భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపోద్ఘాతం

కరణాల చారిత్రకతని, దాని ముఖ్య లక్షణాలని పరిశీలిస్తూ, ప్రస్తుతానికి క్లుప్తంగా కొన్ని విశేషాలు:

  1. కరణాలకి రాయడం, చదవడంపై పట్టు ఉండేది. ఆనాడు, భారతీయ సమాజాలలో చాలా వరకూ పాండిత్యమంతా మౌఖికంగానే చలామణీ అయ్యేది. అందుకే ఎక్కువగా రచనలన్నీ చెప్పడానికి అనువుగా ఉండే పద్య/గేయ రూపాల్లోనే ఉండేవి. కరణాల రచనలు మాత్రం ప్రత్యేకించి వచన రచనలు. వీరి రచనల్లో పద్యం/ కవిత్వం ఉన్నప్పటికీ ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం వాడేవారు. ఇదేకాలంలో వచన రచన తనకంటూ ప్రాముఖ్యాన్నీ, స్థానాన్ని సంపాదించుకుంది. ఈ వచన ప్రక్రియలో వచ్చిన చారిత్రక రచనలకి మరికొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.
  2. దక్షిణాదిన మొదటిసారిగా, బహుశా ఈ కాలంలోనే, ఈ సామాజిక వర్గపు రచయితలో రచయిత, లేఖకుడు ఒక్కరే కావడం విశేషం. అంతకు పూర్వం రచయిత చెప్తూ ఉంటే లేఖకులు రాసేవారు. రచయితే తన రచనని రాయడం ఉండేది కాదు. ఇది చాలా పెద్ద మార్పు. అంతే కాకుండా, వీరి రచనలు పాఠకుడే స్వయంగా చదువుకోడానికి అనువుగా ఉండేవి. అప్పటివరకూ, రచనలు ప్రకాశపఠనానికే – ఒకరు చదువుతూ ఉంటే, పదిమంది కలిసి వినడానికే – ఉండేవి.
  3. కరణాలకి ఎన్నో భాషలపై పట్టు ఉండేది. అందుకని, వీరి రచనలలో బహుభాషా జ్ఞానం కనిపిస్తుంది. ప్రాంతీయ భాషలతో బాటూ వీరికి సంస్కృతం, పార్శీ భాషలపై కూడా అధికారం ఉండేది. బెండపూడి అన్నయ్యమంత్రి గురించి శ్రీనాథుడు (15 శతాబ్దం) రాసిన పద్యం గమనించండి:

    అరబీభాష తురుష్కభాష గజకర్ణాటాంధ్రగాంధారఘా
    ర్జరభాషల్ మళయాళభాష శకభాషాసింధుసౌవీరబ
    ర్బరభాషల్ కరహాటభాష మఱియుం భాషావిశేషంబు ల
    చ్చెరువై వచ్చు నరేటి యన్ననికి గోష్ఠీసంప్రయోగంబులన్

    కరణాల ఈ బహుభాషా ప్రావీణ్యం గురించి అప్పట్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉండేవి – వారొక కూటమిగా ఏర్పడే వారనీ, వారికి మాత్రమే అర్థమయ్యే రీతిలో కొన్ని రహస్య సంకేతాలు పెట్టుకునేవారనీ, ఇంకా ఇలాంటివే ఎన్నో కథలు వీరి చదవడం/రాయడం గురించి ప్రాచుర్యంలో ఉండేవి.

  4. కరణాలది ఆనాటి సమాజంలో ఒక ఇదమిత్థమని చెప్పలేని సందిగ్ధమైన స్థానం. రాజులతో, ఇతర అధికార వర్గాలతో వారికి కొన్ని సమస్యలు/ఉద్రిక్తతలు ఉండేవి. వారి ప్రత్యేకమైన నైతిక దృక్పథం వారి చారిత్రక రచనలలో కనిపిస్తుంది. అంతకు పూర్వం కావ్యసాహిత్యం కంటే భిన్నంగా, ఈ రచనలు రాజుకి గాని, రాజరికానికి గాని కొమ్ముకాసిన అనుబంధాలు కాదు. వీరి నైతిక, రాజకీయ విలువలు కూడా ప్రాంతీయమైన సరిహద్దులకి పరిమితం కాలేదు. ఈ కొత్త ప్రపంచంలో గతానికి అప్పటి వరకూ లేని విశిష్టత వచ్చింది. ఈ రచయితలకి రాజకీయ చరిత్ర అంటే అత్యంతాసక్తి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇవన్నీ కలగలసి, గతాన్ని యధాతథంగా భద్ర పరచాలన్న ఒక స్పృహ, తరతరాలుగా పాతుకుపోయిన పౌరాణిక భావనలతో కలిసిపోయి ఒక క్రొత్త దృక్పథాన్ని వీరికిచ్చింది.

