క్రీ. శ. 1248 నాటికి ఉత్తరభారతము తురుష్కాక్రాంతమైనది. ఢిల్లీ సుల్తానుల దృష్టి దక్షిణభారతము పైకి ప్రసరిస్తున్నది. కాకతీయ సామ్రాజ్యమును అన్ని వైపుల నుండి పొరుగురాజులు ముంచివేయుటకు యత్నింపగా రుద్రమదేవి రాజ్యరక్ష చేసినది. ప్రధానశత్రువైన దేవగిరి యాదవరాజును జయించినది. ‘ఆంధ్రులకూ మహారాష్ట్రులకూ తల్లులైన గోదావరీ మంజీరా నదులు సోదరు లిట్లా వృథా కలహాల పాలవుతున్నారే’ అని శోకిస్తున్నట్టుగా రెండు దేశాల ప్రభువులకు తోచి సంధి చేసుకుంటారు.
రుద్రమ భర్త వీరభద్రేశ్వరుడు. తనకు మరియొక పత్ని వలన కలిగిన సంతానానికి రాజ్యపదవి కావలెనని ఆశిస్తాడు. కాని చక్రవర్తి రుద్రమకే పట్టాభిషేకము చేస్తాడు. భర్త రుద్రమ మీద అంతఃకలహాలు ప్రేరేచి శత్రురాజుల దండయాత్రలు కూడా ప్రోత్సహిస్తాడు. రాజధర్మానికీ, వ్యక్తిధర్మానికీ రుద్రమలో ఘర్షణ ఉదయిస్తుంది. రాజధర్మం పాటించి నిర్దోషురాలైన సీతనే శ్రీరాముడు పరిత్యాగము చేసినది మనస్సుకు తెచ్చుకొని, దోషియైన భర్తను రాజధర్మాన్ని ఆశ్రయించి ప్రతిఘటిస్తుంది. భర్త అమాయకులైన జైనప్రజలలో విప్లవము తెస్తాడు. వారిలో నాయకులను మాత్రము కఠినముగా శిక్షించి, సామాన్య ప్రజలను పొరపాటున తప్పుచేసిన సంతానము వలె క్షమించి, వారిలో నిష్కల్మషులైన వీరభల్లటదేశికులను, సిద్ధినంది వంటివారిని పూజిస్తుంది.
సందర్భవశాత్తుగా ఆనాడు ఏకశిలానగరములో విలసిల్లిన అన్ని తరగతుల జనుల జీవితము చిత్రింపబడినది. తిక్కన సోమయాజి నిర్లిప్తుడై మహాభారత రచన కొనసాగిస్తూ, గడ్డు సమయాలలో రాజకీయనౌకను యోగ్యులైనవారి చేత నడిపిస్తాడు.
కొప్పెరుల జింగడు (రాజసింహుడు) అనే కాడవ ప్రభువు గోదావరీ తీరము వరకు భూసేనను, నౌకాసేనను నడిపించుకొంటూ దండయాత్ర సాగించాడు. అతనికి సాహిత్యమల్లుడు, ఖడ్గమల్లుడు, అనే బిరుదాలున్నవి. ఆంధ్రసేనలు గోదావరి వద్ద భూమి మీదను, సముద్రము మీదను అడ్డగిస్తవి. రాజసింహుడు తన సేనానులకు యుద్ధాలు నడపడానికి ఆజ్ఞలిచ్చి తన సాహిత్యమల్లత్వము గోదావరి పండితులకు ప్రదర్శించడానికి పూనుకుని ఇష్టదైవమైన కనకసభాపతి పూజకు అంగముగా భాసుని ‘ఊరుభంగము’ ప్రదర్శింపజేస్తాడు. భీమసేన దుర్యోధనుల గదాయుద్ధమునే ఆవల రెండు యద్ధములూ అనుకరిస్తవి. ఆంధ్రుల గజఘంటలకూ, కాడవుల అశ్వదళాలకూ, ఆంధ్రుల పెద్దనౌకలకూ, కాడవుల అసంఖ్యాకములైన చిన్ననౌకలకూ, యుద్ధాలు దుర్యోధనునికి ఊరుభంగమైనట్లే పరిణమించినది. వర్ణించిన ఘట్టము అద్భుతశక్తితో నిర్వహింపబడ్డది. సాహిత్య అకాడెమీవారు ఈ నవలను భారతీయ భాష లన్నిటిలోకి అనువదింప నిశ్చయించారు.
