ఈ భాగంలో శైలి – వ్యావహారికం, వాస్తవికం. పామరులు వాడే అప్రామాణికమైన పదాంశాలు విరివిగా కనిపిస్తాయి. గేయంలో కూడా వాక్యాలు పొట్టిగా కేవలం కర్త, కర్మలతో మాత్రమే ఉన్నాయి. సంభాషణలన్నీ రోజువారీ మాటల్లాగానే కలగాపులగంగా ఉన్నాయి. ఇది తీరిగ్గా కూచుని, లిఖిత సాహిత్యంగా రాసింది కాదని తెలుస్తుంది. కథకుడు వేదిక మీద చెప్తుండగా, ఎవరో పరిశోధకుడు వ్రాసుకున్నట్టుగా ఉంది. ‘మేలు మేలు!’ అంటూ కథకుడి పక్కన ఉన్న సహాయకుడి మాటలని కూడా ఎక్కించారు. (ఈ కథని ప్రచురించిన పరిష్కర్త, ఇందులో విరామ చిహ్నాలని చొప్పించినా, ఈ కథనానికి మౌలికమైన మౌఖిక ధోరణిని ప్రతిఫలించే సామర్థ్యం వాటికి లేదు. అంతేకాక, వాక్యాలలో ఉన్న సరళత కూడా పోయింది.) ఇటువంటి నాటికల్లో సహాయకుడు శ్రోతల పాత్రని పోషిస్తాడు – కథకుడిని ప్రోత్సహిస్తుంటాడు, మధ్య మధ్యలో సంభాషణలో చొరబడుతూ ఉంటాడు, పాటలో చరణం/పల్లవి దగ్గర తందాన, తాన అంటుంటాడు. ఇదంతా, ఈ కథనంలో తెలుస్తుంది. ఇవన్నీ బుర్రకథలో ఉండేవే అయినా, ఈ భాగంలో ప్రస్ఫుటంగా ఉన్న వాస్తవిక ధోరణిలో ఇదంతా కలిసిపోయింది.
ఇటువంటి కథనాన్ని చదువు, పాండిత్యం లేని ఒక అనామకుడు చేసిన అచారిత్రకమైన రచన అందామా? లేక, సమాజపు అట్టడుగు పొరలలో నుండి పైకి వచ్చిన చరిత్ర అందామా?
2. యదార్థాలు, సత్యాలు
యదార్థము, సత్యము అనేవి ఎల్లపుడూ ఒకేలా సమానంగా, సమరూపంగా ఉండవని అందరికీ జీవితంలో అనుభవమే. కల్పనలో నిజమెంతో తేల్చిచెప్పవలసింది చరిత్ర. నిజంలో ఏది కల్పనో తీర్మానించే బాధ్యత కవిత్వానిది, తర్కానిది, సంగీతానిది, పురాణానిది. కాల్పనిక సాహిత్యం వాస్తవికతను ప్రకాశవంతం చేసినంతగా మరే సాహిత్య ప్రక్రియ చెయ్యలేదని, ఆ దృక్కోణంలో ‘పౌరాణిక కల్పన’ అని ఈనాడు మనం అంటున్నది ఒకానొకప్పుడు యదార్థమని కొంతమంది చరిత్రకారులు ఒప్పుకుంటారు.
పౌరాణిక కల్పనకి చరిత్రలో చోటుందా లేదా అనే మీమాంస చరిత్రశాస్త్రంలో ఈనాటిది కాదు. గ్రీకు సంస్కృతికి చెందిన థుసిడైడిస్, హెరోడాటస్ ఇద్దరూ ఈ వాదనకి రెండు ధృవాలు. థుసిడైడిస్ ప్రకారం గతంలో జరిగినదంతా కాలగతిలో కొట్టుకుపోకుండా బతికి బట్టకట్టాలంటే అది పౌరాణిక కల్పనగా మారక తప్పదు, అంతేకాక ఈ మార్పు అతివేగంగా జరిగిపోతుంది. అందుకే నిజంగా నమ్మదగ్గ చరిత్ర అంటూ ఏదైనా ఉంటే అది రచయిత తన జీవితకాలంలో ప్రత్యక్షంగా చూసి రాసినదొక్కటే. అదొక్కటే యదార్థం. అంతకంటే వెనక్కి వెళ్ళి నిజమైన చరిత్ర రాసే అవకాశం లేదు, ఆ రకమైన చరిత్ర చదువరులని రంజింపచెయ్యటానికి చేసిన అసంబద్దమైన ప్రయోగమే.
