చారిత్రకభూమిక నుండి దూరంగా సాగిపోయే రచనలకు మరికొన్ని బలవత్తరమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. తరచుగా యిది సమాజంలో విస్తరించుకొనే ఒకానొక సాముహిక స్పృహ మూలంగా జరుగుతుంది. ఓడినవాడి చరిత్ర గెలిచినవాడి చేతిలో కేవలం సాహిత్యంగా మారిపోతూ ఉంటుంది. బ్రిటిష్ పరిపాలనా కాలానికి ముందు దక్షిణాసియాలో వచ్చిన చాలా చారిత్రక రచనలకి సరిగ్గా యిలాంటి గతే పట్టింది. ఈ ప్రక్రియ ప్రారంభదశలో కొన్నిసార్లు అంచెలంచెలుగా సాగే ఆ మార్పును, మనం గమనించ గలుగుతాము. దీనికొక మంచి ఉదాహరణ ‘పద్మనాభ యుద్ధము.’ మొదటి దశలో పద్మనాభ యుద్ధమనే ఒక చారిత్రక దుర్ఘటన, వాస్తవ-కల్పనల వింతైన కలనేతగా చరిత్రను సృష్టించింది. ఆ తర్వాతి దశ – రచన మొత్తం కట్టుకథగా, పుక్కిటి పురాణంగా ముద్రవేయబడింది. ఒక రచనలో వాస్తవ-కల్పనల మధ్య ఉండే సున్నితమైన అంతరాలను గ్రహించే పరిణత ప్రజ్ఞ, సాధారణంగా పరాజితుల వర్గంలో నిలిచి ఉంటుంది. జయించి అధికారం చేపట్టిన వర్గం వారు, స్వరభేదాల గుర్తింపు లేని ప్రాథమిక పఠనానికే పరిమితులవుతారు. ఇది అస్పష్టతకీ, అయోమయానికీ దారితీస్తుంది.
అయితే, బ్రిటిష్ పాలనకి ముందు, భారతదేశంలోని మౌలిక సాహిత్య ప్రక్రియలలో సర్వత్రా చాలా వైవిధ్యభరితమైన వ్యక్తీకరణ కనిపిస్తుంది. అందువల్ల, చరిత్రరచనలో వాస్తవ-కల్పనల అల్లిక లోని అంతరువులను వివరించడానికి పైన చెప్పిన ప్రక్రియ (ఆధికారిక దృష్టికోణం ద్వారా వచ్చే మార్పు) ఒక్కటే సరిపోదు. దీనిని గూర్చి యింకా వివరంగా తెలియడానికి మరొక ఉదాహరణ చూద్దాం. పన్నెండవ శతాబ్ది మధ్యకాలానికి చెందిన కల్హణుని రాజతరంగిణి (కాశ్మీర రాజుల చరిత్ర) భారతదేశంలో వచ్చిన అతి తక్కువ చారిత్రక రచనలలో ఒకటిగా పరిగణింపబడింది. ఈ మహారచన యొక్క సిసలైన చారిత్రక గుణాన్ని గురించి ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ ఉన్నట్టు లేదు. సాహిత్యంలో మాత్రం దీనికి సరైన స్థానం లేదు. ఇలాంటి చారిత్రక రచన భారతదేశంలో ఎలా పుట్టిందనడానికి అతి సులువైన, ఏమాత్రం లోతులేని వివరణ ఏమిటంటే – “కాశ్మీర సంస్కృతిపై విదేశీ ప్రభావం వల్ల అక్కడ చరిత్ర రచనవృద్ధి చెందినది” – అని. ఇది ఆచార్యుడు ఎ. ఎల్. బాషమ్, ది కాశ్మీర్ క్రానికిల్స్ అనే అనే వ్యాసంలో ఉటంకించిన మాట.