మల్లారెడ్డి క్రీ. శ. 1328 నాటిది. మహమ్మదు బిన్ తుఘ్లకు దక్షిణదేశములో అరాజకము ప్రబలజేసెను. అప్పుడు సామాన్య ప్రజలలో నుండి మహావీరులు పుట్టి విప్లవము సాగించి ధర్మబద్ధమైన రాజ్యాలు స్థాపించారు. మొదట విముక్తి సాధించినది కృష్ణానది దక్షిణతీరాన రెడ్డి ప్రభువులు. రెడ్ల కులదైవము నందికంత పోతరాజు అనే కఠారి దైవము వెలుస్తాడు. శ్రీ శంకరస్వామి చేయించిన సహస్ర చండీయాగముతో ధర్మవృషభము ఆవిర్భవించినట్లయి ప్రజలు నిర్భయంగా మహాయుద్ధాలు చేస్తారు. దేశాంతరాలలో, ద్వీపాంతరాలలో అనేక మహానౌకలతో వ్యాపారము చేసే అవచి దేవయ నౌకలు, గజాలు, హయాలు తెప్పించి సహాయం చేస్తాడు. కథా ప్రారంభంలో శ్మశాన సదృశంగా ఉన్న ఆంధ్రభూమి చివరకు సర్వసంపన్న మవుతుంది. ఎర్రయ మహాకవి మహాభారతరచన హరివంశముతో సహా పూర్తిచేస్తాడు.
కవిసార్వభౌముడులో శ్రీనాథకవి కొండవీటి నుండి క్రీ. శ. 1420 లో శ్రీవిద్యానగరానికి సాంస్కృతిక విజయయాత్రకై బయలుదేరి, యుద్ధయాత్రలలో వేసే ఎత్తులన్నీ వేసి అక్కడ డిండిమ భట్టారకుణ్ణి ఉద్భటశాస్త్ర వాదంలో జయించి ఆయన కంచుఢక్కను పగులగొట్టిస్తాడు. ఆ తర్వాత వారిద్దరికి పరస్పరమూ ఆదరగౌరవాలు కలుగుతవి. ఆస్థానములో శ్రీనాథుడు తన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించి కవిసార్వభౌముడుగా కనకాభిషేకము పొందుతాడు. ఆనాడు శ్రీవిద్యానగరములో వేదవేదాంతములకు, దర్శనములకు ఉండిన ప్రాభవము సామాన్య పాఠకులకు కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. పర్వతమల్లుకూ, విద్యామల్లుకూ, వాళ్ళ శిష్యులకూ జరిగిన మల్లయుద్ధాలు శాస్త్రవాదాల ప్రతిధ్వని వలె ఉండి నవలకు రమ్యత చేకూరుస్తుంది. రాజకీయముగా శ్రీవిద్యానగరానికి, కొండవీటికి, రాచకొండ, దేవరకొండలకు ఎన్నెన్ని స్పర్థలున్నా, విద్వాంసులను గౌరవించడములో విరోధ ముండేది కాదనీ, శాస్త్రవాదాలలో ధర్మదీక్షతో పరిషత్తులు నిర్ణయము చేసేవనీ ఇందులో ప్రదర్శింపబడ్డది. ఆ తర్వాత కొద్దికాలానికి ఆంధ్రులకు అభిమానపాత్రమైన భాగవతము వ్రాయనున్న పోతన, కన్నడములో ‘గదగిన భారత’ రచించి బాలవ్యాసుడనే ప్రసిద్ధి పొందనున్న నారనప్ప ఈ నవలాకథ నాటికి యువకులై ఉత్తమ కావ్యరచనకు ఎట్లా ఆదర్శపూరితు లవుతుండిరో ఇందులో చిత్రింపబడ్డది.
