ఉరుము ఉరిమి…
రెండ్రోజుల్నుంచి రాని పనమ్మాయి గురించి - నేనూ, మా అత్త గారూ ఒకటే బెంగ పడిపోతున్నాం. మా ఇద్దరి మనసుల్లోనూ ఒకటే దిగులు. అది ఇక రాదని!
“మానేసిందంటావా? చెప్పా పెట్టకుండా?” అడిగారు మా అత్తగారు బేలగా.
“ఏమో..ఏవేండ్సిందో! ఎవరికి తెల్సు?” నాగమ్మ మీద కోపమంతా నా మాటల్లోకి దూసుకొచ్చింది.
“మొన్ననేగా ఇంట్లో పాత బట్టలన్నీ మూట కట్టి మరీ దానం చేశాం! ఏమొచ్చిందట మానేయడానికి?” మా అత్త గారిక్కూడా వొళ్ళు మండిపోతోంది పాపం!
“బట్టలేం ఖర్మా… వర్షాకాలమని పాత గొడుగు, రెయిన్ కోట్ కూడా ఇచ్చాం. త్వరగా వంట చేసుకుని తగలడుతుంది కదాని పాత కుక్కర్ ఇచ్చాం. పోన్లే కదా, మనసు పడుతోందని కొత్త హాండ్ బాగ్ కూడా కొనిచ్చాం. అంతెందుకు మొన్నటికి మొన్న పిల్లోడ్ని స్కూల్ లో వేశామని చెప్తే డబ్బు సాయం కూడా చేశాం. ఔనా? ఇహ ఇంత కంటే ఏం చేసి చస్తాం చెప్పండి?”
“అవునవును. ఎంత చేసినా అంతే! వీళ్ళ బుధ్ధులు మారవు. ఓ యాభై ఎక్కువిస్తామంటే చాలు. పాతిల్లు వొదిలేసి కొత్తిల్లు పట్టుకుంటారు. మనుషుల్లో విశ్వాసం వుండేడిస్తేగా? ఛీ! పని వాళ్ళంటేనే విరక్తి పుడ్తోంది.” అన్నారు బాధగా . అంతలోనే ఆవిడ గాలి నా మీద వీచింది, ఋతు పవనాలు కేరళ నుంచి ఆంధ్ర లోకి జొరబడ్డట్టు.
“అంటున్నానని కాదు కానీ, దానికసలు భయం భక్తీ లేకుండా చేసింది నువ్వే” అన్నారు అక్కసంతా నా మీద వెళ్ళబోస్తూ. అత్త మీద కోపం దుత్త మీద చూపటం అంటే… ఇదే మరి!
నాగమ్మ పని మానేయడానికి నన్ను కారణం చేస్తున్నందుకు నాకైతే భలే మండుకొచ్చింది. శాసన సభలోలా, ఈ సంసారంలో - ఈవిడ ఎప్పుడు ప్రతిపక్షమౌతుందో, ఎప్పుడు మిత్రపక్షం వహిస్తుందో తెలీదు. తను నాకు అత్తగారన్న సంగతి ఆర్నెల్లకో సారి ఇదిగో ఇలా గుర్తు చేస్తూ వుంటుంది. సుర్రుమంది మనసు. పీకల దాకా వచ్చిన కోపాన్ని నిభాయించుకోవాల్సొచ్చింది. ఎందుకంటే - నన్ను హోం మినిస్టర్ని చేస్తూ, కుటుంబ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతను మా ఆయన నాకప్పచెప్పినందుకు కావొచ్చు! పైకి శాంత స్వభావాన్ని నటిస్తూ…
“మీరు భలే వారండి అత్తయ్యగారూ! నన్నేదో అనాలని అంటమే కానీ, మధ్యన నేనేం చేశానూ?” అని అన్నాను, నాకు సాధ్యమైనంత పరిధిలో నవ్వడానికి ప్రయత్నిస్తూ.
“ఏం చేసానంటావేమిటీ? ఎప్పుడడిగితే అప్పుడు లెఖ్ఖా పత్రం లేకుండా డబ్బులిచ్చి దాన్నిచెడగొట్టలేదూ?”
నాకు తిక్క రేగింది. పీకలోనే ఆడశివుడిలా ఆపిన కోపం ఎగతన్నుకొచ్చింది.