అయితే, భారతదేశానికి తనదైన, వైవిధ్యభరితమైన చరిత్ర రచనా విధానం ఉండవచ్చునన్న ఆలోచన పాశ్చాత్య చరిత్రకారులకి ఎన్నడూ తట్టలేదు. రాజతరంగిణి విదేశీ ప్రభావం వల్ల వచ్చిన చారిత్రక రచన అని చెప్తూనే, కల్హణుడు చేసిన ఆధారాల సేకరణ గురించి, అతని అట్టహాస రచనాశైలి గూర్చి, ‘తునాతునకలైపోయిన వృత్తాంతాన్ని ఒకచోట చేర్చి గుదిగూర్చి చెప్పడం’ తన లక్ష్యంగా అతను చేసిన విస్పష్ట ప్రకటన గురించి, దురదృష్టవశాత్తూ మార్మికతకు, ఇంకా చెప్పాలంటే మూఢత్వానికి లోనై అతడు చేసిన కొన్ని పొరపాట్ల గురించి – ఎంతో ఉత్సాహంతో విశ్లేషిస్తాడు బాషమ్. ఇక్కడ టాసిటస్ (Tacitus), స్యుటోనియస్ (Suetonius) అనే రోమన్ చరిత్రకారులు బాషమ్ విశ్లేషణలో గుట్టుగా తొంగిచూస్తారు. వీళ్ళకు కల్హణునిలో ఒక ఆత్మీయుడు కనిపించాడనడంలో సందేహం లేదు. అదే సమయంలో, కల్హణుడు తనని తాను చరిత్రకారునిగా కాక ఒక కవిగా భావించాడనీ, తన రచనని ప్రధానంగా ఒక కావ్యంగా పరిగణించాడనీ బాషమ్ గుర్తించాడు. అంచేత చరిత్ర రచన, కవిత్వము, రెండూ కల్హణుడికి సమానంగా ప్రేరణనిచ్చిన అంశాలే అన్నది అతని తీర్పు. విశ్లేషణతో కాకపోయినా ఈ తీర్పుతో మాత్రం మనం పూర్తిగా ఏకీభవించాలి.
కల్హణుడు నిజానికి కవే. అందుకే,
“జీవుల జీవితం బతివిచిత్రము బుద్బుదతుల్యమంచు మే
ధావిభవుల్ రసజ్ఞులు ముదంబున నీ కృతి రాట్తరంగిణీ
భావ సుధారసంబు జవిబట్టుచు, శాంతరస ప్రమోదపుం
దీవికి జీవనౌక వినుతింగనునట్లు నయింత్రు నేర్పునన్”
(శ్రీ స్వయంపాకుల వేంకట రమణశర్మ గారి అనువాదం)
జీవుల జీవితము నీటిబుడగలాగ క్షణభంగురమని యెఱిగిన విచక్షణులు, అమృతరసతుల్యమైన యీ రాజతరంగిణిలో మూర్ధాభిషిక్తమైన శాంతరసాన్ని తనివిదీర గ్రోలి ఆనందింతురు గాక అని ప్రకటించాడు. అంతే కాక, “ప్రతిభ అనే దివ్యనేత్రంతో గడచిన కాలాన్ని వీక్షించి, దాన్ని కళ్ళకు కట్టించే నిర్మాణశిల్ప నైపుణి కవిబ్రహ్మకి తప్ప వేరెవ్వరికి ఉంది?” అనడంలో కూడా మనకు కల్హణునిలో కవి స్పష్టంగా దర్శనమిస్తాడు. రచయిత ద్వారా స్వయంప్రకటితమైన యీ ‘కవి’ పాత్ర, ‘చరిత్రకారుని’ పాత్రకు ఏ మాత్రమూ అడ్డం రాదు, పాశ్చాత్య చరిత్రకారులు పొరబడుతున్నట్టుగా. మేము పుస్తకంలో అయిదు అధ్యాయాలలోనూ సుదీర్ఘంగా చేసిన చర్చ ద్వారా యీపాటికి పాఠకులకీ విషయం అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తాము. చరిత్ర అనేక సాహిత్య ప్రక్రియలలో రచింపబడవచ్చు, అందుకు కావ్యం మినహాయింపు కాదు. నిజానికి, కవి కొన్నిసార్లు కేవలం వాస్తవాలలో యీదులాడనూ వచ్చు. సరిగ్గా యిక్కడే, ప్రాచీన భారతంలో ఏకైక చరిత్రకారునిగా చెప్పబడే కల్హణుడి విషయంలో కీలక వ్యత్యాసాలను గుర్తించే స్థితిలో యిప్పుడున్నాం. విచిత్రమైన విషయమేమిటంటే, ఏ రకంగా అయితే చరిత్ర రచనయితర సాహిత్య ప్రక్రియల ముసుగులో కప్పబడిపోయే అవకాశముందో, అదే