తెలియకపోతే మన విద్యావంతులకు ఏమీ తోచదు. అలాంటి కర్తని వెతికి పట్టుకునే దాకా వాళ్ళు విశ్రమించరు. ఇది మన అనుభవంలో మన జీవిత కాలాల్లో రచింపబడిన పుస్తకాల విషయాల్లో నిజమే అనిపిస్తుంది కూడా.
రచయిత > గ్రంథం > పాఠకులు — ఈ వరస మన మనస్సుల్లో జీర్ణించుకుపోయి, సార్వకాలిక సత్యంలా భాసిస్తుంది. కాని బ్రిటిష్ పరిపాలనకు పూర్వ భారతదేశంలో గ్రంథ కర్తృత్వం, గ్రంథ ఆవిర్భావం, గ్రంథ ప్రచారం, ఇవే వరసలోనే వుండేవా, అనే ప్రశ్న ఇంతవరకు ఎవ్వరూ వేసుకోలేదు. మౌఖికంగా పుస్తకాలు ప్రచారమయ్యే భారతదేశంలో పైన చెప్పిన కర్త > గ్రంథం > పాఠకులు అనే క్రమం ఇంకొక రకంగా కూడా వుండేదని అక్కడ కర్త గ్రంథాన్ని చేయడు, గ్రంథమే కర్తని తయారు చేస్తుందని చెప్పడానికి కావలసినంత జాగా వుంది. [ఈ విషయమై ఈ చిన్న వ్యాసంలో వివరంగా సిద్ధాంతం చేయడానికి అవకాశం లేదు. దీనిని గురించి వేరే వ్యాసం రాస్తున్నాను. అంచేత ఇక్కడ ఎక్కువ రాయను.] ప్రతి గ్రంథానికి మూల రచయిత ఒకరున్నారని ఆ గ్రంథానికి లేఖకుల, పాఠకుల చేతిలో వచ్చిన లోపాలన్నీ సవరిస్తే పరిశుద్ధమైన మూలప్రతి ఒకటుందని అనే నమ్మకం వల్ల మన సుమతి శతకానికి కూడా ఒక మూలప్రతి తయారు చేయడానికి ప్రయత్నం చేశాం.
పుస్తకాలకి పరిశుద్ధ ప్రతులు చేయడం మనకి సి. పి. బ్రౌన్ నేర్పాడు. ఆయన పెట్టిన వరవడినే వావిళ్ళ వాళ్ళు అనుసరించారు. దొరికిన లిఖిత ప్రతులన్నీ కలిపేసేసి అవన్నీ ఒక చోట పెట్టి అందులో లోప భూయిష్టంగా కనిపించే మాటల్నీ చరణాలనీ తీసేసి లేఖక ప్రమాదాలనీ వ్యాకరణ దోషాలనీ తొలగించి తయారు చేసేది శుద్ధప్రతి. ఈ రకమైన శుద్ధప్రతి సుమతి శతకానికి కూడా తయారు చేయొచ్చని 1988లో ఆరుద్ర కూడా అన్నాడు: “లేఖకులు చేర్చిన అధిక పాఠాలేవో గుర్తుపట్టాలంటే వివిధ తాళపత్ర ప్రతులను తులనాత్మకంగా పరిశీలించి సుమతి శతకానికి సంశోధిత ప్రతిని తయారుచేయాలి. ఇది కర్తృత్వ సమస్యను కూడా తేల్చడానికి పనికి రావచ్చును.”
ఇరవయ్యొవ శతాబ్దపు తొలి రోజులనుంచీ కూడా సుమతి శతకం ఎవరు రాశారు అనే వివాదం పండితుల్లో వుంది. కొందరి అభిప్రాయంలో బద్దెన సుమతి శతక కర్త. మరి కొందరు బద్దెన కాదు భీమన రాశాడన్నారు. కొన్ని సుమతి శతకపు లిఖిత ప్రతుల్లో కనిపించే ఈ కింది పద్యం భీమన రాశాడనే వాళ్ళకి ఆధారం. దానితో పాటు పద్ధెనిమిదవ శతాబ్దపు కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సార సంగ్రహంలో భీమననే సుమతి శతక కర్తగా గుర్తించాడు. ఇంతకీ ఆ రాతప్రతుల్లో కనిపించే పద్యం ఇది.
శ్రీకరముగ భీమనమును
లోకమునకు బొగడగా విలోకించి మదిన్
బ్రాకటముగ సుమతికి మతి
చేకూడగ సుమతినీతి చెప్పదొడంగెన్
ఈ రాతప్రతిలో భీమన రాసిన పుస్తకం పేరు సుమతి శతకం కాదు సుమతి నీతి. అంటే బద్దెనీతి అనే పేరును తలిపించే పేరు. ఇదే పద్యం వావిళ్ళ సుమతి శతకం చాలా ప్రతుల్లో కూడా చివర కనిపిస్తుంది.
[ఈ పద్యం మద్రాసులోని ఓరియంట్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీలో 1810వ నంబరు రాతప్రతిలో వుందని మచ్చా హరిదాసు (1984) గుర్తించాడు. అయితే ఈ పుస్తకాలు తిరుపతికి చేరాయని నేను వింటున్నాను.]
