వేంకటంలో కొండలరాయడు

ఇప్పుడు ఒక అడుగు వెనకకి వేద్దాం. ఆమె వారిద్దరూ మొదటగా కలిసిన దినాల వివరాలు ప్రస్తావిస్తున్నది. ఆ రోజుల్లో ఆమె చాలా అమాయకురాలు. ప్రియుడిని కన్నెత్తి చూడటానికి కూడా సిగ్గుపడేది. అతన్నీ చూసి తల తిప్పుకునేది, లేదా కళ్ళు దించుకునేది. ఇప్పుడదంతా మారిపోయింది. అతని ఊహ రాగానే ఆమె పెదవుల మీద నవ్వులు పూస్తాయి. ఆమె అతన్ని చూస్తూ ఉండి పోవాలని కోరుకుంటుంది. కానీ ఆ చూడటం నిర్లజ్జగా, బాహాటంగా కాదు. ఆమె ఇప్పటికీ ముద్దరాలు, ఎంతగానో సిగ్గుపడే స్త్రీ. ఈమె మితిమీరిన సిగ్గు ప్రణయసమయంలో ప్రియుడిని చిరాకు పెట్టి ఉంటుంది. చిరు కలహం చెయ్యి దాటిపోవడానికి కారణం అదేనేమో. కానీ ఇప్పుడు ఆమె చెప్తున్నది నేను అంతగా సిగ్గు పడను ఇక మీదట అని. అలా అని నిర్లజ్జాపూరితంగా కూడా ప్రవర్తించను. నేను నీదాననే, అని కూడా చెప్తున్నది.

ఇక్కడి దాకా వచ్చిన తరువాత, ఆమె ఎంత బాధపడిందో కూడా చెప్పవల్సిన సందర్భం వచ్చింది. ఆమె పెదవులు ఎండిపోయి ఉన్నాయి. ఆమె జుట్టు చిందరవందరగా ఉంది. ఈ రోజు, ప్రియుడు వస్తాడనే అనుకున్నదేమో అతనికి నచ్చే విధంగా సింగారించుకుంది. ఆమె పెదవులు తేనెలో నానినట్లుగా నిండుగా ఉన్నాయి. ఆమె జడ వేసుకొని తలలో పూలు తురుముకున్నది. ప్రియుడు తన మొర ఆలకిస్తాడా? ఇంటికి తిరిగి వస్తాడా? ఆమె అతనికి ‘మనిద్దరం భార్యాభర్తలమయ్యా’ అని గుర్తు చేస్తున్నది. స్వామీ, నీవు వేంకటేశ్వరుడవు, నేను నీ సతిని, అలమేలుమంగని అని తన పేరు సగర్వంగా అతనికి చెప్పుకుంటున్నది. వారిద్దరూ ఒకరికొకరు సరిజోడీ. ఆయన ఆమెకి ‘యీడుగా కూడి’న వాడు. అయితే, ఆ కూడిక (శృంగార కలయిక)లో కూడా వారిద్దరూ ఒకరికొకరు తగిన వారు అని చెప్పే చమత్కార ధ్వని ఉన్నది. ఆమె కూడితివి అన్న మాటను అదే అర్థంలో మనం తీసుకుంటే, ఆయన అప్పటికే ఇంటికి వచ్చేసి ఉండాలి. అంటే ఈ కలయిక కూడా అప్పుడే పూర్తయింది ఈ పదపు ఆఖరి చరణం రాకముందే.

అయినప్పటికీ ఆమె ఇంకా “ఇంటికి రావయ్యా” అని అతన్ని పిలుస్తూనే ఉంది. ఆ ప్రియుడు ఇంకా ఇంటికి రావలసి ఉందన్నట్టుగా, ఆమె ఎప్పటికీ అతని రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా. ఈ నిరీక్షణ ఈ పదం లోని చరణాలన్నింటినీ కలిపే సూత్రంగా పని చేస్తున్నది. పదంలోని భావసంచయాన్ని పూలమాలగా అల్లుతున్నది. ఈ పిలుపు విన్న ప్రతిసారీ దాని అర్థం సున్నితంగా మారుతున్నది. ఆ పిలుపులో భావతీవ్రత పెరుగుతూ వస్తున్నది. అప్పటి దాకా ఆమె అతనికి చెప్పిన ఊసులు, ఆ పిలుపుకి మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఆ పిలుపుని మన మనన్సు మూలల్లోకి మరింతగా చొచ్చుకుపోయేలా చేస్తున్నాయి. ఆ రకంగా పొరలు పొరలుగా వారిద్దరి బాంధవ్యపు జ్ఞాపకాలన్నీ మన మనసుల్లో కూడా పేరుకుంటున్నాయి.