విధంగా, పాశ్చాత్యదృష్టితో కాస్త ఆదరాబాదరాగా చూస్తే, కల్పన చరిత్రగా కనిపించే అవకాశమూ ఉంది. అంచేత కాశ్మీర రాజతరంగిణిని మరింత సూక్ష్మదృష్టితో పరిశీలించాల్సిన అవసరముంది. పూర్వ సంప్రదాయరీతులు, రాజవంశాల వివరాలుగల కీర్తిపత్రాలు, దానపత్రాలు, స్మృతిగ్రంథాలు మొదలైన వాటినన్నిటినీ సమీకరించి, నిశితంగా పరిశీలించి, రాజనీతి విధానాలను క్రమపద్ధతిలో, వాస్తవిక వివరాలతో పొందుపరచడాన్ని చూస్తే, రాజతరంగిణిలో ఉన్నదంతా ఖచ్చితంగా చరిత్రే అని అనిపించక మానదు. అది ఎంత వరకూ నిజం? ప్రస్తుతానికి యిక్కడొక చిన్న ఉదాహరణ మాత్రమే యివ్వగలం.
కల్హణునికి సమకాలీనుడైన జయసింహుని ఏలుబడిలో (1128-49), సుజ్జి అనే అతడు సమర్థుడైన సైనికాధికారి. రాజు అతడిని తన మనుగడకు ముప్పుగా భావిస్తాడు. ఇలాంటి బలమైన వ్యక్తులెందరి చావులనో కల్హణుడు తన రాజతరంగిణిలో విపులంగా వర్ణిస్తాడు. జయసింహుడు నిరాశలో కూరుకుపోతున్న సమయంలో ఎట్టకేలకు కులరాజనే ఒక సేనాని అతనికి దొరుకుతాడు. తన ప్రాణాలకు తెగించి సుజ్జిని హత్య చెయ్యడానికతడు సంతోషంగా సిద్ధపడతాడు. తనతో తీసుకువచ్చిన యిద్దరు సహాయకులను బయటనే ఉంచి, కులరాజు సుజ్జి ఉన్న గది లోపలకి ప్రవేశిస్తాడు. ఏదో నేరం చేసి, కులరాజుకు పట్టుబడ్డ ఒక జాలరి గురించి, సుజ్జికి సాక్ష్యమివ్వడానికి ఇద్దరు బైట నిలబడి వున్నారని చెపుతాడు. ఆ యిద్దరు సహాయకులూ లోపలకు వచ్చేసరికి సుజ్జికి ఆ మొత్తం వ్యవహారం మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని గురించి రేపు చూస్తాను, పొండి అని, హఠాత్తుగా వెనక్కి తిరిగి నిద్రమత్తుతో పక్క పైకి చేరతాడు. అతను చేసిన ఆ పొరపాటే అతనికి ప్రాణాంతకమవుతుంది. కులరాజు తన ఖడ్గాన్ని తీసి సుజ్జి ఎడమ భాగంలో పొడుస్తాడు. దానితో పూర్తిగా తెలివి వచ్చిన సుజ్జి, పెద్దగా అరుస్తూ తన ఆయుధం కోసం వెతుకుతాడు. కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. మిగిలిన యిద్దరూ కూడా అతన్ని పదేపదే పొడుస్తారు. చూసేవాళ్ళకు ఏమి జరుగుతోందో అర్థమయ్యే లోపలే సుజ్జి విగతజీవుడవుతాడు. పించదేవుడనే ఒక్క యోధుడు తప్ప అతని అనుచరులందరూ పారిపోతారు. ముగ్గురు హంతకులూ కలసి అతన్ని కూడా తరిమేస్తారు. గది తలుపునూ కిటికీలనూ మూసేసి, సుజ్జి పడున్న మంచాన్ని తలుపుకడ్డంగా తోస్తారు. తటాలున శవం కింద పడిపోతుంది. ఇంతలో బయట మండువాలోనూ మెట్లమీదా ఉన్న సుజ్జి దళంలోని సైనికులు, మూసిన గదిపై దాడి చెయ్యడం మొదలుపెడతారు. అక్కడి నుంచి బయట పడేందుకు, సైనికులను ఎలాగయినా భయభ్రాంతులను చెయ్యాలని ఆశించిన కులరాజు, సుజ్జి తల నఱికి కిటికీలోంచి బయటకి విసిరేస్తాడు. ఆ బీభత్సదృశ్యాన్ని చూసి తట్టుకోలేక, కులరాజు అనుకున్నట్టుగానే, సైనికులందరూ అక్కడినుంచి పరుగులు తీస్తారు. అంతటితో కులరాజు లక్ష్యం సిద్ధిస్తుంది.
