తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం

జీవితంలో పైకి వచ్చే మార్గాలు

ఒక్క మాటలో చెప్పాలంటే సుమతి శతకంలో వున్న నీతి లౌకిక జీవితంలో పైకి రావడానికి పెద్దకులాల మగవాళ్ళకి పనికొచ్చే నీతి. ఈ పుస్తకం, సంస్కృతంలో వుండే పంచతంత్రం, హితోపదేశం, నీతిసారం, మొదలైన ప్రసిద్ధ గ్రంథాల తరగతికి చెందినది. అయితే తెలుగులో వుండబట్టి ఆ గౌరవం దీనికి లేదు. పేరు తెలియని కవి గ్రామాలలో వుండే పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని చిన్న మాటలతో తేలికగా గుర్తు పెట్టుకోవడానికి అయిన పద్ధతిలో నిరాడంబరంగా రాసిన పుస్తకమిది.


వావిళ్ళ సుమతి శతకం, 1870.

13వ శతాబ్ది నుంచి తెలుగులో నీతి గ్రంథాలు రాయడం ఆరంభమయింది. పై కులాల్లో పుట్టిన మగవాళ్ళు ఒక చిన్న రాజులాగా అధికారం చెలాయించే స్థితికి రావడానికి ఏ ఏ పద్ధతులు అనుసరించాలో సాధికారంగా చెప్పడానికి ఈ పుస్తకాలు పనికొచ్చాయి. ఈ పుస్తకాల్లో రాజులెలా ప్రవర్తించాలి, మంత్రులు ఎలా పని చేయాలి, సైన్యాలని, గూఢచారులని ఎలా వుపయోగించుకోవాలి – ఇలాంటి సంగతులు చెప్పి ఉన్నాయి. సుమతి శతకం వాటి కన్నా కొంత భిన్నమైనది. సుమతి శతకంలో అక్కడక్కడా రాజుని గురించిన ప్రస్తావన ఉన్నా నిజానికి ప్రధాన ప్రస్తావన గ్రామాల్లో వుండే భూస్వామిని గురించే. బ్రాహ్మణ పురుషులు, వాళ్ళ భార్యలు, వేశ్యలు కూడా ఇందులో తారస పడతారు. సుమతి శతకం రాజాస్థానం లోంచి వచ్చిన పుస్తకం కాదు. రాజాస్థానాలలో మెలిగే వాళ్ళకోసం రాసినదీ కాదు.

ఇందాకా చెప్పిందే మళ్ళీ చెప్పాలంటే సుమతి శతకం గ్రామాలలో వుండే పై కులాల మగవాళ్ళు లోకంలో ఎలా పైకి రావాలో చెప్పే పుస్తకం. డబ్బు, కామసౌఖ్యము, ఎలా అనుభవించాలో ఏ ముసుగులు లేకుండా చెప్తుందీ పుస్తకం. ముఖ్యంగా కామసుఖాన్ని గురించి మరీ మరీ గొప్పగా చెప్తుంది. అది అనుభవించలేని వాళ్ళని తక్కువగా చూస్తుంది కూడా. సుమతి శతకం దృష్టిలో ఆడవాళ్ళు రెండే తరగతులు. మగనాళ్ళు, వెలయాళ్ళు. వెలయాలు ఏ మగాణ్ణీ ప్రేమించదు. ఆవిడకు కావలిసింది కేవలం డబ్బే. అందం కానీ, కామసుఖం ఇవ్వటంలో నేర్పరితనం కానీ ఆవిడ పట్టించుకోదు. ఆ మాటకొస్తే భార్యలు కూడా డబ్బు సంపాదన లేని మొగుణ్ణి గౌరవించరు. ఆడదాన్ని చచ్చినా నమ్మకూడదు అంటుంది సుమతి శతకం (… మగువకు మదినీయ వలదు మహిలో సుమతీ). ఆడవాళ్ళకి ఏ రహస్యాలూ చెప్పకూడదు. మొగుడు జాగ్రత్తగా కనిపెట్టకపోతే ఆడది తప్పనిసరిగా వ్యభిచారి అవుతుంది (… పడుపుగ నంగడికి తానె పంపుట సుమతీ). ఒక పక్క ఆడవాళ్ళను గురించి ఇలాటి మాటలు చెప్తూనే ఆడవాళ్ళని గౌరవంగా చూడాలని, వాళ్ళే సంపదకు మూలమని, ఆడది ఏడ్చే యింట్లో లక్ష్మీదేవి కాపురం చేయదని కూడా చెప్తుంది (… కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ). పునిస్త్రీ లైన వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పినా విధవ మాత్రం గౌరవార్హ కాదు. ఇంటి యజమానురాలు ఎప్పుడూ భార్యే అయి ఉండాలి కానీ, విధవ యాజమాన్యం చేస్తే యిల్లు పాడై పోతుంది.

