ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి


ప్రాస్టిట్యూట్ బిఫోర్ ఎ మిర్రర్
– జార్జ్ రూఆఁ (1927)

పోతే, ‘చెడ్డ స్త్రీలు’ అనబడే వారి చిత్రాలు చూడండి. చిత్రకళ చరిత్రలో ఎంపిక చేయబడ్డ స్త్రీ ప్రతికృతులు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలలో స్త్రీకి భౌతికంగా ఏ విధమైన అనాకృతీ ఉండడానికి వీలు లేదు. నైతికంగా వీళ్ళు మచ్చలేని వాళ్ళు. దురదృష్టవశాత్తు — పావనమైన ఋషుల వంటి స్త్రీల బొమ్మలు, తల్లులుగా, అణుకువతో మెలిగే భార్యలుగా స్త్రీల బొమ్మలు, మంచితనం, ప్రేమ వొలకపోస్తున్న దేవతల ప్రతిమలు — ఇటువంటి చిత్రాలనే చాలా మ్యూజియములు ప్రదర్శించటానికి సాహసిస్తాయి. ఇవే కాకుండా వివస్త్రగా స్త్రీ చిత్రాలు కూడా పదిలపరచటం సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి ప్రతిగా మరొక సాంప్రదాయం కూడా ఉన్నది. పిల్లలని కనడానికి, తమ లైంగికావసరాలకీ కూడా అతీతంగా ఎదిగి, పురుషులకి ఆసక్తి రేపే స్త్రీ చిత్రాలు — వివస్త్ర లైన వెలయాలుల చిత్రాలు ప్రదర్శించే సాంప్రదాయం. జార్జ్ రూఆఁ (Georges Rouault, 1871-1958) వేసిన Prostitute (1924-27) అనే చిత్రం, ఆన్రి లోట్రెక్ (Henri Lautrec, 1864-1901) వేసిన Woman standing before a mirror (1897) అనే చిత్రం వీటికి ఉదాహరణ. స్త్రీ మానవతని దిగంబరీకరించడం తప్ప, ఈ రెంటిలోనూ చెప్పుకోదగ్గ గుణాలు ఏవీ లేవు.


ఉమన్ స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్
– ఆన్రి లోట్రెక్(1897)

పాపానికంకితమైన జీవితాల మూలంగా, చివరలో మానవత్వం ఎటువంటి దుర్దశకి వస్తుందో, ఈ చిత్రాలలో మోటుతనం, స్థౌల్యం సంజ్ఞా రూపకంగా తెలియపరుస్తున్నాయి. ఇటువంటి చిత్రాలు చిత్రించిన చిత్రకారులు, ‘భ్రష్టలు’గా మారిన స్త్రీలని చిత్రించారు కాని, ఏ వొక్క చిత్రకారుడూ, భ్రష్టులైన పోషకుల చిత్రాలు వెయ్యలేదు. బహుశా పురుష దురహంకారం దీనికి కారణమా? కాకపోతే, చిత్రకారులు భ్రష్టలైన స్త్రీలనే ఎందుకు చిత్రించారు? పురుషభ్రష్టతని ఎందుకు చిత్రీకరించలేదు? ఇందుకు మతం కారణం కావచ్చునేమో! మన ప్రాచీన జ్ఞాపకాలు మనని తేలికగా వదలవు. భ్రష్టలైన స్త్రీలని గర్హించటం, అసహ్యించుకోవటం, మన మత సంబంధ జ్ఞాపకాలకి తార్కాణం అని అనటం తప్పు కాదేమో!


టు ఉమెన్ – కూనింగ్(1952)

ఇంతకు ముందు కూనింగ్ గురించి ప్రస్తావించాము. కూనింగ్ వేసిన Women Series బొమ్మలు స్త్రీ జాతి మీద ద్వేషానికి అంతిమ ప్రతీకలు అనవచ్చు. 1948లో మొదలు పెట్టి 1960ల చివరి భాగం వరకూ — ఈ మధ్య కాలంలో కూనింగ్ ఒక డజను పైచిలుకు స్త్రీ చిత్రాలు గీశాడు. వాటిలో Woman I నుంచి – Woman VI అన్న మకుటాలతో వేసిన ఆరు చిత్రాలు చాలా ప్రసిద్ధి కెక్కిన చిత్రాలు. ఆ తరువాత కూడా స్త్రీ చిత్రాలు వేశాడు కానీ, వాటి గురించి వచ్చిన ప్రస్తావన బహు కొద్దిమాత్రమే. ఈ ఆరు చిత్రాలలో స్త్రీని చిత్రించిన విధానం చాలా భయానకంగా ఉంటుంది. ఇవి పెద్దపెద్ద కేన్వాసులు. క్యూబిజం ధోరణి, పికాసో, రూబెన్స్‌లు అనుసరించిన పద్దతి ఈ చిత్రాలలో కనిపిస్తుంది. తీవ్రమైన నైరూప్య పద్ధతిని, యూరోపియన్‌ ఆకృతి చిత్రీకరణతో కలిపితే వచ్చే చిత్ర కళకి ఈ చిత్రాలు ఉదాహరణలు.


