మా. దాది సంగకు కుమారుడు కలగంగానె, గుర్రమునకు గోడిగ పుట్టగానే, రాజుగారి కచేరిమీద యేవేమొ చోద్యములు పుట్టుచున్నవి? రాజు ఒక్కడే కచేరీన లేడు గాని సకలమైవారు కచేరీలోనే యున్నారు. ఏనుగులకి వైరి ఎనుపోతుల ఎర్రన్న, తెలగా గుర్రములకు వైరి గుజ్జుల పాపయ్య, బొందిలి పరాణి పాగారౌతు తురక ముగ్గురు సరదార్లు ఏమనుకున్నారనగా –
పరాణి పాగారౌతు అన్నాడు గదా, “ఏమోయి, ఏనుగులకు వైరి ఎనుబోతుల ఎర్రన్నా, సిపాయిగిరి బంట్రౌతుమానా యెవ్వరిదోయ్?”
అనగానె, “ఒకరిది అని నిరుకు ఉన్నదా? మొలత్రాడు గట్టిన మగవాడి కెల్లను ఉన్నది సిపాయిగిరి బంట్రౌతుమానా.”
అందుకు తురక ఏమంటాడనగా, సిపాయిగిరి బంట్రౌతుమానా యెవ్వరిదీ కాదు,మేలు, మేలు!
“డాలు పట్టా యెవ్వరిది? సైయ్యదు యింటివారిది
బల్లెపు లగువులు యెవ్వరివి? మామొగలు యింటివారివి,”మా. అందుకు ఎర్రన్న యేమి అనుచున్నాడు: “అయితే, డాలు బల్లెము పట్టా మీ సైయదు మొగలు ఇంటివారివి అయితే ఈ భూమిలో సిపాయిగిరి మరియెవ్వరికి లేదా? వెర్రి మాటలు యేమి చెప్పుచున్నావు!”
మేలు, మేలు!
“మొలత్రాడు కట్టిన మగవానికెలా ఉన్నది, బంట్రౌతుమానా, సిపాయిగిరీ”
ఎర్రన్నతో తురక ఏమనుచున్నాడు?
ఛీ లండి అనుచు తిట్టెను
నన్ను లండి అనుచు తిట్టితివా?
తెలగాలు లెగిసిరి
బొందిలీలు లెగిసిరి
పట్టాలు దూసిరి
కత్తులట్టె దూసిరి
తురకలంత దూసిరి
నడుములట్టె కట్టిరి
డాలు కత్తులు దీసిరి
కదిసెనుర! కయ్యము |తం|
తురకనప్పుడు నరికిరి
తెలగాలు పొడిచిరి
బొందిలీలు నరికిరి
ఓహో! కదిసెర కయ్యము
ఆరునూటికి చావులు
మూడు నూర్లకు గాయములుమా. కచేరీ అంతయు నల్ల కల్లోలము అయినది. ఆ రక్త కోకలు మూటలు గట్టించి, రాయమహల్ మీదికి తీసుకొనివెళ్ళి, “ఓహో, వీరకుంభిణీ మహారాజుగారు, ఏమి నిద్దుర పోవుచున్నారు ఏలినవారు?” అనగానె, దిగ్గున లేచి “ఏమర్రోయి,” అని రాజు అడుగగా
మహాప్రభో, యీ వేళతో కచేరి అంతయు పాడైపోయెను. అనగానె, రాజు వెలవెలబోయి అదియేమి? అని అడుగుచున్నాడు.
ఏనుగలకు వైరి ఎనుపోతుల ఎర్రన్న,
మేలు, మేలు!
గుర్రాలకు వైరి గుజ్జల పాపయ్య, పఠాణిపాగారౌతు మూలముగా కచేరి మీద కార్యము పొసగినది.
అది ఎలాగంటిది? ఎట్లు పొసగినది కార్యము? నాకు తెలియజెప్పుము అని రాజు అడుగగానె, కచేరిన వారిలో వారికి నడిచిన సంవాదము మీద పుట్టిన కార్యము చెప్పగానే, రాజుగారు యేమి చెప్పినారనగా, “నేను ఈలాగంటి సంగతులు పుట్టునని ముందుగానే జాగ్రత్తపడి పట్టములోని బ్రాహ్మణులను పిలిపించి చిన్నవాడు పుట్టిన నక్షత్రము బాగుగా నున్నదా?” అని అడిగితే,
మేలు, మేలు!
“భూమినేలే పుత్రుడు, జగమేలు చంద్రుడంతటివాడు పుట్టెను, తల్లి తండ్రాదులకు మోసము లేదు, పట్టమునకు మోసములేదని చెప్పిరి. నేను వారికి బహుమానములు యిప్పించి రాయమహల్ మీద పండుకుని యున్నాను. నిద్దురపట్టు చున్నది. ఇంతలోనె యింత కార్యము యెక్కడనుంచి వచ్చెనోయి? పిలిపించండి మునుపటి బ్రాహ్మణులని యిప్పుడు,” అని దివాన్ ఆభోజిపంతులకు జెప్పెను. దాయలు గట్టి బ్రాహ్మణుల శిరస్సులు కొట్టించెదను అనగానె ప్రధాని గడ గడ వణుకుచు బ్రాహ్మణులకు నేటికి మూడెను కాబోలును అని బ్రాహ్మణుల నప్పుడు రాజుగారి కొలువుకు హాజరు చేయించెను. చేతులు గట్టుకొని బ్రాహ్మణులు నిలువబడిరి.