సుమతి శతకంలో సమాజం కులస్పర్ధలతో, పరస్పర అపనమ్మకాలతో అయినా సరే క్లిష్టమైన సంబంధ బాంధవ్యాలతో ఒకరి మీద ఒకరు ఆధార పడటంతో ఉన్న సమాజం. ఇందులో పెద్ద పెద్ద మాటలతో రాజుని గురించి భూపాలుడు అని, మండలపతి అని ప్రస్తావన కనిపిస్తుంది. చదువుకున్న కులాల నుంచి ఆ రాజుకి మంత్రులుగా రాయసకాళ్ళుగా పని చేసే వాళ్ళు ఉండేవారు. సుమతి శతకంలో చాలా పద్యాలు వీళ్ళని గురించి రాసినవే. సమర్ధమైన మంత్రి లేకపోతే రాజు తొండం లేని ఏనుగు లాగా ఉంటాట్ట.

మండలపతి సముఖమ్మున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
కొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచును సుమతీ

చదవడం రాయడం వచ్చిన రాజు దగ్గరికి ఏ మంత్రులూ వెళ్ళకూడదు. పైగా, కరణాలకి కూడా ఒక బోధ చేస్తుంది ఈ పుస్తకం: ఒక కరణం ఇంకొక కరణాన్ని నమ్మకూడదు. కరణాలు బలవంతులుగా వుండాలి. వాళ్ళు అతి సాధువుగా ప్రవర్తించకూడదు. ప్రతి కులాన్ని గురించీ సుమతి శతకంలో ఏదో ఒక ప్రస్తావన కనిపస్తుంది. మంచి గుణాలు పుట్టుక తోటే వస్తాయి. ప్రతి కులానికి ఏదో ఒక లోపం ఉంటుంది. క్షత్రియులని సంతోష పరచడం కష్టం. వెలమ వాళ్ళు నమ్మదగ్గ వారు కారు. కోమట్లు అబద్ధాలకోర్లు. వైదికుడికి లోకజ్ఞానం తక్కువ. కంసాలిని ఎప్పుడూ నమ్మకూడదు. ఆఖరికి కరణాలు కూడా బోలెడు మోసాలు చేస్తారు.

సుమతి శతకం సాహిత్యానికి పెద్ద పీట వేస్తుంది, అదీ లౌకిక సాహిత్యానికి. మంచి కవిత్వం రాయగలగటం గొప్ప విషయం. మూర్ఖుడికి సాహిత్యం బోధించడం చెవిటి వాడి ముందు శంఖం ఊదడం లాంటిది. సుమతి శతకం తక్కువ కులాల వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తక్కువ చూపు చూస్తుంది. దుర్జాతి, నీచుడు, అవివేకి, పామరుడు, మూర్ఖుడు ఇలాటి మాటలన్నీ తక్కువ కులాల వాళ్ళను ఉద్దేశించినవే. వాళ్ళను నమ్మకూడదు. వాళ్ళతో స్నేహం చేయడం మూర్ఖత్వం. తక్కువ కులం వాడు చదువుకుంటే వాడు మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తాడు. ముఖ్యంగా తక్కువ కులాల వాళ్ళు డబ్బు కూడ పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు అలా కూడబెడితే ఆ డబ్బుని లాక్కుంటారు, లేదా దొంగలైనా దోచుకుంటారు.

డబ్బెందుకురా అంటే తను సుఖపడ్డం కోసం, లేదా దానంగా ఇవ్వడం కోసం. లేక పోతే ఆ డబ్బు నేల పాలై పోతుంది, అడవిలో తేనెపట్టులో తేనె లాగా. సుమతి శతకంలో చాలా వరకు నీతులన్నీ పాపపుణ్యాలతో సంబంధం లేనివి. అయినా అక్కడక్కడా కొన్ని నీతులు అని మనం అనుకునేవి ఉన్నాయి. పరభార్యా సంగమం దోషం. పరద్రవ్యాపహరణం దోషం. తన కోపం కన్నా పెద్ద శత్రువు లేదు, ఇలాంటివి. ఒక రకంగా చెప్పాలంటే ధర్మార్థకామమోక్షాలు సమపాళ్ళలో వుండే సాంప్రదాయిక సమాజం ఇందులో కనిపిస్తుంది.

ప్రతి వ్యక్తి తన పాపపుణ్యాలని అనుభవిస్తాడు. తాను పూర్వ జన్మలో దానాలిస్తే తానీ జన్మలో ధనికుడవుతాడు. పూర్వ జన్మలో దానాలివ్వకపోతే ఈ జన్మలో ఎంత కష్టపడ్డా డబ్బున్నవాడు అవ్వడు. ఫలితార్థంగా చెప్పాలంటే కాలక్రమాన అన్నీ చెడిపోతాయి. బంధుత్వం శత్రుత్వంగా మారుతుంది. ధనవంతుడు పేదవాడవుతాడు. అధిక ధరలు పడిపోతాయి. అన్ని సుఖాలు దుఖంలోనే పర్యవసిస్తాయి.

పాఠకులు

అయితే ఇలాంటి శతకానికి పాఠకులు ఎవరై ఉంటారు? పదిహేడవ శతాబ్దం నాటికి తెలుగుదేశంలో బ్రాహ్మణుల్లో కొందరు పూజలు చేయించడం, మంత్రాలు చదవడం లాంటి పనులు మానేసి, లౌకిక వృత్తుల్లో ప్రవేశించారు. పౌరోహిత్యం చేసేవాళ్ళు వైదికులు, లౌక్యం నడిపే వాళ్ళు నియోగులు అయ్యారు. ఈ నియోగులే కరణాలు. కరణాలు అందరూ చదువుకున్న వాళ్ళు. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే చదవడం రాయడం బాగా వచ్చిన వాళ్ళు. ఇందులో కొందరు పండితులు, మంచి కవిత్వం రాసేవారు కూడా. వాళ్ళు రాయబారులుగా, వ్యవహారజ్ఞులుగా పేరు తెచ్చుకున్నవాళ్ళు, రాయసకాళ్ళుగా రకరకాల భాషల్లో, లిపుల్లో ప్రావీణ్యం వున్నవాళ్ళు. వీళ్ళు పెద్ద పెద్ద రాజాస్థానాల్లో వున్నవాళ్ళు కాకపోయినా అలా వున్నట్లు ఊహించుకునేవాళ్ళు. ఈ కాలంలో చాలా తెలుగు కావ్యాలు నియోగులు రాసినవి కనిపిస్తున్నాయి. ఈ నియోగులు తామే స్వయంగా తమ కావ్యాలకి ప్రతులు రాసి ఏ కృతిభర్త పోషణ అక్కర లేకుండా సొంతంగా కీర్తిని తెచ్చుకున్నారు. నిజానికి వీళ్ళు చిన్నపాటి కరణాలే అయినా మంత్రి, అమాత్యుడు లాంటి గౌరవమైన పేర్లు పెట్టుకునేవారు. సుమతి శతకం ఈ వర్గం నుంచి వచ్చిన పుస్తకం అయ్యుండాలి. కరణాలు లౌక్యులు, రాజనీతిజ్ఞులు అయినా కూడా వాళ్ళు బాహాటంగా పేరు కోసం ప్రయత్నించలేదు. ఎప్పుడూ అణకువగా తెర వెనకనుండే కార్య నిర్వహణం చేసే తమ గుణానికి అనుగుణంగా ఈ సుమతి శతక కర్త తన పేరు రాసుకోలేదు.

పైకి గొప్పగా పేరు చెప్పుకోకపోయినా కరణాలకి తమ గురించి తమకున్న అభిప్రాయం చాలా గట్టిది. కరణాలు అఘటన, ఘటన సమర్ధులు, రాతకోతల వల్ల తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగల వాళ్ళు. చదవడం రాయడం, లెక్కలు కట్టటం ఎక్కువ మందికి రాని కాలంలో, రాతకోతలకున్న బలం చేతులో పెట్టుకున్నవాళ్ళు వీళ్ళే (తమిళనాడులో గణక పిళ్ళైలు, ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో కాయస్థులు, మున్షీలు, ఒరిస్సాలో కరణాలు, మహారాష్ట్రలో కుల్కర్ణీలు, ఇలా).

