భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం

మరొక్కసారి చెపుతున్నాం. ఒక రచన చరిత్ర కాదు అంటున్నది ఆ రచనలోని సమాచారాన్ని బట్టి కాదు. కాస్త గట్టిగా వెతికితే అక్కడక్కడ మధురావిజయంలో వాస్తవాల ముత్యాలు (కనీసం అలా అనిపించేవి) కొన్ని దొరక్కపోవు. కానీ యిక్కడ అసలు సంగతి అది కాదు. వాస్తవాలను పొదగడం అంత పెద్ద విషయం కాదు. పురాణాలలో ఉన్నాయవి. జానపదగాథలలోనూ ఉండవచ్చు. ఆఖరికి వార్తాపత్రికల్లో కూడా ఉంటూ ఉంటాయి, అప్పుడప్పుడు. ఆ వాస్తవాలను ఎలా వాడుకున్నారు, వాడుకోబోతున్నారు అన్నది ముఖ్యం. గొప్ప కవులు కూడా చరిత్ర రచించవచ్చు, అమీర్ ఖుస్రో విషయంలో యిది చూశాం. అలాటప్పుడు చరిత్ర వ్రాయాలనే ఉద్దేశం వాళ్ళకుండాలి. ఈ ఉద్దేశాన్ని ప్రతిఫలించడానికి ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ అవసరం లేదు. ఏ సాహిత్య ప్రక్రియ తీసుకున్నా, దానికి అంతర్గతంగా ఉండే సూచకాలకు ఆ రచన ఉద్దేశాన్ని వ్యక్తం చేసే సామర్థ్యం ఉంటుంది. వాటితో పాటు మేము పేర్కొన్న శైలీలక్షణపు ప్రమాణాలు కూడా తగిన పాత్ర పోషిస్తాయి. ‘చారిత్రక’ కావ్యాలు రచించిన చాలామంది ప్రాచీన కవులలో అలాంటి ఉద్దేశమేదీ మనకు కనిపించదు. సాధారణంగా, వారి ఆంతర్యం మనకి సులువుగానే అర్థమవుతుంది.

4. ప్రజల చరిత్ర – దూపాటి కైఫీయతు

ఆఖరుగా, మరొక్క విభిన్నమైన ఉదాహరణతో, చరిత్ర-మిథ్యాచరిత్రల మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాము. కేవలం కాలక్రమం పైన కాక కార్యకారణ సంబంధం పైనా, జరిగిన సంఘటనలను వట్టిగా నమోదు చేయడం కాక వాటిని అర్థం చేసుకోడం పైనా, శ్రద్ధాసక్తులు కనపరిచే రచనలను మేము పరిశీలించాము. గతకాలపు సంగతులను ఊరికే ఏకరువు పెట్టడానికీ, వాటి ద్వారా ఒక నూతనావిష్కరణ చెయ్యడానికీ మధ్యనున్న తేడా, ఆయా రచయితలకు, వాటిని చదివే పాఠకులకూ కూడా తెలిసిన విషయమే. పాశ్చాత్య పద్ధతిలో సాగే చరిత్ర రచనకొంత చప్పగా, నీరసంగా సాగడం మనకు అనుభవం లోనిదే. మేము పరిశీలించిన రచనలీ కోవకు చెందినవి కావు. అలంకారప్రయోగం, ఊహించని కథాక్రమం, కదిలేదీ కదిలించేదీ అయిన భాష, నర్మగర్భమైన వ్యంగ్యం, కొన్నిమార్లు ప్రశంస, కొన్నిమార్లు సున్నిత విమర్శ, ధ్వనించే రచయిత సొంతగొంతు – మధ్యయుగాలలో దక్షిణభారతదేశంలో వచ్చిన అత్యుత్తమ చారిత్రక రచనల శైలీలక్షణంలోని సూచకాలు. ఈ సర్వప్రయత్నంలోనూ వాస్తవికత అంతర్లీనంగా, చాలా సహజంగా ఒదిగిపోతుంది. రకరకాల రూపాలలో వ్యక్తమవుతుంది. వాస్తవ ఘటనల పరిధిలోనే, అవి సంఘటించే కాల క్రమంలోనూ, గమనవేగంలోనూ, నిర్మాణంలోనూ అనేక గతిభేదాలు చోటు చేసుకుంటాయి. మన జీవితంలో మాదిరిగానే రచనలోనూ, యీ రకరకాల కాలగతులు, ఒక్కుమ్మడిగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి అల్లుకొని ఉంటాయి. గతకాలపు సంఘటనలను తనదైన పద్ధతిలో ఎంచుకొని, వాటి తారతమ్యాలను విచారించి, వాటి మధ్యనున్న సంబంధాలను పరిశీలించి, ఒక క్రమాన్ని ఏర్పరచి తనదైన వ్యాఖ్యానాన్ని అందించానన్న స్పృహ చరిత్రకారునికి ఉంటుంది. దానికతడు బాధ్యత కూడా వహిస్తాడు. మరొక స్థాయిలో, యీ చారిత్రకస్పృహకు సంబంధించి తన సమాజం ఏర్పర్చుకున్న ఒక సమష్టి జ్ఞానవ్యవస్థను (epistemology) చరిత్రకారుడు గుర్తించగలుగుతాడు. ఆ వ్యవస్థ ద్వారా ఆ సమాజం, చరిత్రను ఏయే తీరులలో అర్థం చేసుకుంటుందో గ్రహిస్తాడు.