‘నేనీకు వేరు గాను నీవు నాకు ఎరవు గావు’ అన్న పల్లవి ముందు కేవలం ప్రియుడికి గతకాలపు ప్రణయాన్ని గుర్తు చేయడానికి నొక్కి చెప్పిన మాట. అది పదం చివరికి వచ్చేసరికి కొత్తగా వారి మధ్య మళ్ళీ చిగురించిన ప్రణయం గురించి చెప్తున్నదిగా భావాంతరం చెందింది. కలహం సమసి పోయింది. పదం నిజంగానే ప్రేమికులనిద్దరినీ మళ్ళీ దగ్గరకు చేర్చింది. ప్రతీసారి విన్నప్పుడల్లా ఈ పల్లవి వాళ్ళిద్దరి మధ్యా జరుగుతున్న పరిణామాలను అల్లుతూ మనకు చూపిస్తున్నది. పదం ముగిసే సరికి ఈ అల్లిక కూడా పూర్తయింది. వాళ్ళిద్దరి కలయిక పూర్తయింది. తనదైన చాతుర్యంతో మాటలాడి ఆమె తన ప్రియుడిని తిరిగి సాధించుకున్నది.

ఈ పదంలో పదాల వాడుక చూడండి. మొదటి చరణంలో కొంచెం పరుషంగా వినపడే ‘క్క’ శబ్దం పునరావృతమైతుంది. అది ఆమె దుస్థితిని శబ్దపూర్వకంగా మనకు ఉద్దేశిస్తున్నది. రెండవ చరణం వచ్చేసరికి పరుష శబ్దం సరళమయింది. ‘గ్గ’ గా మారింది. ఈ సరళత వారి ముందు రోజుల ప్రణయాన్ని సరళంగా గుర్తు చేస్తున్నది. అవి దూరపు జ్ఞాపకాలు. అవి వాడిగా స్పష్టంగా ఉండవు. చివరి చరణానికి వచ్చేసరికి అతిసరళమైన డకార శబ్దం మన చెవుల్లో నిండిపోతుంది. మన తెలుగులో ఇది శిథిల డకారం. సరళమైన శబ్దం. ఆమె తన పేరు అలమేలుమంగ అని చెప్పుకునేసరికి, అత్యంత సరళమైన ల కారం ప్రధానమయింది. ఈ రకంగా ఈ పదంలో శబ్ద సంగీతం కూడా ఎలా పరిణమించిందో మనం గమనించవచ్చు. పదం లోని పదాలతో భావం వర్తులాకారమై, ఆద్యంతాలు కలిసిపోయి అర్థం సంపూర్ణమైతున్నది. వెళ్ళిపోయిన ప్రియుడు తిరిగి వచ్చాడు. స్వామి ఇంటికి చేరుకున్నాడు.

ఈ రకమైన కవిత్వం, ఈ పద రూపం, రాగం కట్టబడిన విధానం – ఇవన్నీ అప్పటికి తెలుగు సంస్కృతిలో మొట్టమొదటగా వచ్చినవి. పదాల పొందిక పొదుపైనది. భావాల అల్లిక విస్తారమైనది. వాడిన భాషలోని సరళత, భావంలో లోతు లేదనుకొని పొరపడడానికి ఆస్కారమిస్తుంది. ఈ పదాలు మళ్ళీ మళ్ళీ వినాలి. ఎన్నో సార్లు వినాలి, ప్రత్యేకించి పాడుతుండగా వినాలి. అప్పటికీ కానీ అవి వాటి రహస్యాలను మనకు చూపించవు.

తన సహజ కవితా సామర్ధ్యం గురించి అన్నమయ్యకు తెలుసును. తన కవిత్వం అనిదంపూర్వంగా, అసమానంగా, అనుకరింప వీలు లేనిదిగా అన్నమయ్య భావించాడు. తనను అనుకరించ బోయిన వారిని తీవ్రంగా నిరసించాడు.