ఈ రచయితల లక్ష్యం చరిత్రే అయినా, వారి వ్యక్తీకరణలలో సంప్రదాయ సాహిత్య ధోరణి బలంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ, ఈ రెంటికీ ఒక తేడా ప్రస్ఫుటంగా ఈ రచనా చైతన్యంలో కనిపిస్తుంది. ఈ కాలంలోనే తెలుగులో ‘చరిత్రము’ అనే ప్రక్రియ విరివిగా వాడకంలోకి వచ్చింది. చరిత్ర అంటే జీవిత చరిత్ర అనే అర్థాన్ని మార్చి, గతం గురించిన కథనానికంతటికీ వర్తింపచేసింది ఈ వర్గపు రచయితలే. ఫ్రెంచి (historie), ఇటలీ (storia) భాషల ‘చరిత్ర’ పదాలకి, చరిత్ర (history) కంటే విస్తృతమైన పరిధి ఉన్నట్టుగానే ఈ వర్గపు రచయితల రచనల్లో గతానికి సంబంధించిన వాస్తవ/యదార్థ కథనం అనే కొత్త అస్తిత్వం వచ్చింది.

ఈ విధంగా, ఒక సాహిత్య సంప్రదాయంలో అంతర్భాగంగా, చరిత్రగా వెలువడ్డ ఈ సరికొత్త రచనా పద్ధతికి, అంతకుముందు ఉన్న చరిత్ర రచన సంప్రదాయానికీ మధ్యనున్న కీలకమైన తేడాలని వివేచించడం మా అధ్యయనంలో ముఖ్యమైన అంశం. రొమిలా థాపర్ అన్నట్టుగా ఇతిహాస పురాణాలనుంచి ఆధునిక చారిత్రక సిద్ధాంతాల సహాయంతో చరిత్రను తెలుసుకోవచ్చును. రాతినుంచి వజ్రాలను పెకలించినట్లు, సాహిత్యం నుంచి ‘నిజమైన’ చారిత్రక సంఘటనలని ఏరుకోనవసరం లేదు. కాలగతికి, కార్య-కారణ భావనలకి సంబంధించి, ఇతిహాస-పురాణాల లోతుల్లో వెతికితే ఒక పొందికైన, సంక్లిష్టమైన, తాత్వికమైన అవగాహన లభించవచ్చు. ముందుగా పేర్కొన్న ఊహాత్మక ప్రాతిపదికల అవసరం కూడా లేకుండా సాహిత్య సంప్రదాయంలో సహజంగానే ఈ తేడా ప్రస్ఫుటమౌతుంది. యజ్ఞనారాయణుడి సాహిత్య రత్నాకరానికి, అదే కాలానికి చెందిన స్థల పురాణాలకీ వ్యత్యాసాలు ఆ రచనలలోనే ఉన్నాయి.

ఈ ఉపోద్ఘాతం తరువాతి అధ్యాయాలు, ఒక సాహిత్య సంప్రదాయంలోనే చారిత్రక రచనలకీ, మిగిలిన సామాన్య రచనలకీ ఉన్న తేడాలని విస్తారంగా పరిశీలించి, ఆయా కాలానికి చెందిన సాహిత్యకారులకి ఆ తేడాలపై ఉన్న అవగాహనని, ఇప్పటివరకూ గుర్తించబడని ఎన్నో చారిత్రక రచనలని గుర్తించడానికి అవసరమైన పరిచయాన్ని, పరికరాలని వివరిస్తాయి.