“ఏం! మీరు మాత్రం తక్కువా? అదేదో మీకు చుట్టమైనట్టు ‘ నాగీ, వొసే నాగీ ‘ అంటూ ముద్దుగా పిల్చుకోలేదా? నేను చూస్తున్నప్పుడో సారి, చూడకుండా రెండో సారి దానికి పీకల్దాకా కాఫీలు తాగించింది ఎవరట? అహ! అంటున్నానని కాదు. రాత్రి మిగిలిన అన్నం మీరు తిని, వేడి వేడి టిఫినీలు చల్ల చల్లగా కూల్‌డ్రింకులూ దాని మొహాన దిమ్మరించిందీ, దాని అడుగులకు మడుగులొత్తి, ఇంతెత్తు బ్రహ్మరథం పట్టిందీ, మీరు కాదూ? దాన్ని ఎక్కడుంచాలో అక్కడుంచకుండా చనువిచ్చి, నెత్తి నెక్కించుకుంది మీరా? నేనా అంష?” నిర్మొహమాటంగానే అడిగేశా. కాదు, కడిగేశా. అప్పుడు కాని శాంతించలేదు.
అవును మరి. ఎంత మా ఆయనకి తల్లైతే మాత్రం నా ఆత్మ శాంతి కంటే గొప్పదేమిటీ, అత్తగారు!
ఆవిడ అవాక్కయ్యారు. ఏదో సాఫ్ట్ వేర్ పిల్లనుకుంది కానీ, ఇంత హార్డ్ వేలో కదం తొక్కుతానని ఆవిడా పాపం అనుకుని వుండదు. అనుకోనిది జరగడమేగా జీవితం!
నాకు తెలీకుండా తను చేసిన పన్లనీ నాకు తెల్సిపోయాయని తెల్సుకున్న ఆవిడ - నీళ్ళు నముల్తూ, నా వైపు అసహాయంగా చూసింది.
“అదేమిటే అలా అంటావ్? నేనేం చేసినా ‘నీ సుఖం కోసమే’ అని నీకు తెలీదుటే శ్యామూ?! అది పని మానేస్తే ఇంటా బయటా నువ్వెక్కడ కష్ట పడతావోననేగా నా బాధంతా..” అంటూ ఆవిడ కళ్ళొత్తుకుంటుంటే నాకూ నీళ్ళు తిరిగాయి.
వెంఠనే నేనూ కరిగిపోయాను. ఆవిడ కాబట్టి ఆ ఒక్క డైలాగుతో - ఇంట్లో సునామీని తప్పించింది. అంతే కాదు. నన్ను గొప్ప స్పృహలోకి కూడా తీసుకొచ్చి పడేసింది. ‘ఛ! అశాశ్వతమైన పనమ్మాయి కోసం, శాంత కుమారి లాంటి అత్తగార్ని ఎంత అపార్ధం చేసుకున్నాను!’ పశ్చాత్తాపంతో గుండె కలుక్కుమంది. బరువెక్కిపోయింది. దీనికంతటికీ కారణం నాగమ్మ! అవును. నా… గ… మ్మ…!’ తలచుకోగానే తెలీని ఆవేశం కట్టలు తెంచుకుంది. వూపిరి సెగలవుతుంటే, పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ…
“అత్తయ్యగారూ! మనల్నింతగా క్షోభ పెట్టిన నాగమ్మకిక మనింట్లో స్థానం లేదంతే. ఈ సారి తిరిగొస్తే చూడండి నేనేం చేస్తానో నాకే తెలీదు. దానికి - మనింటి చీపురు పుల్ల సైతం తాకే అర్హత లేదని చెప్పేస్తాను. ఇప్పుడే దాని జీతం డబ్బులు లెఖ్ఖ కట్టి, దాని మొహాన విసిరి కొ…”
“అమ్మగోరు!”
ఇద్దరం గిరుక్కున వెనక్కి తిరిగి చూశాం. ఎదురుగా నాగమ్మ!
చూసి వులిక్కిపడ్డాం. దాన్ని చూసీ చూడ్డంతోనే మా ఇద్దరి కోపాలూ నిప్పుల మీద నీళ్ళు జల్లినట్టు చప్పున చల్లారి పోయాయి. హమ్మ! రాదనుకున్న నాగమ్మ వచ్చేసింది! మా మొహాలు పెట్రొమాక్స్ లైట్లకి మల్లే వెలిగిపోయాయి.
