భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపోద్ఘాతం

సరే, ఇప్పుడు అదే కథని కాస్త ముందుకి జరుపుదాం – జానపద కథలో ఊహించినట్టుగానే ఈ కథలో కూడా కుమార రాముని, పోలిక రాముని పుట్టుకల ఘట్టాలున్నాయి.

మా. నగరి కొమాళ్ళు రాజుగారి కచేరికడకు వర్తమానము దీసుకొని వెళ్ళుచున్నారు. అంతలో వైళమై రాజుగారు నాలుగు దస్తా లెక్కలు కమరి పట్టించగా తమ ఖర్చు సిబ్బంది ఖర్చు అరమాషీ, పురుమాషీ ఖర్చుపోగా సరకారు సిస్తు చెల్లించగా, 18700 వరహాలు రాజుకు ఆదా కనుపడినది. అగుపడగానే బహుసంతోషముతో నున్నాడు.

మేలు మేలు!

ఆ సమయములోనే నగరి కొమాళ్ళు వెళ్ళి, ‘మహా ప్రభో తమకు కుమారుడు గలిగినా’డని చెప్పగానే రాజు బహు సంతోషించి పుక్కిట విడెమి చెదర నవ్వి, ‘ఎవరయా, ఆభోజిపంతులు, శీఘ్రముగా పట్టములో బ్రాహ్మణులను పిలిపించి చిన్నవాడు పుట్టిన గడియ నక్షత్రమును విచారించవలెను. అతి త్వరగా పిలిపించ’ మనెను. ప్రధాని వెళ్ళి బ్రాహ్మణులను పిలుపించేవరకూ రాజుగారు పన్నెండు పుట్ల కండచక్కెర, యెనిమిది పుట్ల పంచదార, ఆరువందల ఆకుల మోదలు, పందుపోకలు పట్టము వెడల్పున పంచి పెట్టించిరి. అంతలోనే బ్రాహ్మణులందరు హాజరు అయినారు. “ఎవరయా, బ్రాహ్మణోత్తములారా! పట్టపుదేవి పుట్టి పన్నెండు, పెరిగి పన్నెండు, పన్నెండు పన్నెండు యిరువైనాల్గు సంవత్సరములకు సంతానము దెచ్చెను. మగచిన్నవాడు జననమైనాడు. తల్లికి మోసమో, తండ్రికి మోసమో, పట్టమునకు యేమైనా భయమో, యేడు కుంభిణి కోటలు, డెబ్బై రెండు కరపట్నాలు, యేనూట యెనభై రాజవీథులు, యేనూట యెనభై సందువీథులు ఉండునో? ఊడునో? చిన్నవాడు పుట్టిన గడియ నక్షత్రము యేలా గున్నదో? నేను రాజరికము చేయు రాజునని భయపడక గట్టిగా విచారించండి”

“మహాప్రభో, ఇంకను మీరు అడుగ పని ఉన్నదా? మేము చెప్ప పని ఉన్నదా? చిన్నవాడు పుట్టిన గడియ నక్షత్రము బహుబాగుగా ఉన్నవి”

మేలు, మేలు!

“భూమినేలు పుత్రుడు పుట్టనే పుట్టెను, తల్లికి మోసము లేదు, తండ్రికి మోసము లేదు, పట్టమునకు మోసము లేదు, ఏడు కుంభిణి కోటలు, డైబ్బైరెండు కరపట్టములకు మోసము లేదు. కుమారుడు బహు బుద్ధిమంతుడగును. రాజు అంశ బాగుగా ఉన్నది. ఒకట రెంట మూట గట్టిగా విచారించియె మీతో మనవి చేసినాము.”

అనగానే బ్రాహ్మణులకు పప్పు బియ్యములు ఇప్పించి దుశ్శాలువలు,

మేలు, మేలు!

బహుమానం ఇప్పించి రాజుగారు కచేరి బరఖాస్తు చేసి రాయమహల్ మీద పండుకొన్నాడు.

దాది సంగ యిక్కడను
కష్టపడుచున్నది |తం|
అయ్యో! రావే కావేరి,
అప్పా! నేను బ్రతుకనే
చెల్లీ! రావే పద్మాక్షీ
యీవేళ నేను బ్రతుకనే
మంత్రసానిని పిలిచిరి
తాళి తాళి నొప్పులు |తం|
తడవాయి నిల్వవు
ఆవల యీవల దాదులు
నిల్వబెట్టిరి ఆ వేళ
మంత్రోదకములు తెచ్చిరి
నీలవేణికి యిచ్చిరి |తం|
పగలు రెండు జాముల వేళను
దాది సంగకు ఆ వేళ
కుమారుడు కలిగెను
అప్పుడు మంత్రసానులు
బాలుని బొడ్డును గోసిరి
నీళ్ళుబోసిరి బాలునికి
ఉయ్యాల తొట్లలో నుంచిరి
నీలవేణి లెగిసినది
మూర్ఛ పోయి లెగిసినది
‘యేడమ్మా! నా బిడ్డ?’
ఎత్తి చేతికి ఇచ్చిరి
దూది రొమ్మున పాలిచ్చె
నీలవేణి కొడుకేమి
రాజు కొడుకు కన్నాను
చొంతాకు వాసేమి
సౌందర్యము గలవాడు,
అధిక చక్కని బాలుడు
రాజుగారి గుర్రము
పూల తోటలో ఈనినది
నాలుగు కాళ్ళు తెలుపేమి
నడినెత్తిన చుక్కేమి
పంచకల్యాణి పూదోక
మంచి గోడిగను పెట్టినది |తం|