ఉమన్ I – కూనింగ్(1948)

ఉదాహరణకి Woman I బొమ్మలో తీవ్రమైన హింస జొప్పించటంతో ఈ చిత్రంలో వ్యంగ్యం ఉన్నదన్నది కొందరి విమర్శకుల అభిప్రాయం. కాని, అనావశ్యకమైన హింస చిత్రంలో ఎక్కువయి, వ్యంగం ఉన్నదన్న అపోహ అడుగున పడుతుంది. ఈ చిత్రంలో ఉన్నది ఒక వృద్ధ స్త్రీ. ఎక్కువ బరువుగా ఉండే వృద్ధ స్త్రీ. మరీ పెద్దవైన కళ్ళు, కట్టుడుపళ్ళు చూపిస్తూ వికారం కలిగించే నవ్వు, సన్నని చిన్న కాలిమండశీల, లావైన కాలు, చవకరకం చెప్పు వేసుకొని, ఎంత నికృష్టంగా ఉండాలో అంతకన్నా ఎక్కువ నికృష్టంగా స్త్రీ ఆకారాన్ని చూపించే చిత్రం ఇది.


ఉమన్ V – కూనింగ్(1952)

మిగిలిన స్త్రీ చిత్రాలొక్కొక్కటీ, గీసిన కాలక్రమంలో చూస్తూ పోతే, తరువాత అన్నీ కలిపీ ఒక్కసారిగా చూస్తే, పోనుపోను చిత్రం ముఖంలో రాక్షసి నవ్వు, భీకరత్వం పెరిగి కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. మానవత్వం కృశించి పోతుంది. ఈయన పంతొమ్మిదివందల అరవైలలో వేసిన స్త్రీచిత్రాలని అశ్లీల చిత్రాలని అనడం అతిశయోక్తి కాదు. స్త్రీ ఆకారాన్ని ఇంత హింసాత్మకంగా చిత్రించిన చిత్రకారుడు బహుశా ఇంకెవరూ లేరేమో! పేరు మోసిన ఏ విమర్శకుడూ ఈ చిత్రాలపై ఎక్కడా వ్యతిరేకంగా రాయకపోవడం ఆశ్చర్యం.


న్యూడ్ సీటెడ్ ఆన్ ఎ బెడ్
– వాలదాఁ (1922)

విల్లెమ్‌ ద కూనింగ్, మానవ సాంస్కృతిక పతనానికి, విధ్వంసానికి స్త్రీ కారణమని అనుకున్నాడా? సాంస్కృతిక పతనమే నిజమయితే, ఈ పతనానికి పురుషుడికి కూడా సమాన బాధ్యత లేదా? నిజం చెప్పాలంటే, ఎక్కువ బాధ్యత పురుషుడిదే కాదా? కూనింగ్ ప్రదర్శనలపై రాసిన విమర్శకులు ఈ విషయాలు అడగటం మరిచిపోయారా? చెదురు మదురుగా ఎవరో స్త్రీవాదులు ఈ విషయాలు రాసి ఉండవచ్చు కాని, ప్రసిద్ధికెక్కిన పత్రికలలో ఎక్కడా నాకు కనపడలేదు. కూనింగ్ నైరూప్య చిత్రకళాకారుడిగా చాలా గొప్పవాడు. కాని, స్త్రీమూర్తి చిత్రణలో మాత్రం కాదని నా అభిప్రాయం.


న్యూడ్ రిక్లైనింగ్ ఆన్ సోఫా
– వాలదాఁ (1928)

పంతొమ్మిదవ శతాబ్దం, ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో సాంప్రదాయానికి విరుద్ధంగా, బొహీమియన్‌ జీవితానికి చిహ్నంగా స్త్రీ రూపొందింది. స్వేచ్చ, పేదరికం, వలపు, దురవస్థ — వీటి కలయికతో కనపడే స్త్రీ నమూనా అగ్రగామి అయ్యింది. ఈ లక్షణాల కలయిక ఉన్న స్త్రీ ఇప్పటికీ ఒప్పుకోదగినదే! బొహీమియన్‌ స్త్రీ ఎప్పుడూ సజీవే! అమిదియో మొదిల్యియాని (Amedeo Modigliani, 1884-1920) బొహీమియనిజం దృష్టిలో వేసిన బొమ్మలు — అన్నీ వివస్త్ర లైన స్త్రీల బొమ్మలే! ఈ బొమ్మల చిత్రణకి అతగాడు చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టలేదట! ఎందుకంటే, అతను గీసిన బొమ్మలన్ని, అతని స్నేహితురాళ్ళవి, అతని ఉంపుడు కత్తెలవీనూ! అతని స్త్రీ చిత్రాలన్నీ కామోద్రిక్తలు, భోగాసక్తులూనూ!