నాగమ్మ వులుకూ పలుకూ లేకుండా తలొంచుకు నిలబడింది. దాని దీనవదనం చూసి “అయ్యో! అయ్యో! అదేమిటే నాగీ! అలా అయిపోయావ్?” అంటూ మా అత్తగారు తెగ హడావుడి పడిపోయారు.
“అవునండత్తయ్యగారూ! లంఖణాల బండిలా అయిపోయింది. ప్చ్… ప్చ్…” నాకూ దాన్ని చూసి బెంగ పుట్టింది.
“నీ దుంపతెగ! కళ్ళేమిటే అలా వాచాయి? బూరెల్లా?”
“వాడు దీన్ని మళ్ళీ చచ్చేట్టు బాదినట్టున్నాడండీ. అవునా నాగమ్మా?” లాలనగా అడిగా. మాకు తెలుసు. దాని మొగుడు ఒట్ఠి తాగుబోతు. కొట్టి చంపుతాడు.
“…..”
అది కళ్ళొత్తుకుంటూ పెరట్లోకి కదలబోయింది. మా అత్తగారు రెండు చేతులూ బార జాపి, దారికి అడ్డంగా తడిక కట్టింది.
“అయ్యో! ఇంత బాధ పెట్టుకునీ, పని చేస్తావుటే? పాడు పని! తర్వాత చేద్దువులే. అంత మానవత్వం లేని మనుషులమనుకుంటున్నావా ఏమిటీ మమ్మల్ని? ఆ?! ముందు అలా కూర్చో.” అంటూనే, మరో వైపు నన్ను -
“అమ్మాయ్! నువ్విలా వచ్చి కాసేపు దాన్ని వోదార్చు. రెండు నిముషాల్లో కాఫీ, టిఫినూ తెస్తాను. దానిక్కొంచెం ప్రాణం వస్తుంది” అంటూ వంటింట్లోకి ఎగిరి దూకారు. నాకాశ్చర్యమేసింది. మోకాళ్ల నొప్పులెక్కడికి పోయాయోనని.
అత్తగారి ఆజ్ఞ మేర క్షణమైనా ఆలస్యం కాకుండా నేను స్వామిని దయానందిని పాత్రలోకి మారి పోయాను.
“ఏడవకు నాగమ్మా! అంతా నీ ఖర్మ! దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. నువ్ మాత్రమేం చేస్తావ్? మా బామ్మెప్పుడూ చెబుతుండేది. మంచి అన్నంలోకి మంచి కూర దొరకదని. అంటే మంచి ఆడవాళ్ళకి చెడ్డ మొగుళ్ళు తప్పదని అర్థం. రాతలో వుంటే అనుభవించక తప్పదు నాగమ్మా! తప్పదు! ఇటు చూడు. పిచ్చి మొహమా! రెండ్రోజుల్నించీ తిండీ తిప్పలు లేకుండా ఇలాగే ఏడుస్తూ కూర్చున్నావా? ఆ!? మంచి దానివేలే! ఇదిగో, ముందు ఈ నీళ్ళు తాగు. నోట్లోంచి కాస్తంత మాటైనా వస్తుంది.”
“…”
“నీకేం భయం లేదు. మేమున్నాం. సారుకి చెప్పి మీ ఆయనకి బుధ్ధొచ్చేలా, మేమేదో ఒహటి చేస్తాంలే! ఏం చేస్తున్నారో చూసి ఆయన్నిప్పటికిప్పుడే పంపిస్తానుండసలు!” అంటూ దాని కన్నీళ్ళు తుడిచి, నోటికి మంచినీళ్ళ గ్లాసందించా.
ధబ్ మన్న శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తిని కదా, మా ఆయన! నిచ్చెనాకారంలో నిగడ దన్ని, సోఫాలో పడిపోతూ కనిపించారు. పాపం! కళ్ళు తిరిగాయి కామోసు!
జంపాల చౌదరి అభిప్రాయం:
July 3, 2012 5:50 pm
బాగుంది.
vishnuvandana అభిప్రాయం:
July 4, 2012 11:18 am
చెప్పటానికి మాటలు లేవు. హ హ హ
naren అభిప్రాయం:
July 4, 2012 11:57 pm
సహజంగానే అనిపించింది.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 5, 2012 12:13 am
గౌరవనీయులైన జంపాల చౌదరి గారికి, విష్ణువందన గారికి, నరేన్ గారికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో-
ఆర్.దమయంతి.
hemalatha putla అభిప్రాయం:
July 9, 2012 7:13 am
:) హ హ హ… చాలా సహజంగా వుంది.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 9, 2012 4:16 pm
హేమలత గారూ.. చాలా చాలా థాంక్స్..