కవి, నాటికాకర్త, కథకుడు, సాహిత్య విమర్శకుడు, ధర్మదీక్షితుడు ఐన నోరి పరిణత వయస్సులో చారిత్రక నవలారచనకు పూనుకొని తన సర్వతోముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దానికి సంపూర్ణ వికాసము కలిగించినాడని విమర్శకుల నిర్ణయము!
7.
భారత చరిత్ర పరిధులను దాటి రచించిన ఆంధ్ర నవల తెన్నేటి సూరి ‘చెంఘిజ్‌ఖాన్’. ఆ నవల సర్వాంగ సుందరమై అడుగడుగునా గోబీ ఎడారి వాతావరణముతో అక్కడి జనముల తీవ్ర రాగద్వేషాలతో స్పందిస్తున్నది. ఎక్కా మంగోలుజాతి నాయకుడైన యాసుకై మెర్కెట్ తండాలోని వాళ్ళనందరిని చంపి పెళ్ళికూతురు యాలమను బలవంతముగా ఎత్తుకొని పోవడముతో కథ ప్రారంభిస్తుంది. యాలమ మొండిగా బహుకాలము యాసుకై భార్యగా ఉండడాన్ని ప్రతిఘటిస్తుంది. కాని సోదరుడైన కరాచర్ బోధ పాటించి చివరకు ఒప్పుకొని టెమూజిన్ను కంటుంది. యాసుకై మంగోలు తండాల నన్నిటిని ఐక్యము చేసి కెరెటు ప్రభువైన తుఘ్రలుఖానుకు సహాయము చేయగల స్థితికి వస్తాడు. యాసుకై అకస్మాత్తుగా మోసము పాలై శత్రునిచే హతుడవుతాడు. మళ్ళీ మంగోలు తండాలు విచ్ఛిన్నము కాబోతున్న సమయంలో టెమూజిన్ ప్రభుత్వము చేబట్టుతాడు. యువకుడైనా, నయానా భయానా అతడు సమర్థతతో గోబి తండాలను కూడగట్టుకొని, తుఘ్రలుఖాను, చీనా చక్రవర్తి, టర్కీ ప్రభువు చేసే కుట్రలన్నిటినీ ఎదురెత్తులతోనూ, సాహసంతోనూ ఎదుర్కొని చెంఘిజ్‌ఖాన్ (జగజ్జేత) అవుతాడు. అతని సోదరుడు చమూగా చదువుకొన్నవాడు. వీరుడైనా శాంతిప్రియుడు. అతన్ని నైమాన్ ప్రజలకు ప్రభువుగా టెమూజిన్ పంపుతాడు. అతడు ప్రజల చేత ఆయుధ విసర్జన చేయించి దేశాన్ని సస్యశ్యామలంగా తాత్కాలికంగా చేయగలుగుతాడు. బౌద్ధము, ఇస్లాము, క్రైస్తవము ప్రచారము చేసేవారి ద్వారా శత్రురాజులు చేసిన ద్రోహము వల్ల చమూగా ప్రయత్నమంతా విఫలమైన ఘట్టము కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. క్రీ. శ. 1206లో వసంత ఋతువులో జరిగిన విజయోత్సవాలతో టెమూజిన్ చెంఘిజ్‌ఖాన్ ‘జగజ్జేత’ కావడంతో నవల పూర్తి అవుతుంది. ఈ నవల ఆనాటి అనాగరక సాహస వీర ప్రపంచాన్నే చిత్రించినా, ఈ కాలములో మనము ఎంత నాగరకులమని గర్విస్తున్నా జాతులను ఆడించే మూల మహాశక్తి ‘పశుశక్తే’ అనిపిస్తుంది. నవల చదువుతున్నంతసేపూ ఆంధ్రభాషలో పుట్టి ప్రాణవంతమైన ఉత్తమ నవలలలో దీనికి నిస్సందేహంగా స్థానమున్నది. ఈ ఒక్క నవలే వ్రాసి చిన్నతనములోనే తెన్నేటి సూరి గతించినందువల్ల నవలా ప్రపంచానికే తీరని లోటు కలిగింది.
8.