ఈ ప్రయత్నం కేవలం ఒక అమూర్త వాదనగా సాధ్యంకాదు. దీనిని కొన్ని రచనల నేపథ్యంలోనే అధ్యయనం చెయ్యవలసి ఉంటుంది. అందువల్ల బొబ్బిలియుద్ధం కథనాలతో ప్రారంభించి, కరణాలు, కాకతీయ, విజయనగర రాజ్యపు కాలాలనాటి సాహిత్యం పరిశీలించాము. పద్దెనిమిదో శతాబ్ది మధ్యభాగంలో, ఉత్తరాంధ్ర కొన్ని ముఖ్యమైన చారిత్రక ఘటనలకి వేదిక. దానినుంచీ, బహుశా దక్షిణ భారతంలో అపూర్వం అనదగ్గ ఆసక్తికరమైన చారిత్రక కథనాలు వచ్చాయి. బొబ్బిలితో ప్రారంభించడానికి ఇదే కారణం. ఆపైన ప్రధానంగా తెలుగు భాషలో కరణాల వచన రచనలు పరిశీలనాంశం. ముఖ్యంగా వారి పూర్వీకులైన, కాకతీయ సామ్రాజ్య చరిత్రను పదహారో శతాబ్దం నాటి కరణాల రచయితలు ఎలా చూసారో పరిశీలించాము. కాకతీయ సామ్రాజ్యం నుండీ కంపిలి మీదుగా కాస్త శాఖాచంక్రమణం చేసి, ఆ సామాజిక వ్యవస్థలు విజయనగర సామాజిక వ్యవస్థలుగా ఎలా మారాయో కుమార రాముడు, పోలిక రాముడి కథలో చూపించే ప్రయత్నం చేశాము. చివరిగా నాయక రాజుల కాలంలో వచ్చిన గొప్ప వచన రచనలు – రాయ వాచకము, తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్రని చర్చించాము.

తేజ్‌సింగ్‌ సెంజి దుర్గాన్ని ఏలిన రాజపుత్ర రాజు. దక్షిణాదిన ఇతనినే దేశింగురాజు అనేవారు. ఈయన 1714లో ఆర్కాట్‌ని ఏలుతున్న మొగల్ ప్రతినిధి సాదతుల్లా ఖాన్ మీదికి దండెత్తి, వీరోచితంగా పోరాడి మరణించాడు. ఈ చిన్న సంఘటన అప్పట్లో ఎన్నో చారిత్రక కథలకి, గేయాలకి ప్రేరణ. పద్దెనిమిదో శతాబ్ది నాటికి విరివిగా ఆ కాలంలో వినిపించిన చారిత్రక కథనాలకి ఈ రచనలన్నీ ఉదాహరణలే. నాలుగు, ఐదో అధ్యాయాలలో దేశింగురాజు కథని అనుసరించిన కొన్ని జానపద చారిత్రక పాటలలో, తమిళం, పారశీకం, మరాఠీ, ప్రెంచి భాషల రచనలలో చారిత్రక కారణాలని చూపించిన విధం ఆసక్తికరంగా వుంటుంది. ఈ రచనలకీ, మెకంజీ కైఫీయితులు మొదలైన పందొమ్మిదో శతాబ్దపు చారిత్రక రచనలకీ, అవిరామమైన సంబంధం ఉంది. కైఫీయుతులు సింహభాగం కరణాల రచనలే. వీటిని విశ్లేషించిన అధ్యాయంలోనే, కొన్ని భారత ఉపఖండపు పూర్వకాలిక రచనలు (ఉదాహరణకి కల్హణుడి రాజతరంగిణి) పొరబాటున చారిత్రక రచనలుగా వర్గీకరించబడి, నిజమైన చారిత్రక రచనలు ఎందుకు గుర్తించబడలేదో కూడా చర్చించాము.

