ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు

స్త్రీ పురుష పాత్రల పరావర్తం

తమ ఆదర్శాలకు ఊనికగా వ్యవసాయ కులాలు, వ్యాపార కులాలు ఏర్పరుచుకున్న ప్రతీకలు వేరు వేరని మీరు గమనించే వుంటారు. భూస్వామ్య కులాలలో వీరోచితులైన మగవారు, వారి రక్షణలో ఇంటిదాపులో ఒదిగివుండే ఆడవారు ఆదర్శానికి, ఔచిత్యానికి నమూనాలు. వ్యాపార కులాలలో స్త్రీలు త్యాగశీలతకు, ఆత్మస్థైర్యానికి ప్రతీకలు, మగవారి ప్రవర్తన కేవలం సాధారణం. ఈ వ్యత్యాసమే ఈ జానపద ఇతిహాసాలలో కూడా మనకు కనిపిస్తుంది.

పల్నాటి కథలో వెలమ దొర బ్రహ్మనాయుడు ఒక గొప్ప వీరుడు, పుణ్య స్వభావి. కానీ, అందరూ ప్రముఖంగా మెచ్చుకొనేది, అతని కొడుకు బాలచంద్రుడిని. వయసులో చిన్నవాడైనా తన పరాక్రమం నిరూపించుకోవటం కోసం తండ్రినే ఎదురించి యుద్ధానికి వెళ్ళిన వీరుడు. ఈ వీరస్వభావమే, రాజసేవకులుగా మసలిన తక్కువ కులాల మగవారికి కూడా ఆదర్శమైంది. పల్నాటి కథలో మాల కుల యోధుడు కన్నమదాసు, కాటమరాజు కథలో బ్రాహ్మణుడైన తిక్కన పాత్రలు ఇందుకు ఉదాహరణ. ఈ వీరోచిత స్వభావం వారినుంచి సమాజం ఆశించలేదు కానీ, ఇది మినహా వారికి వీరులుగా నిరూపించుకోవడానికి వేరే మార్గం లేదు.

వీరుడిని ఎంత గౌరవిస్తారో ఈ ఇతిహాసాలలో, భీరువుని, స్త్రీకి లొంగిపోయిన మగవాడిని అంతే అవమానంగా చూస్తారు. పల్నాటి కథలో నలగామరాజు ఇలాంటివాడు. తన రాజ్యపాలన పుర్తిగా నాయకురాలు నాగమ్మ చెప్పుచేతల్లో చేసినవాడు. కాటమరాజు కథలో బ్రాహ్మణ సైనికుడు తిక్కన ఇంకో ఆసక్తి కలిగించే ఉదాహరణ. తిక్కన యుద్ధానికి వెళతాడు కానీ శత్రు సైన్యాన్ని చూడగానే ధైర్యాన్ని కోల్పోతాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి వచ్చిన అతన్ని అందరూ ఎగతాళి చేస్తారు. ఇంటికి రాగానే భార్య అతనికి ఆడవారికి లాగా సపర్యలు చేస్తుంది. అతని స్నానానికి అడ్డుగా చీర కడుతుంది. ఒంటికి పులుముకునేందుకు పసుపు ముద్ద పెడుతుంది. తిక్కన తల్లి కూడా కొడుక్కి అన్నంలోకి విరిగిపోయిన పాలు పోస్తుంది. యుద్ధభయంతో వెన్ను విరిగిన తిక్కనను చూసి అతనిలాగే భయపడిన ఆవులు కాటు పోయిన పాలనిచ్చాయని చెబుతుంది. ఈ అవమానాలు తట్టుకోలేని తిక్కన తిరిగి యుద్ధభూమికి వెళ్ళి వీరోచితంగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని చితిలో అతని భార్య ఆనందంగా దూకుతుంది.

భర్తలు, కొడుకులకు వెన్నుదన్నుగా ఉండి, అతని వీరత్వాన్ని ప్రోత్సహించడం, చనిపోయిన తరవాత వారితో చితిలోకి దూకడం ఈ జానపద ఇతిహాసాలలో స్త్రీలకు అమితాదర్శమైన ప్రవర్తన. మగవారిలా ప్రవర్తించే స్త్రీ అమితంగా ద్వేషించబడుతుంది. బ్రహ్మనాయుడి ప్రత్యర్థి నాయకురాలు నాగమ్మ అలాంటి స్త్రీ. ఆమె విధవ, గొడ్రాలు కూడా కావడం ఆమె వైపరీత్య ప్రవర్తనకి సూచికలు. ఆమె కుట్ర కుతంత్రాల వల్ల చివరికి రాజ్య నాశం, కుటుంబ నాశం రెండూ జరుగుతాయి.

ఈ కథలకి పూర్తి వ్యతిరేకం త్యాగప్రధానమైన ఇతిహాసాల లోని పాత్రలు. సన్యాసమ్మ కథలో మగ పాత్రలు ఆమె తండ్రి దాల్నాయుడు, అన్న రామినాయుడు, మొగుడు చెంచన్న, మరిది అప్పన్న. వీరిలో దాల్నాయుడు పల్లెత్తు మాట అనడు. తన కూతురు కష్టపడుతున్నా కూడా ఏమీ అనడు. చెంచన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయినవాడు, ఏడేళ్ళ తరవాత తిరిగివస్తాడు కానీ ఆత్మహత్య చేసుకున్నవాడు. భూస్వామ్య ఇతిహాసాలలో ఆత్మహత్య పిరికిపందల లక్షణం. అన్న రామినాయుడు కూడా తల్లిలా సన్యాసమ్మని సాకినవాడనే ఇతిహాసం మనకు చెబుతుంది కానీ వేరేరకంగా చూపదు. ఆమెకు జడలు వేయడం, బొట్టూ కాటుకతో సింగారించడం కూడా రామినాయుడే చేస్తాడు కానీ అతని భార్య పాపమ్మ చేయదు. చివరికి సన్యాసమ్మ వెళ్ళిపోతున్నప్పుడు రామినాయుడు ఆడదానిలా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. రామినాయుడు ఇలా స్త్రీ సహజమైన ప్రవర్తన చూపిస్తే, అతని భార్య పాపమ్మ పురుషబద్ధమైన లక్షణాలు చూపిస్తుంది. పిల్లను చూసుకోమని చెప్పినప్పుడు, ఇంటి ఆజమాయిషీలో తనకు కుదరదని ఆమె అంటుంది. ఇలా స్త్రీ పురుష పాత్రలు వాటి స్వభావాలకి విరుద్ధంగా ప్రవర్తించడం, ఈ జానపద వీరగాథలు పాడేవారు ప్రత్యేకంగా ఎత్తి చూపరు. ఈ వైరుధ్యాన్ని చాలా సామాన్యమైన విషయంగానే వివరిస్తారు.

ఈ సన్యాసమ్మ కథలో అప్పన్నది మరింత విచిత్రమైన పాత్ర. సన్యాసమ్మ ఏమీ తినలేదని తెలిసి అతను ఆమెకు పాలు తీసుకొని ఆమెకు ఇస్తాడు. ఆమె సగం తాగి అతనికిస్తుంది. అప్పన్న ఆ ఎంగిలి పాలు తాగుతాడు. కేవలం భర్త ఎంగిలి భార్య మాత్రమే తింటుంది. అది భర్త ఆధిపత్యానికి నిదర్శనం. ఈ సాంప్రదాయం అగ్రవర్ణాల వివాహాలలో కనిపిస్తుంది. దేవుడికి పెట్టిన ప్రసాదం దేవుడి ఎంగిలి. కానీ అది అందరికీ పూజనీయం. అప్పన్న సన్యాసమ్మ ఎంగిలి పాలు తాగడం ఆ మగ పాత్రకు ఇతిహాసం ఆపాదించిన స్త్రీత్వం. సన్యాసమ్మ ఆత్మత్యాగం చేసేముందు అప్పన్నకి పసుపు, కుంకుమ బహుమతిగా ఇస్తుంది. ఇవి స్త్రీత్వానికి చిహ్నాలు. పురుషులు ఎవరూ స్వీకరించరు. వీరచరితల్లో ఇవి ఇవ్వబోవడం, లేదా తీసుకోవడం మొగవారికి తీవ్రమైన అవమానం. కానీ త్యాగచరితల్లో వీటికి ఏ విశిష్టత ఇవ్వబడలేదు.

గౌణేతిహాసాలు

కట్టుదిట్టంగా మార్పుకు వీలులేని సమాజంలా పైకి కనిపించినప్పటికీ, భారతీయ సమాజం లోలోపల నిరంతరంగా మార్పు చెందుతూనే వున్నదని పరిశీలకులు ముందునుంచీ గమనించినదే. ఇలా, ఒక ప్రాంతపు ప్రధానమైన కులం లేదా వర్గంలో చేజేసుకున్న మార్పులని సంస్కృతీకరణ (Sanskritization), పాశ్చాత్యీకరణ (Westernization) వంటి సిద్ధాంతాలకు అన్వయించి, వివరించడానికి సాహితీవేత్తలు ప్రయత్నిస్తారు. ఈ వ్యాసంలో ఇప్పటిదాకా నేను ఉదహరిస్తున్న కులాలన్నీ కూడా సమాజంలో మార్పులను తెచ్చుకున్నవి. ఇందుకు మొదటి దాఖలా ఇప్పటిదాకా మౌఖికంగానే ప్రచారంలో ఉన్న ఈ వీరగాథలు లిఖిత సాహిత్యంగా రూపాంతరం చెందడంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా కులాలతోనే ఇప్పటికీ అవినాభావంగా ఉండి, ఈ రూపాంతరాలు వారిలో వచ్చిన సామాజిక మార్పులను ప్రతిఫలిస్తుంటాయి. ఇలా మౌఖికేతిహాసాల రూపాంతర సాహిత్యాన్ని గౌణేతిహాసాలు (Secondary epic) అని పిలుస్తూ, వాటి లక్షణాలని నేను ఇక్కడ వివరిస్తాను.

