తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం

శతక ప్రక్రియ

శతకంలో 108 పద్యాలుంటాయని మొదటి పద్యం శ్రీ తో మొదలవుతుందని అది శతకానికి శుభసూచకమని మనకు చాలామంది చెప్పారు. శతకంలో పద్యాలు ఒక దానికి ఒకటి సంబంధించని ఏ కథాక్రమం లేని విడివిడి పద్యాలు. అయితే అవన్నీ ఏదో ఒకే ఛందస్సులో రాయబడి ఉంటాయి. వాటి చివర మకుటం అనే పేరుతో ఏదో ఒక మాటో ఒక సమాసమో వుంటుంది. అది తరచు సంబోధనాత్మకంగా వుంటుంది. ఈ మకుటం ఒక దేవుడినో, ఒక వ్యక్తినో లేదా ఒక వస్తువునో పిలిచి పద్యం వినిపిస్తున్నట్లుగా వుంటుంది. ఒకే మకుటం వుండడం అనే లక్షణం వల్ల మాత్రమే ఈ పద్యాలన్నీ ఒకే శతకానికి చెందినవి అని చెప్పగలం. ఆ మకుటం వల్లనే శతకానికి ఒక పేరు కూడా వస్తుంది. సుమతి అనే మకుటం వుండటం వల్ల ఇది సుమతి శతకం అయింది. శతకాలు చాలా వరకు ఒకే కర్త రచించినవి అయినప్పటికి కూడా ఇవి ఎవరూ మొదటి నుంచి చివరి దాకా ప్రతి పద్యమూ చదవరు. ఎప్పుడు ఏ పద్యం కావాలంటే ఆ పద్యాన్ని, ఎన్ని పద్యాలు కావాలంటే అన్ని పద్యాలని చదువుకోవడానికి వీలు కలిగిస్తుంది శతకం. అందుకే బహుళ వ్యాప్తిలో వున్న శతకాలు తరచు ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి — ఎవరికిష్టమైన పద్యాలు వాళ్ళు వేరేగా రాసుకున్నారు కాబట్టి.

ఆధునిక విమర్శకులు, శతకాలని ఆ శతకాలలో వుండే పద్యాల ప్రధాన భావాన్ని పట్టి, భక్తి శతకాలనీ, నీతి శతకాలనీ, శృంగార శతకాలని విభజించడం రివాజు. శతకంలో వుండే పద్యాలు గుర్తు పెట్టుకోవడం తేలిక కాబట్టి వాటిని ఒక చోటి నుంచి ఒక చోటికి మౌఖికంగా పట్టుకుపోవచ్చు. శతకంలో ఒక పద్యం చాలా ప్రాంతాల్లో వినిపించింది అంటే ఆ పద్యం చాలా మంది పాఠకులు ఇష్టపడి గుర్తు పెట్టుకున్నారని అర్థం. అంతే కానీ ఆ శతకమంతా అన్ని చోట్లకీ వెళ్ళిందని అర్థం కాదు. అంటే శతకంలో కొన్ని పద్యాలకి ఎక్కువ ప్రచారం వచ్చి మిగతా పద్యాలు మూలపడి ఉండవచ్చు. పైగా పద్యం మౌఖికంగా ప్రచారమైతే పాఠకులు తమ ఆనుకూల్యాన్ని బట్టి అందులో మాటలు మార్చి వేర్వేరు పాఠాలు తయారు చేయొచ్చు. ఇందులో ఏ పాఠం మూలపాఠం, ఏది మార్పు చెందిన పాఠం అని చర్చించడం వల్ల పెద్ద ప్రయోజనం వుండదు. పైగా శతకంలో పద్యాలను మౌఖికంగా పట్టుకుని వెళ్ళేవాళ్ళు శతకకర్తని గురించి కొన్ని కథలు, శతక రచనా సందర్భాన్ని గురించిన కొన్ని విశేషాలు కూడా చెప్పొచ్చును. ఇలాంటి కథలు కొన్నింటిని గురించి ఈ వ్యాసంలో తర్వాత చెప్తాను. ఇక సుమతి శతకం దగ్గరికి వస్తే ఇది ఎక్కడా మొత్తమంతా లభించదు. దొరికిన్న లిఖిత ప్రతులన్నీ ముక్కలు ముక్కలుగా ఉన్నవే. నిజానికి మొత్తం శతకంలో ఎన్ని పద్యాలున్నాయో ఎవ్వరూ నిక్కచ్చిగా చెప్పలేరు.

