వేంకటంలో కొండలరాయడు

అన్నమయ్య పదాలు సాధారణంగా సుళువుగా, అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటాయి. అందరూ పాడుకోవడానికి వీలుగా అన్నమయ్య వాడుక భాషనే ఎంచుకున్నాడని మనం ఊహించవచ్చు. అయితే ఈ పాటలలో భాష వాడుక భాషే అయినా ఇందులోని భావాలను మాత్రం అంత సులభంగా అర్థం చేసుకోలేము. అనూహ్యమైన పదాల మేళవింపు, సున్నితమైన పదాల అర్థభేదంతో సాధించే భావచతురత, విలక్షమైన వాక్సరణి ఈ పదసంకీర్తనల లక్షణం. అన్నమయ్య పదబంధాలు చెవులుకు ఇంపుగా, సంగీతానికి అనువుగా ఉంటాయి. ఆయన పూర్తిగా సంస్కృతంలో రాసిన సంకీర్తనలను మినహాయిస్తే, మిగిలిన గీతాలలో సంయుక్తాక్షరాలు ఉన్న సంస్కృత పదాలు ఎక్కువగా వాడకుండా తేలికగా ఉండే దేశ్య పదాలను వాడాడు; సంస్కృత పదాలు అవసరమైన చోట వాటికి మారుగా లలితంగా ఉండే వాటి తద్భవ రూపాల వాడుకే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన గీతాలను వింటునప్పుడు ఆయన మన పక్కనే ఉండి మృదువైన కంఠంతో మనకు బోధ చేస్తున్నట్టో, మన హృదయంలో కూర్చొని మనలోని భావాలను మనకే అతి మధురంగా వినిపిస్తున్నట్టో అనిపిస్తూ ఉంటుంది. అయితే, ఆ పాటలలో అంతర్లీనంగా వినిపించే గొంతు ఆ దేవదేవునికి కూడ సన్నిహితమైనదిగా మనకు స్ఫురించజేయడం ఈ గీతాల ప్రత్యేకత.

ఈ పాటలలో కవి తన మనస్సులో చెలరేగే భావాలను మళ్ళీ, మళ్ళీ మనకు వినిపించడం కనిపిస్తుంది. ఈ సంకీర్తనలలో కవి చాలావరకూ తన వేదనను ఉత్తమ పురుషలో(first person) వివరిస్తాడు: కవిలో జరిగే అంతస్సంఘర్షణ, అశాంతి; కవి చేసుకునే ఆత్మవంచన, స్వయం-సమర్థన; నిరర్థకమైన జీవితం పట్ల నిరాసక్తత; కవి మనస్సులోని అపరాధ భావం, ఆత్మనింద మనకు వివరంగా చిత్రీకరిస్తాడు. ఒక్కోసారి తననుండి తాను వెలియై తనలోని జీవికి “యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని … గక్కన శ్రీ తిరువేంకటపతి గానక” అంటూ హితబోధ చేసే సందేశాన్ని అందజేయడం కూడా కనిపిస్తుంది.

మానవునిగా తన జీవనకాల పరిమితి గురించి ఈ కవికి బాగా తెలుసు. ఈ కాల పరిమితిని సద్వినియోగం చేసుకోకుండా తను వృథా జీవనం గడుపుతున్నానని కూడా తెలుసు. నిజానికి ఆ ఎరుకే కవి వేదనకు కారణం. ఈ రకమైన పశ్చాత్తాపంతో కూడిన ఆత్మనిందా ధోరణి వల్ల ఈ సంకీర్తనలో మాట్లాడుతున్న వ్యక్తికి, ఆ వ్యక్తిని సృష్టించిన కవికి భేదం మసకబారుతుంది. అన్నమయ్య మగగొంతుకతో వినిపించే ఈ అంతర్ముఖ పదసంకీర్తనలలో ఈ రెండు పురుష రూపాలను విడదీయలేము. పాటలోని కవి-వ్యక్తికి కలిగిన జ్ఞానోదయమే ఈ గీతాలను మనకు వినిపింపజేస్తుంది. అయితే, ఈ గీతాల్లో చివరి చరణంలో వినిపించే మరో గొంతుక, అన్నీ ఎరిగిన దేవునిది.

ఉత్తమపురుషలో సాగే ఇటువంటి సంకీర్తనలను సాంప్రదాయికంగా ‘ఆధ్యాత్మిక’ సంకీర్తనలు అంటారు. తొలి రాగిరేకుల సంకలనంలోనే ఈ విధమైన విభజన ఉంది. నిజానికి ఇవి పూర్తిగా ఆధ్యాత్మికం కావు. వీటిలో ఆధ్యాత్మిక భావాల కంటే అంతర్ముఖమైన భావాల మోహరింపే ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి సంకీర్తనలు అన్నమయ్య వాఙ్మయంలో దాదాపు నాలుగో వంతు. మిగిలిన మూడు పాళ్ళ సాహిత్యాన్ని ‘శృంగార సంకీర్తనలు’ అంటారు. ఇందులో దేవదేవుని శృంగార కలాపాల వర్ణన ఉంటుంది. ఈ శృంగార సంఘటనలు పూర్తిగా కవి కల్పితం. ఈ గీతాలలో కవి నాయికగా మనకు కనిపించడం కద్దు. ఆ నాయిక ఒక్కోసారి అలమేలుమంగ అని స్ఫుటంగా తెలుస్తుంది. కొన్ని గీతాలలో ఆ నాయిక అతని ప్రేయసి గానే తప్ప ఆమెవరో మనకు తెలియదు. ఉదాహరణకు:

కోపము దీరిన మీద గూడే గాని
ఈ పొద్దు కెదిరిమెచ్చు కింత చాలురా

సెలవి నీవు నవ్వగా జేరి మేను నవ్వేగాని
అలరి నా మతినైతే నలుకలేరా
నిలిచి నీవు చూడగా నేనూ జూచితిగాని
బలు దొరవైన నీతో బాడి గాదురా

కోపము దీరిన మీద గూడే గాని

మాటలాడగా నీతో మాటలు నే నాడేగాని
మాటి మాటికి నాకు సమ్మతిగాదురా
కూటమి బిలువగా నే గుట్టున నూకొంటిగాని
యీటున గూడినదాకా యెరవెరవేరా

కోపము దీరిన మీద గూడే గాని

కాగిలించగా నిన్ను కాగిలించేగాని నేను
కాగిన నామేనిమీది కాక చూడరా
దాగక శ్రీవేంకటేశ తలపులో చింతవాసె
ఆగిన నీ రతిలోన నలసితిరా

పడకగదిలో సంభాషణ వినిపిస్తున్నాడు మనకు అన్నమయ్య, ఇక్కడ. ఆయనకు తెలుసు, లోపల ఏం జరుగుతున్నదో. పదం స్త్రీ గొంతుక. ఆమెగా మాట్లాడుతున్నాడాయన. ఆమె చాలా కోపంగా ఉంది, బహుశా ప్రియుడు ఇంకెవరితోనో గడిపాడేమో. కానీ, చరణం తర్వాత చరణం గడిచే కొద్దీ ఆమె మెత్తబడుతున్నది. ఆమె కోపం సడలి పోతున్నది. చివరికి ప్రియునితో రతిలో పాల్గొనే దాకా ఆమె బలహీనురాలవుతూ వచ్చింది. ఈ క్రమ పరిణామమే అన్నమయ్య శృంగార కీర్తనలు అన్నింట్లోనూ కనిపిస్తుంది. ఈ పదాలు అన్నీ ఇంచుమించుగా రతిక్రీడతో ముగుస్తాయి. కానీ, మనం దృష్టి పెట్టవలసింది మారుతున్న ప్రేయసి మనస్తత్వం మీద. నిలకడ లేని మనసు ఆడే ఆటలతో మారిపోయే చిత్తం ఎన్ని రకాల భావాలను ఆమెలో రేపుతున్నదో గమనించండి. అలా అని ఈ పదాలన్ని ఒకే మూసలో ఉండవు. దేనికదే విశిష్టమైనది.

అన్నమయ్య పదాలను ఆధ్యాత్మిక – శృంగార కీర్తనలుగా వేరు చేయడం, ఆయన పద సంకీర్తనా సంపుటులు పూర్తిగా రచించిన తరువాతనే అయి ఉండాలని, అన్నమ్మయ్య ఇలా వర్గీకరించడంలో పాలు పంచుకోలేదని, అనిపిస్తుంది. ఏదేమైనా, ఈ రెండు రకాల కీర్తనలు ఒక దానికొకటి ప్రత్యేకంగా ఉంటాయి. పదలక్షణం గురించి అన్నమయ్యకు రెండు తరాల తరువాత, తాళ్ళపాక చిన్న తిరుమలాచార్య తను వ్రాసిన సంకీర్తనా లక్షణము అనే గ్రంథంలో, అన్నమయ్య పదాన్ని ఈ రకంగా నిర్వచిస్తాడు.

