ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి


మాహా వెస్తీదా – గోయా (1803)

ఫ్రాంచిస్కో గోయా (Francisco Goya, 1746-1828) దృశ్యమాన పరంగా ఆధునికతకి దగ్గిరవాడేనని చెప్పవచ్చు. స్త్రీ రూపాన్ని ప్రౌఢమైన పురుషోచిత సంప్రదాయంతో దృక్పథంతో మెచ్చుకొనేవాడు. అతని మాహా చిత్రాలలో స్త్రీలు (Nude Maja, 1800; Clothed Maja, 1803) నిజంగా దృఢమైన, స్వతంత్ర వ్యక్తులు, లౌక్యం తెలిసి తెలివిగా మసలుకొనేవాళ్ళు. అయితే మనే (Edouard Manet) కూడా ఈ పద్ధతే అవలంబించాడు. అంటే అతని వేసిన ఆడవారి బొమ్మలు స్వతంత్ర వ్యక్తులుగా, లౌకికులుగా, దృఢంగా ఉన్నప్పటికీ, వారిలో వగలాడితనం లోపిస్తుంది. ఉదాహరణకి Olympia (1863) చిత్రం చూడండి.


మాహా దెస్నూదా – గోయా (1800)

స్త్రీలు పురుషులకి ఎల్లప్పుడూ మార్మిక వ్యక్తులుగానే గోచరించేవాళ్ళు. అయితే, ఆధునిక స్త్రీ, పురుషులకే కాకుండా సాధారణ స్త్రీలకి కూడా సమస్యగానే అగుపించేది. అంత ఎందుకు? స్త్రీ, స్త్రీగా తనకే ఒక సమస్య, అన్నా చిక్కు లేదు. మనం ఇప్పుడు తెలుసుకున్నాం: స్త్రీ చరాస్తి కాదని, పనికత్తె మాత్రమే కాదని, జీవితాంతం పిల్లలని కనే యంత్రం కాదని, ఒకే పురుషుడికి అంకితమయిన మనిషి కాదని, తలకొవ్వి తీరికగా కూచునే జీవి కాదనీ — అయినా ఇప్పటికీ కూడా, బయటి ప్రపంచంలో అన్ని విషయాలలోనూ సమాకలిత సభ్యురాలిగా స్త్రీ గుర్తించబడలేదు.


ఒలింపియా – మనే (1863)

నిజం చెప్పాలంటే, పంతొమ్మిదవ శతాబ్దంలో చిత్రకారుడు సహజంగా స్త్రీ ప్రతిమని చిత్రించాలనుకుంటే, అప్పట్లో చిత్రకళలో ఉన్న పాత సాంప్రదాయాలు — అందం, సుకుమారత — వంటివి కనిపించేట్టు చిత్రించాలి. ఇటువంటి సాధారణ లక్షణాలకి ఉద్వాసన చెప్పవలసిన అవసరం ఉన్నదని నమ్మి, ఆ పని చేసిన వాడు డేగా. చాలామంది ధనికవర్గం స్త్రీలకి అప్పట్లో ఇది బాధ కలిగించింది. డేగా శిష్యురాలు, స్నేహితురాలు అయిన మేరీ కసాట్ (Mary Cassatt, 1845-1926) చిత్రించిన స్త్రీ చిత్రాలు సహజంగా, ఆహార్య రహితంగా (ఉదా. La Toilette) ఉంటాయి.


ల ట్వాఁలెట్ – మేరీ కసాట్(1894)

సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థ, గందరగోళం, సమస్యని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. ఈ అభిప్రాయాలు వేద సూత్రాల లాగా, అంతిమ సత్యాల లాగా వల్లించటం పరిపాటి అయ్యింది. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.

ఎడ్గార్ డేగా (Edgar Degas) స్త్రీలు ప్రదర్శనార్థం కోసం కానప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో అల్లాగే తన చిత్రాలలో స్త్రీలని చిత్రించాడు. కొన్ని పాత సాంప్రదాయాలని ప్రతిఘటించి, ముఖ్యంగా, స్త్రీలు సృష్టిలో కేవలం అందమైన ప్రాణులు మాత్రమే కాదని చూపడానికి ప్రయత్నించాడు.


ఆఫ్టర్ ది బాత్ – ఉమన్ డ్రైయింగ్
హర్‌సెల్ఫ్ – డేగా (1898)

వీపు గోక్కుంటూనో, కాలి చీలమండ మర్దన చేసుకుంటూనో, ఇలా సహజ ప్రక్రియలలో స్త్రీలను చిత్రించటం ఏ స్త్రీ సహించదు. డేగా సరిగ్గా అటువంటి సహజమైన పనులు చేసే బాలే (ballet girls) నృత్యకన్యల బొమ్మలు వేశాడు. ఒకసారి, ఎవరో అడిగారట, “డేగా! నువ్వుఎప్పుడూ కురూపులు, అనాకారులుగా కనిపించే స్త్రీ చిత్రాలని ఎందుకు వేశావు?” అని. అందుకు డేగా సమాధానం: “సాధారణంగా స్త్రీలు అనాకారులే కాబట్టి!”