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
DVR BHASKAR అభిప్రాయం:
July 11, 2012 4:15 am
మీ కథ చాలా బాగుంది. శైలి సహజ సుందరంగా ఉంది. ఇంత చక్కటి కథను అందించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 11, 2012 8:10 pm
భాస్కర్ గారూ!
మీ కాంప్లిమెంట్స్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ..
ధన్యవాదాలతో -
ఆర్.దమయంతి.
pandu అభిప్రాయం:
July 13, 2012 8:50 am
చాలా బాగుంది. ఇవి అన్ని ఇళ్ళలో రొజు మామూలే, పనిమనుషులతో.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 15, 2012 9:12 am
అవునండి! అందరిళ్ళల్లో జరిగే సంగతే..కథ గా రాశాను. నచ్చి నందుకు సంతోషం గా వుంది.
కృతజ్ఞతలతో ..
-ఆర్.దమయంతి.
మోహన అభిప్రాయం:
July 15, 2012 11:44 am
స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు - మోహన
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 17, 2012 1:09 am
‘స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు - మోహన.‘
* అదే బెటరనిపిస్తుంది మోహనగారూ!
మాకొక డ్రైవర్ వుండే వాడు. పేరు మునిరాజ్. ఎప్ఫుడూ టైం కి వచ్చేవాడు కాడు. ఫోన్ చేసి, ఎక్కడున్నావని అడిగితే, ‘ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా సార్..’ అనే వాడు. ‘ఐతే ఏం చేయమంటావ్’? ఆఫీస్ మానేయమంటావా? అని విసురుగా అడిగితే… ‘మానేయడం ఎందుకు సార్? మీరు బేగ ఫలానాచోటు కొచ్చేస్తే, నేనాడ్నుంచి తోలుకుపోతా’ అంటూ ఓ ఉచిత సలహా చెప్పేవాడు. పైగా, ‘అలా ఐతేనే, మనకు టైం కల్సొస్తుంద్సార్. మీరు త్వరగ ఆఫీస్ కి పోవచ్చు, (ఆలోచించుకోండి)’ అంటూ ఓ సూచన కూడా పడేసే వాడు.
చెబితే నవ్వుతారు కానీ, చివరికి అదే జరిగేది. అతను చెప్పినట్టే నడుచుకునే వాళ్ళం. అలనాడు - రథసారధి గీతోపదేశంతో అర్జునునికి జ్ఞానోదయమైనట్టు, మాకూ ‘కాల జ్ఞానం’ కలిగింది ఈ డ్రైవర్ల వల్ల! అందుకని, మేమే ఓ అడుగు ముందుగా బయల్దేరే వాళ్ళం. “ఏమిటీ! ఇంత త్వరగా,?” అని ఎవరైనా అడిగితే “డ్రైవర్ని పికప్ చేసుకోవాలి!” అంటూ మా జోక్ కి మేమే నవ్వుకునే వాళ్ళం.
ఇలాంటి ‘బద్ధకిష్టుల’ పట్ల మనకు - మానవతా దృక్పధం మెండుగా వుంటే తప్ప, భారత దేశంలో నవ్వడం సాధ్యం కాదని స్వానుభవంతో తెలుసుకున్నా.
థాంక్స్ మోహన గారూ! నా రచన బావుంది అన్నందుకు!
నమస్సులతో-
ఆర్. దమయంతి
Krishnamohanreddy అభిప్రాయం:
July 21, 2012 11:14 am
కథ విషయం కంటే శైలి చాలా బాగుంది. నాకైతే మధురాంతకం రాజారాం గారి హాస్య శైలి గుర్తుకు వచ్చింది
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 22, 2012 11:34 pm
‘ కథ విషయం కంటే శైలి చాలా బాగుంది. నాకైతే మధురాంతకం రాజారాం గారి హాస్య శైలి గుర్తుకు వచ్చింది ‘
-Krishnamohanreddy
* హబ్బ! నాకెంతో ప్రియమైన రచయిత - మధురాంతకం రాజారాం గారు! నా కథ చదువుతూంటే..వారి శైలి గుర్తుకొచ్చిందని, మీరంటే - ..ఎంత ఆనందమేసిందో..చెప్పలేను.
