“నెలకి పన్నెండొందల రూపాయలు, నెలవారీ సరుకులు, ఓ చిరుగుల గుడారం…”తనలో తాను గొణుక్కుంటూ పెదాల మీదకి ఓ బలవంతపు నవ్వు తెచ్చుకున్నాడు. “తలపైన కప్పు లేదు, నిలుచోడానికి జానెడు నేల లేదు. ఇది కాక పోషించాల్సిన మనుషులు ముగ్గురు. ఎంతటి వైపరీత్యం! ఒకప్పుడు అన్నీ సమృద్ధిగా ఉండేవి. డబ్బు, ఆహారం, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు… ఒకటేమిటి దేనికీ లోటుండేది కాదు. ఇంట్కెప్పుడూ ఎవరో ఒకరు వస్తూ పోతూ వుండేవారు. ప్రతిరోజూ, ఒకరిద్దరు మనుషుల కోసం ఎక్కువ అన్నం వండుతునే ఉండేవాళ్ళం. దురదృష్టం, నోటి కింత ముద్ద వెళ్ళడమే కష్టమవుతోంది. నెలభత్యం పన్నెండొందల్లోంచి రిలీఫ్ కమీషనర్ ఆఫీసులో గుమాస్తా వంద రూపాయలు నొక్కేస్తాడు. ఈ పదకొండు వందలతోనే నలుగురి కడుపులు నిండాలి, బట్టలు కొనుక్కోవాలి, పిల్లల చదువుల ఖర్చు భరించాలి. ఆవిడ చదువుకోలేదు, బయటి పనులలో దేన్లోనూ నైపుణ్యం లేదు. ఆమెకి ఏ ఉద్యోగం దొరకదు. ఇటువంటి దుఃస్థితి ఆమె అస్సలు ఊహించి ఉండదు. నాకుండిన ఒకే ఒక ఆశ నా కొడుకు – వాణ్ణేమో చదువు కూడా పూర్తికాకముందే చావు మాకు దూరం చేసింది. ఇక మిగిలింది తొమ్మిది, ఎనిమిది తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు…” ఆయన ఆలోచనలు సాగుతూనే వున్నాయి.
ఇంతలో హఠాత్తుగా, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయమని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆయనకి. పొద్దున్న ఇంట్లోంచి బయల్దేరే ముందు ఓ తుండు గుడ్డని చల్లటి నీళ్ళలో తడిపి ఇచ్చిందామె. అదిప్పుడు ఎండిపోయి పొడిగా అయిపోయింది. కొద్దిగా తల తిప్పి కాస్త దూరంలో మంచి నీళ్ళు అమ్ముతున్న వ్యక్తిని సమయం ఎంతయిందని అడిగాడాయన.
“ఒకటింపావు…” సూటిగా వచ్చింది జవాబు. చాలా సేపట్నించి ఆయనక్కడే నిలబడి ఉండడం ఆ కొట్టతను చూస్తునే ఉన్నాడు.
“పెద్దాయనా, చాలా సేపటి నుంచి మండుటెండలో అక్కడే నిలబడ్డావ్. ఎక్కడికి వెళ్ళాలేంటి?” అని అడిగాడు.
“ఈ రోడ్డు దాటాలి, కానీ ఈ బండ్లు… నన్ను దాటనీయడం లేదు”
“నువ్విక్కడ నిలుచున్నప్పటి నుంచి ఎంతో మంది రోడ్డు దాటారు, నీకెందుకంత భయం?”
“లేదు బాబూ. రద్దీ విపరీతంగా ఉంది, బండ్లు ఎంతో వేగంగా పోతున్నాయి, నన్ను గుద్దేసినా గుద్దేస్తాయి. అప్పుడు మా కుటుంబం పరిస్థితి ఏంటి? నడిచే వాళ్ళంటే కాస్త కనికరం అయినా ఉంటే బాగుండేది. ఎవరికీ ఏమీ పట్టట్లేదు. మా ఊర్లో ఇలా ఉండదు తమ్ముడూ. ఇంతమంది జనాలు ఉండరు, బండ్లు ఇంత వేగంగానూ వెళ్ళవు. అస్సలే మాత్రం ఇలా జరగదు. మా ఊర్లో ఎవరైనా ముసలివాళ్ళు రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుంటే, ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళ చేయి పట్టుకుని రోడ్డు దాటిస్తారు. నా చిన్నతనంలో నేను అలా ఎన్నో సార్లు చేశాను.”
కొట్టతని ముఖంలో ఏ భావమూ లేదు. ఈ ఊర్లో జనాలు ఎందుకింత ఉదాసీనంగా ఉన్నారు? తన ప్రశ్నకి తానే నవ్వుకున్నాడాయన. “నేనెంత మూర్ఖుడిని? ఏ ఊరిని నేను నాదనుకుంటున్నాను? ఇది నా ఊరయితే, మిట్టమధ్యాహ్నం పూట మండుటెండలో నేనిక్కడ ఏం చేస్తున్నట్లు…?”
“పెద్దాయనా, ఈ గ్లాసుడు నీళ్ళు తాగు. డబ్బులివ్వక్కరలేదులే…” అన్నాడు ఆ కొట్టతను సౌమ్యంగా చల్లని మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ.
“ఎందుకో చాలా దిగులుగా కనిపిస్తున్నావు. నీది ఈ దేశం కాదా?”
“నేను వేరే దేశం వాడినా? ఎందుకలా అనిపించింది? కాదు తమ్ముడూ కాదు. మాదీ ఈ దేశమే. మేమూ భారతీయులమే…” అంటూ నీళ్ళు ఓ గుక్క తాగి, వీలైతే తన తుండుగుడ్డని కాస్త తడిపి ఇవ్వమన్నాడు.
