ఈ పాట వినగానే రాజు పరమానందభరితుడై మళ్ళీ మళ్ళీ వినిపించుకొని, ఇదీ నిజమైన కవిత్వం అంటే! అంటూ ప్రశంసించాడు. అయితే, అధికార మదంతో అన్నమయ్యను ఆ రాజు తన శృంగారలీలను వర్ణించమని ఆజ్ఞాపించాడు. ఇది వినగానే హతాశుడైన అన్నమయ్య ‘హరి, హరి’ అంటూ తన చెవులు మూసుకున్నాడు. విష్ణుని కీర్తించిన నాలుకతో నరులను నుతించలేనని రాజు కోరికను త్రోసిపుచ్చాడు. రాజాజ్ఞను ధిక్కరించినందుకు ప్రతిగా రాజు అతడిని గట్టి సంకెళ్ళతో బంధించి జైలులో ఉంచాడు. అప్పుడు అన్నమయ్య దేవుని స్తుతిస్తూ…
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే
దిక్కు మరి లేదుకొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగుఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగుసంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగుఅని పాడిన వెంటనే ఆ సంకెళ్ళు తెగి పడిపోయాయి. రక్షకభటులు ఈ వార్త రాజుకు తెలుపగానే రాజు అతడిని తిరిగి ఇంకా బలమైన సంకెళ్ళతో బంధించమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అన్నమయ్య పాటకు ఆ సంకెళ్ళు కూడా తొలగిపోయాయి. అప్పుడు రాజు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో అన్నమయ్య కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకున్నాడు. అన్నమయ్యకు ఎన్నో బహుమానాలు ఇచ్చి అతడిని పల్లకిలో కూర్చోబెట్టి తానే స్వయంగా ఆ పల్లకిని మోశాడు.
అన్నమయ్య పెనుగొండ వదిలి వేంకటం చేరుకున్నాడు. అక్కడే నివాసమేర్పరచుకొని సంవత్సరాల తరబడి యోగ, శృంగార, వైరాగ్య సంకీర్తనలతో ఆ కొండలరాయుని స్తుతిస్తూ జీవితం గడిపాడు. ద్విపదలో ఒక రామాయణం, సంస్కృతంలో వేంకటాద్రి మాహాత్మ్యం, 23 శతకాలు, ఎన్నో భాషలలో ఎన్నో ప్రబంధాలు కూడా రచించాడు. తన వంశంలో కింది తరాల వారిని కవులుగా తీర్చి దిద్దాడు. అన్నమయ్య నోటిమాట వరంగానూ, శాపంగాను మారవచ్చు — అతని వాక్శుద్ధి అంత గొప్పది. అతని పాదుకలు మోసిన వారి క్లేశాలన్నీ ఇట్టే మాయమై పోయాయి. దేవుడే ప్రత్యక్ష్యమై “కృష్ణమాచార్య ఆధ్యాత్మిక కృతులు పాడితే నేను విరక్తుడనయ్యాను. నీవు శృంగార సంకీర్తనలు పాడితే నేను మళ్ళీ యౌవన ప్రాయంబు వాడినయ్యాను” అని అన్నాడు.
చిన్నన్న రాసిన ‘అన్నమయ్య చరిత్రము’ అన్నమయ్యను ఒక శ్రీవైష్ణవ గురువుగా, మహిమాన్వితుడైన భక్తునిగా చిత్రీకరిస్తుంది. అప్పటికే అమిత ప్రాచుర్యం చెండిన నమ్మాళ్వారుని కథకు, అన్నమయ్య చరిత్రము లోని కథకు ఎన్నో పోలికలు కనిపిస్తాయి: శిశువుగానే అతడు విష్ణు భక్తిని ప్రదర్శిస్తాడు; యువకుడిగా ఇంటిలో వదిన మందలింపులు పట్టించుకోక అతడు విష్ణు నామస్మరణలోనే గడుపుతూ, హటాత్తుగా తిరుపతికి పయనమౌతాడు; అక్కడ స్వయంగా అమ్మవారి స్తన్యం గ్రోలగానే అతనిలో కవిత్వ ధార పెల్లుబుకుతుంది. అయితే, అన్నమయ్య పూర్తిగా సన్యాస జీవితం గడపలేదు. అతడు ఇద్దరు భార్యలతో సంసారిక జీవితం గడిపినవాడు. అయినా, అతని ఆధ్యాత్మిక రచనల్లో ఐహిక సుఖాల పట్ల నిరసన, స్త్రీల పట్ల విముఖత కనిపిస్తుంది. చిన్నన్న ఈ పదాలను వైరాగ్య సంకీర్తనలంటాడు.
