“ఆకలి వేసినప్పుడు ఎక్కడ తినాలనిపిస్తే అక్కడ తింటాను ఏ హోటల్లోనో. అమ్మ ఇంట్లో ఉంటే ఏమైనా వండి పెడుతుంది. అమ్మ చేతి వంట కన్నా హోటల్ భోజనమే ఫరవాలేదు. అంటే అమ్మ చేతి వంట బాగా ఉండదని కాదు. అమ్మని తలచుకుంటే ముద్ద దిగదు. కూతురు కోసమని ఆమె కూడా ఏమీ చేసింది లేదు.”
సుమతి నా కన్నా ముందుగా అడిగింది. “ఆమె మీ సొంత అమ్మే కదా?”
“అవునండి. కాని ఆమె ఇప్పుడు వేరొకరితో ఉంటోంది. నాకు అతను నచ్చలేదు. అతనికీ నేను నచ్చలేదు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. నా జీవితాన్ని నేను ఎలాగో గడుపుతున్నాను.”
మౌనంగా ఉండిపోయాం అందరమూ. కీ ఇవ్వకుండా ఆగిపోయిన గడియారం వైపు చూస్తూ ఉండి పోయాను.
“మరియా! నీవు స్కూలుకి సరిగ్గా వస్తే కాస్త మార్పుగా ఉంటుంది కదా.”
“నేను ఎవరికోసం చదవాలి సార్?”
“నీ కోసం.”
“ప్చ్..” అన్నది ఆమె. ఆపైన ఏమీ మాట్లాడకూడదని నాకు అనిపించింది.
“బీచ్‌కి వెళదాం. రా రాదూ?”
“నన్ను రమ్మంటున్నారా సార్?” ఆశ్చర్యంగా అడిగింది.
“రా మరి.”
“ఇదిగో ఒక్క నిమిషంలో వచ్చేస్తాను.” అంటూ తుళ్ళి పడినట్లు లేచి లోపలికి పరిగెత్తింది.
నేను సుమతి వైపు చూశాను.
“పాపం ఆ ఆమ్మాయి” అన్నది సుమతి.
“ఎవరు మాత్రం పాపం కాదు? ఈ అమ్మాయిని వదిలేసి ఎక్కడో జీవితం గడుపుతున్న ఆ తల్లి పాపం కాదా? ఆమె తండ్రి పాపం కాదా? అందరమూ ఏదో ఒక రకంగా పాపగ్రస్తులమే.” అన్నాను నేను.
అప్పుడే పూసిన పూవులాగా, రోడ్డు వారగా వానలో తడిసిన మొక్క లాగా, వాగు నీటిలో మెరుస్తున్న గులకరాయిలా బైటికి వచ్చింది మరియ. పేంట్ షర్ట్ వేసుకుంది. టక్ఇన్ చేసుకున్న షర్ట్‌లో అందంగానే కనిపించింది. ప్రవర్తనకి, శరీరానికీ సౌకర్యంగా ఉండేదే కదా డ్రెస్.
“స్మార్ట్!” అన్నాను.
“థాంక్స్ సార్” అన్నది పెదాల మీద విరిసిన నవ్వుతో.
నేను మధ్యలో, వాళ్ళిద్దరూ చెరో ప్రక్కా నడుస్తూ పక్కనే ఉన్న బీచ్‌కి వెళ్ళాము.
బీచ్ లో అంతా సందడిగా ఉంది. ఉరుకులూ పరుగులతో ఒకరినొకరు వెంటాడే పిల్లలు, గుర్రాల మీద సవారి చేసే పిల్లలు, ఆ పిల్లల ఆటలను చూసి సంతోషంతో పొంగి పోయే తల్లి తండ్రులు. యువకులు యువతులూ, వాళ్ళ ప్రేమ వ్యవహారాలు. ఇసుకలో వేయించ బడుతున్న పల్లీలు…
పిల్లల జీవితాన్ని రంగుల మయంగా మారుస్తున్నట్లు బలూన్లు గాలిలో ఎగిరాయి. బటానీలు మామిడి ముక్కలు కలిపిన గుగ్గిళ్ళను అమ్మే అయ్యరు దగ్గర కొనుక్కొని ముగ్గురమూ తిన్నాము.
“నాకు కారం వడ కావాలి సార్” అని అడిగింది మరియ. కొని ఇచ్చాను. చిన్న పిల్లలాగా సంబర పడుతూ తిన్నది.
“మధ్యాహ్నం భోజనం చేయలేదు సార్. ఒంట్లో ఓపిక లేక అలాగే నిద్ర పోయాను.”
“ఈ రోజు రాత్రి మాతోనే నువ్వు భోజనం చేస్తున్నావు” అన్నది సుమతి.
“ఉండనీ అక్కా.”
“ఏమిటి ఉండనీ? నువ్వు రావాల్సిందే.”
తిరిగి వచ్చేటప్పుడు సుమతి చేతి వేళ్ళతో తన వేళ్ళను జొనిపి పట్టుకుంటూ, కొంచం వెనకగా మరియ నడిచి వచ్చింది. నేను ముందుగా దారి తీశాను.
సాంబారు, గుత్తి వంకాయ కూర. మధ్యాహ్నం చేసిన నెత్తిలి చేపల వేపుడు.
“ధూళ్ అక్కా! ఈ సాంబారుకి చేపల వేపుడు మంచి కాంబినేషన్” అన్నది మరియ.
