ఒక్కోసారి ఐతిహ్యం కూడా తనని తాను ప్రశ్నించుకుంటుంది. కథయొక్క విలక్షణత్వాన్ని వాస్తవికతని ప్రశ్నిస్తూ ఉంటుంది. పన్నెండో శతాబ్దం నాటి ప్రభావక చరిత్రము అనే జైనగ్రంథంలో దీనికి ఒక బలమైన ఉదాహరణ ఉంది. అందులో, హేమచంద్రుడనే జినాచార్యుడికి, బ్రాహ్మణ పండితులకి, కుమారపాలుడనే రాజు కొలువులో మహాభారతం గురించిన ఆసక్తికరమైన వాగ్వివాదం జరుగుతుంది.
“ఒకానొక వర్షఋతువులో, నేమినాథుడి గురించి వివరిస్తూ హేమచంద్రుడు పాండవులు, రాజ్యాన్ని, సంసారాన్ని త్యజించి జైన సన్యాసం పుచ్చుకున్న కథని చెప్పాడు. హేమచంద్రుడంటే ప్రజల్లో ఉన్న గౌరవాదరాలంటే అసూయతో రగిలిపోతున్న ఆ వూరి బ్రాహ్మణులు దీనికి ఒప్పుకోలేదు – పాండవులు హిమాలయాలకు వెళ్ళి శివైక్యం అయినారని వారి వాదన. వివాదం పరిష్కరించడానికి ఆఖరికి రాజు కలగజేసుకోవలసి వచ్చింది. ఆయన హేమచంద్రుడిని, “మీ శాస్త్రాల ప్రకారం పాండవులు జైన సన్యాసం స్వీకరించారట, అది సత్యమేనా?” అనడిగాడు. హేమచంద్రుడి “అవును, మా శాస్త్రాల్లో అలాగే ఉంది, మా పూర్వాచార్యులు కూడా అలాగే మాకు చెప్పారు. మహాభారతంలో వారు స్వర్గారోహణ చేసినట్టుగా ఉన్న మాట కూడా సత్యమే. వ్యాస మహర్షి మహాభారతంలో పాండవులు, జైన సన్యాసం స్వీకరించిన పాండవులు ఒకరు కాకపోవచ్చు,” అన్నాడు. ఈ సమాధానం విన్న రాజు “ఆచార్యా, ఒకరికి మించి పాండవులు వున్నారా? వారంతా ఒకే కాలంలో జీవించారా?” అనడిగాడు.
సమాధానంగా, హేమచంద్రుడు మహాభారతంలోనే భీష్మపర్వంలో కథ ఒకటి చెప్తాడు. “ఓ రాజా, వ్యాస భారతంలోనే గాంగేయుడైన భీష్ముడి గురించిన కథనం ఒకటి ఉంది. యుద్ధానికి ముందు, భీష్ముడు తన అంతరింగికులని పిలిచి, తాను మరణించిన తరువాత తన శరీరాన్ని అంతకుముందు ఎవరూ దహనం చెయ్యబడని స్థలంలోనే దహనం చెయ్యమని ఆదేశిస్తాడు. భీష్ముడి మరణించిన పిదప, వారు ఆ మృతదేహాన్ని ఒక కొండ పైకి తీసుకుపోయి, ఆ శిఖరాగ్రాన దహనం చెయ్యబోతారు. అప్పుడు ఆకాశవాణి వారికి ఇలా చెప్తుంది:
“వందమంది భీష్ములు
మూడువందలమంది పాండవులు
వెయ్యిమంది ద్రోణులు
అనంతంగా కర్ణులు ఇక్కడ దహనం చెయ్యబడ్డారు”మహాభారతంలోనే ఉన్న ఈ ఉదంతాన్ని చెప్పి, హేమచంద్రుడు “రాజా, ఆ మూడువందల మంది పాండవులలో కొంతమందైనా జైనమతం స్వీకరించి ఉండవచ్చు కదా” అంటాడు.
