ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు

ఈ సంస్కృత గౌణ రూపంతరం, కన్యక కథను ఎన్నో రకాలుగా మార్చివేసింది. అందులో మొదటిది, కాల స్వరూపం. జానపదులకు కాలం ఒక పొడుగైన గీత లాంటిది. దానిపై ఋతువులు, సంఘటనలు ఒక వరుసలో వస్తూ వుంటాయి. జానపద కథలలో కాలం తరిగిపోదు. జననం నుంచి మరణానికి, తిరిగి జననానికి సాగిపోతూ వుంటుంది. ఇందుకు విరుద్ధంగా పురాణాలలో కాలం వర్తులమైనది. క్రమేణా క్షీణిస్తూ అది కలియుగానికి చేరుతుంది. కన్యక కథ గౌణ రూపం సృష్టి, ప్రతిసృష్టి, మన్వంతరం, వంశం, వంశానుచరిత అనే ఐదు లక్షణాలు కలిగి ఈ పురాణ కాలక్రమంలో చూపించబడింది. ఈ క్రమంలో, కన్యక కుటుంబం ఒక ఫలానా మన్వంతరంలో వుంటారు. ఈ కథ చెప్పబడే చోటు దేవలోకానికి మారుతుంది. గంధర్వుడు ఒకడు, వైశ్య యువతిని మోహిస్తాడు. కానీ ఆ యువతి అతనితో వివాహం నిరాకరిస్తుంది. గంధర్వుడు వైశ్యులను శపించడంతో వారు భూలోకంలో జన్మించి అగ్ని ప్రమాదంలో నాశనమౌతారు. ప్రతిగా గంధర్వుడిని ఒక దౌర్భాగ్యపు జీవితం గడిపి హీనమైన మరణం పొందే మానవుడిగా పుట్టమని శపిస్తారు. భూమిపై పుట్టడానికి విముఖత చూపిన వైశ్యులను, వర్తక వ్యాపారాలతో సమాజంలో సుస్థిరత తేవడం కోసం వారు వెళ్ళక తప్పదని దేవతలు ఆదేశిస్తారు. అలా భూమి పైకి వచ్చిన వైశ్యులు చివరిలో అగ్ని ద్వారా శివ సాయుజ్యం పొందుతారు. గంధర్వుడు రాజు గానూ, వైశ్య యువతి కన్యక గానూ పుట్టిన తరువాత ఇదే కథ భూలోకంలో మళ్ళీ జరుగుతుంది.

రెండవ మార్పు, కన్యక పాత్ర నేపథ్యానిది. జానపద ఇతిహాసంలో కన్యక కథానాయిక. తన ఆత్మాహుతి చేసుకోవడం, వైశ్య కులపు మగవారిని తనతో పాటు ఆత్మత్యాగం చెయ్యమనడం, వైశ్యకులస్తులు పాటించవలసిన ఆచార వ్యవహారాలు నిర్దేశించడం, పెనుగొండను రాజు నుంచి కాపాడడం – ఇలా అన్ని నిర్ణయాలు ఆమె స్వయంగా తీసుకుంటుంది. గౌణరూపాంతరంలో కూడా కన్యక కథానాయికే. కానీ, ఇందులో ఆమె పార్వతీదేవి అవతారం. సర్వజ్ఞుడైన కవి, బ్రాహ్మణుడైన భాస్కరాచార్యుడు ఆపత్కాలంలో వైశ్యులకు ఆసరాగా నిలుస్తాడు. తన దివ్యదృష్టితో అంతా తెలిసిన వాడై, అత్మాహుతి ప్రయత్నాలలో ఉన్న వైశ్యులకు, రాజుకి కాలయాపన చేసే ఉపాయాన్ని చెప్తాడు. తద్వారా, కన్యక కోమటి కులానికి ప్రతినిధిగా మరుగున పడిపోయి, బ్రాహ్మణీయతతో పార్వతి అవతారంగా వెలుగులోకి వచ్చింది.

దేవతాకన్య – పతివ్రత

కన్యక పాత్ర నేపథ్యంలో వచ్చిన మార్పు, జానపద వీరగాథల గౌణ రూపాంతరాలు ప్రభావితం చేసిన మార్పులలో భాగం. అవివాహిత అయిన కన్య త్యాగచరితలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ కన్యను వివాహిత స్త్రీగా చూపబూనడం భూస్వామ్య ఆదర్శాలకు అనుగుణమైన ఔచిత్యం. సంస్కృతంలో కన్యక అంటే అవివాహిత యువతి, అక్షతయోని, కుమారి. జానపద ప్రదర్శకులు సన్యాసమ్మను సత్యవతి – నిజం మాత్రమే పలికేది – అని కన్యగా సంబోధిస్తారు. ఈ కథలన్నీ కథానాయిక శీలసంపదను ఆధారం చేసుకున్నవి. ఎన్నిరకాలుగా ఎవరు ప్రయత్నించినా ఆమె తన శీలాన్ని ఎప్పటికీ పోగొట్టుకోదు, వివాహమైనప్పటికీ శీలవతిగానే ఉండే ఈ పాత్ర, భర్త మరణంతో దేవతగా అవతరిస్తుంది. తన శీలసంపద ఇచ్చిన మహత్వ శక్తి వల్ల ఆ దేవత తనకు హాని చేయబోయిన వారిని శిక్షిస్తుంది.

పితృస్వామ్య సమాజాల నుంచి వచ్చిన సాహిత్యంలో స్త్రీత్వం మీద భయము, అపోహలతో కూడిన ఆరోపణలు కనిపిస్తాయి. మగవారికి రెండు రెట్లు ఆహారం, ఆరు రెట్లు శృంగారం ఆడవారికి అవసరం అని ఒక సంస్కృత ఆర్యోక్తి. మగవారు రతిలో వీర్యాన్ని కోల్పోతారు. ఆడవారు ఆ వీర్యాన్ని సంగ్రహిస్తారు. సుమతీ శతకం మగవారు, గుఱ్ఱాలు రతి వల్ల, ఆడవారు రతిలేమి వల్ల ముసలితనం పొందుతారని చెప్తుంది. మగవాడు కానివాడు స్త్రీ అని భావిస్తారు. అందువల్ల నంపుంసకులని ఆడవారిగా సంబోధిస్తారు. కానీ, జానపద వీరగాథలలో స్త్రీలు ఇందుకు భిన్నంగా కనిపిస్తారు. శీలం వీరికి ప్రధానం. మగవాడితో కలవడం ద్వారా స్త్రీలు తమ శీలాన్ని, తద్వారా తమ ప్రభావాన్ని పోగొట్టుకుంటారు. అందువల్లనే దేవతగా మారడానికి శీలం ప్రధానమైనది. ఆ కన్యాత్వపు మహిమ వల్లనే వారు దేవతలుగా శపించిగలిగేది, దీవించగలిగేది.

దేవతాకన్యకు ఎంతో విరుద్ధమైనది పతివ్రత. ఈమె తన భర్తకు తన జీవితాన్ని అంకితం చేయడం వల్ల శక్తి కలిగినది. భర్త ఎటువంటి వాడైనప్పటికీ – వృద్ధుడైనా, కురూపి అయినా, కోపిష్టి అయినా, దరిద్రుడయినా – మనసా, వాచా కర్మణా అతనినే పూజిస్తూ ఉండేది పతివ్రత. కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, శయనేషు రంభా… అని సంస్కృత శ్లోకం పతివ్రతల లక్షణాలను సూచిస్తుంది. పురాణాలలో కనపడే పతివ్రతలు — సీత, సావిత్రి, దమయంతి, అనసూయ — అందరూ కూడా కష్టాలను ఎదుర్కొని తమ పాతివ్రత్యం నిరూపించుకున్నవారే. సీత అగ్నిప్రవేశం చేసింది; నలుడు జూదంలో రాజ్యం కోల్పోయిన తర్వాత దమయంతి కష్టాలు పడింది; సావిత్రి యముడి నుంచి తన భర్తను దక్కించుకుంది; అనసూయ, నగ్నంగా తమకు భోజనం పెట్టమని అడిగి తనకు పాతివ్రత్య పరీక్ష పెట్టిన దేవుళ్ళను పసి పిల్లలుగా మార్చింది. ఇక్కడ ముఖ్యంగా గమనించదగింది ఒకటుంది. ఈ పతివ్రతలకు మానావాతీత శక్తి కేవలం వారి పాతివ్రత్యానికి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇతర పరిస్థితులలో వారు అబలలు గానే కనిపిస్తారు.

దేవతాకన్య వివాహమైన తరవాత కూడా అక్షతయోని గానే మిగిలిపోతుంది; పతివ్రత తన భర్తకు మాత్రమే అంకితమయింది. తన శీలానికి ఆపద వాటిల్లినప్పుడు దేవతగా అవతరిస్తుంది కన్యక; శీలాన్ని పతికే అర్పించి అతనికంటే ముందు మరణించి దేవత అవుతుంది పతివ్రత. దేవతాకన్య శపించగలదు, దీవించగలదు; పతివ్రత తన శీలానికి ప్రమాదం వచ్చినప్పుడే శపించగలదు. దేవతాకన్య తన కులానికి కొత్త ఆచారాలు ఏర్పరచగలదు; పతివ్రత కులగౌరవాన్ని, ఆచారాలని కేవలం సంరక్షిస్తుంది. స్థూలంగా ఇవి దేవతాకన్యకు, పతివ్రతకు ఉన్న తేడాలు.

కన్య పాత్ర స్వభావాన్ని మార్చి పతివ్రతకు దగ్గరగా చూపడంలో కాల క్రమేణా త్యాగ చరితల ఆదర్శాలలో వచ్చిన మార్పు కనిపిస్తుంది. కన్యక అమ్మవారి జాతరలో వచ్చిన మార్పు ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను. అది కన్యకను పెనుగొండ ఆలయపు దేవుడు, శివుడి రూపమైన నాగరేశ్వర స్వామికి ఇచ్చి కళ్యాణం చేయడం. మంగళ సూత్రం కన్యక మెడలో అలంకరించడం ద్వారా, ఆమె శివుడి భార్య పార్వతిగా, ఒక పతివ్రతగా చూడబడుతుంది.

గత కొన్ని దశాబ్దాలలో కోమటి వారి ఆదర్శాలలో వచ్చిన మార్పులు కన్య్క కథను మరింతగా మార్చివేశాయి. విద్యా ఉద్యోగాలను ఆశించడం, కవులుగా, పండితులుగా సాహిత్య సృష్టి చేయడం, ఇత్యాది వ్యవహారాలతో కోమటి వారు బ్రాహ్మణులకు దీటుగా నిలవాలని ఆశించారు. దోమ వెంకటస్వామి గుప్తా అటువంటి ఒక పండితుడు, కవి. అంతే కాకుండా పంచాంగ కర్త కూడా కావడంతో ముహూర్తాది విషయాలలో తన కులం వారికి సలహాలు ఇచ్చేవాడు. గుప్తా వంటి పండితులందరూ, కన్యకాపురాణములో బ్రాహ్మణీయ ప్రభావాన్ని పునఃపరిశీలించారు. గుడిలో పూజచేసే బ్రాహ్మణ అర్చకులు కన్యకను ఆ పేరుతో కాకుండా, రాజరాజేశ్వరిగా సంభోధిస్తారని, బ్రాహ్మణ అర్చకులు గుడిలో ప్రసాదం తాము స్వయంగా తినరనీ, కేవలం భక్తులకు పంచుతారనీ, గుడిలో వేదం చదవరు, ఉపనయన ఆచారం ఉన్నప్పటికీ గాయత్రి మంత్రాన్ని కోమటి వారికి నేర్పరనీ గుప్తా గమనించాడు. కోమటి భక్తులు ఒక సందర్భంలో గుడిలో పురుషసూక్తం పఠిస్తే బ్రాహ్మణులకు నచ్చలేదని గుప్తా ఆరోపించాడు.

ఇతర కోమటి పండితులు కూడా కన్యక కథను పరిశోధించి కన్యకకు శివుడితో వివాహం జరగలేదని స్పష్టం చేశారు. కన్యక కుమారి గానే మిగిలిపోయింది కాబట్టి ఆమె ఆదిశక్తి అవతారం. చారిత్రక ఆధారాలు చూపించి భాస్కరాచార్యుడి పాఠాంతరం తరవాతి కాలంలో చేర్చినది అని ఆక్షేపించారు. కన్యక తన కులంలో స్త్రీలు ఎవరూ అందంగా జన్మించరని శాపం పెట్టడాన్ని కూడా వారు ఆక్షేపించారు. అలాగే వైశ్య యువతిని వాడు ఎటువంటి వాడైన సరే కేవలం బావకే ఇచ్చి పెళ్ళి చేయాలన్న నియమాన్ని కూడా వారు ఖండించారు. మేనరికపు వివాహాలు కులానికి హాని చేస్తాయని వారు నమ్మారు, అటువంటి అనర్థం కలిగించే నియమాలు, అందవిహీనులుగానే పుట్టాలనే శాపాలు తమ కుల దేవత ఎప్పటికీ పెట్టివుండదనీ వాదించారు.

ఇందుకు వ్యతిరేకంగా, పల్నాటి, కాటమరాజు కథల కర్తృత్వం శ్రీనాధుడికి ఆపాదించినప్పటికీ ఆ కథల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ చోటు చేసుకోలేదు. సమాజంలో పైకి త్వరగానే ఎదిగినందువల్ల ఈ కథల గౌణేతిహాసాలలో చాలా కొద్ది మార్పులే జరిగాయి. ఈ రకమైన మార్పు కొంతలో కొంత కాటమరాజు కథలో కనిపించడానికి కారణం గొల్ల కులపెద్దల ప్రయత్నాల ద్వారా అర్థం చేసుకోవచ్చును. ఆ పెద్దల్లో ముఖ్యుడైన ఆరాధ్యుల పిచ్చయ్య, తన కులస్తులను వైదీక ఆచారాలను పాటించమని ఉద్బోధించేవాడు. కాటమరాజు కథకు పాఠాంతరాలు ప్రచురించడంలో ఎంతో ముఖ్యపాత్ర వహించాడు. ఆ ప్రచురణల ముందుమాటలో విద్యావిహీనులైన కొమ్ముల వాళ్ళు కథను భ్రష్టు పట్టించారని వాదించాడు. కాటమరాజు కథ పూర్వకవి విరచితమనీ అందువల్ల అందులో దోషాలు లేవనీ బలంగా అభిప్రాయపడ్డాడు.

బొబ్బిలి కథకు దొరుకుతున్న రెండు ప్రచురణలలో, ఒకటి రెండవదానికంటే సంగ్రహమైనది. మొదటి ప్రతి మల్లంపల్లి సోమశేఖర శర్మ 1956లో పరిష్కరించి ప్రచురించడంతో వెలుగు లోకి వచ్చింది. రెండవది జాతరలలో, దారి పక్క అంగళ్ళలో పెద్ద బొబ్బిలిరాజు కథ అన్న పేరుతో అమ్మే చిత్తు ప్రతి. ఇందులో బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య కోడిపందెం జరిగినట్టు ఒక కథ వుంది. పల్నాటి కథ నుంచి ప్రభావితమైనట్లు స్పష్టంగానే తెలుస్తుంది. ఇది సమీప ప్రాంతాలలో ఉండే జానపద ఇతిహాసాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయన్న వాదనకు బలాన్నిస్తుంది. అయినప్పటికీ ఈ రెండు ప్రచురణలకీ, మౌఖిక పాఠాంతరానికి పెద్దగా తేడా కనిపించదు.

బొబ్బిలి సంస్థానపు పెద్దలు మౌఖికమైన వీరగాథకు గానీ, లిఖిత ఇతిహాసానికి కానీ అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. బ్రిటీషువారి ప్రాబల్యంలో వారు క్షత్రియుల హోదాను, పాశ్చాత్య జీవన విధానాన్ని కోరుకుని ఆచరించారు. వారి ప్రోత్సాహంతో ప్రచురణకు నోచుకున్న పాఠాంతరాలలో ముఖ్యమైనది దిట్టకవి నారాయణ కవి 18వ శతాబ్దంలో వ్రాసిన రంగరాయ చరితము. జానపద వీరగాథలు ఇప్పటికీ ప్రదర్శిస్తున్నా, వెలమ కులస్తులు ఈ కవి విరచిత గౌణసాహిత్యాన్ని ఎక్కువగా ఆదరిస్తారు. సన్యాసమ్మ, కామమ్మ కథలతో మమేకమైన కులాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడంతో తమ కథల్లో వారు ఆదర్శంగా పెట్టుకున్న స్తోమత వారికి అందుబాటులోకి రాలేదు. ఈ కథలకు లిఖిత ప్రతులు లేకపోవడం వీరి ఆర్థిక, సామాజిక బలహీనత వల్లనే అనిపిస్తుంది. బొబ్బిలి, సన్యాసమ్మ, కామమ్మ కథలు 18వ శతాబ్దానికి చెందినవి కాగా పల్నాడు, కాటమరాజు, కన్యక కథలు ఎంతో పురాతన కాలం నుంచీ వున్నవి. ఒక వీరగాథ ఇతిహాసంగా మారడానికి ఎంతో కాలం పడుతుంది.

ముగింపు

ఈ వ్యాసంలో ఉదహరించిన ఆరు వీరగాథలలోనూ కథలో ప్రధాన పాత్ర మరణానికి భయపడదు. అయితే ఆ పాత్రలు మరణాన్ని ఎలా అహ్వానించాయి అన్న అంశం ఆధారంగా ఈ కథలను వీరచరితలు, త్యాగచరితలుగా వేరు చేయగలం. ఒక్కొక్క చరితకు ప్రత్యేకమైన పాఠకులు, పాత్రధారులు ఉండటం వల్ల ఈ చరితలను ఆ ప్రత్యేక కులం లేదా వర్గపు జీవన విధానానికి అనుసరణగా గమనించాలి. కాలక్రమేణా ఒక కులపు ఆదర్శాలలో వచ్చిన మార్పులను ఆ కులాలు ఆచరితల్లో ప్రతిఫలించుకున్నాయి. ఈ కథలు ఇతిహాసాలుగా పేర్కొనడానికి కారణం, కథ నిడివి, ప్రదర్శనా పద్ధతి, వంటి కావ్య లక్షణాల వల్ల కాదు. సమాజంలో ఒక వర్గపు ఆదర్శాలు, ఆకాంక్షలలో చారిత్రకంగా వచ్చిన మార్పులకు నిలువుటద్దంలా నిలవడం వల్ల ఈ వీరగాథలు ఇతిహాసాలుగా గౌరవించబడుతున్నాయి. ఈ ఇతిహాసాలను తమవిగా భావించే ఆ కులాలవారికి ఇవి నిజంగా జరిగిన సంఘటనలు. ఇవి వారికి కథలు కావు. ఒక కథకు నిజత్వం రావడానికి ఆ కథను తమదిగా చేసుకున్న కులం తమ ఆదర్శాలను అందులో వ్యక్తం చేసుకోవడం ద్వారా ఈ విధంగా తోడ్పడుతుంది.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి:

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 ...