మా వాదన సారాంశం సూక్ష్మంగా ఇదీ: చాలా అరుదుగా మాత్రమే చరిత్ర రచన యూరోపులో జరిగినట్టుగా ఒకే సాహిత్య ప్రక్రియకి అంకితమవుతుంది. సాధారణంగా, ఏ ప్రక్రియలో రచించినదైనా అంతర్లీనంగా ఆ రచనయొక్క లక్ష్యం, స్వభావం ఆ భాష తెలిసిన పాఠకులకి, శ్రోతలకి తేటతెల్లమయ్యే విధంగా ఆ రచనలో ఇమిడి ఉంటాయి. అయితే, ఏ సంస్కృతిలోనైనా సాహిత్య ప్రక్రియలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఆ మార్పులతో పాటుగా చరిత్ర రచన కూడా మారుతుంది. ఏకకాలంలో వచ్చిన వేర్వేరు సాహిత్య ప్రక్రియల మధ్య సరిహద్దులు ఎప్పుడూ స్పష్టంగానే ఉంటాయి. ఉదాహరణకి, శాస్త్రీయమైన చరిత్ర, చారిత్రక నవల, కాల్పనిక నవల – ఈ మూడూ వచన రచనలే, మూడింటికి స్థూలంగా రూపంలోనూ, శైలిలోనూ ఎంతో సారూప్యం ఉన్నా, ఏది ఏ వర్గానికి చెందినదో గుర్తించడంలో పొరబాటు చెయ్యం కదా? ఇటువంటి స్పష్టతే పదునెనిమిదో శతాబ్దానికి పూర్వం దక్షిణ భారతదేశ సాహిత్యంలో కూడా ఉంది.
ఒకసారి ఈ దృష్టిని ఆకళించుకుని పరికిస్తే, సమృద్ధమైన చారిత్రక వనరులు ఎన్నో మన ముందుంటాయి. చరిత్ర రచనల పరిధి ఎన్నో సాహిత్య ప్రక్రియలకి వర్తించినంత మాత్రాన ఏది వాస్తవం, ఏది కల్పితం అనే ప్రశ్నని మనం వదులుకోనక్కరలేదు – ఎందుకంటే, ఈ రెంటికీ మధ్య సరిహద్దులు రచనలోనే ఉంటాయి, మనం చూడగలగాలంతే. ఈ విశ్లేషణ సాహిత్యానికి వున్న ‘శైలీలక్షణం’ బలమైన పునాదిగా సాగుతుంది. శైలీలక్షణం ప్రాతిపదికన ఎంత మార్మికమైన వ్యక్తీకరణైనా మనకి అందుబాటులో ఉంటుంది. చరిత్ర రచన అనేది వాస్తవాలని కేవలం ఇటుకలలా పేర్చడం కాదు, అదొక పరిపూర్ణమైన సాహిత్యసృష్టి. చారిత్రక సమాచారాన్ని ఎటువంటి సాహిత్య ప్రకియ లోనైనా ఎంత వైవిధ్యంగా రాయవచ్చో మనం గమనించగలం. సామాజిక నేపథ్యం మారినప్పుడు సాహిత్యప్రక్రియల్లో వచ్చిన మార్పులు కూడా మనం అర్థం చేసుకోగలం.
ఒక సాంఘిక వ్యవస్థ చరిత్రని అప్పటికి ఆ వ్యవస్థలో ప్రాచుర్యంలో వున్న సాహిత్య ప్రక్రియల్లో వ్రాసుకుంటుంది. అదే విధంగా ఒక వ్యవస్థని మరొక వ్యవస్థ ఆక్రమించుకున్నప్పుడు, కొత్త వ్యవస్థతో బాటుగా, చరిత్ర రచన ప్రక్రియ కూడా మారడం వల్ల ఓడిపోయిన వ్యవస్థ వ్రాసుకున్న చారిత్రక రచనలు తమ చారిత్రకతని కోల్పోతాయి. ఎలా అంటే, ఆధిపత్యం సాధించిన వ్యవస్థ తను లోబరుచుకున్న వ్యవస్థపై తన సాహిత్య ప్రక్రియలను శాసించటం ద్వారా, పరాజిత వ్యవస్థకు చారిత్రకత లేకుండా చేస్తుంది. అందుకే, చరిత్ర రచన అనేది సర్వకాలికమైన, స్థాణువైన, స్థబ్దమైన భావన కాదు. అది దేశకాల పరిస్థితుల ప్రభావంలోంచి ఎదిగిన ఒక ప్రయోగం. ఈ ప్రయోగాల మధ్య వైరుధ్యం, పోటీ ఉండవచ్చు. ఈ ప్రక్రియలో, పరాజితుల చరిత్ర కనుమరుగైపోవచ్చు కూడా.