ఎడ్వర్డ్ ముంక్ (Edvard Munch, 1863-1944) అనే ఆధునిక చిత్రకారుడు మనస్సంబంధితలైంగిక వికాసానికి అన్వయించుకోటానికా అన్నట్టు కనిపించే సూత్రం తన The Dance of Life చిత్రం ద్వారా తెలియపరిచాడు. ఈ బొమ్మలో స్త్రీ మానసిక పరిణామం మూడు దశలుగా చూపిస్తూ ఒక వ్యూహాత్మక కథనం (ప్రణాళిక?) చిత్రించాడు.


ది డాన్స్ ఆఫ్ లైఫ్ – ముంక్ (1899)

మొదటి దశ: స్వప్న మయమైన ఊహా ప్రపంచంలో నుంచి స్త్రీగా పెరిగే బాలిక – మొగ్గనుండి పువ్వుగా వికసించే వ్యక్తి – తరువాత భౌతిక వాంఛతో పురుషునితో కలయిక — పురుషుడు ప్రేమికుడు, మోసపోయినవాడు కూడా — ఆఖరిగా స్త్రీ తిరస్కృతగా తయారయిన వితంతువు. ఈ బొమ్మని చాలా మంది చిత్రకళా విమర్శకులు, బైబిల్‌లో ఉన్న విశ్వసృష్టి పురాణకథకి వైపరీత్య వ్యాఖ్యానం అని రాశారు. కాని, ఆ వ్యాఖ్యానం బహుశా సరైనది కాదు. ఈ బొమ్మలో స్త్రీ తన వ్యక్తిగత మూలాన్నీ, దేశీయ హేతువులనీ అధిగమించినదని వ్యాఖ్యానించవచ్చు. ఏది ఏమయినా, బొమ్మ మధ్యలో శవాకారంలా చిత్రించబడ్డ పురుషుడి గురించి ఏ విధమైన వ్యాఖ్యానం చెయ్యచ్చు? స్త్రీ లైంగికత్వ ధ్వంసకారిణా? కాదు. ఈ చిత్రం స్త్రీ పురుష సంబంధాలలో జటిలమైన సత్యాలని చిత్రించిన చిత్రం.


ఉమన్ విత్ ఎ కాఫీ పాట్
– సెజాఁ (1895)

పాల్ సెజాఁ (Paul Cezanne, 1839-1906) తన Woman with coffee pot చిత్రంలో స్త్రీ లోని సహజ మానవతని నిర్జీవం చేస్తే, ఆన్రీ మటీస్‌కి (Henri Matisse, 1869-1954) స్త్రీ ఒక అలంకరణ వస్తువే! వీరిద్దరూ క్యూబిజమ్ (Cubism) ప్రారంభానికి నాంది పలికిన వాళ్ళు. ప్రొటొ క్యూబిస్టులని చెప్పవచ్చు. కాని, గీతలు, సమచతురాలు మాత్రమే ఉపయోగించి, క్యూబిస్టుల క్రూరమయిన ‘భాష’లో ఒదిగి ఉండే స్త్రీ చిత్రాలని గీసినవాడు పికాసో. 1937లో గీసిన Weeping Womanలో స్త్రీ అంతర్లీన జీవనం విజయవంతంగా గుర్తించగలిగాడు. గుర్తించటమే కాదు; ‘అనుభవించి’ చిత్రంలో స్త్రీ కన్నుల నుండి తడి కన్నీటి బిందువులు సృష్టించాడు.


వీపింగ్ ఉమన్ – పికాసో (1937)

