అద్వైతమూర్తి
సంగీతంలోనూ, సాహిత్యంలోనూ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే రసం భక్తి తరువాత ప్రణయానిదే! ఇక్కడ నేను శృంగారం గురించి నేను మాట్లాడట్లేదు. ప్రణయసుందరిని వర్ణిస్తూ, ఆమె కాటుక కన్నులలోని ఆలోచనలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ, ప్రేయసి చిరునవ్వులోని సంకోచాలు ఎందుకో అని ప్రశ్నిస్తే – ఏ సుందరి అయినా ఆ ప్రియుడిని నిరాకరించగలదా?
అద్వైతమూర్తి
యాదృచ్ఛికమే అయినా, ఈపద్యం కూడా కల్యాణి రాగంలోనే బాణి కట్టబడ్డది. ఎక్కువ వివరణలు ఇవ్వను గానీ, ఈ రెండు పద్యాల్లోని విభిన్నమైన భావాలకి తగ్గట్టు ఒకే రాగంలో బాణి కట్టటంలో ఉన్న నేర్పు గమనించండి. నీ చిరునవ్వులోని, నీ మధురాధరమ్ములో అన్నప్పుడు ‘నీ’ అన్న అక్షరంపై ఆగటంలో ఎన్నో గమ్మత్తులు ఉన్నాయి. పద్యంలోని పదాలను ఎక్కడ, ఎలా విరవాలో తెలిసిన సంగీత మాంత్రికుడు ఘంటసాల.
చూచెదవేల నో ప్రణయసుందరి! కాటుక కళ్ళలోని ఆ
లోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం
కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!
దాంపత్య ప్రేమను వర్ణిస్తూ సాగే ఈ క్రింది పద్యం మోహనంగా మోహన రాగంలో బాణీ కట్టాడు ఘంటసాల. మోహన రాగం గత ఈమాట సంచికల్లో పరిచయం చెయ్యబడింది.
మన దాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్
గనియెన్; సాగెను భాగ్యనౌక కవితాకాళిందిలో; నవ్య జీ
వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము; నే కొల్లగొం
దును నీ కోమల బాహుబంధనములందున్ కోటిస్వర్గమ్ములన్
పైన ఉదాహరించిన రెండు పద్యాలు, హిందోళం రాగంలో బాణీ కాబడ్డ ఈ క్రింది పద్యం, ‘అద్వైతమూర్తి’ పద్యాలు. నువ్వు, నేను అని తేడాలేని ఏకత్వాన్ని సూచించే తత్వమే అద్వైతం. ప్రేయసీ – ప్రియులు ఇద్దరు ఒక్కటే అన్న భావంతో అల్లిన ఈ పద్యంలో “నీవే నేనుగ నేనే నీవుగ లతాంగీ” అన్న ప్రియుని పలుకులు అద్వైతాన్ని అన్వయించుకుంటున్నాయి. హిందోళం రాగం మీద కూడా గత సంచికల్లో రెండు పరిచయ వ్యాసాలున్నాయి.
భావోద్యానమునందు క్రొత్తవలపుంబందిళ్ళలో కోరికల్
తీవెల్ సాగెను పూలు పూచెను; రసార్ద్రీభూతచేతమ్ముతో
నీవే నేనుగ నేనే నీవుగ లతాంగీ! యేకమైపోద మీ
ప్రావృ ణ్ణీరద పంక్తి క్రింద పులకింపన్ పూర్వపుణ్యావళుల్!
సాంధ్యశ్రీ
ఈమాట గత సంచికల్లో ఎక్కవగా ప్రస్తావించని ఒక రాగం బృందావన సారంగ. హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం నుండి కర్నాటక శాస్త్రీయ సంగీతంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించి ఇది ఒక కర్నాటక రాగమా అన్నంతగా మారిన బృందావన సారంగ రాగం చాలా ప్రసిద్ధి పొందినది. కచేరీలలో పల్లవి రాగాల తరవాత సాధారణంగా ఈ రాగం పాడతారు. ఈ రాగం ఒక గమ్మత్తైన మత్తుని, మైకాన్ని కలిగిస్తుంది.
