మై యంగ్ ఫ్రెండ్ నారాయణ రావ్

అయితే, అదే సమయంలో వీఎన్నార్‌ను అర్థం చేసుకోవడం కూడా, అతని సహోద్యోగులకు ఎందుకు కష్టమయ్యేదో నాకు అర్థం అవుతూ వచ్చింది. ఉదాహరణకి, జాన్ రిచర్డ్స్ — కొంతకాలం మాడిసన్‌లో ఉండి, వీఎన్నార్‌తో కలిసి సర్వాయి పాపడి మీద ఒక ముఖ్యమైన వ్యాసం రాశాడు — “నారాయణ రావు త్వరగా అర్థం కాడు, అతి గూఢమైన వ్యక్తి” అని నాతో అన్నాడు. అందుకు కారణం నాకు సులభంగానే బోధపడ్డది. జాన్ రిచర్డ్స్ చరిత్రను పాలకుల దృక్పథం నుంచి, వారిగురించిన ఆధారాల ద్వారా మాత్రమే చూస్తాడు. అదే వివేచన అన్నిటిలోనూ తూచా తప్పకుండా పాటిస్తాడు. నారాయణ రావు అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఇలానే ఇంకోసారి, 1980లో ఒకసారి బర్టన్ స్టెయిన్ నాతో వీఎన్నార్ సాహిత్యాన్ని మార్క్సిస్టుగా చదవడం వల్లనే అతనికి దానిపై ఆ రకమైన సహానుభూతి ఏర్పడింది అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నిజమే, వీఎన్నార్ మీద మార్క్సిస్ట్ ప్రభావం ఒకప్పుడు ఉంది. కానీ, 1985లో అతని ఆలోచనలు అర్థం చేసుకోవడానికి, ఈ కారణం ఎంత మాత్రమూ సరి అయింది కాదు.

వీరిద్దరే కాదు. వీఎన్నార్‌తో ఎంతో కాలం కలిసి పనిచేసిన వారు కూడా అతని ఆలోచనా పద్ధతిని అర్థం చేసుకోలేక పోయారు. ఇందుకు కారణం, అతని ధోరణి అప్పటికే అమలులో ఉండి, అందరికీ పరిచయమైన పాశ్చాత్య సూత్రావళికి భిన్నంగా ఉండడం. బదులుగా, పారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని, వాటికి సంబంధించిన సాహిత్యాన్ని చదవడంలో అతనికంటూ ఒక మార్గం ఉంది. అది వాటితో అతనేర్పరుచుకున్న ప్రత్యేకమైన అనుబంధం వల్ల వచ్చినది. ఆ విధంగా వచ్చిన స్థైర్యంతో అతను సంప్రదాయాన్ని పూజనీయ భావంతో కాకుండా సామరస్యంగా విచారించగలడు. ఇది బిడియానికి, నమ్రతకు పూర్తిగా వ్యతిరేకమైన తత్వం. తన అభిప్రాయాలు పరస్పరవిరుద్ధంగా ఉన్నప్పుడు కూడా అతనికి స్పష్టమైన అవగాహన ఉండేది. ఉత్తరోత్తరా అతని అభిప్రాయాలు ఎప్పుడైనా మారిపోతే, అందుకు కారణం అతని ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుల వల్లే కానీ, ఎవరో అతనితో వాదించి ఒప్పించినందువల వల్ల కాదు. ఒక్కటి మాత్రం నిజం – మౌఖిక సాహిత్యం నుండి లిఖిత సారస్వతం దాకా సాహిత్యాన్ని చారిత్రిక, ప్రాంతీయ, సామాజిక కోణాల నుండి విశ్లేషించగల సమర్ధుడు అతను. తెలుగు సాహిత్యపు పుట్టు పూర్వోత్తరాల చరిత్ర పరిశోధనలను కట్టుదిట్టంగా సరైన మార్గంలో నడిపించగల శక్తి ఉన్నవాడు. ఇదే అతని నిగూఢతకి కారణం.

ఇంతటి విజ్ఞానాన్ని పదిమందికీ తెలియపరచటం ఎంతో కష్టమైన పని. వీఎన్నార్‌ను కేవలం తెలుగు భాషలో ఒక మూల పడున్న సాహిత్యాన్ని తర్జుమా చేసేవాడుగా తీసిపారేయడం, ప్రత్యేకించి పాశ్చాత్య విద్యాసంస్థలలో, ఎంతో సులభంగా జరిగే పని. ఈ విషయం బెర్లిన్‌లో ఉన్నప్పుడు నాకు బాగా అర్థమయింది. కళాశాలలో ప్రతీ గురువారం లాంఛనంగా ఒక విందు ఉండేది. దానికి బెర్లిన్ నగర ప్రముఖులు, పేరు ప్రతిష్టలున్న పెద్దలు ఎందరో వచ్చేవారు. ఆ విందులో వారితో పిచ్చాపాటీ మాట్లాడవలసి వచ్చినప్పుడు వీఎన్నార్ ఎంతో ఇబ్బంది పడేవాడు. తెలుగు భాష అంటే ఎట్లా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఇలాంటి ప్రశ్నలే వచ్చేవి. సాంస్కృతిక రాయబారిగా ఎక్కడికైనా పంపిస్తే వీఎన్నార్ ఒక్క పూట కూడా వుండలేడు, నాకు బాగా తెలుసు. కానీ ఒక నలుగురైదుగురు అతనితో కలిసి కూర్చుని పిచ్చాపాటీ ముచ్చట్లు పెట్టండి, అతను ఎంత కలివిడిగా, పెద్ద చిన్న అని చూడకుండా, ఆడ మగ అని లేకుండా, అందరితో ఎంత బాగా కలిసిపోగలడో తెలుస్తుంది.

1987లో నాకు పరిచయమైన దగ్గరినుంచి ఇప్పటిదాకా వీఎన్నార్‌లో ఎంతో మార్పు వచ్చింది. ప్రత్యేకించి ఎంతో ముందుగా అమెరికా వచ్చేసిన అతను, ఎప్పుడూ ప్రవాసం గురించి మాట్లాడగా నేను వినలేదు. అతన్నెప్పుడూ ప్రవాసం బాధ పెట్టలేదు. కానీ, ప్రవాసంలో ఉంటూ కూడా ఎంతో దూరంలో ఉన్న భారతీయ సంస్కృతి, సాహిత్యాలలో అంతగా ముణిగిపోయిన ఇంకెవరినీ నేను చూడలేదు కూడా. ఒక విషయం చెప్పనా! బెర్లిన్‌లో ఉన్నప్పుడు ఒక రాత్రి వీఎన్నార్ గదిలో నిద్రపోతున్నప్పుడు దొంగ ఒకడు లోపలికి వచ్చి దోచుకున్నాడు. ఆ సమయంలో నారాయణ రావు గనక నిద్ర లేచి వుంటే, ఆ దొంగతో తెలుగులో మాట్లాడి వుండేవాడే.


Textures of Time: Writing History in South India 1600-1800 (2001): ఈ సంచికలో ఫిలిప్ వాగనర్ తన లేఖలో ఈ పుస్తకం ఎందుకు గొప్పదో వివరిస్తాడు. ఈ సంచికలో ఈ పుస్తకం మొదటి అధ్యాయం, చివరి అధ్యాయం సరళమైన అనువాదాలు కూడా ఇవ్వబడినాయి.

షెల్డన్ పోలాక్ వ్రాసిన విమర్శాత్మక సమీక్ష (హిస్టరీ అండ్ థియరీ, సంపుటి 46, అక్టోబర్ 2007) పిడిఎఫ్, అదే సంచికలో వెల్చేరు, షూల్మన్, సుబ్రహ్మణ్యం ఇచ్చిన వివరణాత్మక సమాధానం పిడిఎఫ్. ఈ రెండు వ్యాసాలు అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వార్షిక సమావేశాలలో భాగంగా 2006లో ఈ పుస్తకంపై జరిగిన ప్రత్యేక చర్చ నుండి వచ్చినవి. ఇదే చర్చలో భాగంగా రమ మంతెన వ్యాసం, క్రిస్ చేకూరి వ్యాసం కూడా ఈ సంచికలో పొందుపరచబడినాయి.