కల్పన, నిజం
చాలాకాలం ఒక రంగంలో పనిచేసిన వాళ్ళు ఆ దీర్ఘానుభవం వల్ల సాధారణ విషయాలుగా అనిపించే అసాధారణ సత్యాల్ని చాలా సునిశితంగా, సరళంగా చెప్పగలుగుతారు. నారా ‘సూక్తుల్లో’ అలాటిదొకటి, “నిజానికి ఎన్నో రూపాలుంటయ్ కాని కల్పనకి ఒకటే రూపం” అనేది. అంటే, ఒక సంఘటనని ఒక్కొకరు ఒక్కో రకంగా చూస్తారు, వాళ్ళ భాషలోకి తర్జుమా చేస్తారు. అలా వచ్చిన అనేక రుపాంతరాఅన్నీ సమానంగా ‘నిజాలు’, వారి వారి దృష్టి నుంచి. అదే ఒక కల్పనని చూస్తే అది ఒక వ్యక్తిది కనక దానికి ఒకటే రూపం వుంటుంది. దీన్ని తిరగేస్తే, ఒకే రూపం వున్న ఒక రచన కల్పన కావటానికి అవకాశం చాలా ఎక్కువ. అలాగే, అనేక రచనల్లో వున్న వస్తువుకి ఎంతో కొంత ‘వాస్తవం’ మూలం అయే అవకాశం ఎక్కువ. ఇలాగే మరోటి: “మనక్కావల్సింది స్వార్థపరులు; త్యాగాలు చేసి ఇతరులకి మంచి చేస్తామనే వాళ్ళు ఏ పనీ చెయ్యరు,” అనేది. ఇది ‘ధనస్వామ్య మంత్రం’ సూక్ష్మరూపం అనొచ్చునేమో.
నారాతో నా పరిచయం – స్వోత్కర్ష
‘తెలుసా’ రోజుల్లోనో దానికి కొంచెం ముందు SCIT రోజుల్లోనో నారాయణ రావు గారితో ఈ-మెయిల్ పరిచయం జరిగిన గుర్తు. ఐతే 1998లో ఈమాటని ప్రారంభించటం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆయనతో కొన్నిసార్లు ఫోన్లో మాట్లాడాను. అప్పటికి ఆయన చేసిన పరిశోధనల గురించి ఏమీ తెలీదు, విస్కాన్సిన్ యూనివర్సిటీలో తెలుగు పాఠాలు చెప్తారని, తెలుగు సాహిత్యం మీద పుస్తకాలేవో రాశారనీ వినటం తప్ప ప్రత్యక్షంగా ఏమీ చదవలేదు. ఆరోజుల్లో ఆస్టిన్‌లో కొందరు మిత్రులం కలిసి తెలుగు సాహిత్యం గురించి చర్చిస్తుంటామని ఆ ఫోన్ కాల్స్‌లో చెప్పిన గుర్తు. అలాగే కనకప్రసాద్ ఆయనకి అప్పటికే తెలుసు, అతను కూడ ఆస్టిన్ లోనే వుండేవాడు. మొత్తానికి హఠాత్తుగా ఒకరోజు తను ఫలానా రోజు ఆస్టిన్ కి వస్తున్నానని ఆయన ఫోన్లో చెప్తే డల్లాస్ నుంచి కన్నెగంటి చంద్రని, నందివాడ ఉదయభాస్కర్‌ని కూడ ఆహ్వానించాను. అలా 1998 ఆగస్ట్ ప్రాంతంలో అని గుర్తు, ఒక శనివారం నాడు ఆయన ఆస్టిన్ వచ్చారు. ఆ రోజంతా మా ఇంట్లో సాహిత్యగోష్టి జరిపాం. కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న, చంద్ర, ఉదయభాస్కర్ ఉన్నాం, కొలిచాల సురేశ్ కూడ కొంతసేపు ఉన్నట్టు అనుమానం (అప్పటికతను అట్లాంటా ఆస్టిన్‌ల మధ్య తిరుగుతూండేవాడు). రోజు గడిచింది, రాత్రయింది. ఐనా ఆ చర్చ అలాగే కొనసాగింది. అందరం మా లివింగ్ రూంలో పక్కలేసుకుని ఏ మూడింటికో పడుకున్నాం. అదో మర్చిపోలేని అనుభవం. మళ్ళీ ఎప్పుడూ అలా జరగలేదు.
ఆ చర్చలో ఎన్నో విషయాలొచ్చినయ్. నేను స్పష్టంగా గమనించిన ఒక సంగతి – ఆయన సాహిత్యాన్ని కూడ చాలా సైంటిఫిక్‌గా చూస్తారని. అది ఆశ్చర్యకరమైంది. సామాన్యంగా సాహిత్యానికీ సైన్స్‌కీ చుక్కెదురు. సాహిత్యచర్చల్లో సైంటిఫిక్ పద్ధతులు సాధారణంగా కనిపించవు – ఏదో నాకు తోచింది నేను చెప్తా, అదే సిద్ధాంతం అనే తరహా సాహిత్య విమర్శే తెలుగులో సార్వత్రికం గనక ఆయన పాటించే పద్ధతి మాకు నచ్చింది – అక్కడ వున్న వాళ్ళందరం వృత్తిరీత్యా సైంటిస్ట్‌లి, ఇంజనీర్లు కావటం వల్ల. ఇందుకో చిన్న ఉదాహరణ – క్షేత్రయ్య పేరుతో వున్న పదాలు రాసిన వ్యక్తి పురుషుడా స్త్రీనా అన్న మీమాంస. ఎటూ చెప్పటానికి ఆధారాలేవీ లేవని, కనక అతను పురుషుడే అని ఎలాటి అనుమానమూ లేకుండా చెప్పటం సాధ్యం కాదనీ నారా వాదన. అందుకు భాస్కర్ అదే వాదన కాళిదాసుకీ ఇతర పూర్వకవులు చాలామందికీ వర్తిస్తుంది కదా అని ప్రతివాదన చెయ్యటం ఇంకా బాగా గుర్తు. మరొకరైతే అలాటి ప్రతివాదనకి కోపం తెచ్చుకునే వారేమో కాని ఆయన మాత్రం “అది నిజమే, కాని కాళిదాసు స్త్రీ ఐనా పురుషుడైనా అది క్షేత్రయ్య గురించిన ప్రశ్నకి సమాధానం చెప్పటానికి పనికిరాదు గదా!” అనటం ఇప్పటికీ బాగా గుర్తు. మొత్తానికి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్నీ ఆ పది గంటల్లో చుట్టొచ్చాయి మా సంభాషణలు. సమకాలీన సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం, ఆయనకి చాలా ఇష్టమైన అంశం అని కూడ అర్థమైంది. అప్పటికే కన్యాశుల్కం అనువాదం ప్రారంభించారు, ఆ నాటకం గురించి కూడ ఆసక్తికరమైన చర్చ జరిగిందా రోజు. అందులో,
నదమా పొక్కిలి జాంబూ
నదమా మైచాయ కోకనదమా పదమా
పదమా జడ నడుము వియత్
పదమా …
అన్న పద్యాన్ని సరిగా విడగొట్టటానికి శ్రమ పడటం ఇంకా గుర్తుంది.
ఆ తర్వాత గత పద్నాలుగేళ్ళలో నాలుగైదు సార్లు కలవటం తటస్థించింది గాని ఎప్పుడూ అంత విపులమైన చర్చలకి అవకాశం కలగలేదు. ఈమాట ప్రారంభించాక ఆయనచేత వ్యాసాలు రాయించటానికి చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను. వెయ్యి గుళ్ళ పూజారి, ఎప్పుడూ ఎన్నో ప్రాజెక్టులు సాగుతూ వుంటాయి గనక ఆయన చేత రాయించటం అంత తేలికైన విషయం కాదని తొందర్లోనే అర్థమైంది. ఐతే వెంటబడి వదలకుండా విసిగిస్తే చివరికి మాట నిలబెట్టుకుంటారనీ తేలింది. అలా వచ్చినవే పఠాభి గురించి, అజంతా గురించి ఈమాట తొలిరోజుల్లో ఆయన రాసిన వ్యాసాలు.
నేను ఈమాట సంపాదక బాధ్యతల్ని వేలూరి గారికి అప్పగించాక నారాయణ రావు గారు ఎప్పుడో హఠాత్తుగా ఫోన్ చేసి ఏదో పద్యం తనకి నచ్చిందని దాన్ని గురించి చెప్పటం, ఏవన్నా పదాలకి అర్థాల గురించిన సందేహాల్ని చర్చించటం పరిపాటి అయింది. సంజయ్ సుబ్రహ్మణ్యం అన్నట్టు తనతో మాట్టాడుతున్న వాళ్ళందర్నీ తన సమకాలికులగానే చూడటం, అదే భావం వాళ్ళలో కలిగేట్టు చూడటం ఆయన ప్రత్యేకత అనిపిస్తుంది. ఆయనకి ఎనభై ఏళ్ళు నిండాయంటే ఆశ్చర్యం కలక్కమానదు.
ఈ సందర్భంగా ఒక చిన్న పిట్టకథ. 2002లోనో 2003లోనో శాన్ ఏంటోనియోలో స్టటిస్టీషియన్గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సి. ఆర్. రావు గారి ఎనభయ్యో జన్మదిన సందర్భంగా ఆయన శిష్య ప్రశిష్యులు ఒక సింపోజియం ఏర్పాటు చేశారు. మేం ఆ వర్గంలో లేకపోయినా నేను యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన కూడ అక్కడ పనిచెయ్యటంతో చాలా సోషల్ అకేషన్స్‌లో కలుసుకున్న పరిచయాన్ని పురస్కరించుకుని నేనూ, నాతో పాటు భాస్కర్, లక్ష్మన్న వెళ్ళాం (అలాటి సింపోజియం ఒకటి 2010 లో నారాయణ రావు గారి గౌరవార్థం మేడిసన్ లో జరిగిందని పరుచూరి శ్రీనివాస్ చెప్పారు). సి. ఆర్. రావు గారి గురించి అక్కడందరూ ముక్తకంఠంతో చెప్పిన ఒక విషయం నారాకీ వర్తిస్తుంది – అరవై ఏళ్ళు దాటాక ఆయన ఇరవై ఏళ్ళ కుర్రవాడిలా పనిచేస్తున్నాడని, ఇప్పటికీ ఆయన రాస్తున్న పుస్తకాలైతేనేం పేపర్లయితేనేం ఆయన వయస్సులో సగం వున్న వాళ్ళకీ సాధ్యం కాని పనులని. గత పది పదిహేనేళ్ళలో నారాయణ రావు గారు చేసిన పని చూస్తే వయసు దృష్ట్యా యువకులంతా సిగ్గు పడక తప్పదు.
ముగింపు
తెలుగు సాహిత్యానికి ప్రపంచ వేదిక మీద పటిష్ట స్థానం ప్రతిష్టించటానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు నారా. ఆయన అన్ని భావాలతో అందరూ అంగీకరించకపోవచ్చు, కొందరు కొన్నిటితోనైనా ఏకీభవించకపోవచ్చు. కాని తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయంగా ఇంతటి గుర్తింపు తెచ్చినవారు ఇప్పటివరకు ఇంకెవరూ లేరు. సమీప భవిష్యత్తులో ఇంకెవరూ కనిపించటం లేదు.
తెలుగు భాష దీర్ఘకాలపు మనుగడ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఓ పదేళ్ళ క్రితం లెక్కలు కట్టి 140 సంవత్సరాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ శాతం వుంటారని ఒక వ్యాసం రాశాను. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది బహుశా ఆశావహమైన అంచనాయేమో అనిపిస్తుంది. ఐనా కాకపోయినా, తెలుగు చదివే, రాసే వాళ్ళ శాతం ఒక తరాన్నుంచి మరో తరానికి తగ్గిపోవటం ప్రత్యక్ష సత్యం. ఇదిలాగే ముందుముందు సాగుతుండే అవకాశాలు చాలా అధికం, సాగకుండా పెరిగే అవకాశాలు స్వల్పం కనక తెలుగు సాహిత్యాన్ని రక్షించుకోవటానికి ఎక్కువ వ్యవధి లేదు. ఇంకా ఆగితే దాన్ని అర్థం చేసుకుని ముందుతరాలకి అందించగలిగే వాళ్ళు మచ్చుకి కూడా దొరక్కపోవచ్చు.
తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించాల్సిన బాధ్యత ఈ తరం వాళ్ళది. ఈ సౌధనిర్మాణానికి నారా గట్టి పునాదులు వేశారు. అందుకు నడవవలసిన దారి సుగమం చేశారు. సొంతంగా తలనెత్తుకున్న బాధ్యతని ఇతోధిక ఉత్సాహంతో నెరవేరుస్తున్నారు. ఆయన బాగానే చేస్తున్నార్లే అని పక్కన నిలబడి చోద్యం చూడటం సమంజసం కాదు. అందరూ తమ వంతు సాయం అందించాలి. ఎవరికోసమో కాదు, ఎవరికి వారే వారి స్వార్థం కోసం నారా పుస్తకాలు కొనండి. చదవండి, పిల్లలకి అందుబాటులో వుంచండి, ఎప్పుడన్నా ఏమీ తోచకపోతే చదువుతారు వాళ్ళు. తెలుగు సాహిత్యాన్ని గురించి కొంతైనా తెలుసుకుంటారు.