ఇంతవరకూ స్త్రీ చిత్రణలో పురుషుడు వద్దనుకున్నా కనిపిస్తాడు. అంటే, స్త్రీ స్వాతంత్ర్యం అనేది ఏదన్నా ఉంటే అది మరుగున పడి ఉండిపోయింది. ఇప్పుడు, ఏకాంతత, వంటరితనం ఎలా చిత్రించారో చూద్దాం. ఈ ఏకాంతత — స్త్రీ తనకు తానుగా కోరుకున్న ఏకాంతత, వంటరితనం కావచ్చు. సామాజిక బంధాలు తెగిపోవటం, చుట్టూ చిన్న పిల్లలు లేకపోవడం కారణం కావచ్చు. ఇది చిత్రకళలో మరొక ఆధునిక ప్రస్తావన. అంతర్లీన జీవనం సాధారణంగా సాహిత్య ప్రక్రియ. స్త్రీ ఊహలు, అనుభూతులు, అనుభవాలూ, రాయటంలో ఉన్న సులువు వేరు. చిత్రీకరించటంలో ఉన్న కష్టాలు వేరు. ఒక కళోపాసనకు కావలసిన వ్యూహరచన, భౌతిక సదుపాయాలు — చిత్రకళ, శిల్పకళ, ప్రింట్ తయారీ — సాధారణంగా వసతి గృహాలలో ఏర్పాటు సాధ్యంకాదు. దానికి తోడుగా, పక్షపాతం (prejudice) మరొక అవరోధం. చిత్రకళకి సంబంధించిన సాహిత్యం లోను, చిత్రకళాభ్యాసం లోను కూడా, స్త్రీలు పాక్షికతని ఎదుర్కోవాలి. ఈ పాక్షికతని కవయిత్రుల కన్నా, నవలా రచయిత్రుల కన్నా ఎక్కువగా అనుభవించవలసిన వాళ్ళు చిత్రకారిణులు. అయినప్పటికీ కొద్దిమంది చిత్రకారులు, స్త్రీ యొక్క వంటరితనాన్ని వస్తువుగా స్వీకరించి చిత్రాలు గీశారు.


హోటల్ రూమ్ – హాపర్ (1931)

అమెరికన్‌ చిత్రకారులలో ఎడ్వర్డ్ హాపర్ (Edward Hopper, 1882-1967) స్త్రీ ఏకాంతతని చిత్రీకరించిన ‘కవి’ అంటారు. హాపర్ 1931లో వేసిన Hotel Room చిత్రం చూడండి. ఈ చిత్రంలో స్త్రీ ఒక చవకబారు హోటల్‌ గదిలో ఒంటరిగా కూర్చుంటుంది. నిజంగా ఒంటరిది కాదు. తన భర్తతో కలిసే వచ్చింది. కానీ అతను లేడు. భర్త లగేజీ, విడిచిన తన చెప్పులు, తన చేతిలో ఒక తెరిచిన పుస్తకం; చదవటానికి కుతూహలం మాత్రం లేదు — మానసికంగా విడవబడి, ఒంటరితనం నెత్తిన రుద్దబడిన స్త్రీ.


ఉమన్ బైటింగ్ హర్ నెయిల్స్
సోయర్ (1972)

అలాగే రాఫెల్ సోయర్ (Raphael Soyer, 1899-1987) వేసిన చిత్రం — Woman Biting her Nails (1972) — పిరికిగా, ఉదాసీనంగా, విచారమగ్నంగా గోళ్ళు కొరుక్కుంటున్న స్త్రీ. ఈ చిత్రాలు స్త్రీ వంటరితనానికి, తన పరిసర సమాజంపై అనాసక్తతకి ప్రామాణిక ఉదాహరణ అని చెప్పవచ్చు. కాని, ఈ చిత్రాలు ఏవీ ప్రజాభిమానం పొందలేదు. ఎందుకని? స్త్రీ చిత్రం అనగానే అందమైన బొమ్మలా కృతకంగా కూర్చున్న స్త్రీ చిత్రాలే ‘గొప్ప’ చిత్రాలు అనే అపోహే కారణం. ఆ చిత్రాలే ప్రజాభిమానం పొందాయి.


ఐరనింగ్ ఉమన్ – పికాసో (1904)

స్త్రీ పరంగా సాధారణ వృత్తులు అందరికీ తెలిసినవే. ఇవి చిత్రకారులు ఎలా చూపించారో చూద్దాం. ఇంటిపనులు అన్నీ కష్టపడి చేసే పనులు — వంట చేయటం, ధాన్యం నూర్పిడి, బట్టలు ఉతకటం, ఇస్త్రీ చెయ్యటం వగైరా. విసిగి వేసారి డస్సిపోయే పనులు, ఇవన్నీ! > జాఁ ఫ్రాన్స్‌వాఁ మియే (Jean Francois Millet, 1814-75) వేసిన ఉమన్ విత్ ఎ రేక్ (Woman with a rake), ది గ్లీనర్స్ (The gleaners), ది స్టబుల్ బర్నర్ (The Stubble burner), బ్రేకింగ్ ఫ్లాక్స్ (Breaking Flax), ఇలా ఎన్నో చిత్రాలలో రోజువారీ శ్రమను చిత్రించాడు. ఈ చిత్రాలన్నీ కూడా 1850-60 ప్రాంతాలలో Labors of the field అనే పరంపరలో వేసినవి. ఒనోరే డమియే (Honore Daumier, 1808-79) వేసిన ది లాండ్రెస్ (The Laundress, 1863), డెగా వేసిన టు లాండ్రెసెస్ (Two Laundresses, 1884), పికాసో వేసిన Ironing woman (1904) చూడండి. వీటన్నిటిలో అలసి డస్సిపోయి, నిరాశ, నిసృహలతో ఉన్న స్త్రీ మూర్తులు కనిపిస్తారు.