ఒక సాహిత్య ప్రక్రియ తన ప్రాచుర్యాన్ని కోల్పోయిన పక్షంలో, ఆ ప్ర్ర్రక్రియలో ఉన్న చారిత్రక రచనలు కూడా వాటి చారిత్రకతని పోగొట్టుకున్నాయి, అంటే తరువాతి తరం ప్రజలు వాటిలో చరిత్రని చూసే సామర్థ్యం (శైలీలక్షణాన్ని గుర్తించే సాహిత్య సాంప్రదాయం) కోల్పోవడంతో చారిత్రక రచనలు కూడా సాధారణ సాహిత్యంగానే చలామణీ అయినాయి, అని అర్థం. కేవలం ప్రజలే కాదు, తరువాతి తరాల చరిత్రకారులు, పండితులు కూడా వారి వారి కాలాల్లో ప్రాచుర్యంలో వున్న సాహిత్య ప్రక్రియల ప్రభావానికి లోబడిన వారే కావడంతో పూర్వ చరిత్ర రచనల సాహిత్య ప్రక్రియలను అర్థం చేసుకోలేక, వాటిని కాల్పనిక సాహిత్యంగా తీసి పారవేశారు.
ఒకే సాహిత్య ప్రక్రియలో రచించబడ్డ రచనలలో, ఏది చారిత్రకమో, ఏది కాల్పనికమో మనం ఎలా గుర్తించడం అనేది అతి ముఖ్యమైన ప్రశ్న. అన్ని రచనలూ చారిత్రకమనో, లేదా ప్రతి రచనలోనూ ఎంతో కొంత చరిత్ర ఉంటుందనో వాదించడం నిష్ప్రయోజనం. ఒక్కోసారి, రచన శీర్షిక నుండో, అమరిక, కూర్పు వంటి స్థూల సూచకాల ద్వారానో గుర్తించవచ్చు, కాని ముఖ్యంగా ఈ తేడా ఆ రచన యొక్క శైలీలక్షణం మీద ఆధారపడి స్పష్టం చేసుకోగలం. ఒక భాషలో, సంస్కృతిలో పుట్టి పెరిగిన పాఠకులు ఆ భాష లోని రచనకు వున్న శైలీలక్షణాన్ని స్వాభావికంగా గుర్తించి, దానికి స్పందించగలుగుతారు. ఒక రచనలో గతం గురించిన కథనం యధార్థమో కాదో వారికి సహజంగానే తెలుస్తుంది. అందుకు కావలసిన సంకేతాలు, గుర్తులు విరివిగా ఆ రచన నిండా విశ్లేషించడానికి అనువుగా ఉంటాయి. అయితే, ఇదంతా ఆ కథకుడు/రచయిత, రచన, పాఠకుడు/శ్రోత మధ్య ఉండే అవినాభావ సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధం చెడిపోతే, లేదా నశించిపోతే ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతాయి. దానితో, ఈ రచన ఏ కాలం నాటిది, రచయిత ఎవరు? ఇది చరిత్రా, కాదా? అని అపరాధ పరిశోధకుల పద్ధతిలో విద్యావేత్తలు వేసే యక్షప్రశ్నలకి పాపం సాహిత్యం సమాధానం ఇవ్వలేక పోవచ్చును.
ప్రతీ చారిత్రక రచనా పద్ధతి చుట్టూ ఒక సాంస్కృతిక సందర్భం (లేదూ సాంప్రదాయం) ఉంటుంది. ఈ సాంప్రదాయం ఫ్రాన్స్‌వా హర్టాగ్ (Francios Hartog) నిర్వచించిన చారిత్రక ప్రవృత్తులకు (Regimes of Historicity) లోబడి వుండి కూడా మారుతూనే వుంటుంది. ఇందుకు గ్రీకుల, మహ్మదీయులు/అరబ్బుల, మధ్యయుగాల నాటి భారతీయుల, ఆధునిక యూరోపియన్ల చారిత్రక రచనా సంస్కృతులు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఏ సంస్కృతికి చెందిన చరిత్రను అర్థం చేసుకోవాలన్నా ముందుగా ఆ రచన సందర్భాన్ని తెలుసుకుంటేనే సాధ్యం. గత రెండువందల ఏళ్ళలో భారతీయ సాహిత్యం ఎన్నో అపవాదులకు, అపోహలకు లోనైంది. ఈ నిరాదరణ వల్ల పూర్తిగా నశించిపోయిన మన సాంస్కృతిక సందర్భాన్ని, మన సాహిత్యపు సాంప్రదాయాన్ని మనం పునర్నిర్మించుకోవాలి. జరిగిన నష్టం అపారమైనది కాబట్టి ఈ పని సులభంగా సాధ్యం కాదు. అందుకని పాత రచనలని పాత పద్ధతులలో చదవటం మనం కొత్తగా నేర్చుకోవాలి. ఆ సాహిత్యం మనకు ఏం చెప్తున్నదో శ్రద్ధగా వినడం ఎలానో మళ్ళీ తెలుసుకోవాలి. ఒక రచనని ఎలా చదవాలి, అది ఏం చెప్తున్నదో ఎలా వినాలి అని తెలుసుకోవడమే సాహితీ సాంప్రదాయం అంటే.