ఈ పరిశోధనకి సామాజిక చరిత్ర, సాహిత్య శాస్త్రాలలో నైపుణ్యం సమంగా అవసరం. వలసపాలనకి పూర్వమే, పదహారు, పదిహేడు, పద్దెనిమిదో శతాబ్దాలలో శక్తివంతమైన చరిత్రరచన పద్ధతులు మన సంస్కృతిలో ఉన్నాయని వాదించడానికి, స్థూల దృష్టికి ‘సాంప్రదాయక’ రచనలుగా కనిపించే వాటినుండి కొన్ని రచనలు ఎన్నుకున్నాం. ఈ రచనలలో, ఎక్కువగా అద్భుతమైన వీరరస ఘట్టాలు ఉంటాయి – ఇందుకు కారణం, ఆనాటి సమాజంలో ఘర్షణలు, అవి రేకెత్తించిన రాజకీయ వాతావరణం ప్రధానమైన సాహిత్య వస్తువు కావడమే. చరిత్ర రచనల లక్షణాలని పరిశీలించడం ఒక్కటే కాకుండా, పాశ్చాత్యదేశాల మాదిరి చరిత్రకారులు ఒక కూటమిగా ఏర్పడని సమాజంలో, ఈ రచనల వెనుక ఉన్న సామాజిక నేపథ్యాన్ని కూడా చర్చించడం చరిత్రకారులకి చాలా అవసరం.

ఆఖరుగా, ఇంతకు ముందు చెప్పినదే అయినప్పటికీ, మా అధ్యయనం యొక్క ప్రధానమైన లక్ష్యం – ఇందులో ఉదహరించిన రచనలు ఏం చెప్తున్నాయో శ్రద్ధగా వినడం మినహా, వాటికి వెలుపల నుంచి, తులనాత్మక సిద్ధాంతాలతో ఈ రచనలలో చారిత్రక వాస్తవాలు ఇవి, కల్పనలు ఇవి అని విడగొట్టే ప్రయత్నం కాదు. అటువంటి తులనాత్మక పరిశోధనా పద్ధతులతో మాకు ఎటువంటి సమస్య లేదు. కానీ, ఈ అధ్యయనంలో, ఒక రచనావ్యవస్థని ప్రభావితం చేసిన సాహిత్య సంస్కారాన్ని గుర్తించడానికి కొన్ని సంప్రదాయక రచనలలా పైకి కనిపించే రచనలలో చరిత్ర రచన శైలీలక్షణాన్ని గుర్తించడం అనేదే ప్రధానాంశం. శైలీలక్షణం ఎరుకని పాఠకులకి అందివ్వడమే ఈ పుస్తకపు ప్రయోజనం.


ఈ పుస్తకానికి ఊహ ఎలా వచ్చింది, వ్రాయడం ఎలా జరిగింది, సంజయ్ సుబ్రహ్మణ్యం ఈ సంచికలో వ్రాసిన లేఖలో చదవండి. ఫిలిప్ వాగనర్ తన లేఖలో ఈ పుస్తకం ఎందుకు గొప్పదో వివరిస్తాడు. ఈ సంచికలో ఈ పుస్తకం చివరి అధ్యాయం అనువాదం కూడా చదవండి.

షెల్డన్ పోలాక్ వ్రాసిన విమర్శాత్మక సమీక్ష (హిస్టరీ అండ్ థియరీ, సంపుటి 46, అక్టోబర్ 2007) పిడిఎఫ్, అదే సంచికలో వెల్చేరు, షూల్మన్, సుబ్రహ్మణ్యం ఇచ్చిన వివరణాత్మక సమాధానం పిడిఎఫ్. ఈ రెండు వ్యాసాలు అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వార్షిక సమావేశాలలో భాగంగా 2006లో ఈ పుస్తకంపై జరిగిన ప్రత్యేక చర్చ నుండి వచ్చినవి. ఇదే చర్చలో భాగంగా రమ మంతెన వ్యాసం, క్రిస్ చేకూరి వ్యాసం కూడా ఈ సంచికలో పొందుపరచబడినాయి.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి:

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 ...


డేవిడ్ షూల్మన్

రచయిత డేవిడ్ షూల్మన్ గురించి:

డేవిడ్ షూల్మన్ (David Shulman) జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీలో తులనాత్మక మతధర్మశాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా, దక్షిణ భారతదేశపు భాషలు, సాహిత్యం తదితర అంశాలపై పరిశోధిస్తున్నారు. 1976లో లండన్ యూనివర్సిటీ నుండి పిహెచ్.డీ. 1987 మెక్ఆర్థర్ ఫెలోషిప్ గ్రహీత. ఇజ్రాయెల్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ గౌరవసభ్యుడు. ఇజ్రాయెలీ, పాలస్తీనీయుల ఉమ్మడి శాంతి దళం సభ్యుడిగా ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యాల కోసం కృషి చేస్తుంటారు

 ...