సుమతి శతకము – సి.పి. బ్రౌన్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (C. P. Brown) అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి (1798-1884) తెలుగు సాహిత్యంలో అపారమైన ఆసక్తి చూపి, తెలుగు సాహిత్యం మీద తన చెరగని ముద్ర వేసి, తెలుగు సాహిత్యపరులందరికీ కీర్తనీయుడయ్యాడు. కలకత్తాలో క్రైస్తవ మత ప్రచారం చేసే ఫాదరీల సంతతి అయిన ఈయన పదిహేడేళ్ళ చొప్పున రెండు దఫాలుగా మొత్తం 34 సంవత్సరాల పాటు తెలుగు దేశంలో వుండి ఈస్ట్ ఇండియా కంపెనీలో రకరకాల ఉద్యోగాలు చేశాడు. తెలుగు నేర్చుకోవడంలో చాలా పరిశ్రమ చేసిన ఈయన తెలుగు సాహిత్యాన్ని ‘ఉద్ధరించడానికి’ తన కాలంలో ఎక్కువ భాగం, తన జీతంలో ఎక్కువ భాగం ఖర్చు పెట్టాడు.

బ్రౌన్ అభిప్రాయంలో గ్రంథం ప్రతిదీ ఒక వ్యక్తి చేత రచించబడి ఉంటుంది. కాలక్రమాన స్ఖాలిత్యాలకి లోనై లేఖక ప్రమాదాలు ఇతర ప్రక్షిప్తాలు చేరి చెడిపోతుంది. అలాంటి గ్రంథాన్ని చాలా ప్రతులు దగ్గర పెట్టుకుని, తప్పులు దిద్ది, ప్రక్షిప్తాలు పరిహరించి దానిని పూర్వ స్థితికి తీసుకురావడం పరిష్కర్తలు చేయవలసిన పని. ఇది యూరోపులో గ్రంథాన్ని గురించి ఉన్న నిశ్చితమైన అభిప్రాయం. ఇలాంటి గ్రంథం సక్రమంగా పరిష్కరించి అచ్చు వేసి జనంలోకి తీసుకు వెళ్ళాలి. తెలుగు సాహిత్యంలో చాలా గ్రంథాలకి ఈ విధంగా పరిష్కరణ చేసి ముద్రించడం బ్రౌన్ చేసిన ముఖ్యమైన పనుల్లో ఒకటి.

దాదాపు వెయ్యి సంవత్సరాల నిరంతర రచనల వల్ల, విస్తృతపఠనం వల్ల దేశమంతా విశాలంగా వ్యాపించిన తెలుగు సాహిత్యం ఎక్కడ చూసినా బ్రౌన్ దొరకి శుద్ధంగా కనిపించలేదు. దానితో పాటు తాళపత్ర ప్రతులు ఆయనకి తేలికగా దొరకలేదు కూడా. అవి సంపాదిద్దామని జనాన్ని అడిగితే వాళ్ళు ఈ తెల్లదొరకి అవి ఇవ్వలేదు. తన మధ్యవర్తుల ద్వారా చాలా శ్రమపడి ఆ గ్రంథాలను ఆయన సేకరించవలసి వచ్చింది. బ్రౌన్ తెలుగు ప్రజలతో కలిసిమెలిసి తిరిగి రాతప్రతులని వాళ్ళు ఇళ్ళల్లో భద్రపరిచే తీరు, అవి చదివే తీరు, అందులో తేడాలు, అన్నీ గ్రహించి వుంటే తెలుగు గ్రంథ ప్రపంచాన్ని గురించి ఆయనకు కొంత వరకైనా అవగాహన వచ్చేది. కానీ ఆ ఆలోచన ఆయనకి కలగలేదు. తెలుగు దేశంలో గ్రంథసంస్కృతి యూరోపు దేశాల గ్రంథసంస్కృతికన్నా భిన్నమైనదేమో అన్న సందేహం కించిత్తయినా కలగలేదు కూడా. తను అనుకున్నట్లుగా ప్రతి గ్రంథమూ సులభంగా దొరకక పోయేసరికి, దొరికినవి కూడా శిథిలావస్థలో దొరికేసరికి తెలుగు సాహిత్యం క్షీణదశలో వుందని ఆయన గట్టిగా విశ్వసించాడు. తనకు ఉన్నపాటి అల్పమైన భాషా పరిజ్ఞానంతో పాటు పాశ్చాత్య సంస్కృతి యొక్క గొప్పతనం మీద అపారమైన విశ్వాసం తోడవగా ఈ సాహిత్యాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత తన మీద ఉందని నమ్మకంగా నిశ్చయించుకున్నాడు బ్రౌన్.