ప్రతి ఒక్క సాహిత్య సంప్రదాయంలో ప్రత్యేకమైన చదివే/వినే పద్ధతులు ఉంటాయి. అది తరతరాలుగా ఆకళింపు చేసుకున్న పద్ధతి. అవి ఆ సాహిత్య సంప్రదాయంలో అంతర్భాగంగా ఉంటాయి గాని, రచనలో నిక్షిప్తమై ఉండవు. ఒక రచనని చదవడం లేదా వినేటప్పుడు, ఆ సాహిత్య సంప్రదాయం, ఆ రచనకి మరింత లోతైన అర్థం ఆపాదిస్తుంది. అయితే, అయితే ఇదంతా, ఆ రచనకి వెలుపల, దానిని చదివేవారి చేతనలో ఉంటాయి కాబట్టి, ఆ సాంప్రదాయం నశించిపోయినప్పుడు రచనకు వున్న ఈ అర్థమంతా కూడా పోతుంది. కొత్త పాఠకులకి ఆ రచన యొక్క సందర్భంతో (context) పరిచయం ఉండదు కాబట్టి, వారి దృష్టిలో దాని విలువ మారిపోతుంది. పాఠకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులని అధ్యయనం చెయ్యడం సాహిత్య విమర్శలో ఒక అల్పమైన సమస్యగా అనిపించవచ్చు. కానీ, ఒక రచనకున్న శైలీలక్షణపు ధ్వనిని ‘వినే’ సామర్థ్యం కోల్పోయినప్పుడు, ఆ రచన స్వభావాన్నీ, సందర్భాన్నీ, ప్రయోజనాన్నీ గ్రహించడంలో చాలా అపార్థాలు రేకెత్తవచ్చు. ఇది కేవలం అభిరుచిలో మార్పులా కనపడి మనలని మోసగించవచ్చు. నిజానికి, ఇది ముమ్మాటికీ ఒక జటిలమైన సమస్య.
సాహిత్యము, దానికుండే సందర్భము అంటున్నాం కాబట్టి, ఒక రచన కర్తృత్వం ఎవరిది, ఆ రచన పాఠకులెవరు – ఇత్యాది ప్రశ్నలు వేసి, ఆ సందర్బాన్ని మనం అర్థం చేసుకోగలమా? రచయిత, పాఠకులు రచనకు బాహ్యసందర్భంలోని వారు. అంతర్భాగం కారు. అందువల్ల, బాహ్యసందర్భం గురించి మనకు తెలిసిన వివరాలు, సాహిత్య సందర్భాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయా?
బోర్హెస్ రాసిన ఓ కథలో ఈ ప్రస్తావన వస్తుంది – ఈ కథ ఒక సమీక్షకుడి వ్యాసంలా వుంటుంది. కథానాయకుడు పియెరీ మెనార్డ్ ఇరవయ్యో శతాబ్దం వాడు. సెర్వాంటెస్ 16వ శతాబ్దంలో వ్రాసిన డాన్ కిహోటే (Don Quixote) కథలో కొంత భాగాన్ని అనువదించబోతాడు కానీ, సెర్వాంటెస్‌తో ఎంతగానో మమేకమై పోవడం వల్ల అనువాదానికంటే ఎంతో గొప్పగా ఆ కథను తిరిగి వ్రాస్తాడు. ఎంత గొప్పగా అంటే, సెర్వాంటెస్ కథ, మెనార్డ్ కథ రెండూ అక్షరం అక్షరం ఒకదానిని ఒకటి పోలి వుంటాయి. రెండూ ముమ్మూర్తులా ఒకటిగానే వున్నా, మెనార్డ్ కథ మొదటి దానికన్నా ఎన్నోరెట్లు గొప్పది అంటాడు కథలో బోర్హెస్, సమీక్షకుడి ద్వారా. ఎందుకంటే సెర్వాంటెస్ కథ 16వ శతాబ్దంతో ఆగిపోయింది. కానీ మెనార్డ్ కథను 20వ శతాబ్దం దాకా విస్తరించిన సందర్భంలో అర్థం చేసుకోవాలి. మనం ప్రస్థావిస్తున్న పరిస్థితి ఇటువంటిదే. అంటే, శైలీలక్షణం అనేది కేవలం పదాలు, వాక్యాల అర్థం తెలుసుకున్నంత మాత్రాన బోధపడదు. ఒక రచనని పుట్టించిన సాహిత్య సంప్రదాయంతో సహజమైన సంబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యం. అలా అని, ఇది అర్థం చేసుకోలేని అమూర్త భావన కాదు. ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ కుమార రాముని కథ. ఈ కథ ఎప్పటిదో మనకు తెలియదు. ఈ కథ కుమార రాముడనే వీరుడు, అతన్ని ముమ్మూర్తులా పోలివున్న పోలిక రాముడనే అతని సోదరుడి, పరాక్రమాల గురించిన కథ. ఇలా మొదలవుతుంది.