హెరోడాటస్ అదే యదార్థాన్ని మూడు రూపాలలో చూస్తాడు: 1. సాధారణంగా మనం ఇంద్రియాల ద్వారా అనుభవించేది/చూచేది; 2. పౌరాణిక కల్పనలో కనిపించే అర్థవంతమైన నమూనా; 3. విషాదాంత నాటక రచయితలు తమ సృజనతో సృష్టించిన కల్పనా ప్రపంచం. హెరోడాటస్ దృక్పథంలో గతాన్ని అర్థం చేసుకోవడంలో ఒక ఉద్రిక్తత ఉన్నది. అది చరిత్ర లోలోపలి స్తరాలలో ప్రవహిస్తున్న ఒక నిరంతర ప్రక్రియకి, ఇంద్రియాలతో మనం అనుభవించే బాహ్యప్రాపంచిక ప్రక్రియకి మధ్య ఉన్న ఘర్షణ. సంఘటనల శకలాలకీ, వాటి ద్వారా నిర్మితమైన అగోచరపూర్ణత్వానికీ ఉన్న ఘర్షణ కూడా ఇదే.
అర్థవంతమైన ‘నమూనా’ అన్న భావనని మరికొంత లోతుగా పరిశీలిద్దాం. విడగొట్టబడిన సంఘటనల సమాహారంగా చరిత్రని కూర్చినప్పటికీ, నిజానికి అవెప్పుడూ ఒకదాన్నొకటి విడివడి దేనికదే వేరుగా ఉండవు. అవన్నీ ఏదో ఒక చట్రంలో ఇమిడి ఉంటాయి, వాటి మధ్య ఒక వరుస క్రమం ఉంటుంది, లోపాయికారిగానైనా ఒక పథకానికి కట్టుబడిన నిర్మాణక్రమం, తద్వారా సంక్రమించే కార్య-కారణ సంబంధాలు ఉంటాయి. చరిత్రకారుడు సృజించిన ఇటువంటి పథకం, అప్పటి సాంస్కృతిక ఇతివృత్తాలతో పెనవేసుకుని ఉంటుంది. ఏ చరిత్రకారుడు ఎటువంటి పథకాన్ని అనుసరించాడో విశ్లేషణ ద్వారా తెలుస్తుంది. అంటే, ఒక్కో చరిత్రకారుడు తనదైన గొంతుతో కార్య-కారణ సంబంధాలనీ, సంఘటలని సూత్రీకరించే వరుసక్రమాన్నీ, స్థలకాల నిర్మాణాత్మకంగా వినిపిస్తాడు. ఏ చరిత్రకారుడి పథకమైనా థుసిడైడిస్ యదార్థవాదానికీ, హెరోడాటస్ కావ్యహృదయానికీ మధ్యనే చోటు చేసుకుంటుంది. ఈ రెండు దృక్పథాలు రెండు భిన్న అయస్కాంత ధృవాలుగా చరిత్ర రచన మీద తమ అధిపత్యాన్ని చాటుకుంటూనే వున్నాయి.
భారతదేశంలో కూడా చరిత్ర రచన ఈ రెండు ధృవాల అయస్కాంత శక్తికి లోబడే నడిచింది. 19, 20 శతాబ్దాల నాటి ప్రత్యక్షవాద (Positivist) చారిత్రక శాస్త్ర ప్రభావం లేకపోయినట్లయితే, ‘చరిత్ర వ్రాయబడిన సాహిత్యం’ అని హేడెన్ వైట్ (Hayden White) మనకి చెప్పవలసిన అవసరం వచ్చేది కాదు. నిజానికి, వలస పాలనకి పూర్వపు తెలుగు, తమిళ, మరాఠి చరిత్రకారుల చేత నీరసమైన వచనం రాయించడం అసంభవం. అయితే, 19వ శతాబ్ది నాటి చారిత్రక పద్థతులకి ప్రభావితులయిన వీరి వారసులే, తమ పూర్వీకుల రాతలని చరిత్ర కాదని కొట్టిపడేశారు. వీరి ప్రకారం, మధ్యయుగాలనాటి రాజులు, వారి కొలువులో కవులు, వారి రచనలకి కనీస కాలనిర్ణయం కూడా చెయ్యకుండా వదిలేశారు. అందుకని, ఈ ‘ఆధునిక’ చరిత్ర కారులంతా మూకుమ్మడిగా శిలాశాసనాలలో అర్థంకాని లిపులని పరిశోధించడం మొదలెట్టారు. కాలనిర్ణయమే భారత చరిత్రకి పరమావధి అయిపోయింది. శాసనాలని వెదకటం, వాటిని పరిశోధించి పరిష్కరించడం, వాటి సాయంతో రాజుల పరిపాలనా కాలాన్నీ, వారి వంశానుక్రమణికలని రాసి ప్రచురించడం, తద్వారా ఎవరు, ఎప్పుడు పరిపాలించారో తేల్చడం భారత చరిత్రలో అతి ముఖ్యభాగమై పోయింది. సాహిత్య చరిత్రకారులు కూడా వీరి అడుగుజాడలనే అనుసరించారు. రాజ శాసనాలు కూడా సాహిత్యం లానే రాసేవారనే విషయం వీరెవ్వరి దృష్టికి రాలేదెందుకో!