మహాభారత కథ ప్రతి యుగంలోనూ, ప్రతి కాలంలోనూ జరుగుతూనే ఉంటుంది. ఆ కథలోని ముఖ్యమైన ఘట్టాలలో ఏ మార్పూ ఉండదు – భీష్మ కర్ణులు మరణించవలసిందే, పాండవులు వనవాసం చెయ్యవలసిందే. అయితే, పునరావృతమౌతున్నంత మాత్రాన భారతీయ చింతనలో భాగమైన కాలచక్రానికి సూచనగా చూడనక్కరలేదు. ఆ పురాణానికున్న మౌలికమైన పథకం పరిధిలో ఆ కథ మారుతూ ఉండొచ్చు. అంతమంది పాండవులలో కొందరైనా జైనులేమో అనడాన్ని ఎలా అర్థం చేసుకున్నప్పటికీ, పునరావృతమౌతున్న కథనంలో మార్పులు, భారతీయ సాహిత్యంలో ఉన్న స్పృహ చారిత్రకమైనదిగా సూచిస్తాయి. ఏకైక చారిత్రక ఘటనలు ప్రత్యేకమనీ, అవి పునరావృతం కావనే వాదనను పూర్వపక్షం చేసి, చారిత్రకస్పృహను కాలాతీతమైన సత్యం వైపు మరలించడానికే ఇలాంటి కథలు ఉద్దేశించబడ్డాయేమో అని అనుకోవాలి.
అలా అని, పునరావృతమైన ఘటన కేవలం చారిత్రకమే కానక్కరలేదు, అది పౌరాణిక కల్పనకు మరింత సమీపంగా వుండవచ్చును. బొబ్బిలి యుద్ధం కథలో అనూహ్యంగా కొడుకు చేతిలో కాకతీయ ప్రోలరాజు మరణించడం, ఆర్కాట్ నవాబు మీద దేశింగురాజు యుద్ధం — ఇలాంటివి పౌరాణిక కల్పనలు, పునరావృతమైన సంఘటనలుగా భావించి, వాటికి చారిత్రకత, విశ్వసనీయత తగినంతగా లేదు అనుకోవడం సరి కాదు. గతం ద్వారానే, భవిష్యత్తులో విమోచనకు, మోక్షానికి దారులు వెతుక్కోగలం అనే నమ్మకం ఉన్న చరిత్రకారుడి దృష్టికోణం ఇది. ఈ విషయంలో ఆదిత్య మాలిక్ (1998) పరిశీలనతో మేము అంగీకరిస్తున్నాం. “చరిత్ర పునరావృతం అవుతున్నది అని మనం అనుకుంటాం. అంటే వర్తమానం గతం చేసిన పనులే మళ్ళీ చేస్తున్నది అని. ఆ రకంగా వర్తమానం గతాన్ని పోలి వుండడానికి ప్రయత్నిస్తుంది. ఇలా పదే పదే ఐహికము, నిరాసక్తము అయిన పునరావృతి ద్వారానే అది కాలాన్ని గౌరవించి వర్ణించుకుంటుంది. అంతే కానీ కాలాన్ని ఒక దీర్ఘ రేఖాత్మకంగా, గతం అంటే పునరావృతం కానిదిగా భావించి కాదు.” మేమూ మా ఆధారాలలో చూపించినట్లుగా మార్పుకు సులభంగా లొంగగలిగేది గతం మాత్రమే. అయితే గతాన్ని తవ్వి తీసే పరిశీలకుడికి ఈ మార్పును స్పృశించగలిగే చాకచక్యం, ఐతిహ్య సత్యం ఈ మార్పులో ఒక భాగమే అన్న భావన కలిగివుండాలి.
