తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలున్న రాగిరేకులు శ్రీరంగం, అహోబిలం, కదిరి, చిదంబరం, సింహాచలం వంటి ఇతర దేవాలయాలలోనూ కనుగొన్నారు. అంతే కాక కొన్ని రాగిరేకుల సంపుటాలు తంజావూరు లోని సరస్వతి మహల్ గ్రంఠాలయం లోనూ, పుదుకోటై లోనూ, తాళ్ళపాక కుటుంబ సభ్యుల ఇళ్ళలోనూ ఉన్నాయి. తాళ్ళపాక సాహిత్యంపై పనిచేసిన పండితులలో ఒకరైన అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు కొన్ని అన్నమాచార్య పదాలు, స్వరసహితంగా, తిరుమల దేవాలయ ప్రాంగణం లోని రెండు స్తంభాలపై చెక్కి ఉన్నాయని గమనించారు. ఈ సంకీర్తనల ప్రతులు దక్షిణ భారతంలోని ఇతర శ్రీవైష్ణవ దేవాలయాలకు వితరణ చేయడం కూడా దాదాపు పదహారవ శతాబ్దం నుండే జరిగేదని మనం ఊహించవచ్చు. అయిదేసి రాగిరేకులను గుత్తులుగా ఒక కడియానికి కట్టి, అటువంటి కడియాలను ఒక కంబానికి దిగవేసి, వాటిని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేవారు. ఈ రాగిరేకులతో పాటు ఈ గీతాలను పాడే గాయకులు కూడా వెంట వెళ్ళేవారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ రాగిరేకులు దక్షిణ భారతదేశంలోని ఎన్నో గ్రామ దేవాలయాలలో దొరుకుతున్నాయి కాబట్టి ఈ సంకీర్తనలు ఆ రోజుల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే, అన్నమయ్య తానే స్వయంగా కడప, ఓగునూతల, ముడియము, సంబత్తూరు, పండరీపురం వంటి ఇతర దేవస్థానాలను దర్శించినట్టు ఆయా దేవుళ్ళపై ఆయన రాసిన సంకీర్తనల ద్వారా తెలుస్తోంది. అన్నమాచార్య మనవడైన చిన తిరుమలాచార్యుడు గుంటూరు జిల్లా మంగళగిరి లోని నరసింహస్వామి ఆలయంలో అన్నమయ్య గీతాలు పాడటానికి ఏర్పాట్లు చేసినట్లు అక్కడ ఆయన వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే, అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించడంతో పాటు ఈ గీతాలను వివిధ ఆలయాలకు వితరణ చేసే కార్యక్రమం కూడా పెద్ద సంస్థాగతమై ఉండివుండాలి.
అన్నమయ్య తన కృతులలో కనీసం రెండు మార్లు తన పాటలను వ్రాసే కార్యక్రమం గురించి ప్రస్తావించాడు. ‘సత్యము సేయగవచ్చును’ అన్న కృతిలో “తగ ప్రాణములో నుండి పలికింతువు అక్షరముల,” అంటూ దేవుడిని పొగుడుతూ “పరగ నవే వ్రాయింతువు,” అని కూడా అంటాడు. ఈ కింది కీర్తన రాగిరేకులపై చెక్కి భాండారాన ఉంచే కార్యక్రమం అన్నమయ్య ఎరుగునని మనం అనుకోవచ్చు.
దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి
పూచి నీకీ రీతి రూపపుష్పము లివి యయ్యా
ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన దాచి వుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా
ఇక్కడ “భాండారాన దాచి వుంచనీ” అన్నప్పుడు అన్నమయ్య బహుశా రాగిరేకులు దాచివుంచిన సంకీర్తనా భాండారపు గది గురించి మాట్లాడున్నాడని అనుకోవచ్చు. నిజానికి ఈ సంకీర్తనలో అన్నమయ్య తన కృతులను ఇలా రాసి చీకటి గదిలో నిక్షిప్తం చేసే కార్యక్రమం పట్ల కొంత అయిష్టతను కూడా ప్రకటిస్తున్నాడేమో అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. మొదట్లో యధేచ్ఛగా పాడుకున్న కృతులను రాగిరేకులపై చెక్కే కార్యక్రమం జోరుగా సాగుతున్న రోజుల్లో ఈ సంకీర్తన రచించాడేమోనని మనం ఊహించవచ్చు.