“ఇది కధ; యిది మార్గము; వినిపింతు వినండి; ఓ పుర జనులార! పుణ్యాత్ములార! అది యెట్టి కధ? అనగ అనగ వినిపింతు; ఆయట్టి విరూపాక్షి అనెగిండి భూమి; కంపిలి గంగావ తనియేటి గ్రామ దేవతయు, వీరకుంభిణీ రాజు విక్రమార్కుండు, అతనికి నిజరాణి అలికులవేణి (అరియాల యని యేటి యంభోజనేత్రి) ఉత్తర కాంబోధి యున్నదే వసవల్లి దుర్గము; ఆ వసవల్లి యేలేవారు యెవరంటె? రాజు వీరకుంభిణి మహరాజు; ఆ రాజుకు ఇల్లాలు అరియాల దేవి. పెట్టే పన్నెండు; పెరిగే పన్నెండు; పన్నెండు పన్నెండు ఇరువైనాలుగు యేండ్లు వెళ్ళెను; నగర సంతానం లేక నోయరాని నోములు, పట్టరాని వ్రతాలు, ఆకల్ల పత్రిగా నోచెను; రావిచిలుక నోము నోచెను; కాశీతీర్ఠం గంగకు మోచెను; గంగతీర్థం గాశీకి మోచెను; కాశీరామేశ్వరం సందున చావురావులు వేయించెను; పర్వతం బోయేటి మార్గంలో పదివేలకు జంగమార్చన చేయించెను.“
ఇట్లాంటి రచనని ఏ ప్రక్రియగా వర్గీకరిస్తాం? బహుకాలంగా సంతానభాగ్యం లేని రాణి, ఆమె చేసిన అద్బుతమైన తపస్సు, పురాణగాథల్లో యధావిధిగా తారసపడే పవిత్ర సంఖ్యలు, ఇవన్నీ పరికిస్తే ఇదేదో జానపద కథలా అనిపిస్తుంది. పైగా, ప్రారంభంలోనే రచయిత దీన్ని ‘కథ’ అంటున్నాడు. అందుకే, ఈ కథని పరిష్కరించి ప్రచురించిన నేలటూరు వెంకటరమణయ్య, “కుమార రాముని కథ చదువు, పాండిత్యం పెద్దగాలేని ఎవరో అనామక కవి రచన. దీనిని వాస్తవమైన చరిత్ర కథనం అని అనుకోరాదు. రచయిత చాల స్వతంత్రించి, కథలో మార్పులు, చేర్పులు, అభూత కల్పనలు యథేచ్చగా చేసి, అసలు చరిత్రకి మసిపూసి మారేడుకాయ చేసినాడు. కానీ మూలకథ మాత్రము ఇదేవిధముగా నున్నది” అని అభిప్రాయ పడ్డాడు. పండితుడైన ఈ పరిష్కర్త కళ్ళకి, కుమారరాముని కథారచయిత ఒక పామరుడిలా కనిపించాడు, అందుకని ఆ రచయిత కథనంపై ఆధారపడలేం. మోమిగ్లియానో (Arnaldo Momigliano) అన్నట్టు, “పండితులే చరిత్ర రాయగలరు, పామరులు చెప్పేవి కాకమ్మ కథలే” అని, గతం గురించిన జానపద కథనాలన్నీ అచారిత్రకాలే అనే నమ్మిక ఇప్పుడు పండిత వర్గాల్లో బలంగా నాటుకుపోయింది.