గతం పునరావృతం అనే ఈ భావన ఎప్పుడైతే సాధ్యమో, అప్పుడే కాలానుగుణంగా అన్ని దిశలలో, ఎన్నో రూపాలలో వ్యాపించిన గతంలో నుంచి చరిత్రను గుర్తుపట్టడం సాధ్యమవుతుంది. రెండు సంఘటనల మధ్య భేదమే చరిత్ర కాబట్టి, ఏ మార్పు లేకుండా జడత్వంతో ఘనీభవించిన గతం లోకి తొంగి చూసే చరిత్రకారుడు, కేవలం సంఘటనల క్రమాన్ని ఒక వరుసలో చిట్టాపద్దుగా వ్రాసుకునే గుమస్తా కంటే భిన్నమైనవాడు కాలేడు. ఇతర శాస్త్రాల విజ్ఞానం లాగానే, చరిత్ర కూడా రెండు భిన్న ధృవాల ఘర్షణ లోనుంచే పుడుతుంది. సర్వసమత్వం లేకపోవడమే దాని తత్వం. భవిష్యత్తును నిర్దేశించే ఆ ఘర్షణ అంచులలో తాత్కాలికమైన ఒక స్పృహ అప్పుడప్పుడూ గతాన్ని మనకు యథాతథంగా పునరావృతం చేసి చూపుతుంది. పాశ్చాత్యులు డేజా వూ అని పిలిచే ఈ స్పృహను భారతీయులు వాసన (కర్మ వల్ల గతం గురించి కలిగిన స్పృహ) అని అనుకుంటారు. అందువల్ల ఒక స్థలానికీ కాలానికీ నిశ్చయమైన ఒక సంఘటన అలాగే నిశ్చయమైన ఇంకొక సంఘటనను గుర్తు చేయవచ్చును.
ఉదాహరణకి ఒక యుద్ధం — బొబ్బిలి, జనవరి 1757, శీతాకాలం, మబ్బులు లేని ఆకాశం — ఆ యుద్ధానికి కారణమైన కోడిపందెపు ఆట ద్వారానే మనకు గుర్తు ఉండి పోవచ్చును. స్థలానికీ, జ్ఞాపకానికీ ఉన్న సంబంధాలు పరిశీలించే పురావస్తు కోవిదులు మనకు ఇలాంటి అతి సున్నితమైన బంధాలని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతారు. కాలం అనేది అన్ని సంఘటనలు ఒకే సారి జరగకుండా ఉంచే ఒక ఉపకరణం అని బెర్గ్‌సన్ అంటాడు. చరిత్రలో కార్య-కారణ సంబంధం వున్న సంఘటనలతో పాటు ఏ సంబంధం లేని సంఘటనలూ వుంటాయి. ప్రతీ సంఘటన కాలవేగంతోనే ఉండదు. కొన్ని కుదించబడతాయి, కొన్ని సాగదీయబడతాయి. భారతీయ చరిత్ర రచయితలకు ఇది తెలుసును. భారతీయ చరిత్రను అర్థం చేసుకోవాలంటే మనం వారిలాగా ఆలోచించక తప్పదు.
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మా ఈ ప్రతిపాదన ఉత్తరాధునికుల వాదనకు ప్రతికూలమైనది. సాహిత్యానికీ చరిత్రకూ వారు ఏ రకమైన భేదాన్నీ గుర్తించరు. వారి ధోరణిలో చరిత్ర కేవలం సాహిత్యం. సాహిత్యం కేవలం భాషలో ఇమిడిపోయి వున్న వాక్యసంబంధి. అంటే, సంఘటన, చర్య, కారణం ఇవన్నీ కూడా కథనానికి వాడుకునే సాధనాలు మాత్రమే. అందువల్ల చరిత్ర విశ్లేషణకు లొంగదు. ఈ రకమైన ధోరణి ప్రాచుర్యం లోకి రావడం వల్ల కూడా, వలసపాలనకు పూర్వం భారతీయ చారిత్రక రచనా సంపదను మనం కోల్పోయాం. మా సార్ధకప్రతీకలు అన్న పుస్తకంలో సాహిత్యాధారాలతో నాయక రాజుల మనసుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాం.ఈ సాహిత్యాధారాలు, అప్పటి సాంఘిక రాజకీయ పరిస్థితులని ప్రతిఫలించేవి అనీ, అప్పటి పాలకులు, ప్రజల జీవితాలలో జరిగిన నిజ సంఘటనలను పట్టి ఇచ్చేవనీ మా దృఢమైన నమ్మకం. భారతీయ చరిత్ర రచనలో శైలీలక్షణాన్ని గుర్తించడం ద్వారా ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాం. చారిత్రక ఆధారాలను గౌరవిస్తూనే, ఎంతో విభిన్నమైన సాహిత్యం నుంచి, వలసపాలనకు పూర్వం భారతీయులు చరిత్ర ఎన్ని విధాలుగా వ్రాసుకున్నారో గుర్తించి చూపడం మా ఆశయం.
లేఖనాల ఆనవాళ్ళు
ఈ అధ్యయనంలో ప్రదర్శించిన పరిశోధనా పద్ధతి సాహిత్య ప్రక్రియలకీ, వాటి శైలీలక్షణానికీ సంబంధించినంత వరకూ భారత చరిత్రకే కాదు, నిజానికి ఏ చరిత్రకైనా వర్తిస్తుంది. కానీ, ఈ అధ్యయనంలో చరిత్ర విషయంలో ఒక శక్తివంతమైన మార్పు చోటు చేసుకుంటున్న కాలానికి చెందిన రచనలే ఎంచుకున్నాం. ఈ రచనలన్నీ సుమారుగా పదహారో శతాబ్దం ప్రారంభదశ నుండి మొదలవుతాయి. ఇవన్నీ ప్రధానంగా దక్షిణాది భాషల్లోను, సంస్కృతంలోనూ, పార్శీలోనూ రచింపబడ్డాయి. ఈ కాలానికొక ప్రత్యేకత ఉంది – భాషని రకరకాల లిపులలో చదవడం, రాయడం నేర్చిన సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. రాతని/రచనని కేవలం సమాచారం భద్రపరచడానికే కాకుండా, సమాచార ప్రసారానికి ప్రధానమైన వేదికగా ఉపయోగించడం కూడా ఈ కాలంనుంచే మొదలయింది. పర్యవసానంగా చారిత్రక సమాచారం కేవలం శిలాశాసనాలకే పరిమితం కాకుండా, రాగిరేకులు, తాళపత్రాలు, కాగితాలకు కూడా విస్తరించింది. ప్రజలు పుస్తకాలని తమ స్వంత వాడకానికి సేకరించడం కూడా ఈ కాలంలోనే జరిగింది. ఈ పరిణామాల వల్ల చరిత్రరచన కూడా అన్ని సాహిత్య ప్రక్రియలలోకి చొచ్చుకుపోయంది.
ఇంతకీ, ఈ అధ్యాయాల్లో పరిశీలించిన చరిత్ర రచనలు చేసిన సాహిత్యకారు లెవరు? వీరంతా భూస్వాములు కారు, కళాకారులు కారు. వీరంతా సేవారంగానికి చెందినవారు. వారి వారి వృత్తులు నిర్వహిస్తూ, కొన్ని రాజకీయ విలువలకి కట్టుబడి, వాటిని ఆచరించినట్టుగా వారి రచనల ద్వారా తెలుస్తుంది. ఇదొక ప్రత్యేకమైన సామాజిక వర్గం. ఈ వర్గంవారు 17, 18 శతాబ్దాలనాటికి కొత్తగా వచ్చిన సామాజికమైన మార్పుల వల్ల ఒక చిన్న ప్రాంతానికి పరిమితం కాకుండా, దక్షిణ భారతం, నిజాం/ దక్కను ప్రాంతం అంతా విస్తరించారు. ఈ సామాజిక వర్గాన్ని ఈ అధ్యయన పరిధిలో ‘కరణాలు’ అనే పేరుతో వ్యవహరించాం. దానికి కారణం, కరణాలు అప్పట్లో గ్రామాధికారులుగా ఉంటూ, గ్రామానికి చెందిన శిస్తు, ఆదాయం, ఆస్తి పంపకాలు, ఇలా అన్ని వ్యవహారాలని కవిలెలుగా వ్రాసి భద్రపరిచేవారు. వీరినే ఉత్తరాదిన ‘ఆమిల్’, ‘కానూన్’ అనేవారు. ఈ అధ్యయనంలో పరిశీలించిన అన్ని రచనలూ కరణాలు చేసినవి కావు. కానీ రచయితలందరూ కరణీకపు సంస్కృతిలో భాగం అయినవారే.