ఈ వీరగాథల అంతఃసూత్రాలకి, వాటిని ఆచరించుకునే సామాజిక వర్గాలకూ మధ్య ఏదైనా సంబంధం ఉందా అని పరిశీలించడం ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ కులాలు, వర్గాల గురించిన శాస్త్రీయ అధ్యయనం ఇప్పటికి మనకు లేదు. ఈ విషయంలో ఎడ్గర్ థర్స్‌టన్ (Edgar Thurston) వ్రాసిన ‘దక్షిణ భారతదేశపు కులాలు, తెగలు’ అన్న పుస్తకమే మనకు మూలాధారం. ఈ పుస్తకంలోని వివరాలు, క్షేత్రీయంగా నేను సేకరించిన వివరాల ఆధారంగా ఈ వీరగాథలకు చెందిన కులాల గురించి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ కులాలను ప్రధానంగా భూస్వాములు, వ్యాపారులు అన్న రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఈ విభజన బెక్ 1972లో ప్రతిపాదించిన ‘ఎడమచేతి / కుడిచేతి’ కులాలకు సమీపంగా ఉన్నది. తమిళులలో ఉన్నంత స్పష్టంగా మనకు తెలుగులో ఈ వర్గీకరణ లేకపోయినా, ఆచార వ్యవహారాలు, ఆదర్శాలు, కుల ప్రవర్తన ఆధారంగా తెలుగునాట కూడా నిమ్నకులాలు ఇలానే విడిపోయి ఉండేవని తెలుస్తుంది. భూమిని ఆస్తిగా కలిగివున్న వారు కుడిచేతి కులాలవారు; వర్తక వ్యాపారాలు చేసేవారు ఎడమచేతి కులాలవారు.
ఒకనాటి ఆంధ్రదేశంలో భూస్వాములు రాజకీయబలం వున్నవారు. ధాన్యం పండించేవారిగా వీరికి సమాజంలో చాలా ప్రాధాన్యత ఉండేది. క్షత్రియ రాజుల హోదాతో సమానమైన యాజమాన్య హోదా వీరికుండేది. వీరి పెద్దరికాన్ని వీరి పొలాలలో పనిచేసే నిమ్నకులాలవారందరూ గుర్తించేవారు, వారి అధికారాన్ని ఒప్పుకునేవారు. వీరు, బ్రాహ్మణులు ఈ యజమానుల సేవలో వుండేవారు. బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు, పౌరోహిత్యం తదితర దైవకార్యాలు చేసేవారు. కేవలం పూజాపునస్కారాలే కాకుండా వార్తాహరులుగానూ, లేఖకులుగానూ, సలహాదారులుగానూ కూడా బ్రాహ్మణులు పనిచేసేవారు. ఐతే, పౌరోహిత్యం కేవలం బ్రాహ్మణులకే ప్రత్యేకమైన విధి కాదు. జాతరలలో వీరగాథల నిర్వహణ మాలలు చేసేవారు. అంకాళమ్మవారిని కొలవడం గొల్లల పనిగా ఉండేది. అంటే, జంతుబలి ఆచారంగా ఉన్న జాతరలు, గ్రామదేవతల పూజల ఆచరణ నిమ్నకులాల కర్తవ్యంగాను, సంస్కృత దేవతల పూజలు బ్రాహ్మణుల ఆధ్వర్యంలోను, వుండేవి.
ఈ విధంగా, సమాజంలోని అధికారక్రమంలో భూస్వామి అయిన యజమాని – బ్రాహ్మణులతో సహా ఇతర కులాలన్నిటికన్నా – పైమెట్టులో ఉండేవాడు. వీరులైన రాజులు తమ రాజ్యాలను కాపాడుకొన్నట్టుగా, తమ భూమిని కాపాడుకోడం తమ ధర్మంగా భావించడం వల్ల తమ నాయకత్వాన్ని ప్రతిబింబించే నాయుడు (నాయకుడు), రాజు (రాజ) వంటి బిరుదులు ఈ యజమానులు పెట్టుకున్నారు. శత్రువుకి తలదించడం కన్నా యుద్ధభూమిలో మరణించడాన్ని ఆశించడం, ధైర్యసాహసాలతో పరాక్రమవంతులై వుండి, వంశగౌరవాన్ని కాపాడుకోవడం – ఇలాంటి క్షత్రియ ఆదర్శాలనే వీరు కూడా గౌరవించి ఆచరించేవారు. ఆ ఆదర్శాలే మగవారికి ఉండవలసిన విలువలు. తమ కుటుంబాలలోని స్త్రీలు, తమ భూమి, గౌరవాల లాగానే కాపాడుకోవలసిన వస్తువులు.