గౌణేతిహాసాల లక్షణాలు ప్రధానంగా నాలుగు: 1. జానపదేతిహాసపు కృతికర్తగా ఒక రచయిత పేరును తథ్యం చేయడం, 2. వాటికి సంస్కృత పద్ధతిలో నామకరణం చేయడం, 3. జాతరలు, పండగలలో జానపదులను కాకుండా ఈ గాథల ప్రదర్శనకు చదువుకున్న వారిని అధికారికంగా ప్రదర్శించే హక్కు ఉన్న కళాకారులుగా ప్రోత్సహించడం, 4. ఈ ఇతిహాసాల స్త్రీ పాత్రలలో మార్పులు చేయడం.

నేను పైన పేర్కొన్న ఆరు వీరగాథలు ప్రధానంగా మౌఖిక ఇతిహాసాలు అయినప్పటికీ వాటన్నిటికీ లిఖిత రూపాంతరాలు వున్నాయి. వీటిలో కొన్నిటికి జతచేసి రచయిత పేరు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కేవలం గౌణేతిహాసంగా మాత్రమే మనకు లభ్యమవుతున్న కన్యక కథ మినహా ఇతర వీరగాథలు మౌఖిక సారస్వతంగా ఇప్పటికీ నిలిచే వున్నాయి.

అక్కిరాజు ఉమాకాంతం తాళపత్రాల ఆధారంగా పల్నాటి కథలో ఒక భాగాన్ని పరిష్కరించి, కర్తృత్వం శ్రీనాథుడికి ఆపాదించడంతో సాహితీవేత్తలకు ఈ విషయంలో ఆసక్తి మెండయింది. తాళపత్ర ప్రతులు, ప్రచురిత పాఠాలను పరిశీలించి జానపద కళాకారులు, కాటమరాజు కథ ప్రదర్శనలో శ్రీనాథుడిని మూల రచయితగా పేర్కొనడాన్ని ప్రస్తావించిన తంగిరాల వెంకట సుబ్బారావు పరిశోధన వల్ల ఇలా కర్తృత్వాన్ని ఆపాదించడం ముందునుంచీ ఉన్నదనీ, వాటిని ప్రదర్శించే జానపద కళాకారులకు కూడా తెలుసనీ తెలుస్తుంది. బొబ్బిలి కథ రెండు రకాల ప్రచురణలలో మనకు దొరుకుతుంది. ఒక ప్రతిపై రచయితగా పెద్దాడ మల్లేశం పేరు కనిపిస్తుంది; రెండవ ప్రతి రచయిత పేరు లేనిది.

కన్యక కథ పరిస్థితి వేరు. ఈ కథకు ఎన్నో ప్రతులున్నాయి. ఈ కథ స్కందపురాణంలో భాగంగా రెండు సంస్కృత ప్రతులు, భాస్కరాచార్యుడు వ్రాసినట్టుగా చెప్పబడే తెలుగు గ్రాంథికభాషలో వ్రాసిన ఇంకో ప్రతి వున్నాయి. సంస్కృత ప్రతి 1950లో పెనుగొండలో, శ్రీవాసవకన్యకాపురాణము అన్న పేరుతో ప్రచురించబడింది. భాస్కరాచార్యుడి తెలుగు ప్రతి పేరు వైశ్యపురాణము, ప్రస్తుతం అలభ్యం. ఆ పైన 20వ శతాబ్దికి చెందిన ఎందరో కవుల రూపాంతరాలు కూడా వున్నాయి. ముఖ్యంగా 1956లో సత్యనారాయణ గుప్తా, 1968లో వెంకటస్వామి గుప్తా, వ్రాసిన వాటిలో ఇతిహాస కథకు ముందు వెనుక విపులంగా ఉపోద్ఘాతం, పీఠికలు ఇవ్వబడ్డాయి. కోమటి వారు, ప్రత్యేకించి విద్యాధికులు, ఈ లిఖిత రూపాంతరాలనే ప్రామాణికంగా భావిస్తారు. వైశ్య సాహిత్యవేత్తల తెలుగు రూపాంతరాలకు మూలం ఈ సంస్కృత ప్రతులే కావడం ఇందుకు నిదర్శనం. అప్పట్లో వీరికి పూజారులుగా, ఈ కథను ప్రదర్శించిన మైలారు కులస్థుల ద్వారా ఈ కథకు ఒక మౌఖిక రూపాంతరం ఇంకా ఉన్నదని తెలుస్తుంది. (ఈ విషయాన్ని సత్యనారాయణ గుప్తా తన ప్రతిలో నిర్ధారించడమే కాకుండా అందులోంచి ఎన్నో వాక్యాలు ఉదహరిస్తాడు కూడా.) మైలారపు వారిని తమ ఆచారవ్యవహారాలలో వినియోగించుకోవడం కోమటి వారు మానిన తర్వాత, ఈ రూపాంతరం మరుగున పడిపోయింది. ఇప్పటికీ ఈ కథను ప్రదర్శించే మైలారు గాయకులు లిఖిత రూపాంతరాన్ని దాని స్థానంలోకి తెచ్చుకున్నారు.