ఈ మధ్యకాలంలో, చరిత్రకారులు తాము అధ్యయనం చేస్తున్న సంస్కృతికి అంతర్భాగమయిన సామాగ్రిని గౌరవిస్తున్నారు. రొమిలా థాపర్ (Romila Thapar) పురాణేతిహాసాలని చారిత్రక కోణంతో లోతుగా అధ్యయనం చేసింది. ఆంథొనీ వార్డర్ (Anthony K Warder) గతం గురించిన ప్రతి రచనలోనూ చారిత్రక కోణాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. ఇలా ప్రతి రచననీ చరిత్రగా చూసే పద్ధతి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని మా అభిప్రాయం. నికొలస్ డిర్క్స్ (Nicholas Dirks) జాతిచరిత్ర (Ethnohistory) అని ఒక కొత్త నమూనాని ప్రవేశపెట్టాడు. ఇందులో, వలసపాలనకి పూర్వం ఉన్న కథనాలను పరికించి వాటిల్లోని నిర్మాణ-పథకాలని పరిశీలిస్తారు. అయితే, ఈ పద్థతిలో ఇటు యదార్ఠవాదైన థుసిడైడిస్ పద్ధతిలోని సరళత్వంగానీ, భావనామయమైన హెరోడాటస్ పద్ధతిలోని సృజన కానీ కనిపించదు. అంతకంటే ముఖ్యంగా, జాతిచరిత్ర అన్న భావన, ప్రతి చరిత్ర జాతిచరిత్రే అన్న సత్యాన్ని విస్మరించినట్టుగా ఉంది. ఏ చరిత్రయినా, ఒక జాతిని, ఆ జాతి సాంస్కృతిక చిహ్నాలన్నీ పుణికి పుచ్చుకుంటుంది! దీనికి తోడు, ఈ పద్ధతిలో ఒక జాతి/సంస్కృతికి చెందిన రచనలన్నీ ‘విలక్షణ’మైనవే అనే ఒక నిర్ణయాత్మక పరిధి లోనే చూడడం వల్ల వాటిలో కూడా వాస్తవిక చరిత్ర ఉందనే భావన విడిచి పెట్టవలసి వస్తుంది.
ఈ జాతిచరిత్ర నమూనా వల్ల ఒకే సాహిత్యప్రక్రియలో చారిత్రక రచనలు, సామాన్యమైన రచనలూ రెండు ఉండవచ్చుననే స్పృహని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ అతిముఖ్యమైన తేడాని విస్మరిస్తే, చారిత్రక రచనల్లో ఉపయోగించిన ప్రత్యేకమైన రచనా పద్ధతులని గుర్తించి వాటి సాయంతో ఏవి చారిత్రక రచనలో, ఏవి సామాన్య రచనలో తేల్చడం సాధ్యం కాదు. ఈ తేడా భారతీయ చారిత్రక రచనల పరిశోధనకి ఆయువుపట్టు. మన సంప్రదాయ సాహిత్య ప్రక్రియలైన ఇతిహాస-పురాణాలన్నిటినీ చరిత్రగా వర్గీకరించడం నిష్ప్రయోజనమని మా అభిప్రాయం. ఇతిహాస-పురాణాలలోని స్థల, కాల, వ్యక్తుల, దైవిక శక్తుల మేళవింపులకి ఒక భాష్యాన్ని తయారుచెయ్యడం కుడా మా ఉద్ధేశం కాదు. జాన్ అస్మాన్ (Jan Assmann) స్మృతిచరిత్ర (Mnemo-history) అనే ఒక శక్తివంతమైన వ్యాఖ్యాన పద్ధతిని ప్రతిపాదించాడు. ఒక ఇతివృత్తమో, వ్యక్తో, ఒక సంఘటనో ఒక వ్యవస్థలో గుర్తు పెట్టుకోబడి, కథనాలుగా చెప్పుకోబడి, కాలక్రమంలో ఒక సాంస్కృతిక జ్ఞాపకంగా, ఒక చారిత్రక స్మృతిగా ఏర్పడే విధానాన్ని స్మృతిచరిత్రగా ఆస్మాన్ నిర్వచించాడు. ఒకే కథనం రకరకాలుగా ఎలా పరివర్తనం చెందుతుందో ఈ సూత్రాలతో అధ్యయనం చెయ్యవచ్చు – ఉదాహరణకి ద్వారకా పాలకుడు కృష్ణుడు, రాజస్తాన్ జానపద నాయకుడు పాబుజీ – వీరిద్దరూ, రెండు వైవిధ్యమైన సంస్కృతుల్లో – ఇతిహాసాల్లోనూ, జానపద గాథల్లోనూ, ఏ విధంగా స్మరించబడ్డారో అధ్యయనం చెయ్యవచ్చు. ఈ పద్ధతి, మేం ప్రతిపాదిస్తున్న ఈ అధ్యయనంలో ఉదాహరించిన రచనలకి కూడా వర్తింపచెయ్యవచ్చు. మా అధ్యయనంలో చరిత్ర అనే పదం కేవలం యథాతథం (Literal) కాదు, కాల్పనికత (Figurative) అంతకన్నా కాదు. చరిత్రను ఏదో ఒకలా నిర్వచించడం మా ఉద్దేశ్యమూ కాదు.