కాని, ఈ సన్నివేశాన్ని ఉత్తగా వివరించి ఊరుకొనడం యీ కవి-చారిత్రకునికి సంతృప్తినివ్వలేదు. కిటికీలోంచి బయటకి వచ్చి దుమ్ములో పడ్డ ఆ తెగిన తల, అక్కడ చూసిన వాళ్ళలో కలిగించిన నైరాశ్యం, భయోత్పాతం, చదివే మనలో కూడా కలిగించాలని అతని కోరిక. అందుకే, పాఠకుల యిష్టాయిష్టాలతో పనిలేకుండా ఆ దృశ్యాన్ని యిలా (అతి) సజీవంగా చిత్రించడానికి పూనుకున్నాడు:
బయట మండువాలో తెగిపడ్డ తలను; రక్తధారలు నిరంతరంగా స్రవిస్తున్న దాని తెల్లబడిన కళ్ళను, పాలిపోయిన చెవులను; పైపెదవి పైనున్న మీసాల వెండ్రుకలతో కప్పబడి, కాస్త నొక్కుకొని ఉన్న ముకుపుటాలను; చిందరవందరగా ప్రాంగణమంతా పరుగులుతీసే సైనికుల ప్రతిబింబాలు కదలాడి, జీవస్పందన ఉన్నదేమో అనే క్షణికభ్రాంతిని కలిగిస్తున్న గాజుపెంకుల్లాంటి కనుపాపలను; ఎగుడుదిగుడుగా తెగిపడ్డ మెడ అంచుల యెత్తుపల్లాలలో ఎండిపోయి, చూడ్డానికి పసుపుముద్దలా దళసరిగా అట్టకట్టిన కొవ్వును; దుమ్ముకొట్టుకుపోయి చింపిరిగా తయారయిన శ్మశ్రుకేశాలను; ఆ తల సుజ్జిదేనని నిశ్చయించడానికి ఒకే ఒక గురుతుగా మిగిలిన నుదుటనున్న కుంకుమబొట్టును; నేలకు వాలుగా తగలడం వలన, ఆ తాకిడికి పగుళ్ళువారిన పళ్ళను – చూసిన సేవకులు బిగ్గరగా కేకలు పెట్టడం మొదలుపెట్టారు.