సాళువ నరసింహ రాజు తనను కీర్తిస్తూ ఒక రచన చేయమని అడగడంలో ఆ తరువాతి రోజుల్లో రాజుకు దైవానికి సారూప్యత సాధిస్తూ రచనలు చేసిన ఆస్థాన కవుల పరిస్థితిని వివరిస్తుంది. నాయక రాజుల కాలంలో ఈ రకమైన రచనలు కోకొల్లలు. చిన్నన్న కావ్యంలో ఈ రకమైన వర్ణన బహుశా తనకాలపు కవుల పరిస్థితిని అన్నమయ కాలానికే ఆపాదించే ప్రయత్నం కూడా కావచ్చు. శ్రీవైష్ణవ భక్తుడిగా అన్నమయ్య సాళువ నరసింహునితో సహకరించకపోవడమే సబబు. అన్నమయ్య సర్వసామాన్యమైన మనుష్యుల వేదనలను వివరిస్తూ రాసిన ‘ఆకటి వేళల’ అన్న పాటను కథలో ఈ సందర్భానికి సరిపోతుందని చిన్నన్న వాడుకొని ఉంటాడు.
చిన్నన్న చెప్పిన సాళువ నరసింహుని కథలో నిజానిజాల మాట ఎలా ఉన్న అక్కడ ఆస్థానంలో అన్నమయ్య పాడిన పాటగా చెప్పుకున్న శృంగార సంకీర్తన ఒక అద్భుతమైన గీతం. భామిని అయిన అమ్మవారు తన శయ్యామందిరం నుండి వెలుపలికి వస్తుంటే చూసిన చెలులు ఆమె శరీరంపై కనిపించే లక్షణాల ద్వారా పడకగదిలో జరిగిన కథను రమ్యంగా ఊహిస్తున్నారు. ఇక్కడ ప్రతి భావచిత్రం విలక్షణమైనదే. ప్రాణేశ్వరునిపై నాటిన కొనచూపులు బలంగా పెరుకగా నెత్తురు మరకలు ఆమె కన్నులలో కెంపై తోచాయట. చంద్రవంక వంటి నఖక్షతాలు ఆమె వక్షోజాలనుండి వెన్నెలలు కురిపిస్తున్నాయట. ఇక్కడ సాధారణంగా వాడే ‘వక్షోజ చంద్రికలు’ అనే ఉత్ప్రేక్షాలంకారాన్ని చంద్రవంక వంటి నఖక్షతాలు అన్న మరో పోలిక ద్వారా యథార్థానికి దగ్గరగా తీసుకువచ్చాడు. ఈ రకమైన వాస్తవిక మూర్త భావాలు ఈ గీతంలో ప్రబలంగా కనిపిస్తాయి. చివరగా ఆమె మొహంపై ముత్యాల వంటి జల్లులు – తిరువేంకటపతి అద్దిన చెమటలు. అయితే, ఇటువంటి మూర్త భావాలు ఒకవైపు మనను నాయికా నాయకుల పాత్రలకు దగ్గరిగా చేరుస్తుంటే, మరోవైపు వారు సాక్షాత్తు వేంకటేశ్వరుడు, ఆమె అతని పత్ని అన్న భావన మనను హద్దులలో ఉంచుతుంది. ఇక్కడే సాళువ నరసింహుడు పొరబడ్డాడు: ఈ పాటలో తనను నాయకుడిగా, తన ప్రేయసిని నాయికగా ఊహించుకొన్నాడు. చిన్నన్న ఈ పాటను ఎంచుకోవడంలో మనకు అన్నమయ్య భక్తి శృంగారానికి, రాజాస్థానాల్లో వినిపించే శృంగార కావ్యాలకు తేడా చెప్పడమనే భావించాలి.
నిజానికి అన్నమయ్య యొక్క విలక్షణమైన శృంగార సంకీర్తనలు పైన చెప్పిన భక్తి శృంగారానికి, కావ్య శృంగారానికి చెందింది కాక మూడో రకానికి చెందినవని చెప్పుకోవాలి. ఈ కొత్తరకం శృంగార గీతాలలో కనిపించే వైయుక్తిక, విశృంఖల భావాలు పూర్తిగా మానవ సంబంధమైనవి. ఈ గీతాలలో కనిపించే శృంగారం అంతకు ముందు భక్తి-శృంగారంగా చెప్పుకునే సాహిత్యంలో లాగా ప్రణయ భావాలు కేవలం భక్తిని తెలుపుకొనే సాధనాలు కావు. అందుకే జయదేవుని గీతాగోవిందంలో ప్రణయగీతాల అంతిమ లక్షం కృష్ణునిపై భక్తి తెలుపుకోవడమే. అంతేకాక, అన్నమయ్య గీతాల్లో కనిపించే విశృంఖలత అంతకు ముందు సాహిత్యంలో కనిపించదు. అన్నమయ్యతో ప్రారంభమైన ఈ రకపు గీతాలు అన్నమయ్య తరువాతి తరంలో పదిహేడవ శతాబ్దంలో క్షేత్రయ్య, ఆ తరువాత పదాలను సృష్టించిన తెలుగు, తమిళ వాగ్గేయకారులు కొనసాగించారు.
5. తాళ్ళపాక వంశ పూర్వ చరిత్ర
చిన్నన్న రాసిన ‘అన్నమయ్య చరిత్రము’ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అన్నమయ్యను శ్రీవైష్ణవ సంప్రదాయ గురువులలో ఒకడిగా చిత్రీకరించే రోజులలో వెలువడిన కావ్యం. అయితే, తిరుపతి చుట్టుపక్కల దొరికిన ఆధారాలు, అక్కడి స్థానిక ప్రజలు చెప్పుకొనే కథల ఆధారంగా అబ్బూరి గోపాలకృష్ణ, అల్లంరాజు విజయేంద్రనాథరావు వంటి పరిశోధకులు తాళ్ళపాక వారి వంశ చరిత్రను పూర్తిగా వేరే దృక్కోణంలో చిత్రీకరించారు. స్థానిక ప్రజల కథలలో నందవరీక బ్రాహ్మణులైన తాళ్ళపాకవారు తిరుపతికి ఆగ్నేయంగా, బనగనిపల్లె, పన్యం గ్రామాల మధ్యన ఉన్న నందవరం గ్రామానికి చెందిన వారు. ఆ ప్రాంతానికి రాజైన నందునికి ప్రతిరోజూ కాశీ వెళ్ళి, అక్కడి గంగలో స్నానమాచరించాలన్న కోరిక పుట్టింది. దత్తాత్రేయుడు అనే పేరుగల ఒక సిద్ధుడు ఆ రాజు కోరిక తీర్చడానికి అతనికి మహిమగల పాదరక్షలు ఇచ్చి, ఆ పాదుకలతో సొరంగమార్గం గుండా ప్రతిరోజు కాశీకి పోయే మంత్రాన్ని అనుగ్రహించాడట. ఒకనాడు మహరాణి తన భర్త ప్రతిరోజు ఉదయాన్నే మాయమవ్వడం గమనించి నిజం చెప్పమని అడిగింది. నిజం తెలుసుకొని, తానూ కాశీకి వస్తానని మరునాడు రాజుతో పయనమయ్యింది. ఇద్దరు కాశీ చేరి గంగా స్నానం చేసిన తరువాత తిరుగు ప్రయాణానికి రాణిగారికి ఆ మంత్రం పనిచెయ్యలేదట (కొన్ని కథల్లో ఆమె ఆరోజుల్లో రసజ్వల కాబట్టి మంత్రం పనిచెయ్యలేదని చెబుతారు). దాంతో సాయం చెయ్యమని అక్కడి బ్రాహ్మణులను వేడుకున్నారట. అక్కడి బ్రాహ్మణులకు సాయం చెయ్యడానికి ప్రతిగా వారికి అవసరమైనప్పుడు ఆదుకొంటానని ఆ రాజు అక్కడి చాముండేశ్వరి దేవి ఎదురుగా ప్రతిన చేస్తాడు. వారి సాయంతో ఆ రాజదంపతులు తిరిగి తన రాజ్యం చేరుకుంటారు.
కొంతకాలానికి, కాశీప్రాంతంలో కరువు ఏర్పడడంతో ఆ బ్రాహ్మణులు నందవరం వచ్చి తమను ఆదుకొమ్మని ఆ రాజును వేడుకొంటారు. అయితే, ఆ రాజు తాను వారికి సాయపడతానని ఎప్పుడూ మాట ఇవ్వలేదని బుకాయిస్తాడు. వారు కాశీకి తిరిగి వెళ్ళి అతని మాటకు సాక్షం చెప్పమని చాముండేశ్వరీ దేవిని అర్థిస్తారు. ఆమె వారి ప్రార్థనలకు కరిగిపోయి, తాను వారితోపాటు వెంటవస్తానని, అయితే వారెవ్వరు ప్రయాణంలో ఆమె ఉందా, లేదా అని అనుమానపడుతూ వెనకకు తిరిగి చూడవద్దని నియయం పెడుతుంది. వారు ఆ నియమాన్ని పాటించడంతో ఆమె నందవరం వచ్చి సాక్షం చెబుతుంది. ఆపై, ఆ బ్రాహ్మణుల కోరిక మేరకు నందవరంలోనే ఉండిపోతుంది. అందుకే, వారణాసిలో చాముండేశ్వరీ గర్భాలయంలో విగ్రహం లేదని చెబుతారు.
ఈ బ్రాహ్మణులతో పాటు కాశీనుండి ప్రయాణం చేసిన దుగ్గన అప్పయ్య అనబడే ఒక నియోగి బ్రాహ్మణుడు తన కూతురిని వారి కుమారులలో ఒకరికి ఇచ్చి పెళ్ళి చేయమని అర్థించాడు. వారు వైదికులు కాబట్టి నియోగి సంబంధం ఒప్పుకోలేదు. నిరాశ చెంది ఆ బ్రాహ్మణుడు తన కుటుంబాన్ని చంపి తనూ ఆత్మహత్య చేసుకొంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులతో పాటు ప్రయాణం చేసిన అమ్మవారు – ఇప్పుడు చౌడేశ్వరి – మరో బ్రాహ్మణుని మరణానికి కారకులైనందుకు, ఆ బ్రాహ్మణులను లౌకికమైన ఉద్యోగాలలో మాంసభక్షకులైన తోగట నేతవారి పురోహితులుగా కాలం గడపమని శపించిందట. ఆ బ్రాహ్మణులే నందవరీకులు – వారి నుండే తాళ్ళపాక వంశం ఉద్భవించిందట.
చౌడేశ్వరి ఇప్పటికీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో పేరుగల గ్రామదేవత. చౌడమ్మ పదాలు అన్న పాటలలో ఆమె మహిమను తెలిపే ఎన్నో కథల్లో ఈ కథ కూడ ఉంది. తాళ్ళపాక సాహిత్యంలో కనిపించే సంక్లిష్టత చౌడమ్మ పదాల్లో కనిపిస్తుంది: వారణాసిలో ఖాళీ గర్భాలయం, గ్రీకు కథల్లోని యూరిడిసీ లాగా వెనక్కి తిరిగి చూడవద్దనే దేవత, నందివారిక బ్రాహ్మణులకు తోగట నేతపనివారికి గల సంబంధం వివరించే ఈ కథల్లో కొంత నిజం దాగి ఉందని మనం ఊహించవచ్చు. అంటే, తాళ్ళపాక వారి కుటుంబం మొదట్లో స్థానిక గ్రామదేవత అయిన చౌడమ్మగుడిలో అర్చకులుగా, తోగట నేత వారికి పురోహితులుగా, బహుశా, తాళ్ళపాకలో ఉండేవారని మనం భావించవచ్చు. నిజానికి, అన్నమయ్య మనుమడైన చిన తిరుమలాచార్యుడు కూడా వైష్ణవానికి ముందు వారు “పచ్చి తామసుల”మని ఈ కింది కీర్తనలో వర్ణించాడు:
పచ్చితామసుల మమ్ము పరమ-సాత్వికులగా
యిచ్చటనే సేసినాడు యెంత చిత్రము
యిచ్చగించి మాకులాననెన్నడు లేని వైష్ణవం
అచ్చముగా గృప సేసెనన్నమాచార్యుడు
‘పచ్చి తామసులము’ అని చేసిన వర్ణన అంతకు మునుపు వారికి గ్రామదేవత అయిన చౌడేశ్వరి/చౌడమ్మతో గల సంబంధాన్ని వివరిస్తుందని అనుకోవాలి. గ్రామదేవతలను ఆరాధించే వారు చాలా శరీరమంతా నిమ్మకాయలు గుచ్చుకోవడం, తలమీద టెంకాయలు కొట్టుకోవడం మొదలైన ఆత్మహింసా పద్ధతులతో, దేవత పూనడం వంటి అనుభవాలతో దేవతతో అతి గాఢమైన అనుబంధాన్ని పెంచుకొంటారు. పూనకం వచ్చినవారు జుట్టు విరగబోసుకొని, వెనుకకు ముందుకూ ఊగుతూ దేవత మాట్లాడినట్టు కొత్త గొంతుకలో కొలువు చెప్పుతుంటారు.
తాళ్ళపాక కుటుంబానికి గ్రామదేవతకు మధ్య ఉన్న సంబంధం వివరించే మరో ముఖ్యమైన ఆధారం చిన్నన్న కావ్యం ఉపోద్ఘాతంలో అన్నమయ్య తాత గురించి చెప్పే కథ: అన్నమయ్య తాత నారాయణ చినప్పుడు చక్కగా బడిలో చదువుకొనే వాడు కాదు. బడిలో ఉపాధ్యాయుల శిక్షలకు భయపడి ఒకసారి పారిపోయి చింతాలమ్మ గుడికి చేరాడు. ఆ గుడి వెనక పుట్టలో విషసర్పాలున్నాయని చెప్పుకొనేవారు. ఆ బాలడు పాము కాటుతో చనిపోదామని ఆ పుట్టలో చేయి పెట్టాడు. ఆ క్షణమే సర్వం తెలిసిన అమ్మవారైన గ్రామదేవత ప్రత్యక్షమై ఎందుకు చావాలనుకుంటున్నావని ప్రశ్నించింది. ఉపాధ్యయుల దెబ్బలు భరించలేకున్నానని ఆ పిల్లవాడు చెబితే, దగ్గరలోనే ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్ళి మొక్కితే అతనికి విద్య అబ్బుతుందని అతనికి సూచిస్తుంది. అంతేకాక, అతని వంశంలో మూడవ తరానికి చెందిన వారిలో మహా విష్ణుభక్తుడొకడు పుడతాడని చెప్పి అంతర్థానమయ్యిందట. అంటే, అన్నమయ్యను శ్రీవైష్ణవ గురువులలో ఒకడిగా చేర్చే ప్రయత్నంలో కూడా గ్రామదేవత ప్రస్తావన పూర్తిగా తొలగిపోలేదు. అంటే, తాళ్ళపాక వారికీ గ్రామదేవతకు వారి పూర్వ చరిత్రలో ఉన్న గట్టి సంబంధాన్ని ఈ ప్రస్తావన సూచిస్తుందని మనం అనుకోవచ్చు.
అన్నమయ్య మనవడి కథనం ప్రకారం, తాళ్ళపాక కుటుంబ సభ్యులు తామసమైన గ్రామదేవతారాధన నుండి సాత్త్వికమైన వైష్ణవులుగా మతాన్ని మార్చుకోవడం అన్నమయ్య జీవిత కాలంలోనే, ఒకే తరంలో, పూర్తిగా జరిగింది. ఇదే కాలంలో చౌడేశ్వరి దేవి అర్చకత్వ బాధ్యతలు నందవరీక వంశం వారినుండి తోగట వారికి అప్పచెప్పారని అల్లంరాజు విజయేంద్రనాథ రావు తెలుగు సాహిత్యంలో చౌడేశ్వరి దేవి చరిత్ర అనే పుస్తకంలో వివరించారు. ఇప్పటికీ తిరుపతిలో రెండు విభిన్నమైన స్థానిక సంప్రదాయాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి మనకు కనిపిస్తాయి: ఒకటి వేంకటేశ్వరునికి, అతని సోదరుడు గోవిందరాజుతో గూడిన పురుష దేవతల సంప్రదాయం; మరొకటి చౌడేశ్వరి, గంగమ్మ మొదలైన గ్రామదేవతలు, ఆపై సాత్విక రూపంలో పద్మావతి/అలమేలుమంగ మొదలైన స్త్రీ దేవతల సంప్రదాయం. ఇవి రెండు విభిన్నమైన సంప్రదాయాలుగా కనిపిస్తున్నా, కాలగతిలో ఒకదానిని ఒకటి ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చు.
