ఈ పదంలో అన్నమయ్య పట్టువిడవకుండా ప్రశ్నిస్తున్నాడు. తన మనసుతో బేరసారాలాడుతూ శల్య పరీక్ష చేస్తున్నాడు. భిన్నమైన గొంతుకలతో చర్చిస్తున్నాడు. మొదటి దశలో మానసిక రక్షణ కరువైన గొంతుక పెట్టి ప్రపంచంతో, ముందు రాబోయేది మంచిదని మాటిస్తే ప్రస్తుతమున్నది వదులుకుంటాను, అంటూ షరతులు పెట్టి మరీ అడుగుతున్నాడు. వెంటనే వేరొక గొంతుతో దానినే మరలా ఖండిస్తున్నాడు. బేరసారాలకి వాస్తవమే పెద్ద నిరోధకం. అన్నమయ్యకి ఈ నిజం తెలుసు. కానీ మనసుని ఆపలేడు. అందుకే భగవంతుణ్ణి చేరుకుందామనుకున్న కోరిక మానసిక వ్యాజం ఉన్నంతవరకూ కలలో కూడా తీరదని వాపోతాడు. తన మనసులో నిరంతరమూ నలుగుతున్న సంభాషణలని చిన్న చిన్న ప్రశ్నలుగా మార్చి, వాటికి ఉత్ప్రేక్షలు చేర్చి మరీ అడుగుతాడు. అందులో కడలి కూడా, మనసు లాగే ఎప్పటికీ ఉపశమించదన్న పద చిత్రాన్ని అందంగా చూపిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ పునరావృత్తమయే ఈ సంభాషణని చిక్కటి తెలుగు పదాలలో చక్కగా చూపిస్తాడు. ఇదీ అన్నమయ్య కవిత్వంలో మనకి కనిపించే గొప్పదనం.
ఈ పుస్తకంలో సున్నితమైన శృంగార కీర్తనలని love poemsగా అభివర్ణించారు. సాధారణంగా స్త్రీ గొంతుతో ఉండే ఈ పాదాలనుంచి ఒక అద్భుతమైన కీర్తన, అంతకంటే అద్భుతమైన అనువాదం గురించి ప్రస్తావిస్తాను. ముందు అన్నమయ్య వ్రాసిన పాదం చదవండి. వెంటనే తొందర పడి అనువాదం చదవకుండా, ఈ పాదం గురించి ఆలోచించండి. ఆ తరువాత అనువాదం చూడండి.
యెఱిగించరే పతికి యీ సుద్దులెల్లాను
కఱకఱిసేసితేను గయ్యాళి యందురు
మలసి తన కెదురు మాట లాడుటకంటే
చెలిచే మనవి చెప్పించేదే మేలు
పలుమారు దన్ను జూచి పచ్చారుకంటేను
తలవంచుక తనముందర నుండుటే మేలు
తడివి మందెమేళాన దనతో నవ్వుటకంటే
వొడికమై సిగ్గుతోడ నుండుటే మేలు
సడిబెట్టి సారె సారె సరస మాడుటకంటే
వుడివోని బత్తితోడ నుమ్మగిలుటే మేలు
ఆనుకొని తన్ను రతి నలయించుటకంటే
పానుపుపై దండ నిట్టే పండుటే మేలు
నే నలమేలుమంగను తాను శ్రీవేంకటేశుడు
మేనంటి తా నన్ను గూడి మెఱయుటే మేలు
ఈ కీర్తన చదివితే ఏమనిపిస్తోంది? అలమేలుమంగ తన ప్రవర్తన ఎలా ఉంటే సంసారానికి మంచిదో తనకు తెలుసు. ఆ సంగతి పోయి ఆ పెద్దమనిషికి చెప్పండే అని చెలులకు చెప్పుకుంటున్నట్లుగా లేదూ? అయితే ఈ విషయాన్ని భర్తకు చెప్పిరమ్మనటం ఎందుకు? పైగా, ఆ చివరి వాక్యం సంగతేమిటి? పోనీ అది కాదా దాని అర్థం? నేనెలా ఉంటే ఆయనకు నచ్చుతుందో నాకు తెలుసు అని అంటూ తనకు ఒప్పని ప్రవర్తననే చెప్పుకుంటున్నదా? ఎంతైనా ఆయన కూడా ఒక మగవాడే కదా అని వ్యంగ్యంగా ఎత్తి చూపుతున్నదా?