ఈ రచనా వైఖరులన్నిటినీ, బొబ్బిలి మొదలుకొని సెంజి, కంపిలి, హంపి, తంజావూరుల వరకూ గల వివిధ ప్రాంతాలకు సంబంధించిన రచనల ద్వారా మేమీ పుస్తకంలో విశదపరిచే ప్రయత్నం చేశాము. ఒక సామాజిక వాతావరణంలో విస్తరించుకున్న చారిత్రకస్పృహ, పదిహేను పదహారు శతాబ్దాల మధ్య కాలంలో, సుసంపన్నమైన చరిత్రరచనా సారస్వతంగా, చిక్కని ఆకృతి దాల్చింది. గతాన్ని గూర్చి సుదీర్ఘంగా సాగిన విచార విశ్లేషణల స్వరూపమది. దక్షిణాసియాలోని ప్రాచీన చరిత్ర రచనప్రక్రియలతో ఈ సాహిత్యానికి సంబంధముంది. అయితే, వాటినుండి విడివడి ఒక కొత్త పుంతను తొక్కడం కూడా మనకీ సాహిత్యంలో గోచరిస్తుంది. ఒక రకంగా యిది దక్షిణ భారతదేశంలో అప్పుడే ఆవిర్భవించిన ఒక కొత్త ‘ఆధునికత’ను సూచిస్తుంది. అది సాధారణ ప్రమాణాలకు ఎన్నో మైళ్ళు ముందుండే ఆధునికత. గతాన్ని గూర్చిన యీ కొత్త స్పృహ – బలమైన వ్యక్తివాదం, మానవశరీర సామర్థ్యాన్ని గూర్చిన ఒక కొత్త చైతన్యం, వివిధ సామూహిక (మతపరమైన) అస్తిత్వాల సరిహద్దులను చెరిపేసి, రాచరికానికి ఒక కొత్త నిర్వచనాన్ని యిచ్చే ఒక సమష్టి రాజకీయసంస్కృతి – మొదలైన లక్షణాల సమ్మేళనం. ఈ ఆధునికత పదునెనిమిది పందొమ్మిదవ శతాబ్దపు సంధియుగం వచ్చేటప్పటికి, వలసవాద ఆధునికత ప్రాబల్యంలో మరుగున పడిపోసాగింది. ఇంగ్లీషు కంపెనీవారు దక్షిణభారతంలో తమ పట్టు బిగిస్తున్న కాలంలో, తమకు తెలిసిన, తాము గ్రంథస్థం చేసిన నైతిక-సాంస్కృతిక ప్రపంచం తమ కళ్ళముందే అంతరించిపోవడం గమనించిన కరణాల బాధ, ఆ కాలపు చరిత్ర రచన శైలీలక్షణంలో ఒక మార్పుగా కనిపిస్తుంది.

ఈ మార్పును తెలిపే ఒక శక్తివంతమైన రచన దూపాటి కైఫీయతు. దీనిని పందొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్ళలో ఒక అనామకుడైన కరణం రచించాడు. ఈ కైఫీయతు రచనాకాలానికి, పాత ఏలుబడి పోయి ఒక నూతన వ్యవస్థ అవతరించింది. దానికి తెర తీసినవాడు థామస్ మన్రో (Thomas Munro). మన్రో అమలు పరచిన రైతువారీ విధానం, పాత అధికార వ్యవస్థల స్థానే నూతన వ్యవస్థకి నాంది పలికింది. ఈ కొత్త విధానం రైతులకూ రాజ్యానికీ ప్రత్యక్ష సంబంధం నెలకొల్పింది. దీని ఫలితంగా (కొంతవరకూ దీనికి పూర్వరంగంగా), తరతరాలుగా, ప్రాంతీయ రాజకీయ నిర్మాణాలలో వచ్చిన అనేక మార్పులకు తట్టుకుంటూ నిలబడిన పాలెగాళ్ళ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ గతించిన వ్యవస్థకు శ్రద్ధాంజలి ఘటించడానికో, కోల్పోయిన ఒక స్వర్ణయుగ చిత్రాన్ని మన కళ్ళముందు సృష్టించడానికో యీ కైఫీయతు వ్రాయబడ లేదు. మూడువందల ఏళ్ళ కల్లోలభరితమైన కమ్మ నాయక వంశ చరిత్రను చిత్రిస్తుందీ కైఫీయతు. సునిశితమైన వ్యంజనను, వక్రోక్తిని, పరిస్థితులను ఎదుర్కొనే ఒక మొండి పట్టుదలను ప్రదర్శిస్తూ ఇ. ఎల్. డాక్టోరో (E. L. Doctorow) వ్రాసిన వెల్కమ్ టు హార్డ్ టైమ్స్ నవలలా సాగుతుంది.

అలనాటి సమాజంలోని రాజకీయ-ఆర్థిక సమీకరణాలు, అవి కాలక్రమంలో ఒక పటిష్ఠ వ్యవస్థగా రూపొందిన తీరు, రచనలో అడుగడుగునా ఎంతో నేర్పుతో మనకు బొమ్మకట్టి చూపిస్తాడు రచయిత. క్రమేపీ మన్రో కాలానికి ఆ వ్యవస్థ క్షీణించిపోవడం అతడు గమనిస్తాడు. మధ్యయుగాంతపు నైతికవ్యవస్థ పూర్తిగా పతనమై పోవడానికి దారితీసిన చారిత్రక క్రమం యిందులో కనిపిస్తుంది. అయితే, వికాసయుగానంతర (post-Enlightenment) కాలంలో పశ్చిమ ఐరోపాకు చెందిన గిబన్ (Edward Gibbon), రాన్కే (Leopold Ranke), మోంసెన్ (Theodor Mommsen), మిషెలెట్ (Jules Michelet) వంటి ప్రత్యక్షవాద (positivist) చరిత్రకారుల రచనలలో అంతర్లీనంగా కనిపించే ప్రయోజనవాదం, ఈ కైఫీయతులో మనకు కనిపించదు. ఆ ఐరోపా చరిత్రకారుల రచనలలో వారికి తెలియకుండానే క్రిస్టియన్ల శాంతియుగ విశ్వాసం (millenarianism), అంతర్లీనంగా అల్లుకుపోయి, వస్తుగత దృక్పథపు (objectivism) చట్రంలోనే యిరుక్కుపోయి, యింకిపోయింది. దాన్ని గుర్తించకుండా వారి రచనలను అర్థం చేసుకోడం అసాధ్యం. ఈ విషయంలో, తనకు ఇంచుమించు సమకాలీనులైన ఐరోపా చరిత్రకారుల కన్నా, దూపాటి కైఫీయతు వ్రాసిన అజ్ఞాత కరణానికి (పద్మనాభ యుద్ధ రచయిత లాగే) తన దృక్పథాన్ని గూర్చి స్పష్టమైన అవగాహన ఉంది.