మంత్రి, ప్రెగ్గడ, ప్రధాని — ఇలా ఎన్ని పెద్ద పేర్లున్నా, సుమతి శతకంలో కరణాల గురించిన చాలా పద్యాలున్నాయి. అయితే సుమతి శతకంలో కరణాలు గ్రామాల్లో రెవెన్యూ లెక్కలు రాసే వాళ్ళ స్థాయిలోనే కనిపిస్తారు. ఇంతకు ముందు గ్రామాల్లో పన్నులు వసూలు చేసి, లెక్కలు రాసే వుద్యోగం కంసాలులు చేసేవారని, 1145లో రామప్రధాని అనే ఆయన కంసాలులని ఆరువేల గ్రామాలలో ఆ ఉద్యోగంలో నుంచి తొలగించి నియోగుల్ని ప్రవేశపెట్టాడని ఒక కథ ఉంది. ఈ కథ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో కూడా కనిపిస్తుంది (సం. 1, పే. 227-28).

సుమతి శతకంలో కంసాలుల గురించి విరుద్ధంగా రాసిన పద్యాల ఆధారంగా కరణాలకి, కంసాలులకి మధ్య వైరుధ్యం వుండేదని ఆరుద్ర నమ్మాడు. (1924లో శతక కవుల చరిత్ర రాసిన వంగూరి సుబ్బారావు కూడా సుమతి శతక కర్త కరణం అయ్యుంటాడని (మంత్రి కులం) ఊహించాడు కానీ కచ్చితంగా గ్రామాల్లో లెక్కలు రాసే ఉద్యోగి అని నిర్ధారణగా చెప్పలేదు.) ఆరుద్ర చెప్పిన కథలో సత్యాసత్యాలు ఎలా వున్నా ఆరువేల వారు అనే పేరున్న కరణాలు ఇప్పటికీ తెలుగుదేశంలో వున్నారు. ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పలేం కాని, మొన్నమొన్నటి వరకు చాలా గ్రామాల్లో ఆరువేల వారే కరణాలుగా వుండేవారు. 18వ శతాబ్దిలో ఉత్తర రామాయణం రాసిన కంకంటి పాపరాజు ఈ కులం వాడే. ఆరువేల నియోగులని శ్లాఘిస్తూ [Paparaju, 1970] కంకంటి పాపరాజు ఈ పద్యం రాశాడు.

అఖిల రాజాధిరాజాస్థానజనహృద్య
       విద్యావిహారులార్వేలవారు
కల్పకబలికర్ణకలశార్ణవో దీర్ణ
       వితరణోదారు లార్వేలవారు
సజ్జన స్తవనీయ సతత నిర్వ్యాజహా
       రిపరోపకారు లార్వేలవారు
ఘనదుర్ఘటస్వామికార్య నిర్వహణ
       ప్రవీణతాధారు లార్వేలవారు

విమతగర్వాపహారు లార్వేలవార
లట్టి యార్వేలవారిలో నలఘుకీర్తి
వెలయు శ్రీవత్సగోత్రారవిందహేళి
మహితగుణశాలి వల్లభామాత్యమౌళి

కానీ సుమతి శతకాన్ని జాగ్రత్తగా చదివి చూస్తే ఈ శతకకర్త గ్రామ కరణంగా తోచడు. ఈ శతకంలో అన్ని కులాలతో పాటు కరణాలలో కూడా లోపాలు చూపించాడు. ఇందులో కంసాలుల గురించి చెప్పిన నిందలు తెలుగు లోకంలో అప్పట్లో చాలా మందిలో కరణాల పట్ల ఉన్న అభిప్రాయాలకి పద్యరూపాలే కానీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు కావు. పైగా ప్రత్యేకించి బ్రాహ్మలకి కంసాలులకి వైరుధ్యాన్ని సూచించేవి కావు. మొత్తం మీద చెప్పగలిగిందల్లా ఏమిటంటే పై కులాలలో పుట్టి లేఖకులుగా పనిచేసే వాళ్ళ వర్గం నుంచి ఈ పుస్తకం వచ్చుంటుంది. ఈ వర్గాన్ని మనం కరణాలు అని సామూహికంగా పేర్కోవచ్చు. ఈ వ్యాసంలో తరవాత సుమతి శతకం ఇంకో రూపంలో ఇంకొక సమూహంలో ప్రచారం పొందిన సంగతి చర్చిస్తాను. అంతకన్నా ముందు శతకం అంటే ఏమిటో చూద్దాం.