మేలు, మేలు!
“ఎవరయా, బ్రాహ్మణులు? నేను ఒకపారికి రెండు మారులు మిమ్ముల విచారించమంటిని, మరేమి పట్టమునకు మోసము లేదు అని చెప్పితిరి. ఇంతలోనే నా కచేరిలో ఆరునూటికి చావు, మున్నూటికి గాయములు ఎట్లా అయెను?”
“మహాప్రభో, మనవి చిత్తగించండి. అప్పుడు ఒకమాట, యిప్పుడు ఒకమాట ఆడుదమా మేము? మీ కుమారుడు పుట్టిన గడియ నక్షత్రమువల్ల యిలాటి కార్యములు పుట్టబోవు ఇంతకు ముందుగా ఈ పట్టములోను యే కోమటి వీధినో, యే బ్రాహ్మణగల్లీనో, యే రాజవీధినో, యే శూద్రశ్రేణిలోనో, యేమొగలాయి వీధినో యే గొల్లవీధినో మహాచెడ్డ కార్యవాది పుట్టినాడయ.” అనగానె,
“విన్నావటయ్యా! ఆభోజిపంతులు, మన సిబ్బంది వారిలో దిట్టమైన వారిని పదిమందిని వెంటదీసికొని పట్టము దరోబస్తు యిల్లిల్లు తప్పకుండా వెతికించి రెండు జాములప్పుడు యే యింట యే చిన్నవాడు పుట్టెనో ఆ చిన్నవానిని మన కచేరికి హాజరు చేయించుము,” అనెను.
మేలు, మేలు!
కథలో ఈ భాగానికొచ్చేసరికి మనకి కొట్టచ్చినట్టు కనిపించే విశేషాలు: లెక్కలు, పద్దులు మొదలైన సంఖ్యలేవీ ఇంతకుముందు చూసిన ‘పురాణ’ సంఖ్యలు కాకపోవడం, ఉదాహరణకి నగరంలో ఉన్న పేటలు, రాజుగారి బహుమానాల జాబితా మొదలైనవి. వర్ణన అంతా విషయపరంగా, నిర్దుష్టంగా ఉండటం.
అంతేకాక, కథనశైలిని పరిశీలిస్తే, ఇందులో కథకుడు యథాతథంగా జరిగింది వినిపిస్తున్నాడే తప్ప ఇందులో నాటకీయత గానీ, ప్రేక్షకులని ఉర్రూతలూగించే రక్తి-రసాలు గానీ లేవని తెలుగువచనంతో బాగా పరిచయమున్న పాఠకులకి సులువుగానే తెలుస్తుంది. ఇక్కడ శైలీలక్షణం తటస్థంగా ఉండటం గమనించవచ్చు. సన్నివేశాలలో కొంత నాటకీయత ఉన్నా, కథనం ఉత్కంఠభరితంగా కనిపించదు. వివరణలలో, వర్ణనలలో, రచయిత ఇక్కడ ఎంచుకున్న భాషాసామాగ్రిలో వైవిధ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉదాహరణకి కార్యం అనే పదం ప్రమాదం అనే అర్థంలో వాడటం, కార్యవాది అనే పదం ప్రమాదకరమైన మనిషి అనే అర్థంలోనూ వాడబడింది. అలాగే సిపాయిగిరీ, బంట్రౌతుమాను పదాలలోని వైచిత్రిని గమనించండి. (సిపాహి = పార్శీ), బంట్రౌతు (బంటు = సైనికుడు, రౌతు= అశ్వికుడు) అనే పరభాషా పదాలకి గిరి, మాను అనే అంత్యప్రత్యయం ద్వారా వాటిని జంట పదాలుగా వాడారు. తెలుగులో సాధారణంగా వచ్చే పునరుక్తి వచనశైలికి ఇది చక్కగా సరిపోతోంది, అయినా ప్రయోగం ప్రత్యేకంగా, విచిత్రంగా ఉంది. ఈ ప్రయోగాల ద్వారా ఇక్కడ కథనం రెండుగా విడగొట్టబడి, ప్రత్యేకంగా కనపడుతోంది. మొదటిది, ఇటువంటి వాడుక తెలుగులో సాధారణంగా వచ్చేది కాదు. అందువల్ల అది శ్రోతలలో ఎటువంటి భావోద్వేగాలనీ కలిగించదు, అంతేకాక శబ్దాలంకారాల వంటివి లేకపోవడం వల్ల, కథనం ఒక తటస్థమైన గొంతులో ఉండి, వార్తాకథనాన్ని వినిపిస్తున్నట్టుగా ఉంది. సంభాషణలు కూడా వాస్తవిక ధోరణిలో ఉన్నాయి.