పింక్ ట్యునిక్ – లెంపికా (1927)

సుజాఁ వాలదాఁ (Suzanne Valadon, 1867-1938) స్త్రీ చిత్రకారిణి. ఆవిడ వేసిన దిగంబర స్త్రీల బొమ్మలలో అమాయకత్వం కనిపిస్తుంది. స్త్రీ తన లైంగికత్వాన్ని అమ్మకానికి పెట్టిందా అన్నట్టు మాత్రం ఆవిడ ఎక్కడా చిత్రించలేదు. ఉదాహరణకి, Nude seated on a bed (1922), Nude reclining on a couch (1928) అన్న ఈ రెండు చిత్రాలూ చూడండి. టమారా (Tamara de Lempicka, 1898-1980) గీసిన Pink Tunicలో (1927) అత్యంత దృఢమైన వ్యక్తి కనపడుతుంది. ఇది రాతిపై చెక్కిన శిల్పంలా ఉన్నది అన్న ఊహ రాక మానదు.


సెల్ఫ్ పోర్ట్రెయిట్ – బెకర్ (1906)

స్త్రీ చిత్రకారులే స్త్రీ చిత్రాలని ప్రమాణసిద్ధంగా యదార్థంగా చిత్రించగలరా? అని ప్రశ్నిస్తే, నిక్కచ్చిగా సమాధానం చెప్పటం కష్టం. కాని, పురుషులకీ స్త్రీలకీ లైంగికానుభవం, ఒకే రకంగా ఉండదు. 1973లో లూసీ లిపర్డ్ (Lucy Lippard) చిత్రకళా ప్రదర్శన కేటలాగ్ Women Choose Womenలో ఈ విధంగా రాసింది: “The overwhelming fact remains that a woman’s experience in the society is simply not like that of a man… and if this factor does not show up in women’s art, only repression can be to blame.” ఇది కొంచెం అతిశయోక్తిగా కనిపిస్తుంది కాని, పచ్చి అబద్ధం మాత్రం కాదు. పాలా బెకర్ (Paula Modersohn-Becker, 1876-1907) వేసిన Self Portrait (1906) చిత్రం చూడండి. కచ్చితంగా స్త్రీ దృక్పథం, స్వీయ ప్రకటన — రెండూ కనిపిస్తాయి. ఈ చిత్రం వేసిన ఒక సంవత్సరం తరువాత, చిత్రకారిణి ప్రసూతిలో మరణించింది.


ది బాత్ – మేరీ కసాట్ (1893)

చిత్రకళలో ప్రేమ, వలపు, వివాహం లాంటి సాంఘిక విషయాలు భాగాలే. చిత్రకళలో ‘ప్రేమ’ అనేది వివిధ రకాలుగా కనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం స్త్రీపురుషుల కౌగిలికే పరిమితం కాదు. తల్లి – పిల్లల మధ్య అనురాగం, అభిమానం, ఇవన్నీ ప్రేమకి ఉదాహరణలే. అగూస్ట్ రొదాఁ (Auguste Rodin, 1840-1917) శిల్పం The Kissలో, మేరీ కసాట్ చిత్రం The bathలో, జేకబ్ ఎప్‌స్టీన్ (Jacob Epstien, 1880-1959) గీసిన Madonna and Childలో రకరకాల ప్రేమానుభూతులు చూడవచ్చు.

రొదాఁ విషయం వచ్చింది కాబట్టి అతను వేసిన దిగంబర స్త్రీ నీటిరంగుల చిత్రాల ప్రసక్తి చెప్పి తీరాలి. రొదాఁ కొన్ని వందల బొమ్మలు వేశాడు. దిగంబర స్త్రీని చూస్తూ కాగితానికేసి చూడకండా పెన్సిల్‌తో స్కెచ్ గీసి, ఆ తరువాత కాగితంపై నీటిరంగులు పులిమేవాడని అంటారు.


ది కిస్ – రొదాఁ (1889)

అందంగా అచ్చు వేసిన ఒక వంద బొమ్మలు కూర్చిన Auguste Rodin, Erotic Water Colors, 1995 అనే పుస్తకం చూస్తే బహుశా ఇది నిజమే సుమా అని మీకు కూడా అనిపించక మానదు. స్త్రీ చిత్రాలలో స్త్రీని దిగంబరంగా చిత్రించటం బహుశా పురుష ప్రకృతి కావచ్చు. సంప్రదాయకులైన మన భారతీయ చిత్రకారులు కూడా దిగంబర స్త్రీ చిత్రాలు వేశారు. దామెర్ల రామారావు కూడా దిగంబర స్త్రీ చిత్రం, అమాయిక (నిరంబర) గీశాడు. చిత్రకారులందరికీ ఈ ప్రక్రియ ఒక రిచువల్‌ కావచ్చు. స్త్రీ ఆకృతి సర్వసాధారణంగా వ్యక్తిగత లైంగిక అనుభూతులను విశదీకరిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంతకుముందు ఉదహరించిన మొదిల్యియాని చిత్రం, రిక్లైనింగ్ న్యూడ్ (Reclining nude) చూడండి. స్త్రీ సుఖాన్నిచ్చే విలాసవస్తువు గానే చూపబడింది. ఎర్రటి పెదవులు, ఒక చేయి తల క్రింద పెట్టుకొని, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రించటం, లైంగిక తృప్తికి ఉదాహరణ.