- వలసపాలనకు క్రైస్తవ మత ప్రచారానికి ఎడతెగని సంబంధం ఉంది. క్రైస్తవ మతానికి భారతీయులు అధిక సంఖ్యలో మార్పిడి చెందితే అదే మతానికి చెందిన వలసపాలకుల పట్ల విధేయత ప్రదర్శిస్తారన్న అంచనా వలసపాలకులు క్రైస్తవ మతప్రచారకులని ప్రోత్సహించడానికి దారి తీసింది. వలస పాలకుల తరహాలోనే క్రైస్తవ ప్రచారకులు భారతీయులది అధమ సంస్కృతి అని, భారతీయ మతాలు అసత్యమైనవి అని, మూఢ నమ్మకాల పుట్టలని ప్రచారం చేశారు. మతమార్పిడి ప్రయత్నాలు విజయవంతం కాకపోతే, ఆటంకం కలిగిస్తున్నది కుల వ్యవస్థే అని నిర్ధారించి కులాన్ని రూపు మాపాలన్న వాదన మొదలు పెట్టిన వారయ్యారు.
- వలసపాలన క్రమంలో భారతదేశానికి వచ్చి పని చేసిన ఉదారవాదుల (Liberals) జీవితాలని, పనిని వలసవాద భావజాలంలో భాగం గానే చూడాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో ఒక్కోక్కసారి నిస్వార్థం, త్యాగం కనిపించినంత మాత్రాన వారి భావప్రపంచం గురించి తప్పు అంచనా వెయ్యకూడదు. భారతదేశానికి వచ్చి స్థిరపడి, ఇక్కడే మరణించిన క్రైస్తవ మత ప్రచారకుడు వ్యక్తిగతంగా నిస్వార్ధపరుడే అయినా వలసపాలనకు చేయూత ఇచ్చిన వాడే, వలసభావాల ప్రచారంలో పాలు పంచుకున్న వాడే. దక్షిణ భారతదేశంలో పని చేసి రాయలసీమలో మరణించిన మద్రాసు రాష్ట్రపు గవర్నరు థామన్ మన్రో రైతు పక్షపాతి కాదు, వలసపాలక వర్గ ప్రతినిధి. ఆనకట్టలు కట్టించిన ఆర్థర్ కాటన్ ప్రమేయం వలన కోస్తా ఆంధ్ర రైతాంగం బాగుపడి ఉండవచ్చును గాని ఆయన ఆనకట్టలు కట్టించింది రైతాంగాన్ని బాగు పరచటానికి కాదు. లాభపడింది రైతాంగం మాత్రమే కాదు. అంతరిస్తున్న భాషలని, సాహిత్యాన్ని ఒంటి చేత్తో పునరుద్ధరించామని గొప్పలు చెప్పుకున్న అధికారులు, మిషనరీలు చేసిన పనిని కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. నిజంగానే వారు ఒంటరి పోరాటం చేసి పునరుద్ధరించారా? పునరుద్ధరణ పేరుతో వారు చేసిన ప్రయత్నం వల్ల ప్రయోజనం ఎంత కలిగింది? హాని ఎంత కలిగింది? అనే ప్రశ్నలను బేరీజు వెయ్యవలసిన అవసరం ఉంది.
ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎంతో రాయొచ్చు. స్థలకాలాభావాల వలన వీటితో సరిపెట్టుకుంటాను. ముగింపుగా కొన్ని విషయాలు చెబుతాను. వలసపాలకులకు భారతీయ విజ్ఞానం అంటే పట్టింపు లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఆ కారణాలు కొన్ని వివరించాను. మన విజ్ఞానం అంటే మనకే పట్టింపు లేని పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో మనకు కనపడుతుంది. ప్రతిరోజూ పూర్వచరిత్రకు సంబంధించిన దాఖలాలు ధ్వంసమవుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బకాసురులకు చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతతో పని లేదు. చారిత్రక కట్టడాల పరిరక్షణలో బెంగాల్ విభజన చేసిన లార్డ్ కర్జన్ కున్న శ్రద్ధ కూడా మనకు లేదు. తాళపత్ర గ్రంథాలు, ఇతర రాతప్రతులు, శాసనాలు, లౌక్యం తెలియని పరిశోధకులు కొందరు కొన్ని దశాబ్దాల క్రితం సేకరించారు గాని ఆ ముఖ్యమైన పని కొనసాగించాలన్న ఆలోచన మనకు లేదు. అచ్చుయంత్రం వచ్చిన తరవాత పంతొమ్మిదవ శతాబ్దం నుండి భారతీయ భాషలలో ప్రచురించిన లక్షల కొద్దీ పుస్తకాలు ఆర్కైవులలో పాత గ్రంధాలయాలలో శిథిలమై పోతున్నాయి. వాటిని కాపాడుకోవాలని, డిజిటైజ్ చేయాలని ఔత్సాహికులు కొందరు ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళది వ్యక్తిగతమైన చొరవే కాబట్టి సాధించగలిగింది కొంతే. ఏమైనా అటువంటి పనుల వల్ల మన ఆస్తులు ఆదాయాలు వృద్ధి చెందవు.
ఆధునిక సంస్కృతి విస్తరణ వలన, ప్రపంచీకరణ వలన మన గ్రామాలలోని వివిధమైన వృత్తులు, జీవనశైలులు అంతరిస్తున్నాయి. అక్షరాస్యత లేని జనసమూహాలు ఏర్పరిచిన మౌఖిక సంప్రదాయాలు, కథలు, పాటలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మొక్కలు, ప్రాణులు అంతరించినందువలన పృధ్వి మీద పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో, సాంస్కృతిక వైవిధ్యతలో జరుగుతున్న ఖననం వలన మానవ సమాజ భవిష్యత్తుకు అంతే హాని సంభవిస్తుంది.
అంతే కాదు. ఒక వ్యక్తి అస్తిత్వ సాధనకు తనదైన ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకోవడం ద్వారా పొందే ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో, ఒక సమాజపు అస్తిత్వ వృద్ధికి కూడా ప్రత్యేక శైలి, ఆత్మవిశ్వాసం అవసరం. ఆ ఆత్మవిశ్వాసం వివిధంగా వెల్లి విరిసే భాషలు, సంస్కృతుల నుండే వస్తుంది. యూరప్‌లో ఆధునికత అభివృద్ధి చెందినా, ఆ క్రమంలో అనేక జీవనశైలులు అంతరించినా, ఆ సంస్కృతులకు సంబంధించిన విజ్ఞానం, ఎరుక, జ్ఞాపకాలను కాపాడుకొనే ప్రయత్నం అందుకేనేమో చేశారు. ప్రాచీనతను పాతర పెట్టలేదు. ఆధునికతలో మేళవించే ప్రయత్నం చేశారు. కొద్ది సంఖ్యలోనైనా విద్వాంసులు గ్రీక్, లాటిన్ లాంటి ప్రాచీన భాషలు, వాటిలో సాహిత్యం అధ్యయనం చెయ్యడానికి వనరులు ఏర్పాటు చేశారు.
ఆ స్పృహ మన సమాజంలో కనిపించదు. మన వైవిధ్యాన్ని చంపుకొని ఇతరుల సంస్కృతిని మనం అనుకరించుకుంటూ పోతే ఆ ఇతరులు మనలని గౌరవించరు. అనుకరిస్తున్నామని తెలుసు కాబట్టి మనలని మనం గౌరవించుకోలేం. అర్థ సంపాదనే మనిషికి సంతోషం కలగజేస్తుందనే అపోహ లోంచి మనలో కొందరమైనా బయటపడి ఉండాలి. మన సమాజానికి వైవిధ్యపు అవసరం మీద, మన భవిష్యత్తు మీద మనకు సరైన అవగాహన ఎందుకు లేకుండా పోయిందన్న ప్రశ్నకు, 2009లో నారాయణ రావు గారు, పరుచూరి శ్రీనివాస్, నేను మ్యూనిక్‌లో పెయింటింగ్ గాలరీలు చూసి వచ్చి బైట నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు, నారాయణ రావు గారు చెప్పిన సమాధానం — “వలసపాలన వలన మనకు జరిగిన కీడు ఆర్ధికంగా వెనుకబాటుదనం, రాజకీయ దాస్యం కాదు — మనం మన అభిరుచిని (taste) కోల్పోవడమే మనకు జరిగిన దౌర్భాగ్యం” — ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది.