భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం

రాజతరంగిణి పూర్వ తరంగాలను కూడా నిష్పాక్షిక దృష్టితో చదివితే, మా యీ అభిప్రాయానికి మరింత బలం చేకూరుతుంది. తన రచనంతటికీ ఉత్కృష్టమైన నాల్గవతరంగంలో చాలా భాగం జయాపీడుడనే రాజు చేసిన సాహసకృత్యాలను గూర్చి చెపుతాడు కల్హణుడు. నేపాళరాజ్యంపై జయాపీడుడు తెగువతో చేసిన దండయాత్ర, అందులో అతడు పట్టుబడడం, అసాధారణరీతిలో తప్పించుకోడం, మొదలైన ఎన్నో అద్భుత సాహసాలను వర్ణిస్తాడు. ఇందులోని కథాంశం నవలాస్వరూపం కలిగినది. ఇది దండి దశకుమారచరిత్ర వంటి రచనల సరసన నిలబెట్ట తగినది. కథలోని ఉత్కంఠకి అనుగుణంగా కథనశిల్పం సాగుతుంది. ఇలాటి అంతర్గర్భితమైన నవలికలు ఈ రచన పొడుగునా తరచూ వస్తూంటాయి. ఈ నిర్మాణంలో — కథనంలో సరళక్రమాన్ని పాటించాలనే ఒక చరిత్రకారుని తీవ్రకాంక్ష, జరిగే సంఘటనలపై ఒక నీతిమంతుడి పెదవివిరుపు — మనకు కనిపించక మానవు. ఒకరకంగా చూస్తే యివన్నీ చరిత్ర లక్షణాలే. కానీ యీ రచనలో పూర్తి స్థాయి చారిత్రక విశ్లేషణా లక్షణాలు లేవు. అయితే, దీనికి కారణం, కళానైపుణ్యంతో, అక్కడక్కడ భావకవిత్వపు పోకడలతో సాగే, కల్హణుడి రచనాశైలి మాత్రం ముమ్మాటికీ కాదు. “చరిత్ర అంటే, గతాన్ని గూర్చి ఒక మేధోవంతమైన సంస్మరణే తప్ప అందులో ఉక్తివైచిత్రికీ, భావ విశృంఖలతకూ, విపరీత భావోద్వేగాలకు చోటులేదు” అన్న హెగెల్ (Hegel) నిర్దేశం పక్షపాతదృష్టితో చేసినదే.

మా సారాంశం ఏమిటంటే, రాజతరంగిణి మధ్యయుగాలలో భారతదేశంలో వచ్చిన ఒక విలక్షణ రచన అన్న ప్రచురాభిప్రాయంతో మేము తప్పక అంగీకరిస్తాము. గతాన్ని గురించి కల్హణుడు సృష్టించిన యీ సుదీర్ఘ రచన, రాజవంశావళిని చిత్రించే సంప్రదాయ పురాణమో, హర్షచరిత్ర వంటి రాచరికపు రాసలీలలు వర్ణించే కావ్యమో కాదు. అదే విధంగా పాశ్చాత్య సాహితీప్రక్రియకు లోబడిన చరిత్ర రచనకూడా కాదు. ఇతర కవులు కావాలని మితిమీరిన కల్పనలకి పాల్పడే సందర్భాలలో కల్హణుడు కఠోర వాస్తవికతకి చోటు కల్పిస్తాడు. తన వద్దనున్న ఆధారాల ద్వారా కష్టపడి సంకలించిన వాస్తవాలను విడిచిపెట్టడు. అయితే, యిలాంటి అతివాస్తవికత, మధ్యయుగాల చివరలో వచ్చిన కావ్యాలలో కూడా సర్వసాధారణంగా కనిపిస్తుంది. అది వాటిని చరిత్రగా మార్చదు. పదహారవశతాబ్ది మొదట్లో వచ్చిన పెద్దన మనుచరిత్ర కావ్యంలో, చక్కటి పరిశీలనతో విపులంగా వర్ణించిన వేట దృశ్యాలను చూస్తే, యీ తేడా అర్థమవుతుంది.