వెఱ్ఱులాల మీకు వేడుక గలిగితేను
అఱ్ఱువంచి తడు కల్లంగరాదా

వుమిసిన తమ్మలో నొక కొంత కప్రము
సమకూర్చి చవిగొని చప్పరించనేల
అమరగ ఛాయాపహారము సేసుక
తమ మాట గూర్చితే దైవము నగడా

దిబికివేసిన గింజ చేత బట్టగనేల
గబుక కెంగిలి బూరె గడుగగ మరి యేల
తొబుకకవిత్వాల దోషాల బొరలితే
దిబుకార నవ్వడా దేవుడైనాను

అన్నమయ్యను అనుకరించిన వారెవ్వరూ అతని స్థాయిని ఏ రకంగానూ సమీపించలేక పోయారు. అనుకరించి వారు అన్నమయ్య కవితా సౌందర్యపు కాంతిలో నేలబారున పడ్డ నీడల లాంటి వారే. అన్నమయ్య ఇంత తీవ్రంగా నిరసించినప్పటికీ, అతని పుత్రపౌత్రాదులు అతని పేరు మీద పదాలు రాశారు. పదాలు వ్రాసే పరిశ్రమ ఒకటి తిరుపతిలో వెలసింది అనడంలో అనౌచిత్యం లేదు. చిన తిరుమలాచార్యుడి సంకీర్తనా లక్షణ గ్రంథము ఈ అనుసరణ పదాలకి సాధికారత నివ్వడానికి చక్కగా ఉపయోగపడింది. ఒక విస్తారమైన తాళ్ళపాక గ్రంథాలయం తిరుపతిలో అతని కుటుంబీకులు వృద్ధి చేశారు. పద కవిత మాత్రం ఎంతో ప్రాచుర్యం లోకి వచ్చింది. 17వ శతాబ్దంలో క్షేత్రయ్య, 18వ శతాబ్దంలో సారంగపాణి వంటి ప్రముఖ కవులను ప్రభావితం చేసింది. అయితే, ఈ రోజుకీ అన్నమయ్య పద కవితా సాహిత్యం శ్రద్ధగా అధ్యయనం చెయ్యబడలేదు. వాటిని జాగ్రత్తగా చదివి, శాస్త్ర ప్రామాణికతతో విశ్లేషించి, పరిష్కరించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. కాకపోతే, కొన్ని పదాలు, కర్నాటక సంగీతజ్ఞులు పాడినవి, విపరీతంగా ప్రాచుర్యం లోకి వచ్చాయి. అవి ఇప్పుడు తిరుపతిలో దేవుడి దర్శనానికి వేచి ఉన్న వారందరికీ వినిపిస్తూనే ఉంటాయి.

[ఈ వ్యాసానికి అవసరమైన అన్నమయ్య సంకీర్తనల తెలుగు మూలాలను నాకు అందజేసిన అవినేని భాస్కర్, జ్యోతి వలబోజులకు నా కృతజ్ఞతలు. చివరి నిమిషంలో అందజేసినా ఈ అనువాదరచనను ఎంతో ఓపిగ్గా, క్షుణ్ణంగా పరిష్కరించి, నేను వదిలివేసిన ఖాళీలను పూరించిన ఈమాట మాధవ్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. — సురేశ్.]


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి:

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 ...


డేవిడ్ షూల్మన్

రచయిత డేవిడ్ షూల్మన్ గురించి:

డేవిడ్ షూల్మన్ (David Shulman) జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీలో తులనాత్మక మతధర్మశాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా, దక్షిణ భారతదేశపు భాషలు, సాహిత్యం తదితర అంశాలపై పరిశోధిస్తున్నారు. 1976లో లండన్ యూనివర్సిటీ నుండి పిహెచ్.డీ. 1987 మెక్ఆర్థర్ ఫెలోషిప్ గ్రహీత. ఇజ్రాయెల్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ గౌరవసభ్యుడు. ఇజ్రాయెలీ, పాలస్తీనీయుల ఉమ్మడి శాంతి దళం సభ్యుడిగా ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యాల కోసం కృషి చేస్తుంటారు

 ...