సుమతి శతకం, బ్రౌన్ చేతిరాతగా
చెప్పబడిన ప్రతి నమూనా

బ్రౌన్‌కి సుమతి శతకం మీద ఆసక్తి కలగడానికి కారణం అందులో వుండే నీతి తనకి పరిశీలన యోగ్యంగా వుండడం కాదు. భాష సులభంగా వుండబట్టి తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశ్యం. అందుచేత తన దగ్గర పనిచేసే పండితుణ్ణి పురమాయించి సుమతి శతకానికి శుద్ధప్రతిని, ప్రతిపదార్థాన్ని రాయించుకున్నాడు. ఆ పద్యాలు చదువుతూ తనకి అర్థమైన పద్యాలని ఇంగ్లీషు వచనం లోకి అనువాదం చేసి పెట్టుకున్నాడు. ఇదంతా ఆయన తెలుగు నేర్చుకోవడంలో ఒక భాగం. క్రమంగా 1832 నాటికి ఒక పది సుమతి శతక లిఖిత గ్రంథాలను సంపాదించాడు బ్రౌన్. యూరోపులో గ్రీక్, లాటిన్, లిఖిత ప్రతులను పోగు చేసి వాటిని తైపారు వేసి దుష్ట పాఠాలను లేఖిక దోషాలను తొలగించి శుద్ధప్రతిని తయారు చేసే మార్గంలోనే సుమతి శతక లిఖిత ప్రతులను కూడా అన్నిటినీ కలిపేసి ఒక 150 పద్యాల గ్రంథాన్ని తయారు చేసి అందులో 85 పద్యాలకి తన ఇంగ్లీషు వచన అనువదాలతో సహా 1842లో అచ్చు వేయించాడు. కానీ ఈ పుస్తకం ఎవరికీ దొరకటం లేదు. అసలు ఈ పుస్తకాన్ని అచ్చు వేయించాడని చెప్పడానికి ఆధారం ఈ పుస్తకానికి చేసిన ప్రకటన. ఆ ప్రకటనని మచ్చా హరిదాసు తన వ్యాసంలో ఉదహరించాడు. దరిమిలా 1973లో ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బ్రౌన్ తయారు చేయించిన రాతప్రతి ఆధారంగా ముద్రించారు. దీన్ని ‘బ్రౌన్ సుమతి శతకం’ అన్న పేరుతో ఈ వ్యాసంలో వ్యవహరిస్తాను. ఇక మనకి ప్రచారంగా తెలిసిన సుమతి శతకాన్ని ‘వావిళ్ళ సుమతి శతకం’ అంటాను.

బ్రౌన్ సుమతి శతకాన్ని గురించీ దానికి ఆధారమైన తాళపత్ర ప్రతులను గురించీ మనకి కొంతైనా తెలుసు కాని, వావిళ్ళ సుమతి శతకానికి ఆధారాలేమిటో మనకేమీ తెలియదు. 1870లో ఆదిసరస్వతి ముద్రణాలయం ప్రచురించిన సుమతి శతకానికి తాళపత్ర ప్రతులేవయినా ఆధారం అయివుంటే వాటిని గురించి ఆదిసరస్వతి ప్రతి కాని, దాని రూపాలయిన వావిళ్ళ ప్రతులు కాని మనకేమి చెప్పలేదు. ఆదిసరస్వతి ప్రతిలోను దాని తరువాతి వావిళ్ళ ప్రతిలోను మనకు కనిపించే ముఖ్యమైన విశేషాలు రెండు. ఒకటి, ఇందులో పద్యాలు అకారాది క్రమంలో అమర్చబడి ఉన్నాయి. రెండు, వీటిలోని భాష అరసున్నలతో, బండి ర (ఱ)లతో కూడిన లాక్షణిక భాష. సుమతి శతకపు తాళప్రతులు వేటిలోను పద్యాలు అకారాది క్రమంలో వుండటం కానీ, భాష లాక్షణికంగా వుండటం కానీ నేనెరిగినంత వరకు కనిపించదు. ఆదిసరస్వతిని అనుసరించిన వావిళ్ళ సుమతి శతకాన్నే తరువాతి ముద్రాపకులందరూ మక్కీకి మక్కీ అనుసరించారు. చాలాసార్లు చాలామంది ప్రచురించిన వావిళ్ళ సుమతి శతకంలో చేరిన మార్పులు ప్రధానంగా రెండు. ఒకటి, కొన్ని కొత్త పద్యాలు చేరడం. అందులోను ముఖ్యంగా శ్రీరాముని దయచేతను అనే పద్యం మొదటిదిగా చేరటం. రెండవది, శ్రీకరమగు భీమన అని శతక కర్తృత్వాన్ని భీమనకి ఆపాదిస్తూ చివరి పద్యంగా చేరటం. కొన్నింటికి ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా చేరడం.