దీని గురించి మేమిక్కడ క్లుప్తంగా వివరిస్తాము. ఈ కథ కూడా కృష్ణదేవరాయల దగ్గర మొదలవుతుంది. శాయప్పనాయకుడనే ఒక ఇరవయ్యేళ్ళ కమ్మ యువకునికి రాయలవారు, శ్రీశైలానికి తూర్పున పదహారు కోసుల దూరంలో ఉన్న గుడిపాడు అనే గ్రామాన్ని అమరంగా వ్రాసిస్తారు. పడమటి తెలంగాణాలోని అటవీప్రాంతానికి నడిబొడ్డది. శాయప్ప, అతని కొడుకు వేంగళనాయుడు, మనుమడు వేంకటాద్రినాయుడు అక్కడ తమ ఆధిపత్యాన్ని స్థాపించుకుంటారు. వీరి ఏలుబడి ప్రశాంతంగా సాగిపోయినట్టు కనిపిస్తుంది. శాయప్పనాయుని వంశక్రమంలో జరిగే మార్పులను, వాళ్ళకు పైనున్న విజయనగర పరిపాలనావ్యవస్థలో సమాంతరంగా జరుగుతున్న మార్పులతో పాటుగా మన ముందుంచుతాడు కరణం చరిత్రకారుడు. కృష్ణరాయల మరణానంతరం తలెత్తిన సమస్యలు, ఆ తర్వాత శాలివాహన శకం 1505లో (క్రీ.శ. 1582) విజయనగర సామ్రాజ్యం తురుష్క బాదుషా వశమవ్వడం, మొదలైన విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఈ కైఫీయతులో వరుసగా వచ్చే ఉపాఖ్యానాలు, తిరిగి తిరిగి పునరావృతమయ్యే కొన్ని రకాల కథావస్తువుల కథననిర్మాణాల చుట్టూ అల్లుకొని ఉంటాయి. అయినా కూడా, వంశావళిని చిత్రించే సరళక్రమాన్ని మాత్రం తప్పిపోకుండా జాగ్రత్తగా అనుసరించడం విశేషం.