అసలు మనమీ సమస్యని అర్థం చేసుకోవడం లోనే చాలా వరకూ లోపం ఉంది. మనమింకా ఒక పాత ఉచ్చులో పడుతూనే ఉన్నాం. సాధారణంగా మనం మనకొక సామాన్య అవగాహనా పరిధిని ఏర్పరుచుకుంటాం. సమష్టిగా ఏర్పరచుకున్నదే అయినా, అది చాలా పరిమితమైనది. ఆ పరిధిని అతిక్రమించే విషయాలను అద్భుతాలనీ, అభూతకల్పనలనీ, మర్మభూయిష్టాలనీ ముద్రవేసి, రచనలో అలాంటి భాగాలను ఏరివెయ్యడానికి ప్రయత్నిస్తాం. ఈ దృష్టితో ఆలోచించి, “చరిత్రకారునికి తప్పకుండా ఉండాల్సిన అర్హతగా మనం భావించే చారిత్రకస్ఫూర్తి కల్హణుడిలో లే”దని కొట్టిపారేసే అవకాశముంది. పైపెచ్చు, “గొప్ప కాశ్మీర చరిత్రకారుడైన కల్హణుడు సైతం, చరిత్రకు సంబంధించి హిందూ భావజాలాన్ని ప్రభావితం చేసే ఆలోచనల బారినపడ్డాడు… పురాణాలను, ఐతిహ్యాలనూ, నిజమైన చరిత్రతో వేరు చేయగల నేర్పు భారతీయచేతన ఎప్పుడూ సంపాదించలేదు.” అని నిశ్చయించే అవకాశమూ ఉంది. ఈ నిశ్చయానికి వచ్చినది స్వయానా, కల్హణుడికి తన జీవితంలో చాలా భాగాన్ని, ఆత్మలో ముఖ్యభాగాన్నీ అంకితం చేసిన ఆరెల్ స్టెయిన్ (Aurel Stein) అనే పాశ్చాత్య చరిత్ర పరిశోధకుడు. ఇది అవగాహనారాహిత్యంతో చేసిన తప్పుడు వర్గీకరణ.

చరిత్ర అంటే కేవలం సంభవనీయత కాదు. రచన అల్లికలో అంచెలంచెలుగా, అతిసూక్ష్మంగా, చాలాసార్లు ఖచ్చితంగా, గుర్తించగల చిహ్నాలకు సంబంధించినది చరిత్ర. ఏ భాషలో చరిత్ర రచనసాగిందో, ఆ భాష మాట్లాడే పాఠకులు దాన్ని సులువుగా గుర్తిస్తారు. వాస్తవికత; చారిత్రక ఆధారాల సరైన వినియోగం; సంఘటనల మధ్య అర్థవంతమైన కార్యకారణ సమన్వయం; సమాచారసామగ్రి నంతటినీ సమీకరించి, సమీక్షించి, అందులోనుండి ఒక చారిత్రక అవగాహనను వెలికి తీసి, దాన్ని చదివించే గుణంతో గుది కూర్చడం; యివన్నీ కూడా ఎంతో కొంత చరిత్రకు ఉండవలసిన లక్షణాలే. ఈ లక్షణాలే ఒక గొప్ప చరిత్రకారుణ్ణి సగటు చరిత్రకారుడి నుంచి వేరు చేస్తాయి. ఇవన్నీ చరిత్ర అల్లికలో అంతర్గతంగా ఉంటాయి. ఏది సంభావ్యము, ఏది హేతుబద్ధము, ఏది అర్థవంతము, అనే విషయాల గురించి మన స్వంత అభిప్రాయాలనూ తీర్పులనూ, మరొక సంస్కృతికి చెందిన మౌలిక అవగాహనా రీతులతో కలగలిపి గందరగోళం చెయ్యడం ఇకనైనా ఆపవలసిన సమయం వచ్చింది. వాస్తవ-కల్పనల నడుమనున్న అంతరాన్ని తెలుసుకొనేందుకు ఆయా వ్యవస్థలలో వాటికి మాత్రమే స్వంతమైన అంతర్గతప్రమాణాలు ఉంటాయని గుర్తించాలి. మన పూర్వస్థిత భావాల కన్నా యీ ప్రమాణాలే మనకు తగిన పనిముట్లని తెలుసుకోవాలి.

3. గంగాదేవి – మిథ్యాచరిత్ర

కల్హణుడు సరే, చరిత్రకారుని లక్షణాలు కొన్నయినా అతనిలో ఉన్నాయి. ‘చారిత్రక కావ్యం’ సృష్టించిన యితర (అంతగా ప్రసిద్ధి పొందని) రచయితల విషయంలో కూడా అలాంటి భ్రాంతిలోనే పడుతూంటాం. చారిత్రక కావ్యం అన్న యీ పస లేని సాహిత్య ప్రక్రియ వర్గీకరణలో మళ్ళీ అనేక స్థాయీభేదాలు! రాచరికమో, సైనికపాలనో కలిగిన గతాన్ని గురించి యెలాంటి ప్రౌఢమైన లేదా కవితాత్మకమైన రచననైనా, ఈ పేరుతో పిలవడం ఆనవాయితీ అయిపోయింది. మండలకవి విరచిత పాండ్యకులోదయం; విజయనగర చక్రవర్తి, తన భర్త, అయిన అచ్యుతరాయలతో తన ప్రణయాన్ని గూర్చి తిరుమలాంబ రచించిన వరదాంబికా పరిణయమనే చంపూకావ్యం; కేరళ రాజవంశాన్ని గురించి అతుల కవి వ్రాసిన మూషిక వంశమనే కావ్యం; యిలా యెన్నో రకాల రచనలు అదే సాహిత్య ప్రక్రియ క్రిందకి జమ చేయబడ్డాయి. ఈ రచనలన్నీ వేటికవి విడిగా పరిశీలించాల్సినవి. వీటిలో కొన్ని, మా ప్రమాణాల మేరకు, చారిత్రక రచనలే. కాని చాలా వరకు కావు. అసలేమాత్రమూ చారిత్రకత లేని ఒక ప్రసిద్ధ రచనని యిప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. అది – మధురా సుల్తానులపై విజయనగర రాజు కంపనుని దండయాత్ర గూర్చి పదమూడవందల ఏభైలలో గంగాదేవి వ్రాసిన ‘మధురా విజయం.’

