రచన – రచయిత
రామాయణం, మౌఖిక సాహిత్యం, చాటు సాహిత్యం, శతక సాహిత్యం, ఇలా అనేక సాహితీధోరణుల గురించి అర్థం చేసుకోవటానికి (రామాయణం అనేది ఒక గ్రంథం కాదని, అదీ ఒక సాహితీధోరణిగా లేక ఇంకా విశాలమైన ఒక ‘భాష’గా చూడాలనీ నారా ప్రతిపాదన) రచనలూ వాటి రచయితల గురించిన పాశ్చాత్య భావాలు ప్రతిబంధకాలై ఎన్నో తరాల పరిశోధకులని అగమ్య మార్గాలు పట్టించాయని నారా విశ్వాసం. పాశ్చాత్యుల దృష్టిలో ఒక రచన వుంటే దానికి ఒక రచయిత(లు) ఉండాలి. ఒకే కథ వివిధ రచనల్లో వుంటే వాటిలో ఒకటి మాతృక, మిగిలినవి దాని పుత్రికలై వుండాలి. ఒక రచనలోని ఒక భాగం మరో రచనలో వుంటే ఆ ఇద్దరు రచయితల్లో ఒకరు రెండవ వారి నుంచి తస్కరించి వుండాలి. ఏ రచయితా ఇష్టపూర్వకంగా తన రచనకి మరో రచయిత కర్తృత్వం ఆపాదించడు.
భారతీయ రచనల విషయంలో ఇలాటి పాశ్చాత్య భావాలు ఏవీ వర్తించవని గుర్తించటం నారా వెలుగు లోకి తెచ్చిన అంశాల్లో ముఖ్యమైంది. ఒకసారి ఈ భావనని గ్రహిస్తే కర్తృత్వం విషయంలో ఎప్పటినుంచో రాజుకుంటున్న ఎన్నో వివాదాల్ని తేలిగ్గా తేల్చెయ్యొచ్చు. ఉదాహరణకి: (అ) రామాయణాన్ని వాల్మీకి రాశాడా? అసలు ‘ఒక’ రామాయణం అనేది లేదు, ఎన్నో వున్నయ్. వాటిలో ఒకదాన్ని వాల్మీకి అనే కవి రాసుండొచ్చు, ఔననీ కాదనీ చెప్పలేం. కాని, అన్ని ఇతర రామాయణాలకీ మాతృక ఐన ఒక రామాయణం వుందని, దాన్ని వాల్మీకి రాశాడని అనుకోవటం మాత్రం పొరపాటు. (ఆ) మౌఖిక కావ్యాలు ఎవరు రాశారు? అసలీ ప్రశ్నే అర్థరహితం. ఏ కావ్యానికైనా మొదలు రాతతో కానక్కర్లేదు. మౌఖికంగా వందల, వేల ఏళ్ళనుంచి వస్తున్న కథలు ఎన్నో వున్నయ్. వాటిలో కొన్నిటిని ఎవరన్నా రాసి వుండొచ్చు గాని అంత మాత్రాన వాళ్ళు ఆ కథకి కర్తలు కారు. (ఇ) ఫలానా చాటు పద్యం ఎవరు రాశారు? ఎవరినా అయుండొచ్చు, వాళ్ళూ ‘రాసి’ వుండక్కర్లేదు. అది ఎవరి పేరుతో చలామణి ఔతుందో వాళ్ళకా పద్యంతో ఎలాటి సంబంధమూ ఉండకపోవచ్చు. ఇలా ఎన్నో కొరుకుడు పడని ప్రశ్నలకి సూటైన సమాధానాలు ఇవ్వవచ్చు.
పురాణాలు, అనేక ఇతర రచనలు ఎవరి కర్తృత్వంతో ప్రచారంలో వున్నాయో వాళ్ళు రాసినవు కావని ఖచ్చితంగా చెప్పొచ్చు. నిరపేక్షగా రచనలు చేసి ఎవరో పెద్దవారి పేరు మీద వాటిని ప్రచారం చెయ్యటం అచ్చు యంత్రానికి ముందు సర్వసాధారణ విషయం. కవిగా పేరు తెచ్చుకోవటమే గాని ‘ఫలానా రచనకి రచయితగా’ పేరు తెచ్చుకోవటం అప్పట్లో అంత గొప్ప విషయంగా కనిపించదు. ముఖ్యంగా రాజాస్థానాల్లోనో, పెద్ద దేవాలయాల్లోనో ఆశ్రయం లేని వాళ్ళకి.
కనక, ఒక రచనని తీసుకుని, దీన్ని రాసింది ఫలానా వాళ్ళా కాదా? అని సిగపట్లు పట్టుకోవటం సమయం వృథా చేసుకోవటానికి తప్ప సాహిత్య చరిత్రకి ఉపయోగపడే పని కాదు. అంతకన్నా, ఆ రచనని కూలంకషంగా విశ్లేషించి దాన్నుంచి ఆ రచనని సాధ్యం చేసిన సందర్భాన్ని అంచనా వెయ్యటానికి ప్రయత్నించటం ఉత్తమ మార్గం.
ఆధునికత
చాలామంది పాశ్చాత్యులు, కొందరు భారతీయులూ కూడ ముస్లిం దండయాత్రలకి ముందు వరకు భారతదేశంలో ఉన్నత సంస్కృతి ఉండేదని, ముస్లిం పరిపాలనా కాలంలో అది దిగజారిపోయిందని, బ్రిటీష్ వారి పాలనలో పూర్వపు ఔన్నత్యం ఆధునికతా అలంకారాలతో మళ్ళీ పునరుద్ధరించబడిందని సిద్ధాంతీకరించారు. ఈ భావన ప్రకారం బ్రిటీష్ వారి పాలనలో లేని ప్రాంతాల్లో, కాలాల్లో భారతీయ సంస్కృతి క్షీణదశలో వుంది. బ్రిటీష్ పాలనే ఆధునికతకి నాంది.
ఇది దోషభూయిష్టమైన సిద్ధాంతం అని నారా వాదన. నాయకరాజుల కాలంలో వచ్చిన అనేక కావ్యాల ఆధారంగా ఇప్పుడు మనం ఆధునికతా లక్షణాలుగా లెక్క వేసేవి ఎన్నో అప్పటి సమాజంలో ఉండేవని నిరూపించారు. అంతకన్నా ముందు వచ్చిన కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం ఆధునికతకి పెద్దపీట వేశాయని చూపించారు. ఇంకా ముందున్న అన్నమయ్య ఎంతో ఆధునికుడని నిశ్చయించారు. శతక కవులు ఆధునికతని పుణికి పుచ్చుకున్నారని చూపారు. శ్రీనాథుడి సుకుమారుడి కథ ఈనాటి నవలికల్తో పోల్చదగిందని, కళాపూర్ణోదయం అచ్చమైన నవల అని నిర్ధారించారు. ఇలా అనేక విధాలుగా ఆధునికతని వందల ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళి వలస సంస్కృతికీ ఆధునికతకీ జనక జన్య సంబంధం లేదని ఢంకా మోగించి చాటారు.
కొత్త చూపు
ప్రతి విషయాన్ని ఒక కొత్త దృష్టితో చూడటానికి ప్రయత్నించటం నారాలో కొట్టొచ్చినట్టు కనిపించే మరో గుణం. ఇది ఆయన రచనలన్నిటా సర్వవ్యాపకంగా వుంటుంది. కవితా విప్లవాలని గుర్తించటంలో, అదివరకు పరిశోధకుల వివరణల్ని పూర్వపక్షం చెయ్యటంలో, ఆ గ్రంథాన్ని వాడుక భాష వంటి సాంకేతిక భాషలో ఎంతో పటిష్టంగా రాయటంలో మొదటగా కనిపించిన ఈ లక్షణం తర్వాతి అన్ని రచనల్లోనూ స్పష్టంగానే వుంది. ముఖ్యంగా చాటుపద్యాల గురించిన పరిశోధన ఆయన లోచూపుకి మహోన్నత శిఖరాయమానం అని నా అభిప్రాయం. అప్పటి వరకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి వున్న వాళ్ళందరికీ తెలిసిన పద్యాలే ఇవి. ఎందరో పెద్దలు, ఉద్దండులు వాటితో కుస్తీ పట్లు పట్టిన వారే, వాటి ఆధారంగా కథలల్లి పుస్తకాలు రాసిన వారే. నారా వాళ్ళెవరికీ కనపడని లోతుల్ని, కోణాల్ని చూశారు. బహుశా పదిహేడో శతాబ్ది ప్రాంతంలో దక్షిణ భారతంలో చాటుపద్య వ్యవస్థ ఒకటి రూపు దిద్దుకున్నదని, కవిత్వపు లోతుల్ని తీక్షణంగా చూడగలిగిన రసగ్రహణ పారీణులు ఇందులో భాగంగా వున్నారని ప్రతిపాదించారు. తెలుగు, సంస్కృత, తమిళ సంప్రదాయాల్నుంచి చాటు రచనలని, వాటికి అనుబంధంగా వున్న కవుల కథల్ని విశ్లేషించి వీటన్నిటికీ ఎన్నో సామాన్య సారూప్య లక్షణాలున్నాయని గుర్తించి వాటిని విశదీకరించారు. వాటినుంచి చాటు వ్యవస్థ రూపురేఖలని, ఎదుగుదలని వివరించి ఈ సిద్ధాంత బలంతో చాటు పద్యాల్ని ఎలా విశ్లేషించవచ్చునో చూపారు. నారా పరిశోధనల్లో ఒక్కదాన్ని అన్నిటికన్నా మిన్నగా ఎత్తిచూపాలంటే అది ఇదే, నా దృష్టిలో.
కన్యాశుల్కం విషయం లోనూ ఆయన విశ్లేషణ ఆశ్చర్యం కలిగిస్తుంది. గత వందేళ్ళలో కన్యాశుల్కం గురించి మాట్లాడని లేదా రాయని తెలుగు కవి గాని విమర్శకుడు గాని బహుశా లేరు. ఐనా వాళ్ళెవరూ చూడని పార్శ్వాల్ని చూడగలటం, వాటిని సహేతుకంగా చర్చించి పాఠకుల చేత నిజమే అనిపించటం అసాధారణ విషయాలు. ఇంతకుముందు వరకు అందరూ కన్యాశుల్కం ఆశించిన ప్రయోజనం సంఘసంస్కరణ అని ఒప్పేసుకున్న సందర్భంలో దాన్లో సంఘసంస్కరణ మచ్చుకైనా లేకపోవటమే కాదు, అది సంఘసంస్కరణ భావాలకే వ్యతిరేకం అనే సాహసం బహుశా ఆయనొక్కడే చెయ్యగలడు.
ఆమూలాగ్ర దృష్టి
ఒక కావ్యం చదువుతుంటే దాదాపు అందరి దృష్టీ ఉండేది ప్రస్తుతం చదువుతున్న ఒక్కొక్క పద్యం మీద. ఆ పద్యం గురించి కొందరు తీవ్రంగా ఆలోచిస్తారు, లోతుగా విశ్లేషిస్తారు, దాన్లోని పదాల్ని, పదబంధాల్ని, వాటి సంబంధాల్ని, శబ్దస్వభావాన్ని, శబ్దార్థ సంయోజనాన్ని – ఇంకా ఓపికుంటే రసాల్ని, అలంకారాల్ని చూస్తారు, నచ్చితే మెచ్చుకుంటారు. మొదటి నుంచి చివరి వరకు కలిసి ఒకే ఒక అవిభాజ్య మొత్తంగా ఆలోకించేవారు, ఆలోచించేవారు అరుదు. అలాటి అరుదైన వారిలో ఒకరు నారా. కాకుంటే మరెవరు “ఆముక్తమాల్యదలో తొలికథ ఖాండిక్య కేశిధ్వజులదైతే, చివరి కథ మాలదాసరిది ఎందుకైంది? ఆ రెంటిని అలా వుంచి కృష్ణరాయలు ఏం చెప్తున్నాడు?” అని అడగ్గలరు?
అలా చూడగలగటం వల్లనే కళాపూర్ణోదయాన్ని నవలగా, సుకుమారుడి కథని నవలికగా గుర్తించటం సాధ్యమైందనుకుంటాను. కన్యాశుల్కంలో సంస్కరణ లేదనటానికి, క్రీడాభిరామం బాఖ్తిన్ (Mikhail Bakhtin) కార్నివల్ సిద్ధాంతానికి విరుద్ధమైన ఉదాహరణ అని చెప్పటానికి ఇలాటి ఆమూలాగ్రదృష్టి అవసరం. శ్రీనాథుడి శృంగార నైషధాన్ని శ్రీహర్షుడి మూలంతో పోల్చి ఎక్కడ శ్రీనాథుడు మూలాన్ని మించాడో చెప్పాలన్నా, భీమేశ్వర స్థలపురాణం చాలాభాగం శ్రీనాథ సృష్టి అని గుర్తించాలన్నా అది లేకుండా సాధ్యం కాదు.