బృందావన సారంగ రాగం ఆరోహణ: స, రి2, మ1, ప, ని2, స ఆవరోహణ: స, ని1, ప, మ1, రి2, గ2, రి2, స
సాంధ్యశ్రీ
తెలుగు సినిమాల్లో ఇప్పటికీ మరువలేని, మరపురాని సినిమాగా బి. ఎన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా మల్లీశ్వరి. ఈ సినిమాలో సాలూరు రాజేశ్వరరావు బాణీ కట్టిన ‘పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి,’ బృందావన సారంగ రాగంలో స్వరపరచబడ్డది. మాయాబజార్ సినిమాలోని ‘చూపులు కలసిన శుభవేళ,’ దొంగరాముడు సినిమాలోని ‘భలే తాత మన బాపూజీ,’ ఈ జాతికి చెందినవే!
బాలమురళి తిల్లానాలతో బాగా పరిచయమైన వారికి ‘సొగసులూర హొయలుమీర’ తిల్లానా గుర్తుండే ఉంటుంది. ఈ తిల్లానా కూడా బృందావన సారంగ రాగంలో స్వరపరిచారు బాలమురళి. ఈ తిల్లానా తప్పులు లేకుండా పాడితే ఈ రాగం పట్టుబడినట్టే!
‘కంజదళాక్షి ప్రణయ గానమ్ములో పులకించే’ ఒక ప్రియుని వర్ణన ఈ పద్యం.
అంజన రేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా
కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో
రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!
అప్పుడే స్నానం చేసి, తన సన్నని వేళ్ళ అంచుల కురుల తడి ఆర్చుకొంటున్న ప్రేయసిని వర్ణిస్తూ ప్రియుడు చెప్పే ఈ క్రింది పద్యం ‘ఆభేరి’ రాగంలో స్వరపరచబడ్డది. ఈ రాగం కూడా గత సంచికల్లో పరిచయం చేయబడ్డది.
క్రొంజిగురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అ
భ్యంజనమంగళాంగి! జడ లల్లుదునా – మకరంద మాధురీ
మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రఫుల్ల పు
ష్పాంజలి చేసి నీ యడుగులందు సమర్పణచేసికొందునా –
ఈ వ్యాసంలో ఆఖరి పద్యమైన ఈ క్రింది పద్యం ‘సింధుబైరవి’ రాగంలో బాణీ కట్టబడ్డది. ఈ రాగం కూడా ఈమాట పాఠక – శ్రోతలకు తెలిసిన రాగమే!
ఈ పద్యాలన్నింటిని నేను గత 30 ఏళ్ళుగా పాడుతున్నా నాకు ఇప్పటికీ ఈ పద్యాలు ఎప్పుడు విన్నా ఎదో ఇంతకుమున్నెపుడూ తెలియని కొత్త అందాలను విప్పిచెపుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ క్రింది పద్యం మరీనూ. ఈ పద్యాలన్నింటిలోనూ కొసమెరుపుగా ఉండే ఈ పద్యంతో నేను అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ పద్యాలను పూర్తి చేయగానే నా శ్రోతల్లో కనపడే మెరుపు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపోయేట్టు చేస్తుంది. సాధారణంగా కర్నాటక (హిందూస్తానీ) కచ్చేరీలను సింధుభైరవి రాగంతో ముగిస్తారు. అది ఒక కారణమే కాకుండా, ఆఖరి పద్యంగా ఉన్న ఈ పద్య సాహిత్యానికి (ప్రేయసి కోసం మృత్యువునే తొడలుకొట్టి సవాలుచేసే ప్రియుడు) అతికినట్టుగా సాగే ఈ బాణీ నాకు ఇష్టమైన పద్య బాణీల్లో ముఖ్యమైనది!
సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా
రింజకు నీరువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై
రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ
త్యుంజయమూర్తినై యమునితో తొడగొట్టి సవాలుచేతునా!
(నివాళి: నేను గత ముప్ఫై ఏళ్ళుగా కొడవటిగంటి రోహిణీప్రసాద్ నుంచి ఎన్నో సంగీతపరమైన విషయాలను, మెళకువలను నేర్చుకున్నాను! సెప్టెంబర్ 8, 2012 న అకాలమరణం చెందిన నా మిత్రుడికి గుర్తుగా ఈ సంగీత పరిచయ వ్యాసం.)