ఈ పదాన్ని నిజంగా ఎలా అర్థం చేసుకోవాలో దాని అనువాదంలో చూడండి.
You tell him about subtlety
If I insist, they will say I am too demanding.
Instead of talking back to me,
he would do better to send a messenger.
Why stare at me over and over?
He might bend his head, a little shy.
Tell him about subtlety.
Better than laughing so loudly,
he could be a little quiet.
Instead of pestering me to play,
let him simmer with some affection.
Tell him about subtlety.
Rather than tiring me by making love,
let him lie quietly by my side.
I’m Alamelumanga. He is the god on the hill.
A loving touch would make all the difference.
Tell him about subtlety.
ఈ కీర్తనలో వేంకటేశ్వరుని భార్య, అలిమేలు మంగ, తన ఇష్ట సఖులతో తన దేవుడి గురించి ఫిర్యాదు చేస్తోంది. సున్నితత్వం కొరవడిన అతని ప్రవర్తన చూసి ఆగ్రహం చూబెడుతోంది. అతను గట్టిగా నవ్వుతాడనీ, బిగ్గరగా మాట్లాడుతాడనీ ఒక స్త్రీ ఏమీ కోరుకుంటుందో తెలుసుకోలేని వాడనీ వాపోతుంది. ఇంత కోపంలోనూ అతన్ని ప్రేమిస్తుంది. ప్రేమపూరితమైన స్పర్శతో సంతృప్తి పడుతానని చెబుతుంది. చిన్న మౌన సందేశం చాలని మొరపెట్టుకుంటుంది. ఒక స్త్రీ యొక్క ప్రేమా, కోరికా వంటివి ఇంత విస్తృతమైన పరిధిలో ప్రస్ఫుటంగా చెప్పడమే అన్నమయ్య కీర్తనలకున్న ప్రత్యేకత. చదివేటప్పుడు ఇది ఒక పురుష రచన అన్న సంగతే మనం మర్చిపోతామని అంటారు వెల్చేరు, షూల్మన్లు.
మనం అనుకున్నట్టు ఈ పాదం అలమేలుమంగ తను ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడం గురించి కాదు. తన పెనిమిటి ఎలా ఉంటే తనకి బాగుంటుందో చెప్పడం ఇది. చూశారా, ఇది ఎంత నాజూకైన తేడా! ఎంతో సూక్ష్మంగా ఈ పాదాన్ని చదివి అర్థం చేసుకుంటే గానీ అంతు చిక్కని అంతరార్థం! ఈ ఒక్క ఉదాహరణ చాలు, వెల్చేరు ఎప్పుడూ “First read the Text!” అని అనడంలో అర్థమేమిటో మనకు తెలియడానికి.
వెల్చేరు నారాయణ రావు (షూల్మన్‌తో కలిసి) అన్నమయ్య పదాలని కేవలం అనువాదం మాత్రమే చేశాడు అని అనుకుంటే మీరు పొరబడ్డారు. ఆయన ఇతర అనువాదాలలో లాగా ఈ పుస్తకంలో కూడా అతి ముఖ్యమైన మలిపలుకు ఉంది. అన్నమయ్య గురించి, తిరుమల గురించి, అన్నమయ్య జీవిత చరిత్ర, ఆయన పద కవితాకోశం గురించి ఇందులో వివరిస్తారు. తిరుపతి చరిత్రను, తాళ్ళపాక వంశస్థులకు ఆ దేవాలయంతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తారు. కానీ అక్కడితో ఆగరు. అంతకంటే ముఖ్యంగా, అన్నమయ్య పద కవిత్వం ఎందుకు గొప్పదో, ఆ కవిత్వాన్ని ఎలా చదవాలో, ఎలా ‘వినాలో’ మనకు చెప్తారు. అన్నమయ్య కాలానికీ, కవిత్వానికీ, ఆ కవిత్వ ధ్వనికీ ఉన్న ప్రత్యేకతను వివరిస్తారు. అన్నమయ్య కవితా భావంలో ఆధునికత చూపిస్తారు. ఈ రకంగా వీరి అన్ని పుస్తకాల లాగానే ఈ పుస్తకం కూడా కేవలం అనువాదం కాదు. భారతీయ సాహిత్యాన్ని సందర్భోచితంగా ప్రపంచానికి ప్రదర్శించి, తెలుగు భాష గొప్పతనాన్ని పదిమందికి తెలియబరిచే గొప్ప ప్రయత్నం ఇది.