అన్నమయ్య రాసిన 32వేల కీర్తనల రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడి ఉన్న సంగతి 70 ఏళ్ళకు పూర్వం ఎవరికీ తెలియదనీ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారో, ఇంకొకరో అయాచితంగా ఈ రాగిరేకులను కనుగొన్నారని, తద్వారా ఈ భాండారాన్ని వెలికితీశారని ఒక కట్టుకథ బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ దాదాపు అన్నమయ్య గురించి రాసిన చాలా పుస్తకాలలో ఉటంకించడం కనిపిస్తుంది. అయితే, ఈ కథ నిజమని నమ్మడానికి ఏ ఆధారాలు లేవు. దాదాపు ఇటువంటి కథే చాలా సాహితీ గ్రంథాల విషయంలో చెప్పుకునే సంప్రదాయం దక్షిణ భారతంలో ఉంది. గొప్ప సాహితీ సంపద ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోవడం, దానిని అనుకోకుండా ఒక పండితుడు కనుక్కోవడం ఈ కథలన్నింటిలోనూ కనబడే సాధారణ అంశం. అన్నమయ్య సంకీర్తనలును కూడా నాటకీయ ఫక్కీలో కనుగొన్న కథనం ఈ రకమైన ప్రచారంలో భాగమే. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1920లలో శిలాశాసనాధికారిగా పని చేసిన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి తానే స్వయంగా ఈ సంకీర్తనల రాగిరేకులను భాండారం నుండి దేవస్థాన కార్యాలయానికి తరలించినట్లు చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ రాగిరేకులు దేవాలయం వారి మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.
4. అన్నమాచార్య చరిత్రము
నేడు అన్నమయ్య జీవితం గురించి ప్రచారంలో ఉన్న కథలన్నింటికీ మూలాధారం ఆయన మనవడు తాళ్ళపాక చిన్నన్న (చిన తిరువేంగళనాథ) రచించిన ‘అన్నమాచార్య చరిత్రము’ అనబడే కావ్యం. ఈ కావ్యాన్ని అన్నమయ్య సంకీర్తనలను “సంస్థీకరించే” సమయంలో రాసి ఉండవచ్చు. ఈ కాలం నాటికి అన్నమయ్య కుటుంబ సభ్యులు ఆర్థికంగా సుసంపన్నులు. అన్నమయ్య ద్వారా ఈ కుటుంబ సభ్యులకు దేవస్థానపు అర్చక, ఆర్థిక, నిర్వాహక, కళాత్మక కార్యకలాపాలన్నింటిలోనూ ప్రధాన పాత్ర పోషించే అవకాశం కలిగిందని మనకు తెలియవస్తుంది. 1540లో వేయించిన శాసనం ద్వారా అన్నమయ్య మనవడు, ‘సంకీర్తనా లక్షణము’ రచించిన చిన తిరుమలాచార్యుడు, దిగువ తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం కళ్యాణ వేంకటేశ్వర ఆలయాన్ని పూర్తిగా మరమ్మత్తు చేయించాడని, అదే సమయంలో అనేక దేవతా విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు అన్నమయ్య విగ్రహాన్ని, ఇతర వైష్ణవ గురువుల విగ్రహాలను చేయించాడని మనకు తెలియవస్తుంది. తమిళ అళ్వారు కవుల నుండి రామానుజాచార్యుల వరకు సాగే వరుసలో అన్నమయ్య విగ్రహాన్ని కూడా ప్రతిష్టించడంలో అన్నమయ్యను ప్రముఖ వైష్ణవ గురువులలో ఒకడిగా చేర్చే ప్రయత్నం కనిపిస్తుంది. అన్నమయ్యను తమిళంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వైష్ణవ భక్తకవి నమ్మాళ్వారు అవతారంగా కూడా అభివర్ణించడం ఈ ప్రయత్నంలో భాగమే. నమ్మాళ్వారు, అన్నమయ్యల జన్మ నక్షత్రం కూడా ఒకటే: విశాఖ. ఈ విధంగా అన్నమయ్యను వైష్ణవ గురువుల పరంపరలో భాగంగా చేసే ప్రయత్నంలో అల్లిన కథల వల్ల అన్నమయ్య కాలం నాటి విలక్షణమైన చారిత్రకాంశాలను, అన్నమయ్య ప్రాచుర్యానికి దోహదం చేసిన పరిస్థితులను మనం సూటిగా ఆ తరం వారి నుండి తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోయాం. ఏది ఏమైనా, తిరుపతి దేవస్థాన నిర్వాహణలో తాళ్ళపాక కుటుంబం ఈ మధ్య కాలం దాక తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారని మనకు తెలియవస్తుంది.
చిన్నన్న తన తాతయ్య గురించి రాసిన కావ్యం లోని అన్నమయ్య చరిత్ర సంగ్రహంగా:
అన్నమయ్య నందవరీక బ్రాహ్మణ వంశంలో పొత్తపినాడు మండలంలోని తాళ్ళపాక గ్రామంలో వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో జన్మించాడు. శ్రీమహావిష్ణువే స్వయంగా పిల్లవాడి తండ్రికి కలలో కనిపించి ‘అన్నం బ్రహ్మేతి వ్యజనాత్’ అన్న ఉపనిషత్ మంత్రం ఆధారంగా పిల్లవానికి అన్నమయ్య అని పేరు పెట్టమని సూచించాడు. శిశువుగానే అన్నమయ్య దేవునిపై దృష్టి సారించేవాడు; ఎన్ని జోలపాటలు పాడినా మానని ఏడుపు విష్ణు నామం వినగానే ఆపేవాడు. చిన్నప్పటి నుండే భక్తి శ్రద్ధలతో దేవుని పూజించేవాడు.
ఒకనాడు ఆవుల కోసం గడ్డి తెమ్మని ఆతని వదిన పురమాయిస్తే అడవికి వెళ్ళాడు. అక్కడ కొడవలితో గడ్డికోస్తూ ఏమరపాటుగా తన వేలిని కోసుకున్నాడు. తనకు తెలియకుండానే ‘హరి, హరి’ అన్నాడు. అంతే. ఆ క్షణంలోనే అతనికి జ్ఞానోదయమై కుటుంబాన్ని, గురువును, ఊరిని వదిలి వేసి వేంకటం వైపుగా వెడుతున్న భక్తబృందంతో కలిసి తిరుపతి వైపు పయనం సాగించాడు. దారిలో శక్తిగుడిలో అమ్మవారైన తాళ్ళపాక గంగమ్మ దర్శనం చేసుకున్నాడు. ఆపై తలయేరు బండకు చేరుకున్నాడు.