ఇలాంటి అతివాస్తవిక చిత్రణ, శైలీపరంగా చూస్తే అసాధారణకార్యమే! సజీవ చిత్రణ కోసం, దీర్ఘవర్ణనల ఆవరణాలు ఏర్పరచబడ్డాయి. ఒకసారి ఆ ఆవరణంలోకి అడుగుపెట్టామా, అది సృష్టించే దుర్భరానుభూతినుండి తప్పించుకోడం అసాధ్యం. కవి పన్నిన వలలోంచి బయటపడలేము. ఒక ఆవరణం వెంట మరొక ఆవరణం, ఒక వర్ణన తర్వాత మరొక వర్ణన, అన్నీ ద్వితీయా విభక్తిలోనే. వాక్యాన్ని పూర్తిచేసి మనల్ని ఆ బీభత్సంనుండి విముక్తులను చేసే క్రియాపదం చిట్టచివరకు కాని రాదు. ఫలితం – పాఠకుణ్ణి మునుపెన్నడూ కనీవినీ యెరుగని దిగ్భ్రాంతికి గురిచేస్తూ, విస్తృతమైన వివరణతో, అద్భుతంగా, అతిస్పష్టంగా కళ్ళముందు ఆవిష్కరించబడిన వాస్తవం (ఊహా? జ్ఞాపకమా?) చివరికి మిగిల్చే అనుభూతిలో కళాసౌందర్యమేమీ లేదు. ఉన్నదల్లా కఠోరవాస్తవికత, అతిసహజత్వమూను. సాంప్రదాయిక కావ్యంలో లాగ విషయాలను నియంత్రించడమో, సంగ్రహించడమో, ఆదర్శీకరించడమో, తేలికపరచడమో మనకిక్కడ కనిపించదు. తద్విరుద్ధంగా, కవికున్న సర్వమార్గాలు, భాషావనరులు, చిత్రమైన యీ సన్నివేశాన్ని పూర్తి వాస్తవంగా మలచడానికి వినియోగించబడ్డాయి. ఈ సందర్భంలో బాబెల్ (Isaac Babel) గుర్తుకువస్తే ఆశ్చర్యం లేదు. అయితే, ఇది వాస్తవమైన చరిత్రా?
బహుశా కాదు. పోనీ, మేము పరిశోధిస్తూ వచ్చిన కరణపు వ్రాతలతో పోల్చి ఇది కాస్త బలహీనమైన చరిత్ర రచన అనుకోవచ్చు. వాస్తవికత ఒక్కటే చారిత్రకత కాలేదు. ఈ రచనలో కార్యకారణ సంబంధాల గూర్చి గాఢమైన అవగాహన కాని, పూసగుచ్చినట్టు కూర్చిన సంఘటనల కూర్పును అర్థయుక్తంగా వ్యాఖ్యానించగల కాస్త లోతైన సూత్రనిర్మాణం కాని వెతకడం వ్యర్థప్రయత్నమే. ఇక్కడ కల్హణుడు పరోక్షజ్ఞానం పైన ఆధారపడినాడన్న సంగతి గుర్తుంచుకోవడం ముఖ్యం. నఱకబడ్డ సుజ్జి తల గురించిన వర్ణన అతను ప్రత్యక్షంగా చూసినది కాదు. తాను విన్న సమాచారం ఆధారంగా స్వంతంగా సృష్టించినది. బహుశా అంతకు కొన్నేళ్ళ ముందు జరిగిన సంఘటనలే కాబట్టి అతనికి లభించినది వాస్తవానికి దగ్గరగా ఉన్న సమాచారమే అయ్యుండవచ్చు. నిజమే, జయసింహుని కొలువుకూటంలో తనకు తెలిసిన అంతఃపుర రహస్యాలను, వ్యక్తిగత రాజకీయాలను, విపులీకరించడంలో అతడు చాలా శ్రద్ధను కనపరిచాడు. రాజాస్థానాలలో జీవితాన్ని గూర్చి ఒక నిర్లిప్తమైన, విరక్తి నిండిన దృక్పథాన్ని, (కొద్దిపాటి ఉపదేశశైలిలో) ధ్వనింపచెయ్యడానికి యిలాంటి సంక్లిష్ట ప్రణాళికలను, పునరావృతమయ్యే విషాద వర్ణనలను ఉపయోగించుకున్నాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సాగే కథనంలో సమగ్రత కోసం, విషయాలన్నిటినీ నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం ఒకపక్క చేస్తూనే, మరోవైపు, జుగుప్సాకరమైన యిలాంటి నాటకీయ సన్నివేశాలు కళ్ళముందు జరిగిన అనుభూతి పాఠకుల గుండెల్లో కలిగించే ప్రయత్నం కూడా చేశాడు కల్హణుడు. ఒక ప్రతిభావంతుడైన చారిత్రకనవలా రచయిత చేసేది కూడా యిదే కదా?