కేవలం భూస్వాములే కాకుండా సమాజంలో ఇంచుమించు అందరూ ఈ భావాలను ఆదర్శ ప్రవర్తనకు చిహ్నాలుగా అంగీకరించారు. యజమానికి పనిచేసే నిమ్నకులాల పురుషులు వీరత్వాన్ని, వారి స్త్రీలు పాతివ్రత్యాన్ని అలవర్చుకున్నారు. పిరికివాడైన పురుషుడిని, అధిపత్యం చెలాయించే స్త్రీని, సమాజంలో అందరూ అసహ్యించుకునేవారు. అయితే కొన్ని మినహాయింపులు లేకపోలేదు. ఉదాహరణకు, పండితులైన బ్రాహ్మణులకు వీరత్వం ఆదర్శం కాదు. అలాగే వేశ్యాకులాలకు చెందిన ఆడవారికి పాతివ్రత్యం ఆదర్శనీయం కాగల వీలు లేదు. అయితే ఈ మినహాయింపులు సంఘంలో వారి వారి విలువని తక్కువ చేశాయి. భూస్వామ్యం కోసం పోటీ పడని కారణంగా సమాజం అంగీకరించిన ఈ ఆదర్శాలకు విడిగా వాణిజ్యకులాలవారు నిలబడి, స్వతంత్ర భావాలను వారికి ఆదర్శాలుగా మలచుకోగలిగారు.
ఈ నేపథ్యంతో, వీరగాథలనీ, వాటికి అనుబంధంగా వున్న కులాలనీ మనం పరిశీలించవచ్చును. పల్నాటి కథను తమ ఆదర్శాలకు ప్రతీకగా తీసుకున్నది తెలగ, వెలమ, కమ్మ కులాలవారు. వీరందరూ పారంపర్యంగా భూస్వాములు. భూమితో ఉన్న బలమైన అనుబంధం ఈ కులాల కట్టుబాట్లలో, నమ్మకాలలో, కనిపిస్తుంది. వారు వాడే సామెతలు, చెప్పే సూక్తుల ద్వారా వారి భాషలో తెలుస్తుంది. స్త్రీలకు భిన్నంగా కనపడాలనే తాపత్రయం వారి ఆహార్యం ద్వారా అర్థం అవుతుంది. మీసం పెంచడం పౌరుషానికి ప్రతీక. గంభీరమైన ఆంగికవాచికాలను అలవర్చుకోవడం, తమ ఇండ్లలో ముందు వైపు గదులు, లోగిలి మగవారి వ్యవహారాలకు ప్రత్యేకంగా అమర్చుకోవడం ఈ పురుషాదర్శాల వల్లనే. ఆడంగి అనడంకన్నా హీనమైన నింద లేదు. మీసంలేని మగవాడు, గాజులు తొడుక్కున్నాడు, పెళ్ళాం మాట వినేవాడు – ఇలాంటి హేళన వెంటనే దాడికి రెచ్చగొట్టేది.
ఈ కులాల స్త్రీలు భూమితో సమానంగా భావించబడినవారు. వాళ్ళ సంరక్షణ ద్వారా కులగౌరవాన్ని, మర్యాదను కాపాడుకొనే బాధ్యత మగవారిది. పునర్వివాహాలకు ఆ సమాజంలో చోటు లేదు. కన్య కాకముందే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరిగేవి. ఆడవారి శీలత, భూమి సారవత్వానికి సాటిగా భావించేవారు. కులస్త్రీల గౌరవం ఇంటి నాలుగు గోడల మధ్యనే కానీ బాహ్యప్రపంచంలో కాదు. పెళ్ళికాని ఆడవారు, విధవలు పదిమందిలో కనిపించడం అమర్యాద. విధవలని వెలయాలితో సమానంగా పరిగణించేవారు. ముండ అన్న నిందావాచకం ఇద్దరినీ సూచిస్తుంది.