ఉత్తరాంధ్రలో 1757లో జరిగిన బొబ్బిలియుద్ధం, 1714లో సెంజిలో వీరోచితంగా పోరాడి మరణించిన యువయోధుడు తేజ్‌సింగు (దేశింగురాజు) కథనాలు ఆనాటి సమాజం జ్ఞాపకపథంలో ఏ విధంగా నిలిచాయో, అటుపైన ఏ విధంగా అవి మార్పులు చెందుతూ వచ్చాయో గుర్తించడానికి, ఒకే కథని వేరు వేరు రచయితలు ఏ విధంగా చెప్పారో పరిశీలించడానికి స్మృతిచరిత్ర పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ స్మృతిచరిత్ర పద్ధతిని భారతీయ సాహిత్య సందర్భానికి అన్వయించి, పురాణేతిహాసాలలో గతాన్ని చారిత్రకస్పృహతో చూసిన రచనలనీ, కాని వాటినీ స్పష్టపరచవలసి వుంటుంది. పురాణేతిహాసాలలో వున్న చారిత్రక స్పృహను (లేదా లేకపోవడాన్ని) ఐతిహ్యం అనే సాధారణ నామంతో పిలుద్దాం. ఐతిహ్యం ఎల్లప్పుడూ సత్యమే కానీ, చాలా అరుదుగా మాత్రమే అది యదార్థం చెప్తుంది. అందులోని సత్యం సాహిత్యపరమైనది, తాత్వికమైనది, దార్శనికమైనది. అందువల్ల అది ఏ ఒక్క సంఘటననీ ఉద్ధేశించి మాట్లాడలేదు. యదార్థానికి, కాల్పనిక భావనకి మధ్య ఉన్న ఘర్షణ ఐతిహ్యంలో కనిపిస్తుంది.
అంటే ఐతిహ్యంలో చారిత్రక వృత్తాంతం, పౌరాణేతిహాసిక కథనం ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి వున్నవి. అంతేగాక, రెంటికీ మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు కూడా వున్నాయి. హిందువులకి చారిత్రక దృష్టి లేదనే వాదన అందుకే సరైనది కాదు. వేలంటైన్ డేనియల్ (E. Valentine Daniel) శ్రీలంక బౌద్ధగ్రంథాలని పరిశీలిస్తూ, శ్రీలంక తమిళులకి తమ సాంస్కృతిక వారసత్వం పట్ల ఉన్న శ్రద్ధ, వారి రాజకీయ, చారిత్రక చైతన్యం ముందు భారతదేశ తమిళుల చారిత్రక చైతన్యం సూర్యుడి ముందు కరదీపిక వంటిది అంటూ, సుమారుగా వెయ్యేళ్ళ క్రితం అల్ బీరూనీ చేసిన తప్పునే చేశాడు. ఐతిహ్యంలో ఎలా ఐతే పురాణ కాల్పనికత ఉన్నదో, కార్య-కారణ ప్రేరితమైన దేశకాల సంఘటనలని, వాస్తవిక ధోరణితో విశ్లేషించే శాస్త్రీయ చైతన్యమూ ఉంది. కేవలం అచారిత్రకమైన ఐతిహ్యం పైనే దృష్టిపెట్టడం ఈ సంప్రదాయంలో అంతర్గతంగా ఉన్న సమతౌల్యాన్ని, వైవిధ్యాన్ని విస్మరించడమే.