మరియ ప్రొద్దున్న, సాయంత్రం మా ఇంటికి రావడం కొనసాగింది. రోజూ ప్రొద్దున్న టిఫిన్ మా ఇంట్లో ఇడ్లీలు. సంవత్సరంలో మూడువందల అరవై ఐదు రోజులూ మా ఇంట్లో ఇడ్లీ లేక పోతే దోశ.
“రుబ్బురోలును తీసి దాచి పెట్టేస్తే సుమతికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మరియా,” అన్నాను. పడీ పడీ నవ్వింది మరియ. సాయంత్రాలలో కూడా మా ఇంటికి వస్తుండేది రోజూ. పేంట్ షర్ట్ వేసుకొన్న ఆ అమ్మాయి శ్రమపడి నేల మీద కూర్చుని సుమతికి ఉల్లిపాయలు కోసి ఇవ్వడం నాకు వింతగా ఉండేది.
“సైకిల్ ఎక్కి రోడ్డు మీద తిరిగే పిల్లవి, నీవు ఈమెకు ఉల్లిపాయలు కోసి ఇవ్వడం ఏమిటీ?’ అన్నాను.
“ఈ పనులు చేయడం నాకు థ్రిల్లింగా ఉంది సార్. కళ్ళంబట నీళ్ళు కార్చుకుంటూ ఉల్లి పాయలు కోస్తుంటే బాగుంటుంది సార్,” అన్నది. అయ్యో పాపం! అనిపించింది నాకు.
“సార్! ఒక విషయం చెప్పనా?”
“రెండు మూడు చెప్పు.”
“సీరియస్‌గా అడుగుతున్నాను సార్! నేను ఇక్కడికి వచ్చి వెళ్ళడం మీకు ఇబ్బందిగా లేదు కదా?”
“సత్య ప్రమాణంగా ఏ ఇబ్బందీ లేదు.”
కాస్సేపు మౌనంగా ఉన్న తరువాత ఆమె అన్నది. “ఎందుకు సార్ చెడిపోయిన పిల్ల అని అందరూ అనుకునే నన్ను మీ ఇంట్లోకి రానిచ్చి భోజనం కూడా పెడుతున్నారు?”
నవ్వొచ్చింది నాకు. “పిచ్చి పిల్లా! ఈ లోకంలో చెడ్డవాళ్ళు ఎవరు చెప్పు? ఎవరూ చెడ్డవాళ్ళు కాదు తెలుసా? చెడి పోయిన అమ్మాయిని అని నీ మనసులో అనుకుంటున్నావు కాబోలు. ఆ సంగతి వదిలెయ్యి. నీవు చెడిపోలేదు. ఆ మాట కొస్తే మీ అమ్మా, నాన్నా కూడా చెడ్డ వాళ్ళు కాదు.”
మరియ అన్నది. “మా అమ్మ మీద పగ తీర్చుకోవాలనే అలా చేస్తాను సార్.”
“నాకు తెలుసు.” అన్నాను.
పది రోజులు గడిచాయో ఏమో. ఒకరోజు మరియ నన్ను అడిగింది. “సార్! నేను స్కూలుకి రావడం లేదేమని మీరు నన్ను ఎందుకు అడగలేదు?”
నేను ఆమె ముఖం వైపు చూశాను. కళ్ళ నుంచి రెండు నీటి చుక్కలు క్రిందికి జారడానికి సిద్ధంగా ఉన్నాయి.
“నన్ను మీరు అడిగి ఉండాల్సింది సార్. ఏమిటే! స్కూలుకి ఎందుకు రావడం లేదని చెంప మీద కొట్టి మరీ అడగాల్సింది. అలా ఎవ్వరూ నన్ను అడగక పోవడం వల్లనే కదా నేను ఇలా పట్టించుకోకుండా తిరుగుతున్నాను. నా మీద ఎవరూ ఇలా ప్రేమ చూపించినది లేదు సార్. ఆప్యాయత చూపించే వాళ్ళకే కదా గదమాయించి అడగడానికి అధికారం ఉంటుంది?”
“నీకే అలా అనిపించాలనే నేను ఇన్ని రోజులు ఆగాను. ఇప్పుడేమయ్యింది? ఏదీ మించి పోలేదు. ఈ రోజు కొత్తగా జీవితం ప్రారంభించు. ఈ రోజే పదవ తరగతిలో కొత్తగా చేరానని అనుకో. రేపటి నుంచి మనం స్కూలుకి వెళ్తున్నాం” అన్నాను.
మరియ రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవ సాగింది.
ప్రపంచన్ (1945- )
ప్రముఖ రచయిత ఎస్. వైద్యలింగం, ప్రపంచన్ అన్న కలం పేరుతో తమిళ సాహితీ ప్రియులకి పరిచయం. స్వభావరీత్యా స్నేహశీలి. ‘వానం వసప్పడుం’ అన్న నవలకి 1995లో సాహిత్య అకాడెమి అవార్డ్ లభించింది. జీవితాన్ని పాజిటివ్ దృక్పథంతో చూడాలని, మనుషుల మధ్య మాటల వారధి ఉండాలన్న ఆశయంతో రచనలు చేస్తున్న ప్రపంచన్ భారతీయ భాషా పరిషత్ అవార్డ్, కస్తూరి రంగమ్మాళ్ అవార్డ్, ఆదిత్యనార్ అవార్డ్, ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం సారల్ అవార్డ్ గ్రహీత కూడా ప్రపంచనే.