తెలుగులో పద్యాలు అకారాది క్రమంలో వుండటం చాలా కొత్త విషయం. బ్రౌన్‌ సుమతి శతక పద్యాలు అకారాది క్రమంలో లేవు. పంతొమ్మిదొవ శతాబ్ది వరకు నిఘంటువులు కూడా అకారాది క్రమంలో వుండేవి కావు. శివుణ్ణి ప్రార్థిస్తూ రాసిన అక్షరాంకగద్య మాత్రం అకారాది క్రమంలో కనిపిస్తుంది. అకారాది క్రమం జైన ప్రభావం వల్ల వచ్చిందని సుమతి శతకాన్ని సుమతి అనే జైన భిక్షువు రాశాడని ఒక ఆసక్తికరమైన, ఏ రకమైన రుజువులు లేని సూచన ఒకటి వుంది. [Venkata Rao, 1966, p. 64] ఈ సూచన మనం పరిశీలనకు ఉపయోగించుకోగలిగిన స్థితిలో లేదు. సుమతి శతకానికి బ్రౌన్ వాడిన ఏ తాళపత్ర ప్రతిలోను పద్యాలు అకారాది క్రమంలో లేవు. సలక్షణ భాషలో కూడా లేవు.

సుమతి శతకం అనే పేరు, సుమతి అనే మకుటం మాత్రమే ఈ పద్యాలన్నీ– ముక్కలుగా వేరు వేరు ప్రతుల్లో కనిపిస్తున్నా– ఒకే గ్రంథానికి చెందినవని వాటి పాఠకులు భావించారని అనుకోడానికి ఆస్కారముంది. కాని వావిళ్ళ సుమతి శతకంతో మాత్రమే, శ్రీకారంతో మొదలు, కవి పేరుతో ఆఖరు, మంగళకర సంఖ్య అయిన 108 పద్యాల సంఖ్య, వీటితో దీనికి పరిపూర్ణమైన శతక స్వరూపం యేర్పడింది. అడయారు థియసాఫికల్ సొసైటీ లైబ్రరీలో వున్న సుమతి శతకపు తాళపత్ర ప్రతుల స్కాన్ చేసిన ప్రతిరూపాలు ముక్కలుముక్కలుగా ఇంటర్నెట్లో దొరుకుతాయి. వీటిలో ఒక ముక్కలో శ్రీరాముని దయచేతను అన్న పద్యం కనిపిస్తుంది. అయితే అందులో కూడా అది మొదటి పద్యం కాదు. ఈ పద్యం హరిదాసుకి కాని, ఆరుద్రకి కాని వారు చూసిన తాళపత్ర ప్రతిలో కనిపించలేదు. అడయారు లోని తాళపత్ర ప్రతి రెండు కారణాల వల్ల ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. ఒకటి అందులో శ్రీరాముని దయచేతను అన్న పద్యం ఉండటం. రెండు అందులోని పద్యాలు అరసున్నలు, బండి రలు లేకపోయినా వావిళ్ళ ప్రతి లోని పద్యాలకు దగ్గరగా వుండటం. దురదృష్టవశాత్తు అడయారు ప్రతి ప్రతిరూపాలు స్పష్టంగా లేవు. అంచేత వాటి గురించి ఇంతకన్నా నిక్కచ్చిగా నిర్ణయాలు చేయడం నాకు వీలు పడటం లేదు.