పదహారు పదునెనిమిది శతాబ్దాల మధ్యకాలంలో, దక్కనీ రాజకీయాలనే విశాల రంగస్థలంపై దూపాటి నాయకులవి చాలా చిన్న పాత్రలు. వారికున్న పరిమితమైన అధికార వైభవాన్ని గురించి కరణం రచయితకు ఎలాంటి భ్రమలూ లేవు. దాని గురించి అతడికి బాగానే తెలుసు. అయితే, వారికున్న బలమల్లా, మారే ప్రభుత్వాలకు అనుగుణంగా తమ ప్రభుభక్తినీ విధేయతను మార్చుకోగల సామర్థ్యం. సాధారణంగా, వారి అధికారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలవంటివి ఒక నియోగి బ్రాహ్మణుని అధీనంలో ఉండేవి. అవకాశవాద రాజకీయ సమీకరణాలను అంచనా వేసి, వాటికి తగ్గట్టు కార్యసాధన చేసే నేర్పున్న ఆ నియోగి బ్రాహ్మణుని మధ్యవర్తిత్వం ద్వారా దూపాటి నాయకులు తమ అధికారాన్ని కాపాడుకొనేవారు. ఈ ప్రకారంగా కమ్మ నాయకులు, ముందు విజయనగర రాజ్యం క్రింద తమ అధికారాన్ని స్థాపించుకొని, ఆ తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ పరిపాలన కిందకి మారి (దీనికోసం వారు తమ శత్రువులైన ఆ ప్రాంతపు బోయలపై కుతుబ్ షాహీకున్న శత్రుత్వాన్ని తమకి మిత్రత్వంగా మార్చుకున్నారు), అటు పైన మొఘలాయి సామ్రాజ్యం అంతరించాక హైదరాబాదులో ఏర్పడిన ఆసఫ్ జాహీ నిజాముల పరిపాలనలోకి మారారు. అంచేత ఒక రకంగా చూస్తే యిది దూపాటి నాయకుల హక్కుల నిరంతర పరిరక్షణా చరిత్ర. ప్రామాణికమైన వారి అధికార ధృవీకరణ పత్రాలు కాగితాలపై కాని రాతిపలకలపై కాని, జాగ్రత్తగా భద్రపరచబడి ఉండేవి. ఒకోసారి, వారు నిరంతరం దాసోహమనే మహారాజుల కొలువులోని చిట్టా పుస్తకాలలో (రిజిష్టర్లలో) కూడా ఉండేవి. అలాంటి ఒక సందర్భంలో, వారి నియోగి మధ్యవర్తి, పూనేలోని పేష్వా బాలాజీ బాజీరావు కొలువు దాకా వెళ్ళవలసి వచ్చింది. ఈ రుజువులు చాలాసార్లు దస్తావేజులలో ఉన్నా, కొన్నిసార్లు దేవాలయ శాసనాలలో కూడా ఉండేవి. అవసరమైనప్పుడు యథాతథంగా ఉటంకించబడేవి కూడా.

ఒక రకంగా చూస్తే, చరిత్రను నమోదు చేసే ప్రక్రియావిధానమే యీ కైఫీయతులో నాయకస్థానాన్ని ఆక్రమించుకొనే ప్రధానాంశం. మనిషి కర్మబద్ధత, వ్యక్తి స్వేచ్ఛ, మొదలైన పురాతన విషయాలను పునస్సమీక్షించుకొనేందుకు, ఒక చక్కని నమూనాను అందించే, బొబ్బిలి రంగారాయుడు, దేశింగురాజు వంటి ఏకవీరుడెవరూ యీ రచనలో కనిపించడు. దాని బదులు, ప్రామాణికమైన పత్రాల ఆధారంతో చరిత్ర గురుతులు చెరిగిపోకుండా తరతరాలు నిలిచి ఉంటాయనీ, వాటి చుట్టూ నిర్మించబడిన వ్యవస్థ ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతుందనీ – ఒక గట్టి నమ్మకం, మనకీ రచన పైపొరల్లోనే ప్రస్ఫుటంగా ద్యోతకమవుతుంది. దూపాటి వంశపాలనకు వినాశమూ, విచ్ఛితీ ఏర్పడిన తరుణంలో, ఎవరో ఒక నియోగి రాయబారి, వారి హక్కుల సాధనకు కావలసిన సాక్ష్యాధారాలను శ్రమకోర్చి సమకూర్చుకొనే విధానమంతా, ఒక ఆలోచనాత్మక పదచిత్రంగా మనకు మరల మరల దర్శనమిస్తుంది. పదునెనిమదవ శతాబ్దపు మధ్యకాలంలో పరిస్థితి ఇలాగే ఉండేది. ఆ పరిస్థితికి, నిజాము, మరాఠులు, బుస్సీ (ఇతని ప్రస్తావన నేరుగా లేకపొయినా) మధ్య నడచిన రాజతంత్రపు ఎత్తుజిత్తులతో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇబ్రహీం ఖాన్ అనే అతడు కమ్మనాయకులను మరోసారి అణచివేయడానికి అలాంటి అవకాశాన్నే చేజిక్కించుకుంటాడు. అయితే, దస్తావేజులనే తమ తరగని గని సహాయంతో వారు తిరిగి పైకి లేవడం ఎలానూ కచ్చితమే.