కాటమరాజు కథని తమదిగా భావించే గొల్లలు పశువుల కాపరులు. క్షత్రియులతో సమానంగా చూపుకోవలసినప్పుడు యాదవులుగా తమని చెప్పుకుంటారు. పశుసంవర్ధన వీరి ప్రధాన వ్యాపకం కావడంతో వీరికి భూమితోటి అనుబంధం తక్కువ. భూస్వామ్య కులాలకన్నా సులభంగా వలస పోగల వీరు భూమిని పశుగ్రాసానికి అవసరమైనదిగానే తప్ప వేరే అనుబంధంతో చూడరు. వీరికి నీటితోటి అనుబంధం ఎక్కువ. నిజానికి వీరి కులదేవత గంగానది, గంగమ్మతల్లిగా కొలవబడుతుంది. కాటమరాజు కథలో కరువుతో నీటి కొరత ఏర్పడడం, తద్వారా యుద్ధం జరగడం, వారు నీటికిచ్చే విలువను సూచిస్తుంది. ప్రధానంగా పశుపోషకులైనప్పటికీ యాదవులు వీరత్వాన్ని కూడా ఆదర్శంగా కొలిచేవారు. గొల్ల స్త్రీలకు పునర్వివాహం చేసుకునే అనుమతి లేదు. కానీ, అవివాహిత యువతులు, విధవలు, అమర్యాదతో చూడబడలేదని దొరికిన ఆధారాల వల్ల తెలుస్తుంది. మిగతా కులాలలోలా కాకుండా, భర్త చనిపోయినప్పుడు గాజులు తీసివేసే ఆచారం గొల్లస్త్రీలలో లేదని థర్స్‌టన్ పేర్కొన్నాడు.
గాజులకాపుల కులంతో కూడుకొన్నది సన్యాసమ్మ కథ. కాపులు అన్న పేరు జనసామాన్యం కొరకు వాడుకున్నా, వారిలో వారు సంబంధాలు కలుపుకోడానికి వారి అసలు కులాన్ని గుర్తించుకుంటారు. గాజుల అమ్మకం ఈ కులపు మగవారి వృత్తి. సాంప్రదాయకంగా స్త్రీలకు పరిమితమైన ఇంటి వెనక గుమ్మం దగ్గరికి వచ్చి గాజులు అమ్ముతారు. వీరే కాకుండా, కాపులు అన్న కులంలో మగవారు, మగపని ఆడపని అన్న తేడాను అంతగా గమనించరు. ఈ కులాలలోని మగవాళ్ళు వంట చేయడం, ఇళ్ళు శుభ్రం చేయడం, పిల్లలని ఆడించడం లాంటి పనుల్లో పాలు పంచుకుంటారు. కొందరు కాపు కులస్థులని పరిశీలించి థర్స్‌టన్ ఇలా అంటాడు:
“వ్యవసాయం మినహా మిగతా విషయాలలో ఆడవారు ప్రముఖమైన పాత్ర వహిస్తారు. ఇందుకు కారణంగా ఒక కథ చెప్పుకుంటారు. కాపులు అయోధ్య నుండి వలస వచ్చినప్పుడు వారి వెంట ఆడవారు ఎవరూ లేరు. వాళ్ళకి భార్యలనిమ్మని దేవుళ్ళని వారు వేడుకున్నారు. పాండవులకు అక్రమసంతానంగా పుట్టిన ఆడవాళ్ళని పెళ్ళి చేసుకోమని వారికి దేవుళ్ళు చెప్పారు. వడ్లు దంచడం, అంట్లు తోమడం, నీళ్ళు తేవడం లాంటి ఇంటిపనులు వాళ్ళకోసం చేసి పెట్టేటట్టూ, వాళ్ళదే పైచేయిగా ఉండేటట్టు కాపులు ఒప్పుకున్న తరవాతనే ఆ ఆడవాళ్ళు పెళ్ళికి ఒప్పుకొన్నారు.”