ఆ సమయంలో అతనిని ఆకలి దహించివేసింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. తల్లిని విడిచి అంతకు ముందెన్నడూ ఎరుగడాయె. నడిచే ఓపిక నశించి అక్కడే వెదురు పొదల నీడలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు వేంకటేశుని నాయిక అయిన అలమేలుమంగ సాధారణ స్త్రీ రూపం ధరించి అతని దగ్గరికి వచ్చింది. అతడిని చూడగానే ఆమె స్తన్యం ఉబికివచ్చింది. ఆమె తన కృపామృతధార అతనికి అందజేసింది. తిరుపతి కొండ ప్రాంతమంతా పవిత్రమైన సాలగ్రామములతో నిండి ఉందని, అందుచేత చెప్పులు వదలివేసి కొండ ఎక్కమని అతనికి సూచించింది. అతడు చెప్పులు వదిలివేయగానే కొండప్రాంతమంతా సువర్ణవర్ణమై శోభిల్లుతూ కనిపించింది. ఆనందభరితుడైన అన్నమయ్యకు తను విష్ణుమూర్తితోపాటు ఆరగించిన ప్రసాదాన్ని కొంత ఇచ్చింది. ఉన్న పాటుగా అతని నోటివెంట కవిత్వం వచ్చి అలమేలుమంగను స్తుతిస్తూ ఒక శతకం వినిపించాడు.
తరువాత కోనేటి చెరువులో స్నానం చేసి అక్కడి చెన్న కేశవస్వామి దేవునకు కాసు సమర్పించుకున్నాడు. ఆ మరునాడు తిరుమల చేరుకొని ముద్రలు వేయించుకొని వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. ఆపై వేంకటేశునిపై ఒక శతకం వినిపించాడు. అన్నమయ్య కొన్ని పద్యాలను వినిపించగానే మూసి ఉన్న తిరుమల తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. గర్భగుడిలో నంబి పుజారి సమక్షంలో మరికొన్ని పద్యాలను వినిపించగానే దేవుని బహుమతిగా ఒక ముత్యాల హారం పైనుంచి వచ్చి అన్నమయ్య మెడను అలంకరించింది.
అన్నమయ్య తన వైష్ణవ గురువు ఆజ్ఞ మేరకు తాళ్ళపాకకు తిరిగివచ్చాడు. అక్కడే తిరుమలమ్మ (తిమ్మక్క), అక్కలమ్మ అనే పడతులతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఆ ఆడపిల్లల బంధువులు ముందుగా ఈ సంబంధానికి ఒప్పుకోలేదు: ‘ఇహలోక చింత ఏ మాత్రము లేని వానికి పిల్లనెలా ఇచ్చేది,’ అని అభ్యంతర పెట్టారు. అయితే, ఆ రాత్రే ఆ పిల్లల తల్లిదండ్రుల కలలో విష్ణువు కనిపించి ఈ వివాహాన్ని నిశ్చయం చేశాడు. పెళ్ళిలో అహోబిల స్వామి అయిన నరసింహుడు గురువు రూపంలో కనిపించి పెళ్ళికొడుకుకు చక్రాన్ని ఇచ్చి, మంత్రాన్ని బోధించాడు. హయగ్రీవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు.
ఆపై, వేదాంతదేశికాచార్యుడైన శఠగోపముని వద్ద వేదాంతాన్ని అభ్యసించాడు. అక్కడే వాల్మీకి రామాయణాన్ని క్షుణ్ణంగా పఠించాడు. తనకు తోచిన పాటలు రాచేవాడు. మెల్ల మెల్లగా వాగ్గేయకారునిగా అతని పేరు ప్రఖ్యాతులు ఆ చుట్టుపక్కల గ్రామాలలో వ్యాప్తి చెందాయి. ఆ రోజుల్లో టంగుటూరును పాలిస్తున్న సాలువ నరసింహ అన్నమయ్య తన వద్దకు పిలిపించుకొన్నాడు. రాజుతో బాటు టంగుటూరుకు ఆ పై పెనుగొండకు పయనమై వెళ్ళాడు. రాజు అతని ప్రావీణ్యతను మెచ్చి తలపాగా, కంకణము మొదలైన ఎన్నో ఆభరణాలు బహుకరించాడు. ఒకరోజు తన ఆస్థానానికి పిలిపించి అన్నమయ్యను ఒక సంకీర్తనను వినిపించమన్నాడు. అప్పుడు అన్నమయ్య ఈ గీతం పాడాడు:
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదాకలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదాపడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదాముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా