నారాయణ రావుకి వున్న ఈ అవగాహన, పఠన సాంప్రదాయాల గ్రాహ్యత వెనక ఏదైనా మేధో నేపథ్యం వున్నదా? వున్నది అనే నా అభిప్రాయం. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతపు సాంస్కృతిక వాతావరణపు ప్రభావం, అక్కడే పుట్టి పెరిగిన నారాయణ రావుపై వుంది. అంబఖండి అనే పల్లెటూరిలో పుట్టిన నారాయణ రావు, స్వయంగా పౌరాణికుడైన అతని తండ్రి నుంచి చిన్నతనంలోనే ఆ విద్యను నేర్చుకున్నాడు. ఆ కాలంలో విజయనగరం గురజాడ అప్పారావు వంటి ఎందరో మేధావులకు, సాంస్కృతిక విప్లవాలకూ పుట్టినిల్లు. ఆ ప్రపంచం నారాయణ రావుని సహజంగానే ఆకట్టుకుంది. ఇక్కడ ఈ సాంస్కృతిక విప్లవం గురించి కొంత చెప్పాలి. గత రెండు శతాబ్దాలకు పైగా ఎందరో, కవులు, రచయితలు, గాయకులు, తదితర కళాకారులు ఎందరో మరుగున పడిపోయినా, వారు సృష్టించిన ఆ సాహిత్యకళావరణం, ఆ ప్రాంతపు సంస్కృతిలో అంతర్భాగమై జీవించే వుంది. గోకులపాటి కూర్మనాథ కవి, చట్రాతి లక్ష్మీనరసకవి, కాకరపర్తి కృష్ణకవి, కోటికలపూడి వెంకటకృష్ణ, ఫక్కి వెంకటనరసయ్య, ఫక్కి అప్పలనరసయ్య, మండపాక కామకవి పార్వతీశ్వరుడు, ఆడిదం సూరన, ఓరుగంటి సోమశేఖరకవి, కాళ్ళకూరి గౌరీకాంతకవి, ఇలా ఎందరివో పేర్లు నా ఊహకు తడుతున్నాయి. సంస్కృత భాషా ప్రభావం ముడుంబ నరసింహాచార్య, కొల్లూరి కామశాస్త్రి వంటి పండితుల వల్ల ప్రబలంగా ఉండేది. శాస్త్రీయ సంగీతం ప్రత్యేకమైన ఉత్తర కోస్తా సంప్రదాయాన్ని పాటించేది. ఇరవయ్యవ శతాబ్దిలో ఆదిభట్ల నారాయణదాసు మొదలుకొని ఎందరో ఆధునిక రచయితలు వుండేవారు.
నారాయణ రావు, అప్పారావు ఇద్దరూ కూడా దక్షిణ భారతదేశంలో మరెక్కడా కనిపించని ఈ విశిష్ట సాంస్కృతిక సంప్రదాయానికి చెందినవారే. ఈ సాంప్రదాయం విభిన్న సంస్కృతుల సజీవ సమ్మేళనం. ఆనంద గజపతి రాజు ఆస్థానం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ భిన్న సంస్కృతీ సమ్మేళనం వల్ల ఉత్తర కోస్తా ప్రాంతానికే ప్రత్యేకమైన సాంప్రదాయం ఒకటి ఏర్పడింది. తాంత్రిక యోగ కర్మలు, రసవాదం; పరిగ్రాహ సాహిత్యం, జానపదుల ఆచార వ్యవహారాలు, పులి వేషం, మల్లయుద్ధం లాంటి ప్రదర్శనలు; పైడి తల్లి, శ్రీకూర్మం, అరసవల్లి, ముఖలింగం జాతరల ఆచారాలు; విజయనగర ఆస్థానంలో ఉండే ఉర్దూ కవుల ద్వారా వ్యాప్తిలో కొచ్చిన ఇస్లాం పద్ద్ధతులు – ఇలా ఎన్నో ఆ ప్రాంతపు, సామాజిక, రాజకీయ దృక్పథాన్ని తీర్చిదిద్దాయి. ఈ సాంస్కృతిక వైవిధ్యం, సాంప్రదాయ సాహిత్యం, పాండిత్య సంపద ఎలా 1930, 40లలో బొబ్బిలి, రాజం, మాడుగుల, అంబఖండి లాంటి పట్టణాలకూ, పల్లెలకూ వ్యాపించాయి అంటే చెప్పడం కష్టం. బహుశా నారాయణ రావునే అడగాలేమో. విప్లవాత్మకమైన ధోరణులు సాంప్రదాయంగా ఘనీభవించి ఆ సమాజపు అంతశ్చేతనలో స్థిరంగా నిలిచిపోవడం ద్వారా ఇది సాధ్యమయిందేమో. ఏదేమైనా, ఈ వైవిధ్య సాంస్కృతిక సమాజపు ప్రభావం నారాయణ రావు మీద చిన్నతనం నుంచే ఎంతో బలమైన ప్రభావాన్ని చూపి వుండాలని నాకు అనిపిస్తుంది.
నేను అతిశయోక్తిగా చెప్పడం కాదిది. కానీ మేధావులు పుట్టడమే ప్రత్యేకంగా పుడతారు. కవి నిర్వచనం అడిగితే రష్యన్ కవయిత్రి అఖ్మతోవా చెప్పినట్టు, “ఎవరికైతే మనమేదీ ఇవ్వలేమో, వారినుండి మనమేదీ దూరం చేయలేమో ఆ వ్యక్తి కవి.” ఎంతో దూరం నుంచి చూస్తున్న నాకు, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యావరణంలో ముగ్గురంటే ముగ్గురే అందరికంటే ఉన్నతంగా కనిపిస్తారు. వారు గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, వెల్చేరు నారాయణ రావు. వీరిలో ఇద్దరే ఉత్తర కోస్తా నుంచి వచ్చారు. కానీ ముగ్గురికీ అవినాభావ సంబంధం ఏదో ఉందనే ఖచ్చితంగా అనిపిస్తుంది. నారాయణ రావు కన్యాశుల్కం అద్భుతంగా అనువదించడమే కాదు, తన మలిపలుకు వ్యాసం ద్వారా ఆ నాటకాన్ని విశదంగా వివరించి అర్థం చేసుకునేలా చేశాడు. తన పుస్తకాన్ని విశ్లేషిస్తూ నారాయణ రావు వ్రాసిన వ్యాసాన్ని చదివి, విశ్వనాథ, “ఈ కుర్రవాడు నన్ను అర్థం చేసుకున్నాడు,” అన్నాడు. బహుశా, ఆయన ఉద్దేశ్యం, “కేవలం ఈ కుర్రవాడు మాత్రమే నన్ను నిజంగా అర్థం చేసుకున్నాడు,” అని చెప్పటం అయివుంటుంది. 20వ శతాబ్దపు సాహిత్య చరిత్రను ఈ ముగ్గురి ఆధారంగా చెప్పుకోవచ్చు — ప్రపంచ స్థాయిలో సగర్వంగా నిలబడగలిగిన రచయితలు ఇద్దరు; వారి సాహిత్యాన్ని, ప్రపంచానికి స్పష్టం చేసిన ఒక మేధావి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, ఒకరు.
ఇంతకు ముందే చెప్పినట్లుగా, నారాయణ రావు చేసిన కృషి తెలుగు సాహిత్యానికి సంబంధించినది. తెలుగులో కవితా విప్లవాల స్వరూప స్వభావాలను పరిశీలించి, నిర్వచించిన మొట్టమొదటి విమర్శకుడు. అతను తెలుగు సాహిత్యంలో కావ్యార్థ ధోరణులను ఎలా గుర్తించాలో చూపించడం వల్ల, తమిళ, మళయాళ, సంస్కృత సాహిత్యాలలో అటువంటి సాంప్రదాయ ధోరణులను గుర్తించడానికి వీలయింది. అందువల్ల, నారాయణ రావు కృషి కేవలం తెలుగు సాహిత్యానికే పరిమితం కాలేదు. అది సమస్త భారతీయ సాహిత్యంపైన ఒక కరదీపికలా ప్రకాశిస్తూ, మనం ఆ సాహిత్యాన్ని సమీపించడానికి సహాయపడుతోంది. ఈ విప్లవాత్మకమైన సాహిత్య వివేచన, అవగాహన, ఈ కృషి ముందుగా తెలుగు దేశానికి వెలుపలగా ప్రపంచ సాహిత్య విమర్శకులను, విశ్లేషకులను ఎంతగానో ప్రభావితం చేసినా, ఇప్పటి దాకా తెలుగు సాహిత్య పరిశోధకులు — ప్రత్యేకించి సాటి తెలుగు వారిగా అందరికంటే ముందుగా గుర్తించాల్సిన వీరే — ఈ కృషిని ఏమాత్రమూ గుర్తించక పోవడం, నాకు అర్థం కాని ఒక వైపరీత్యం.
కేవలం ఈ ఒక్క కారణం కోసంగా అయినా సరే, నారాయణ రావు ఈమాట లోనూ, ఇతర పత్రికల లోనూ వ్రాసిన ఎన్నో చక్కటి తెలుగు వ్యాసాలను ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. అది తెలుగు వారికి ఒక చక్కటి బహుమతి అనడంలో నాకు ఏ సందేహమూ లేదు. అల్లసాని పెద్దన మనుచరిత్రముపై మేము చేస్తున్న తెలుగు-ఇంగ్లీషు ద్విబాషా అనువాదం త్వరలోనే హార్వర్డ్ యూనివర్సిటి ప్రెస్ ప్రచురించబోతున్నది. ఆ అనువాదంతో జతగా మేము రాసిన వ్యాసం నారాయణ రావు ఆలోచనల స్థిరాస్థిరత్వానికి ఒక నిజమైన నమూనాగా ఉండబోతున్నది.