ఇదే కాక, తిరుపతి ప్రాంతాల్లో వినిపించే మరో కథ: వేంకటేశ్వరుని విగ్రహం స్త్రీ విగ్రహమనీ, రామానుజాచార్యుడు ఇక్కడి మతాన్ని శ్రీవైష్ణవ మతానికి మార్చి అదే సమయంలో మూలవిగ్రహాన్ని వేంకటేశ్వరునిగా మార్చాడని చెప్పుకుంటారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ జాతరలో దేవత పలు వేషాల వస్త్రధారణ ధరించడం ఆనవాయితీ. ఈ వేషాల్లో మగదొర వేషం కూడా ఒకటి. అంటే, పైపైన కనిపించే మగవేషం వెనుక అసలైన స్త్రీ ప్రకృతి దాగి ఉందని చెబుతారు. అలాగే, ఈ జాతరలో పాల్గొనే మగవారు ఆడ దుస్తులు ధరించి ఆడవారుగా వ్యవహరించడం విశేషం.
ఈ రకంగా పలు మత ధోరణుల సంకీర్ణ సమ్మేళంగా తిరుపతి తిరుమల దేవస్థాన చరిత్ర క్లిష్టమైనది. ఇదే రకమైన క్లిష్టత తాళ్ళపాకవారి చరిత్రలోనూ కనిపిస్తుంది. స్త్రీదేవత పురుషరూపంలో మారటంలోనూ, దాగివున్న స్త్రీప్రకృతి బయటపడటం అన్నది ఆసక్తిని రేకెత్తించే అంశం. లోలోపల దాగి ఉన్న స్త్రీప్రకృతిని బహిర్గతం చేసే శృంగార పదాలను కూడా అన్నమయ్య స్త్రీగొంతుకలో వినిపించడం విశేషం. ఈ అంశాన్ని విపులంగా శృంగార పదాల విభాగంలో చర్చిద్దాం.
6. వేంకటేశ్వరీకరణ
ఎలాగైతే, అన్నమయ్య చరిత్ర శ్రీవైష్ణవ సంప్రదాయ గురువుల చరిత్రలో భాగంగా రూపాంతరం చెందిందో, అదే విధంగా కొండల రాయడు కూడా వేంకటేశ్వరుడిగా రూపాంతరం చెందాడు. ఆ దేవుడు మధ్యయుగపు తమిళ శ్రీవైష్ణవ సంప్రదాయంలో వర్ణింపబడ్డ భగవంతుని సాత్విక లక్షణాల కనుగుణంగా కరుణామయుడిగా, శాంత స్వభావునిగా, భక్తుల కోర్కెలు ఈడేర్చే వరప్రదాతగా వేంకటేశ్వరీకరించబడ్డాడు.