ఆంధ్రభాషలో ఇంకా ఎన్నో చారిత్రక నవలలు పుట్టినవి. వాటిలో శ్రీ వేదుల సూర్యనారాయణశర్మ ఆర్యచాణక్యుడు నవలని ప్రశంసించక తప్పదు. అందులో చారిత్రక విషయాలెన్నో ఉన్నవి. కాని అది చరిత్ర అనిపిస్తుంది. కాని నవల అనిపించదు.
ఆంధ్ర చరిత్రకారులలో ప్రామాణికులైన డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య రచించిన పశ్చాత్తాపము, ఛత్రగ్రాహి, మధుమావతి, మొదలైనవి పెద్దకథ లనదగినవే కాని వాటికి నవల కుండవలసిన విస్తృతి లేదు. వారి కథలలో చరిత్ర-కల్పన ఎంత చక్కగా జోడింపవచ్చునో ఆదర్శప్రాయంగా ప్రదర్శించారు.
ఉన్నత పాఠశాలలలో పాఠ్యగ్రంథాలుగా ఉద్దేశింపబడి ఎన్నో చిన్న చారిత్రక నవలలు పుట్టినవి. అట్టివాటిలో శ్రీ వావిలాల సోమయాజులు రచించిన నాలందలో ఆనాటి ఆచార్య వైభవము చక్కగా పోషింపబడ్డది. అనవేమారెడ్డి జైత్రయాత్రను వర్ణించిన వసంతరాయలు, విహారి-శాతవాహన రచించినది, కూడా గణ్యమైనది. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల అభయ ప్రదానము కూడా ఎన్నతగినది. ఇంకా ఎన్నో చిన్న నవల లున్నవి.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ నేటి ఆంధ్ర సారస్వత రంగములో సర్వతోముఖ ప్రతిభ ప్రకటించి ఎన్నో ఉత్తమ నవలలు వ్రాసిన తర్వాత ఈ మధ్య ‘పురాణవైరి గ్రంథమాల’ పేరుతో 16 నవలలు వ్రాయ సంకల్పించి చాలా భాగము పూర్తి చేశారు. ఈ వ్యాసము ఉపక్రమణములో మన పురాణాదులలో ఎన్నో చారిత్రక విషయాలు నిక్షిప్తములై ఉన్నవనీ, రామాయణ మహాభారతాలే ఐతిహాసిక నవలలకు మార్గదర్శకముగా ఉండదగుననీ సూచించినాము. ఈ గ్రంథమాల నవలలలో శ్రీ విశ్వనాథ ఒక అడుగు ముందుకు పోయినారు. పురాణకథలే చరిత్రగా గ్రహించి శ్రీ కోటవారు భారతజాతి చరిత్ర రచించారు. అదే నిజమైన చరిత్ర అని శ్రీ విశ్వనాథ నిశ్చయము. పాశ్చాత్యుల దృష్టితో ప్రారంభింపబడిన భారత చరిత్ర అత్యంతము పునఃపరిశీలన చేసి రచింపవలసి ఉన్నదనుటలో మాకెట్టి సందేహము లేదు. కాని శబ్దసామ్యాన్ని బట్టి హూణ మిహిరగులుడు హూణుడు కాడని, మిహిరకులుడైన ఆదర్శ భారతీయ వీరుడనేవరకూ మా బుద్ధి ప్రస్తుతము ప్రసరింపలేకున్నది. ఈ గ్రంథమాల నవలలలో రచనలోను, కల్పనలోను తొందరపాటు, విశృంఖలత్వము గోచరించడము సంతాపకరమైన విషయము. మధ్యమధ్య శ్రీ విశ్వనాథ మహాప్రతిభ తెరచాటు నుండి గోచరిస్తూ ఉండకపోతే వాటిని పరిగణించ వలసినది కాదు. ఏమైనా పురాణవైరి గ్రంథమాలలోని శ్రీ విశ్వనాథ నవలలు చారిత్రక నవలా రచయితలకు, విమర్శకులకు ఒక సవాలువంటివని మాత్రము అంగీకరించక తప్పదు!
[నోరి హనుమచ్ఛాస్త్రి సంపాదకత్వంలో 1979లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురించిన “సారస్వత వ్యాసములు, ఐదవ సంపుటము, కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారి వ్యాసములు” నుండి]