ఇంత మంచి ప్రశంసనిచ్చినందుకు - థాంక్యూ, కృస్హ్ణమోహన్ రెడ్డి గారూ! థాంక్యూ!
నమస్కారాభినందనలతో-
ఆర్.దమయంతి.
రాజీవుడు అభిప్రాయం:
July 24, 2012 5:24 pm
“ఏం! మీరు మాత్రం తక్కువా?..” నుండి పాత్రల సంభాషణ హాస్యం పండించిందండీ..
Seetha kumari అభిప్రాయం:
July 25, 2012 7:13 pm
నాకు మా ఇంట్లో సన్నివేశాల్లానే అనిపించాయి, చక్కని శైలి.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 25, 2012 10:40 pm
“ఏం! మీరు మాత్రం తక్కువా?..” నుండి పాత్రల సంభాషణ హాస్యం పండించిందండీ..”
* థాంక్సండి రాజీవుడు గారు! పాత్రల సంభాషణ లో హాస్యం పండింది అన్నందుకు!
ఇలాటి చిన్నిచిన్ని ప్రశంసలే పెద్ద పెద్ద ఆనందాలౌతాయి రైటర్స్ కి! . థాంక్యూ!
* Seetha kumari గారూ! నిజంగా ఇంట్లో జరిగిందే రాశాను. మీరందరూ శైలి
‘చక్కదనం’ గురించి చెబుతూంటే -అదంతా ‘ మన తెలుగు భాషా సౌందర్యం కదా ‘ అని.. గర్వంగా వుంటుంది.
మీ ఇరువురికి -
మనః పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ..
నమస్సులతో-
ఆర్.దమయంతి.
Sowmya అభిప్రాయం:
July 27, 2012 2:29 am
:) బాగుందండీ.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
July 27, 2012 9:25 pm
సౌమ్య గారూ, లక్ష్మి గారూ,
కథ నచ్చినందుకు థాంక్సండీ!
శుభాకాంక్షలతో
ఆర్.దమయంతి.
lakshmimadhav అభిప్రాయం:
July 29, 2012 8:55 am
చాలా సహజంగా ఇంచుమించు వారానికో సారి జరిగే విషయాన్నే ఎంతో మంచి శైలితో వ్రాశారు.వ్రాసిన మీకు నా హ్రుత్పూర్వక అభినందనలు.
sairam అభిప్రాయం:
August 18, 2012 1:37 pm
దమయంతి గారూ! కథ బాగుందండీ.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
August 20, 2012 9:16 am
థాంక్సండీ, సాయి రాం గారూ!
కృతజ్ఞ తలతో..
-ఆర్.దమయంతి.
sirisha అభిప్రాయం:
August 21, 2012 3:17 am
కధ చాలా సహజం గా ఉంది. అత్తగారు, కోడలుగారు ఇరువురు పని చేయలేరు పాపం.
ఆర్.దమయంతి. అభిప్రాయం:
August 21, 2012 9:57 pm
అవునండీ..అత్తా కోడళ్ళిద్దరూ కలసి పని చేసుకోలేకే గా ఈ తిప్పలన్నీపా పం! మీరన్నట్టు ఇది సహజమే!! మీ స్పందన తెలియచేసినందుకు..ధన్యవాదాలతో
-ఆర్.దమయంతి.
mangu sivaram prasad అభిప్రాయం:
September 1, 2012 5:08 am
సున్నితమైన హాస్యన్ని సునిశితముగా కథలో చక్కగా పండించారు. భానుమతిగారి కథలను గుర్తుకు తెచ్చారు
ఒక మంచి కథను చదివిన అనుభూతిని మిగిల్చారు. మీ నుంచి ఇంకా ఎన్నో ఇటువంటి కథలు రావలని ఆశిస్తూ.
—– మంగు శివ రాం ప్రసాద్ , విశాఖపట్టణం
ఆర్.దమయంతి. అభిప్రాయం:
September 8, 2012 10:24 am
‘భానుమతిగారి కథలను గుర్తుకు తెచ్చారు
ఒక మంచి కథను చదివిన అనుభూతిని మిగిల్చారు’ - మంగు శివ రాం ప్రసాద్ , (విశాఖపట్టణం)
* భానుమతి గారి కథలు నాక్కూడా చాలా ఇష్టమండి, శివరాం ప్రసాద్ గారూ!
మీ ప్రశంసకి నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో-
ఆర్.దమయంతి.