గంగాదేవి కంపనుడి రాణి. ఆమె తన ప్రియునికి పుట్టినరోజు బహుమతిగా ఒక చారిత్రక పత్రాన్ని సమర్పించిందని ఊహించడం హాస్యాస్పదమే అవుతుంది. అంచేత సహజంగానే యీ కావ్యం కంపనునికి పుట్టినరోజు కానుకగా అందించిన సన్మానపత్రంలా అనిపిస్తుంది. ఇందులో తన ప్రియుని శారీరక సౌందర్యాన్ని, శృంగారకళా కౌశలాన్ని, దేహదార్ఢ్యాన్ని, చాలా సుదీర్ఘంగా సొగసుగా వర్ణిస్తుందామె. ఈ మూడంశాలతోనూ ఆమెకు మంచి పరిచయం ఉండటం సహజమే. ఆశ్చర్యంగా, యీ మూడంశాలూ కూడా మధురపై అతడు చేసిన సైనికచర్యతో కలిసిపోతాయి. నవజనిత విజయనగర రాజ్య విస్తరణ కోసం కంపనుడు చేసిన దక్షిణదేశ దండయాత్ర, ఒక దక్షిణనాయకుని అంతఃపుర జైత్రయాత్రగా రూపాంతరం చెందుతుంది. చాలా వరకూ ఆ నాయకుని సమయం, త్రోవలో తన అంతఃపురస్త్రీలతో సలిపే క్రీడావినోదాలలోనే గడిచిపోతుంది. రతికేళీవిలాసాలతో ఋతువులు సాగిపోతాయి. యుద్ధం అనేదొకటి జరుగుతోందనీ, అతడు కత్తి పట్టాలనీ, అప్పుడప్పుడూ ఆ రాజకుమారునికి గుర్తు చెయ్యబడుతూ ఉంటుంది.

అయితే, అతిశయోక్తులపై పండితులకున్న అభిమానానికి యిలాంటి విషయాలేమీ అడ్డుకట్టు వేయలేక పోయాయి. అందుకే, “గంగాదేవిని మొట్టమొదటి దక్షిణ భారత చరిత్రకారిణిగా పేర్కొనడం ఎలాంటి శాస్త్రదృష్టితో చూసినా సమంజస” మయ్యింది. దండయాత్రకు సంబంధించి ఏవో కొన్ని ప్రామాణికమైన పేర్లు ప్రస్తావించినంత మాత్రాననే యీ రచన, “పూర్వకాలం భారతదేశంలో వచ్చిన చాలా కొద్ది పరిపూర్ణ చారిత్రక రచనలలో ఒకటి” అయ్యే అర్హత సంపాదించింది. అందువల్లనే – విజయనగర రాజు బుక్కరాయని తనయునిగా కంపనుని జననం మొదలుకొని, గంగాదేవితో అతని వివాహం (అతని జీవితంలో ప్రధాన ఘట్టం?); దక్షిణ దిశగా ప్రయాణమై చంప (శంభువరాయ) రాజుల నుండి తుండీరమండలాన్ని స్వాధీనం చేసుకొని మధురా రాజ్యాన్ని ముట్టడించమన్న బుక్కరాయని ఆదేశం; తండ్రి మాట తలదాల్చి, సులువుగా, మధ్య మధ్య తన భార్యలతో సరససల్లాపాలకై దీర్ఘ విరామాలు తీసుకుంటూనే, కంపనుడు తన పనిని చక్కబెట్టడం వరకూ సాగిన సుదీర్ఘ చరిత్ర, మనకీ రచన ద్వారా తెలుస్తుంది. కంపన యవనసురత్రాణుల (సుల్తాను) మధ్య ద్వంద్వయుద్ధంతో కథ సుఖాంతమవుతుంది. సుల్తాను చాలా బలవంతుడైన శత్రువు. అతడి తల తెగిన తఱువాత కూడా గుఱ్ఱపు పగ్గాన్ని పట్టుకున్న అతని ఎడమచేయి పట్టుదప్పదు. కుడిచేయి కంపనునిపై తిరుగుదాడి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. అయినా చివరకు తురుష్క సామ్రాజ్యం తాత్కాలికంగా నిరోధించబడుతుంది. బహుశా, కంపనుడికి తిరిగి తన అసలైన అభిరుచులపై దృష్టి సారించే అవకాశం లభిస్తుంది.