క్రీస్తు శకం 1491లో తిరుమల ఆలయ ప్రాంగణంలో ‘తిరువేంకటమహాత్మ్యం’ అనే నాటకాన్ని ప్రదర్శించే వారని మనకు దొరికిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మనకు లభ్యమౌతున్న గ్రంథాలలో ఈ నాటకం దొరకక పోయినా, 15-16వ శతాబ్దాలలో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎంతో సృజనాత్మక సాహిత్యం సృష్టింపబడేదని చెప్పడానికి ఇది ఒక ఆధారంగా పనికి వస్తుంది. తిరుమల దేవస్థాన సంస్థ నిర్వాహణలోనూ, సాహిత్య సృష్టిలోనూ అన్నమయ్య కుటుంబ సభ్యుల పాత్ర ఉచ్ఛస్థాయిలో ఉన్న రోజులవి. ఆ పాటికి స్త్రీ ప్రాధాన్యత గల పాంచరాత్ర సంప్రదాయం పూర్తిగా శ్రీవైష్ణవ సంప్రదాయంతో కలిసిపోయింది. అంతేకాక వేంకటేశ్వరునికి సంబంధించిన కథ బహుళ ప్రాచుర్యం చెందడంతో అంతకు ముందు దేవతల గురించి చెప్పే కథల ప్రాధాన్యత తగ్గిపోయింది. 15వ శతాబ్దంలో తిరుపతిలో వచ్చిన సామాజిక, ఆర్థిక పరిణామాలను ఈ కథ ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ‘ఎడమచేతి’ కులాల వారి ఆధిపత్యానికి, ద్రవ్యసంబంధమైన ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు సూచకంగా కూడా భావించవచ్చు. ఈ కొత్త సామాజిక ఆర్థిక వ్యవస్థ వల్ల, సంబంధిత రాజకీయ, సంస్థాగత మార్పుల వల్లనూ ఈ దేవాలయం గొప్ప ప్రజాదరణను, ఆర్థిక సంపత్తిని చూరగొన్నది. ఈ దేవాలయంలోని దైవం ఒక చక్రవర్తి గాను, ఒక గొప్ప కోశాధికారిగానూ సమాజంపై ప్రభావం చూపిస్తూ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో దేవస్థానానికి ఎనలేని ఆధిపత్యాన్ని కట్టబెట్టాడు.
ఈ పరిణామాన్ని మేం ‘వేంకటేశ్వరీకరణ’ అని పిలిచాం. ఈ కాలంలోనే ఈ దైవానికి ‘కొండల రాయడు,’ ‘వడ్డికాసులవాడు,’ ‘వట్టి పణం పెరుమాళ్’ అని కొత్త, కొత్త విశేషణాలు జత కూడాయి. ఈ విశేషణాలను వివరించే స్థల పురాణాలు తయారయ్యయి. భవిష్యోత్తర పురాణంలో ‘శ్రీవేంకటాచల మహాత్మ్యం’ వివరించే కథ ఇది: విష్ణువుపై అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి వెళ్ళిపోతే ఖిన్నుడైన విష్ణువు ఆమెను వెతుకుతూ తిరుమల చేరుకున్నాడు. తన పత్ని కోసం ప్రపంచం నలుమూలలా వెతుకుతూ అలసిన విష్ణువుకు వేంకటగిరిపై కొంత ఊరట కలిగినట్టనిపించింది. వరాహస్వామి నుండి కొంత స్థలాన్ని అద్దెకు తీసుకొని అక్కడే నివాసం ఏర్పరుచుకొన్నాడు. ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన రాసి ఇచ్చాడు. వేంకటంలో వేంకటేశ్వరునిగా స్థిరపడ్డ శ్రీమహావిష్ణువు పద్మావతి అనే ఒక స్థానిక యువతిని ప్రేమించాడు. ఆమె అక్కడి రాజైన ‘ఆకాశరాజు’ కూతురు. వేంకటేశ్వరునికి ఆకాశరాజుకు మధ్య ఎన్నో ఉత్తరప్రత్యుత్తరాలు, బేరసారాలు జరిగాక ఆకాశరాజు చివరకు తన కూతురుని అతనికి ఇచ్చి వివాహం జరపడానికి ఒప్పుకున్నాడు. అయితే, ఈ పెళ్ళి ఖర్చులన్నీ వేంకటేశ్వరుడే భరించాలి కాబట్టి, అతడు కుబేరుని వద్దనుండి అప్పు తీసుకొన్నాడు (స్థానిక కథనాలలో ఈ అప్పు ఇచ్చింది వేంకటేశ్వరుని అన్న అయిన గోవిందరాజు). అయితే, ఈ అప్పుకు వడ్డీ చాలా ఎక్కువ. అందుకే తిరుపతి కొండ ఎక్కే భక్తులందరూ ఈ వడ్డీ తీర్చడానికి తమకు తోచిన రీతిలో హుండీలో డబ్బు వేసి సాయం చేస్తుంటారు. స్కందపురాణంలోని ‘వేంకటాచల మహాత్మ్యం’ లో కూడా ఈ కథలో కొంతభాగం మనకు కనిపిస్తుంది.