ఉన్నట్లుండి హఠాత్తుగా అతని స్వరం మూగపోయింది. మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయాడు. “నాది ఈ దేశమా? దీన్ని నా దేశమని ఎలా చెప్పడం? ఈ దేశం నాకు రక్షణ కల్పించడం లేదు, ఓ ఆధారం కల్పించడం లేదు. తమ సొంత దేశంలోనే ఎవరైనా కాందిశీకులవుతారా?”
తడి తువ్వాలుని అందిస్తూ, “పెద్దాయనా, నువ్విందాక ఏదో చెప్పబోతూ ఆగిపోయావ్,” అన్నాడు కొట్టతను.
“ఏం చెప్పాలి తమ్ముడూ, చెప్పడానికి ఏమీ లేదు. నా దేశంలోనే నేను శరణార్థినయ్యాను…”
“రద్దీ తగ్గింది పెద్దాయనా, రోడ్డు దాటడానికిదే మంచి సమయం” అన్నాడు కొట్టతను.
ఆయన తల తిప్పి రోడ్డు వైపు చూశాడు. నిజంగానే ఖాళీగా ఉందిప్పుడు. బహుశా ఆఫీసులకు లంచ్ టైము కాబట్టి వాహనాల రాకపోకలకు కాస్త విరామం దొరికినట్లుంది.
ధైర్యాన్ని కూడగట్టుకుని లేచి మెల్లిగా నలుపు తెలుపు చారలపై అడుగులు వేయసాగాడు. ఓ క్షణం ఆగి తల తిప్పి, కొట్టతనికి ధన్యవాదాలు చెపుతున్నట్లుగా తలాడించి ముందుకు నడిచాడు.
ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… అడుగులు సాగాయి. రోడ్డుకి అవతలి వైపుకి చేరాడు.
ఫుట్‌పాత్ మీద ఓ క్షణం ఆగి నిట్టూర్చి, తడి తుండు గుడ్డతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతని శరీరం ఇప్పుడు నిప్పుల కొలిమిలా తయారైంది. తల తిరుగుతున్నట్లైంది, కళ్ళు మసకబారినాయి. ఏమీ కనపడడం లేదు. నోటి లోంచి నురగలొస్తుండగా, మొదలు నరికిన చెట్టులా ఫుట్‌పాత్ మీద కూలబడిపోయాడు. కొట్లోంచి ఆయననే చూస్తున్న కొట్టతను ఓ చల్లనీళ్ళ సీసా తీసుకుని గబగబా పరిగెత్తుకొచ్చాడు. మూత తీసి నీళ్ళు ముఖం పైన చిలకరించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. శరీరం ఫుట్‌పాత్ పైన నిశ్చలంగా పడి ఉంది, నోట్లో నురగలు, నాడి స్పందించడం లేదు.
ఇంతలో ఆ శవం చుట్టూ జనాలు పోగయ్యారు. పోలీసులు వచ్చి శవాన్ని వాన్‌లో తీసుకువెళ్ళారు.
ఓ మాములు మరణం. ఎండలని తట్టుకోలేక మరో ముసలివాడి చావు. వాళ్ళ దృష్టిలో అంతే. వడదెబ్బ తగిలి చనిపోయిన జనాల సంఖ్య ఒకటి పెరిగింది అంతే.
దీపక్ బుద్‌కీ (Dipak Budki) సుప్రసిద్ధ ఉర్దూ రచయిత. ఆయన 1971 నుంచి రచనలు చేస్తున్నారు. ఆయన మొదటి కథ ‘సల్మా’ శ్రీనగర్ నుంచి వెలువడే హమ్‌దర్ద్ అనే దినపత్రికలో అచ్చయింది. 1976లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కి ఎంపికై దాదాపు ఇరవై సంవత్సరాలు రచనలకి దూరమయ్యారు. 1996 నుంచి మళ్ళీ రచనా వ్యాసాంగాన్ని చేపట్టారు. అనంతర కాలంలో ఆయన దాదాపుగా 60 కథలు రాశారు, అవన్నీ భారత ఉపఖండం, బ్రిటన్ మరియు ఉర్దూని చదివి అర్ధం చేసుకునే ఇతర ప్రాంతాలలో ముద్రితమయ్యాయి. ఈయన కథలు హిందీ, తెలుగు, కశ్మీరీ భాషలలోకి అనువాదమయ్యాయి. 1999లో “అధూరే చెహెరే” అనే కథా సంకలనం, 2005లో “చినార్ కే పంజే” అనే కథా సంకలనం వెలువడ్డాయి. మూడో సంకలనం “జీబ్రా క్రాసింగ్ పర్ ఖడా ఆద్మీ”. ఉర్దూ సాహిత్యంలోని సుప్రసిద్ధ రచయితలు, విమర్శకులు – సుల్తానా మెహర్, వారిస్ అల్వీ, హర్‌చరణ్ చావ్లా, సయ్యద్ జాఫర్ హష్మీ, అన్వర్ సాదీద్ వంటి లబ్దప్రతిష్టులు ఈయన రచనలని ప్రస్తుతించారు. కథలను ఎంతో నైపుణ్యంతోను, కళాత్మకంగాను అల్లుతారు దీపక్ బుద్‌కీ. ఈయన కథలు మానవ జీవితాలలోని వ్యథలని చిత్రిస్తాయి, వాటిని చదివాక పాఠకులు సమాజంలో ఎక్కడ తప్పు దొర్లుతోంది అని ఆలోచించకుండా ఉండలేరు.