ఈ రచనకి రిచర్డ్ డేవిస్ (Richard H. Davis) అర్థవంతమైన వ్యాఖ్యానాన్ని అందించాడు. దీనినతడు హిందువుల ‘ప్రతిఘటనా ఇతిహాసాల (epics of resistance)’ కోవలోకి వర్గీకరిస్తాడు. మధురావిజయ కావ్యాన్ని సరైన సాంస్కృతిక చారిత్రక నేపథ్యంలో అర్థంచేసుకోడానికి యితని వ్యాఖ్యానం బాగా ఉపయోగపడుతుంది. అయితే, వచ్చిన చిక్కల్లా మధురావిజయంలో ఐతిహాసికాంశమేదీ లేదు. అన్ని విధాలా, నూటికి నూరుపాళ్ళూ, అది ఒక కావ్యం. వినోదాన్నీ ఆహ్లాదాన్నీ అందించేందుకు, ముఖస్తుతి చేసేందుకు, రచింపబడిన ఒక రాజకీయ కావ్యం. కవయిత్రి స్వయంగా కావ్యపీఠికలో యీ విషయాన్ని చెపుతుంది:

కరోతి కీర్తిమర్థాయ కల్పతే హన్తి దుష్కృతం
ఉన్మీలయతి చాహ్లాదం కిం న సూతే కవేః కృతిః

కీర్తిని చేకూరుస్తుంది. ధనాన్ని యిస్తుంది. పాపాన్ని రూపుమాపుతుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కావ్యం ఇయ్యని దేది? ఇలాంటి మహా ప్రయోజనాలను సాధించే ఆశయంతోనే కాబోలు, ఆమె తనని తానొక గొప్ప కవయిత్రిగా భావిస్తుంది:

తార్కికా బహవస్సన్తి శాబ్దికాశ్చ సహస్రశః
విరలాః కవయో లోకే సరసాలాపపేశలాః

తార్కికులెందరో ఉన్నారు. వైయాకరణులు వేలకువేలు ఉన్నారు. సరససూక్తులతో రంజింపజేసే మంచి కవులు లోకంలో చాలా తక్కువ.

దీనిని మనం అంగీకరించాలి. గంగాదేవి నదేష్దా (Nadezhda Mandelstam) వంటి రచయిత్రి కాకపోవచ్చు. కాని, ఆమెకు పదాలను పొందికగా కూర్చడం తెలుసు. ఆమె రచనాచాతుర్యం చాలాచోట్ల తళుక్కున మెరుస్తుంది. “దక్షిణభూమి అయిన మధుర, తురుష్కుల దుండగాలవల్ల నాశనస్థితిని పొందింది. ఆ దుర్మార్గులు కొబ్బరితోటలను నరికి వేశారు. సద్బ్రాహ్మణులకు సంకెళ్ళు వేశారు. ఒకప్పుడు ప్రేయసీప్రియులు విహరించిన వనాలు పాడుబడి, గుడ్లగూబల కేకలకు నెలవులయ్యాయి. ఆ అరుపులకన్నా ఎక్కువగా, చిలకలు పలికే (యవన తురుష్కుల దగ్గరనుండి నేర్చుకున్న) పారసీకపు పలుకులు ములుకుల్లా గుచ్చుకొని వేధిస్తున్నాయి.” ఇలాటి వివరాలన్నీ రాజు గుండె లోతులను (పెద్ద లోతేం కాదు కాని!) పట్టి కుదిపేస్తాయి. అయితే, దీనికి కొద్ది క్షణాల మునుపే ఆ రాజు మనసు వేరే విషయాలపై కేంద్రీకృతమై ఉంటుంది, అది వేరే సంగతి. అవి ఎలాంటి విషయాలంటే:

“పాదపద్మంబుల పైబడి పొరలాడి
యుత్సంగ తలముల యుదుటు దాటి
నీవిబంధము తోడి నెలవుల కెగబ్రాకి
నాభి చక్రంబు రంధ్రంబు దాకి
యుత్తుంగ కుచతటు లొఱసి యుద్ధతి బొంగి
కంధర వీచి దోర్బంధమొసగి
ఘననీల కైశికం బనువు మైకొన దాల్చి
ముఖచంద్ర బింబంబు ముద్దు వెట్టి

(శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారి అనువాదం)

చరిత్రాత్మక దిగ్విజయాలు రూపుదిద్దుకొనేవి యిలాంటి విషయాలతో కాబోలు!