కామమ్మ కథ బెస్త కులస్తుల కథ. ప్రధానంగా జాలరులైన వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో పల్లకీ మోసేవారి గానూ, కిరాయి సైనికులు గానూ పని చేశారు. వీళ్ళల్లో ఆస్తిపరులు వ్యవసాయం చేపట్టినప్పటికీ, రైతుకూలీగా ఎవరికీ పనిచేసేవారు కాదనీ థర్స్‌టన్ గమనిస్తాడు. వాళ్ళ ఇళ్ళల్లో పూజా పునస్కారాలకి బ్రాహ్మణులని, సాతానీలని (అబ్రాహ్మణ వైష్ణవ పూజారులు) వినియోగించుకునే వారని, బ్రాహ్మణ సాంప్రదాయాలని అనుకరించే వారని థర్స్‌టన్ రాశాడు. ఈ బ్రాహ్మణ ఆచారాలు అనుసరించడానికి పూర్వం ఈ కులంలో వితంతు పునర్వివాహం ఉండేదనీ, ఇప్పుడు లేకపోవడానికి కారణం ఈ మార్పే కారణమని మనకు తెలుస్తుంది.
వ్యాపారస్తుల కులంతో ముడి పడిన త్యాగ చరిత్రకు చక్కటి ఉదాహరణ చెందిన కన్యకా పరమేశ్వరి కథ. కోమటి వారు భయస్తులనీ, పిసినారి వారనీ, గానూ, గోప్యంగా ఉంటారనీ, నమ్మదగిన వాళ్ళు కారనీ, అందవిహీనులనీ, గౌరవ మర్యాదలకన్నా వారికి లాభం మీదే దృష్టి అనీ, సమాజంలో వారి మీద హేళనతో కూడిన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రాచుర్యంలొ ఉన్న ఎన్నో సామెతలు, పిట్టకథల వల్ల ఈ విషయం రూఢి అవుతుంది. ఒక కోమటోణ్ణి కొడితే, నీకు దమ్ముంటే నా పక్కింటోణ్ణి కొట్టు, అప్పుడు చెప్తా అంటాడని ఒక సామెత. తనంతగా తాను ఎదురు తిరగలేక పక్కింటివాడి మీదకు ఉసి గొల్పుతాడని అర్థం. కోమటి సాక్ష్యం అంటే గోడమీది పిల్లి వాటంగా ఎటూ తేల్చకుండా చెప్పేది, ఎటన్నా తేలిస్తే రెండోవైపు వారేం చేస్తారో అన్న భయంతో. రెండు వర్గాల వారికి అనువుగా కోమటి తెలివిగా సాక్ష్యం చెప్తాడనీ, ఆ రకంగా తన లాభం ఏ ఒక్క వర్గం వల్లా తగ్గకుండా చూసుకుంటాడనీ లోకోక్తులున్నాయి. కోమటి వారి గొంతు కర్కశంగా ఉంటుందని, నల్లగా, అసహ్యంగా ఉంటారనీ, చురుకుగా ఉండరనీ, బానపొట్ట ఉంటుందనీ, వీరు అవమానించబడతారు. కోమటి స్త్రీల గురించి ఇంచుమించు ఇంత అపహాస్యంగానే మాట్లాడుకుంటారు. గొల్ల కులస్తులలో లాగానే ఈ కులంలో కూడా పునర్వివాహానికి అనుమతి లేకపోయినా, కోమటి స్త్రీలు మిగతా వ్యవసాయిక కులాల స్త్రీల కన్నా, వారి కులంలో ఎక్కువగానే గౌరవించబడతారు.
సమాజంలో ఇలా చిన్నతనంతో చూడబడడంతో, కోమట్లు తమ బలహీనత కూడా ఒక బలంగా చూపించుకునే ప్రయత్నం చేసుకున్నారు.. భూస్వామ్య కులాలకి వీరత్వం ఎలా చిహ్నమయిందో, కోమటి వారు త్యాగాన్ని అలా తమ ఆదర్శ చిహ్నంగా చేసుకున్నారు. హిందూ సమాజంలో బలానికి రెండు ప్రతీకలు కనిపిస్తాయి. ఒకటి పరాక్రమంతో తోటివారిపై ఆధిపత్యం పొందడం; రెండు, ఆ పరాక్రమాన్ని తమ మీదనే చూపించుకొని ఆత్మ త్యాగం చేసుకోవడం, అందువల్ల వచ్చిన దివ్యత్వంతో ప్రపంచం మీద పట్టు సాధించడం. కోమటి వారంత స్వచ్ఛన్నంగా ఇతర కులాల వారి కథలు ఈ ప్రతీకను ప్రదర్శించక పోయినప్పటికీ, విపత్కర పరిస్థితుల్లో వారు ధైర్యం తెచ్చుకొనేది వారి స్త్రీల ఆత్మ త్యాగాల కథలు వారికిచ్చే మనోబలంతోనే.