సరైన ఆధారాలు లేని కారణంగా మౌఖిక జనపదాలు లిఖిత సారస్వతంగా ఏ పరిస్థితుల్లో మార్పు చెందాయో కేవలం ఊహించగలం. శ్రీనాథుడో, ఇంకొక మహా కవో ముందుగా వ్రాసిన కథ ఆ తరువాత జానపదంగా రూపాంతరం చెంది ఉండవచ్చనే వాదనను పక్కకు పెడదాం. అప్పటికీ పల్నాటి కథను, కాటమరాజు కథను మహాకవులకు ఆపాదించడానికి, కన్యక కథ విషయంలో జరిగినట్టు జానపద సాహిత్యాన్ని సమూలంగా తుడిచేస్తూ సంస్కృత ప్రతులు ప్రాచుర్యంలోకి రావడం వెనుక కారణాలను విశ్లేషించడం ఆసక్తికరంగానే వుంటుంది. ఎందుకు బొబ్బిలి కథకు అజ్ఞాత కవి వ్రాసిన తాళపత్ర ప్రతి ఉన్నది? ఎందుకు సన్యాసమ్మ, కామమ్మ కథలకు తాళపత్ర ప్రతులు లేవు? అవి ఇప్పటికీ కేవలం జాతరలలో, దారిపక్క అమ్మే చవుకబారు ప్రచురణలలోనే, ఏ రచయిత పేరూ లేకుండా మాత్రమే ఇవి దొరుకుతాయి?

నాకు ప్రత్యేకించి ఆసక్తి కలిగించినది ఇది: ఈ వీరగాథలు లిఖిత సాహిత్యంగా మార్పు చెందటం, వాటికి కృతికర్తలని ఆపాదించటం వెనుక ఏ రకమైన ఆదర్శాల వ్యాప్తి కారణమయింది? ఈ విషయం గురించి తెలుసుకోవడానికి నేను చాలామంది జానపద కళాకారులతో ముచ్చటించాను. పల్నాటి కథ, కాటమరాజు కథ ప్రదర్శించే వారు చదువుకున్నవారు. వీరి దగ్గర ఈ కథల తాళపత్ర ప్రతులు వున్నాయని ఆరాధ్యుల పిచ్చయ్య, సుబ్బారావు తమ పరిశోధనకు సేకరించిన వివరాల ద్వారా తెలుస్తుంది. కానీ బొబ్బిలి కథ పాడే ఒక పాటగాడు చదువుకున్నవాడే అయినా అతని దగ్గర లిఖిత ప్రతి ఏదీ నాకు దొరకలేదు. సన్యాసమ్మ కథ, కామమ్మ కథ నాకోసంగా పాడిన కళాకారుడు చదువు రాని వాడు కావడంతో ఈ కథలు ప్రచురణలో ఉన్నాయని కూడా అతనికి తెలియదు.

పల్నాటి కథను ప్రస్తావిస్తూ రోగెయ్‌ర్ లిఖిత ప్రతికి, అది ప్రదర్శించే పద్ధతికి మధ్య ఎంతో వ్యత్యాసం వుందని పేర్కొన్నాడు. నేను రికార్డు చేసుకున్న కాటమరాజు కథ, బొబ్బిలి కథ కూడా పుస్తకాల పాఠానికంటే ఎంతో తేడాగా వున్నాయి. కన్యక కథ ఒక్కటే దీనికి మినహాయింపు. పోతే, దారిపక్క అంగళ్ళలో దొరికే పుస్తకాలైన సన్యాసమ్మ, కామమ్మ కథలు మౌఖిక సాహిత్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి.