వేంకటంలో కొండలరాయడు

నేనై విడువవద్దు తానై తగులవద్దు
తానే తానై వుంటేఁ దగులెల్ల నూడు

పొద్దు వొద్దు హరిఁ దలఁపునఁ దలపోయఁగ
వొద్దికైనపలుచేఁత లున్న వెల్లా మరచును
నిద్దిరించువానిచేతినిమ్మపంటివలెనే
బుద్ధితోఁ గర్మములు గొబ్బున జారిపోవును

పలుమారు గురుసేవఁ బరగఁగా బరగఁగా
చలివాసి యత్మవిజ్ఞానముఁ బొడచూపు
కలగన్నవాఁడు మేలుకనిన కలవలెనే
పలుసంసారములెల్ల భావనలై యుండును.

పక్కన శ్రీవేంకటేశుపై భక్తి వొడమఁగా
అక్కజపు టిహపరా లరచేతివి యౌను
చొక్కపు పరుసమంటి సొంపుగానిలోహము
నిక్కఁ బైఁడైనట్టు నెరుసెల్లఁ దొలఁగును

తానే తానై వుంటేఁ తగులు (చిక్కులు) అన్నీ తొలగిపోతాయట. ప్రతి పొద్దు హరిని తలపున తలపోస్తే ఈ వేదనలన్నీ నిద్దిరించువానిచేతిలో నిమ్మపండు వలె జారిపోతాయట.

అయితే, “తానే తానై” ఉండటం అంత సామాన్యమైన విషయం కాదు. ఒకచోట అన్నమయ్య సూటిగా చెప్పినట్టు నరుని వేదనలకు పరిష్కారం ఉంది కాని, ఆ పరిష్కారాన్ని చేరుకోవడానికి మార్గమే లేదు. ఇది ఎంత గడ్డు సమస్య అన్నది అధ్యాత్మిక సంకీర్తనల్లో అన్నమయ్య మనకు విపులంగా, హృద్యంగా మనకు వివరిస్తాడు. ఈ సంకీర్తనలు మనకు ఒక రచయిత రోజూవారి ఆలోచనలు రాసుకొనే డైరీ చదివినట్లు అనిపిస్తుంది: ఎన్నో పరస్పర వైరుధ్యమైన భావాలు, ఆత్మవిమర్శనలు, అపనమ్మకాలు, వివిధ మానసిక స్థితులలో రాసుకున్న భావాల పరంపర ఈ సంకీర్తనల్లో మనకు కనిపిస్తాయి. ఈ ఆత్మవిమర్శనా గీతాల్లో దేవుడి ప్రస్తావన ఉంటుంది కానీ, ఆత్మ విమర్శనయే ప్రథానమైన అంశం.

దురదృష్టవశాత్తూ, ఇది మనిషి జన్మ. కోరికలను త్యజించడం సులభమైన పని కాదు. ఈ ఐహిక వాంఛలనుండి ఎలా విముక్తి పొందాలో తెలుస్తున్నప్పటికీ అది ఆచరించడం మానవసాధ్యం కాదు. అధ్యాత్మిక పదాలలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేది ఈ వేదనే. తనని తాను సందేహించుకుంటూ, తనని తాను ద్వేషించుకుంటూ తనని తాను ప్రశ్నించుకుంటూ చేస్తున్నఈ ప్రయత్నంలో దేవుడు ఎప్పుడూ దూరంగా నిలబడి చూస్తుంటాడు. కానీ, పదాలన్నీఆయననే ఎలుగెత్తి పిలుస్తుంటాయి, ఆయనతోనే నేరుగా మొర పెట్టుకుంటాయి. దేవుణ్ణి కూడా వదలడు కవి. కాసేపు బ్రతిమాలుతాడు, కాసేపు బుజ్జగిస్తాడు, కాసేపు కసురుకుంటాడు, కాసేపు ఎత్తి పొడుస్తాడు. వాళ్ళిద్దరి దగ్గరితనం అలాంటిది. దేవుడి గురించిన సంగతులన్నీ కవికి తెలుసు. ఆయన అవతారాలని అప్పుడప్పుడూ ఆట పట్టిస్తాడు. అప్పుడప్పుడు ధిక్కార స్వరంతో ఎదురుతిరుగుతాడు.

పనిలేక జీవులను భవసాగరంబులో
మునుగ లేవగ జేయు మోహ దోసమున
పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను
వెన కెవ్వరో మొదలి వేలుపనక

తన మీద ఆధారపడి ఉన్న ఆ భగవంతుడి అవసరాన్నివాడుకుంటాడు:

నే నొక్కడ లేకుండితే నీ కృపకు బాత్ర మేది
పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు

భావించి నావంటి నీచు బట్టి కాచినప్పుడుగా
యే వంక నీ కీర్తి గడు నెంతురు భువి
నావల్ల నీకు బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు
శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు

కొన్నిసార్లు ఎత్తిపొడుపు మరింత పరుషంగా మారుతుంది.

వెన్నలు దొంగిలు నాటి వెఱ్ఱివా నీవు
విన్న కన్న జాడ గాదు వెఱ్ఱివా నీవు

చేరి నిన్ను నొల్లనట్టి జీవుల నీ వుదరాన
వీరుడవై మోచేవు వెఱ్ఱివా నీవు
నార పేరు నుడిగితే నా పేరంటా దగిలేవు
వీరాన జుట్టమవై వెఱ్ఱివా నీవు

దేవుడు దయామయుడు. కానీ బలమూ, కీర్తీ రెండూ ఉన్న దేవుడికి దయగా ఉండవల్సిన అవసరమేమున్నది? అందుకనే నీకు వెఱ్ఱి అని అంటున్నాడు దేవుడితో. లేకుంటే తనలాంటి వాడు ఎవరు మొర పెట్టుకున్నా, తటాలుమని రక్షించడానికి బయలుదేరి నవ్వుల పాలైతావు ఎందుకయ్యా? అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ దేవుడిని ఆట పట్టిస్తున్నట్టుగా ఉన్నఈ ధ్వని పైకి వినిపిస్తున్న మాట అర్థానికి వ్యతిరేకమైనది. పైకి సమవుజ్జీగా మాట్లాడుతున్నా లోలోపల ఆయనకు లొంగిపోయే ఉన్నాడు కవి. ఆ అనుబంధం ఇచ్చిన ధైర్యం వల్లనే దేవుడితో ఇటువంటి పరాచికాలు ఆడగలుగుతున్నాడు.

ఈ రకంగా మనకు అన్నమయ్య పదంలో ప్రశ్నించే గొంతు కనిపిస్తుంది. చంచలమైన చిత్తం తన మనసుతో ఆడిస్తున్న తోలుబొమ్మలాటను గమనించిన గొంతు ఇది. అంతే కాదు, దైవసాన్నిధ్యం దొరికినప్పుడు కూడా మనసులో కలిగే సందేహాలను కూడా ఈ గొంతు గుర్తించింది. అందుకే, ఆట పట్టించే మిషతో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత దేవుడి మీదకు నెడుతున్నాడు. అన్నమయ్య శరణు వేడుకోవడంలో నిగూఢత ఇదే. ఇది మామూలుగా రక్షించమని అడగడం కాదు. ఐహిక వాంఛలకు లొంగిపోయిన శరీరం తనది అని గుర్తింపుతో వచ్చిన కోపాన్ని దేవుడి సమస్యగా చేయడం ఇది. ఈ సమస్యను తీర్చవలసింది ఆ దేవుడే.

వెలయ దన మనసునకు వేంకటేశుడు గర్త
బలిసి యాతని దలచు పనికి దా గర్త
తలకొన్న తలపులివి దైవమానుషముగా
దలచి యాత్మేశ్వరుని దలపంగ వలదా

మానవుడి సంకల్పానికి ఈ సంభాషణలో చోటు లేకపోలేదు. కానీ అది చాలా పరిమితమైన పాత్ర పోషిస్తుంది. అంతిమంగా నిజం తెలుసుకోడంలో తనకు బుద్ధి నిచ్చిన దేవుడు, ఆ బుద్ధిని తన ఇష్టానుసారం వాడుకోగలిగిన మానవుడు — ఇద్దరి బాధ్యత మనకు కనిపిస్తుంది.

ఎచ్చోటి కేగిన యెప్పుడూ దమలోని
మచ్చిక పెను దెవులు మానకపోయె

పాయపు సతుల గుబ్బల పెద పొట్లాల
కాయము వడి నొత్తి కాచగను
రాయిడిచే ఘనమాయె గాని లోని
మాయపు పెను దెవులు మానకపోయె

ఈ పదాలలో మనకు వినిపించేది పురుష ధ్వని. దేవుడితో మాట్లాడుతున్నది మగవాడు. అందుకనే స్త్రీ కలిగించే ఆకర్షణను అప్పుడప్పుడూ అమిత పరుషంగా నిందించడం కూడా కనిపించకపోదు.

చక్కదనముల వారసతులాల
యెక్కువతెక్కువల మీరేమి సేసేరికను

దొంగిలి మా గుట్టులెల్లా దోవ సేసి మరుబారి
భంగపెట్టితిరిగా నో భామలార
చెంగలించి వేంకటేశు సేవకు జొచ్చితిమి
యెంగిలిమోవులును మీ రేడబడే రికను

ఈ పదాలలో స్త్రీ ద్వేషిలా కనిపించే అన్నమయ్య శృంగార కీర్తనలన్నీ స్త్రీ గొంతుకలో వ్రాశాడు. ఆ పదాలలో స్త్రీ సహజమైన కోరికలు వెలిబుచ్చడంలో బిడియము, వారి సిగ్గు, ఇత్యాది లక్షణాలు ఎంతో సున్నితంగా చిత్రీకరిస్తాడు. ఇది ఎలా సాధ్యమయిందో తెలుసుకోవాలంటే ముందు మనం ఈ శృంగార కీర్తనల భావాన్ని లోతుగా పరిశీలించాలి.