ఇక పోతే మానవల్లి రామకృష్ణ కవి, వంగూరి సుబ్బారావు, నిడదవోలు వెంకటరావు సుమతి శతకానికి బద్దెనే కర్తని వాదించారు. బద్దెన రాసిన నీతిశాస్త్ర ముక్తావళిలో (దీనికే బద్దెనీతి అని పేరు) కనిపించే ఈ పద్యం వీరికి ఆధారం.
శ్రీవిభుడ గర్వితారి
క్షమావరదళనోపలబ్ధజయలక్ష్మీసం
భావితుడ సుమతిశతకము
గావించిన ప్రోడ గావ్యకమలాసనుడన్
భీమనా? బద్దెనా?
బద్దెన గురించి మనకు ఎక్కువ తెలియదు. ఆయన 11-12 శతాబ్దాలలో ఏదో ఒక చిన్న దేశానికి ఒక చిన్న రాజు అని మానవల్లి రామకృష్ణ కవి, వేదం వెంకటరాయ శాస్త్రి అంటున్నారు. బద్దెన పేరుతో వున్న పుస్తకం నీతిశాస్త్ర ముక్తావళి. దీనినే బద్దెనీతి అంటారని ఇంతకు ముందే చెప్పాను. ఈ పుస్తకంలో 162 పద్యాలున్నాయి. రాజులు మంత్రులు అనుసరించదగిన నీతిని గురించి కామందకంలో చెప్పిన లాటి నీతులు ఇందులో కనిపిస్తాయి. ఈ బద్దెన ఎవరో కానీ పద్యం చక్కగా రాయగలడు. రాజ్య పరిపాలనలో గట్టి అనుభవం ఉన్నవాడిలా కనిపిస్తాడు. ఈ పుస్తకం అలాంటి వ్యవహారాల పట్ల ఆసక్తి ఉన్న జనాభాలో ప్రచారం పొంది ఉండొచ్చు. ఏది ఏమైనా పధ్నాల్గవ శతాబ్దిలో మడికి సింగన తాను సంకలనం చేసిన సకల నీతి సమ్మతములో బద్దెన పుస్తకంలో నుంచి 38 పద్యాలు చేర్చుకున్నాడు. ఈ పుస్తకానికి సింగన కాలం నాటికే బద్దెనీతి అనే పేరు ప్రచారంలో వుంది. [వికిపీడియా వ్యాసకర్త కూడా సుమతి శతకకర్త బద్దెన అని గట్టిగా చెప్తున్నాడు]
భీమన గురించి మనకు అసలేమి తెలియదు. కానీ ఆయన గురించి కథలు చాలా ఉన్నాయి. ఆయన వేములవాడ అనే ఊళ్ళో పుట్టాడు. అతని తల్లి ఒక బాల్య వితంతువు. ఆవిడ తన భర్త పోయిన తరువాత భీమనను కన్నది. వితంతువైన ఈవిడ భర్తలున్న ఇతర బ్రాహ్మణ స్త్రీలతో పాటు భీమేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళి వాళ్ళందరూ పుత్ర సంతానం కోసం మొక్కుకుంటూ వుంటే తనక్కూడా పుత్రుడు కావాలని అమాయకంగా మొక్కుకుంది. భీమేశ్వర ప్రసాదం వల్ల ఆవిడకు భీమన పుట్టాడు. ఈ కొడుకు ఎవరికో పుట్టాడని ఆ తల్లి శీలాన్ని శంకించినవాళ్ళు భీమనని ఊళ్ళో అమర్యాదగా చూసేవాళ్ళు. భీమనకి చిరాకు పుట్టి తల్లి దగ్గర కెళ్ళి నా తండ్రెవరో చెప్పమని గట్టిగా అడిగాడు. ఆవిడ భీమేశ్వర స్వామి దేవాలయాన్ని చూపించి అందులో దేవుడే నీ తండ్రి అని చెప్పింది. భీమన తిన్నగా ఆ దేవాలయానికి పరిగిత్తి చేతిలో ఒక బండరాయి తీసుకుని శివలింగానికి ఎదురుగా నిలబడి, “ఓ భీమేశ్వరా, నీవు నా తండ్రివి అవునో కాదో చెప్పు. చెప్పక పోతే ఈ రాతితో నీ తల పగలకొడతాను,” అని గట్టిగా అరిచాడు. అంతకన్నా పెద్ద రాయిలా వున్న భీమేశ్వరుడు గట్టిగా నోరు తెరిచి, “నాయనా! నువ్వు నా కొడుకువే, ఇకనుంచి ఎవరైనా నిన్ను నీతి లేని తల్లికి పుట్టాడని నిందిస్తే నువ్వు వాళ్ళని శపించు. ఈ క్షణం నుంచి నీ మాటకి వెంటనే ఫలితం వస్తుంది. నువ్వు శాపానుగ్రహ సమర్థువుడవౌతావు,” అని చెప్తాడు.