మౌఖిక ప్రచార లక్షణాలు

వావిళ్ళ సుమతి శతకంలో ఉన్న పద్యాలన్నీ మౌఖిక ప్రచార లక్షణాలు కనిపించేవే. కాగా బ్రౌన్ సుమతి శతకంలో చాలా పద్యాలు లిఖిత సంప్రదాయంలో ఉన్న పద్యాల్లా వుంటాయి. ఇరవయ్యో శతాబ్దపు పూర్వ సాహిత్యం చాలా మట్టుకు ఒక రకంగా మౌఖిక స్వభావం ఉన్నదే. ఎందుకంటే పద్యాలన్నీ పైకి చదివేవారు కాబట్టి. కానీ ఇక్కడ నేను చేసే విభాగం వేరు. ఒకటి: ఒకరి నుంచి మరొకరికి మౌఖికం గానే ప్రచారమయ్యే పుస్తకాలు. రెండు: లిఖిత రూపంలో ప్రచారమయ్యే పుస్తకాలు. అంటే పుస్తక ప్రచారం రెండు రకాలుగా జరిగిందన్న మాట. ఒకటి మౌఖికం గాను, రెండు లిఖిత మార్గం లోను. మౌఖిక ప్రచారంలో ఉన్న పద్యాలు చాలా ఎక్కువ మందికి అందాయి. లిఖిత ప్రచారంలో వున్నవి కొంత తక్కువ మందికి అందాయి. అయితే ఈ రెండు రకాల ప్రచారం కూడా చదవడం, రాయడం తెలిసిన కులాల వారి లోనే జరిగింది.


సుమతి శతకం, తాళపత్ర ప్రతి

బ్రౌన్ సుమతి శతకం ప్రచారమైన జనాభా బహుశ కరణాల జనాభా అయి ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సరే రాసి పెట్టుకోవడం పెద్ద అలవాటు. వావిళ్ళ సుమతి శతకం ప్రచారమైన జనాభా జ్ఞాపకం పెట్టుకోవడం మీద నోటితో తిరిగి చదవడం మీద ఆధారపడ్డది. సుమతి శతకం పద్యాలు, ఈ రెండు రకాలవి కూడా, సంభాషణలో బాగా పనికొచ్చేవి. చెట్టు కింద కూర్చుని సాయంకాలాలు కాలక్షేపం చేసే సందర్భాలలో ఈ పద్యాలు శాస్త్రం చెప్పినట్లు ఉదాహరించేవారు. ఒకరి నోటి నుంచి మరొకరు ఈ పద్యాలు వినడం, ఆ పద్యం అంతకుముందు వినని కొత్త పద్యమైతే, దానిని వెంటనే కంఠస్తం చేయడం, ఈ సమావేశాల్లో తరచూ జరిగేవి. నిజానికి ఇలాంటి సమాజాల్లో నోటి మాటగా చెప్పిన పద్యానికి ఎక్కడో రాత పుస్తకంలో ఉన్న పద్యం కన్నా ఎక్కువ ప్రామాణికత, సాధికారత ఉండేది.

ఇలాంటి మౌఖిక ప్రచారం వల్ల పద్య నిర్మాణం ఒక పద్ధతిలో మారుతుంది. వావిళ్ళ సుమతి శతకంలో వున్న పద్యాలన్నిటికీ మౌఖిక నిర్మాణ స్వభావం ఉందని కొంచం సేపట్లో చూపిస్తాను. ఈ పద్యాలు విని నేర్చుకున్న వాళ్ళల్లో ఎవరో ఒకరు కరణమో కరణాల కుటుంబపు మనిషో అయ్యుంటే ఆయన తాను విన్నది విన్నట్టుగా రాసి పెట్టుకుని ఉంటాడు. అయినా ఆ పద్యం యధాపూర్వంగా మౌఖికంగా ప్రచారమవుతూ ఉంటుంది. బ్రౌన్ సుమతి శతకంలో కొన్ని పద్యాలు మౌఖిక ప్రచార లక్షణాలు వున్నవిగా కనిపించడానికి ఇదే కారణం. అయినా బ్రౌన్ సుమతి శతకాన్ని దామాషా మీద లిఖిత సంప్రదాయపు శతకమని వావిళ్ళ సుమతి శతకాన్ని మౌఖిక సుమతి శతకమని విడదీసి చూపిస్తాను.