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై
యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై
కృతులై వేంకటశైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళ్ళపాక అన్నయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

వేదవిజ్ఞానం గల శ్రుతులుగా, పురాణకథలుగా, మంత్రార్థాలుగా తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనల ముఖ్య లక్షణాలు కొన్ని వివరిస్తున్న ఈ పద్యానికి సొగసు, ఊపు ‘వేంకటశైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై’ అన్న దీర్ఘ సమాసం వల్ల వచ్చింది. ఈ దీర్ఘసమాసం అన్నమయ్య సాహిత్యంలో శృంగార సంకీర్తనల ప్రాధాన్యతను కూడా వివరిస్తుంది. ప్రాయికముగా, శ్రీవైష్ణవ వాఙ్మయంలో ‘రహస్యం’ అన్న పదం గుహ్యమైన, కొంతమందికే పరిమితమైన తాత్త్విక విజ్ఞానాన్ని చూపడానికి వాడేవారు. అదే అర్థంలో ప్రయోగాలు భగవద్గీతలోనూ, భాగవతంలోను కనిపిస్తాయి. ఈ కింది రెండు ఉదాహరణలు చూడండి:

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం (భగవద్గీత 4.3)

జ్ఞానం పరమ-గుహ్యం మే యద్విజ్ఞాన-సమన్వితం
సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా (శ్రీమద్భాగవతం 2.9.31)

కానీ, 15వ శతాబ్ది నాటికి తిరుపతిలో ‘రహస్యం’ అన్న పదానికి అర్థం మారిపోయింది – ఆ రోజుల్లో ఈ పదాన్ని గుప్తమైన లౌకిక వ్యవహారాలను, శృంగార ప్రణయ కలాపాలను సూచించడానికి కూడా వాడేవారు బహుశా.

3. పదసంకీర్తనా సంపుటాలు

అన్నమయ్య రాసిన పాటలుగా దాదాపు పదమూడువేల సంకీర్తనలు 2,289కి పైగా ఉన్న రాగిరేకులలో మనకు లభ్యమౌతున్నాయి. అన్నమయ్య కృతులను రాగిరేకులపై రాయించే పని బహుశా అన్నమయ్య కాలంలోనో, అతని చనిపోయిన కొద్ది కాలానికో చేపట్టి ఉంటారని భావించవచ్చు. ఈ రాగిరేకుల సంపుటాలను తిరుమల తిరుపతి దేవాలయంలో బంగారు వాకిలికి ఎదురుగా ఉన్న ‘సంకీర్తనా భాండారం’ లో భద్రపరిచారు. తాళ్ళపాక వారి అర అని పిలవబడే ఈ సంకీర్తనా భాండారం వద్ద అఖండ దీపారాధనలు, పూజా నివేదనలు ఘనంగా నిర్వహింపబడినట్లు భక్తులకు అతిరసాల ప్రసాదాన్ని వితరణ చేసినట్లు కృష్ణదేవరాయల తమ్ముడైన అచ్యుతదేవరాజు విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో (1530) వేయించిన శాసనాల వల్ల వెల్లడవుతున్నది. ఇలా ప్రతి యేటా ఈ క్రతువులను నిర్వహించడానికి కావలిసిన ధనాన్ని అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యుడు సమకూర్చి పెట్టాడని కూడా ఈ ఆధారాలు మనకు చెబుతున్నాయి.

అంతేకాక ఇన్నివేల సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించడానికి ఎంతో సమయం, ధనం వెచ్చించాల్సి ఉంటుంది. బహుశా, ఇంత పెద్ద ప్రచురణా కృషి తెలుగు సాహిత్య చరిత్రలో అంతకు ముందెప్పుడూ కనీ వినీ ఎరుగనిది. ఆ రోజుల్లో అన్నమయ్య పేర ఎంత ఆర్థిక సంపత్తి ఉండేదో మనకు దీని ద్వారా తెలుస్తుంది. కొన్ని రాగి రేకులమీద వ్రాయసగాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. అయిదవ రాగిరేకులో ఈ రాగిరేకుల కృషిని పెద తిరుమలాచార్యుడే స్వయంగా బాధ్యత వహించి నిర్వహించాడని రాయబడి ఉన్నది. అన్నమయ్య ఈ కృతుల రచన తన పదహారవ యేట శాలివాహన శకం 1346లో (క్రీ. శ. 1424) ప్రారంభించి 1424 (క్రీ. శ. 1503) వరకూ కొనసాగించాడని ఈ రాగిరేకులలో పలుమార్లు చెప్పబడిన అంశం. అన్నమయ్య మరణకాలాన్ని సూటిగా ఈ రాగిరేకులలో ప్రస్తావించక పోయినప్పటికీ, చివరి కృతి రచనా కాలంగా పేర్కొన్న శా. శ. 1424 (క్రీ. శ. 1503) ఫాల్గుణ మాసపు కృష్ణపక్ష ద్వాదశియే ఆయన పరమపదించిన దినంగా భావిస్తారు.