కాకతీయ రాజ్యపతనమును గూర్చి ఆమె రచించిన సప్తపర్ణి కూడా బహుమతి నందినది. ఇందులో గూడ కక్షలు, ద్వేషములు, దురభిమానము, ఆడంబరముల కాస్థాన గౌరవము ఏ విధముగా రాజ్యపతనమునకు దారి తీసినవో వర్ణించుటకు ప్రయత్నించినది. ఇందులో జక్కనాచార్యుడను మహాశిల్పి తన మంత్రతంత్రశక్తిని జోడించి సప్తపర్ణిని అష్టవర్ణినిగా చేసి రాజ్యము మరియొక తరము వరకూ నిలుపుటకు చేసిన ప్రయత్నానికి అవకాశము లభింపకపోవడమనే కల్పనమీద కథ నడచినది. ఈ భావనలోనే కొంత అసంబద్ధత ఉన్నందువల్ల హృదయానికి హత్తుకోదు. రాజవంశములో ఏడుగురు రాజులు ఉండిరనే విషయ మాధారము చేసుకొని సప్తపర్ణి కల్పన నడచినది. ఐనా ఈ నవల కూడా గణింపదగినదే.
ఆమెయే ఈమధ్య రచించిన రామప్పగుడి అనే నవల విశ్వవిద్యాలయ బహుమతు లందినది కాకపోయినా ఈ సందర్భములో ప్రస్తావింపదగినది. రామప్పగుడి లోని శిల్పసౌందర్యము అనన్య సామాన్యము!
శ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తి రచించిన భువన విజయము, గృహరాజు మేడ, విశ్వవిద్యాలయము బహుమతు లందినవి. ఆయన సాహిత్యవేత్త. ‘భువన విజయము’లో శ్రీకృష్ణదేవరాయలు ఆదిల్షాను జయించుటతో ప్రారంభించి ప్రాచీ దిగ్విజయయాత్ర చేసి దుర్గములెన్నిటినో జయించి కటకము వరకూ యాత్ర చేసి గజపతి కుమార్తె యయిన తుఖాదేవిని వివాహమాడి భువనవిజయ సభా నిర్మాణము పూర్తిచేయించుటతో పర్యవసిస్తుంది. ఐనా ఈ కథయంతటిలో సూత్రరూపంగా నడిచిన కథ చిన్నాదేవి తిరుమలదేవితో పాటు శ్రీకృష్ణదేవరాయల మహిషిగా గౌరవింపబడిన వృత్తాంతము. ఆమె నిజముగా రాజపుత్రికయే ఐనను వేశ్యమాతచేత పెంపబడి ‘గాండ్లసంగి’ అను పేర రాయలకు ప్రేమభాజన మవుతుంది. ఆమె ప్రణయకోపము వల్ల రాయలకు ఆమె పైన అనుగ్రహము తప్పుతుంది. నందితిమ్మన అనే మహాకవి తన పారిజాతాపహరణ కావ్యము రచించి రాయలకు మరల అనుగ్రహము కలిగించినాడను ఐతిహ్యము మీద ఈ మూలకథ నడిచినది. ఇందులో శ్రీరామమూర్తి సూక్ష్మాతిసూక్ష్మ సన్నివేశములతో తన సాహిత్య వైశారద్యము ప్రదర్శించి ‘పారిజాత’ సౌరభము నవలలో అంతటా గుబాళింపజేసినాడు. ఈ నవలలో తిరుమలదేవి ఉదాత్తత, తిమ్మోజు కుండోజుల శిల్పప్రావీణ్యము, నంది తిమ్మన కవితా మాధుర్యము, పెద్దన మహాకవి సహృదయత హృదయంగమంగా రాణించినవి. రాయల వీణామధువగు కృష్ణపండితుని చక్రవాకరాగము తిరుమలదేవి కంఠములో విరహవేదనగా మధురాతిమధురంగా పొంగి పాఠకుల శ్రోత్రాలలో ప్రతిధ్వనిస్తుంది.
వారి గృహరాజు మేడలో కూడా సాహిత్య వైశారద్యము ప్రతిబింబిస్తున్నది.
మరొక విశ్వవిద్యాలయ బహుమతి నందిన నవల శ్రీ పాటిబండ మాధవ శర్మ ‘రాజశిల్పి.’ ఇది కొండవీటి రెడ్డిరాజ్యమును కుమారగిరి పరిపాలించిన నాటి చరిత్రను చిత్రించునట్టిది. కుమారగిరి జీవించియుండగానే కొండవీటి రాజ్యము నుండి రాజమహేంద్రవర రాజ్యము చీలిపోయినది. కొండవీటి రాజ్యానికి ఆయన దూరపు జ్ఞాతియైన పెదకోమటి వేమారెడ్డి, రాజమహేంద్రవర రాజ్యమునకు కుమారగిరి మేనల్లుడూ ప్రభువులైనారు. కుమారగిరి హృదయపూర్వకముగా రెండు రాజ్యములు అర్పించి తాను కొండలలో ఎక్కడనో శిల్పిగా ఉండుటకు నిశ్చయించుకొనడముతో నవల అంతమవుతుంది. కుమారగిరి భోగలాలసుడైన ప్రభువనీ, లకుమాదేవి అతని ఉంపుడుకత్తె యని చారిత్రకుల భావము. ఈ నవలలో కుమారగిరి మకరంద మధురమైన హృదయము గల ఉత్తమ వ్యక్తి గాను, లకుమాదేవి ఉత్తమాదర్శములు గల కేవల కళోపాసన చేయు నాతని సోదరి గాను చిత్రింపబడినది. ఆ తర్వాత వేమభూపాల చరితము సంస్కృత పద్యకావ్యముగా రచించి గద్యకవి సార్వభౌముడని, వామన భట్టబాణుడని బిరుదములందిన వామను డిందులో ఎక్కువ రాజనీతిధురంధరుడుగా భాసించును. ఆయన వైదుష్యము కంటె కాటయవేముని వైదుష్యము ఎక్కువ ప్రకాశిస్తున్నది. పెదకోమటి వేమారెడ్డి (వేమ భూపాల చరిత నాయకుడు) అల్పుడుగా భాసిస్తాడు. ఆయన రాజ్యకాలములో విద్యాధికారియైన శ్రీనాథ కవిసార్వభౌముడు కూడా ఈ నవలలో అల్పుడుగానే చిత్రింపబడ్డాడు. మంత్రిసింగన కూడా వీరశైవ కోలాహలముతో కలసినాడు. ఒకవిధంగా చూస్తే ఇది కుమారగిరి పక్షము వహించి వ్రాసిన నవల. అట్లా చేయడానికి నవలాకారులకు నిస్సందేహంగా స్వాతంత్ర్యమున్నది. మొత్తము మీద ఇందులో ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు ప్రతిబింబించినవి. వెంకోజు ఇంద్రజాలము, తిప్పయశెట్టి సమ్మానము, మల్లాంబిక సంగీతము, లకుమాదేవి నాట్యము, వీరాస్వామి సన్నాయి వాద్యము నవల యంతటా ప్రతిధ్వనిస్తవి! సామాన్యముగా నవలలోని భాషకంటె ఇందులోని భాష ప్రౌఢతరమైనది.
5.
ఆంధ్ర చారిత్రక నవలను ఆంధ్ర సారస్వత పరిధిని దాటించిన వారిలో ప్రథముడు అడవి బాపిరాజు. ఆయన మూడు చారిత్రక నవలలలో ‘హిమబిందు’ నిస్సందేహంగా ప్రపంచ భాషలలోని ఉత్తమ నవలల స్థాయి నందుకొన్నది. బాపిరాజు కొంతకాలము లాయరు, కొంతకాలము జాతీయ కళాశాలలో అధ్యాపకుడు, కొంతకాలము దిన పత్రికా సంపాదకుడు, కొంతకాలము వెండితెర మీద చిత్రనిర్మాత. స్వయముగా చిత్రకారుడు, కవి, కథకుడు. మెత్తని హృదయము కలవాడు. తరుగని ఉత్సాహముతో పొంగులు వారేవాడు. ఆయన బహుముఖానుభవము, ఆర్ద్రహృదయము హిమబిందుగా రూపొందింది.
ఇది శ్రీముఖ శాతవాహన చక్రవర్తి కాలము చిత్రించును. చక్రవర్తి యాదర్శము తన రాజ్యము చతుస్సముద్రవలయిత మొనర్చి ధర్మము నాలుగు పాదముల నడిపించి రాజ్యము స్వర్గధామముగా చేయవలెనని. రాజగురువుల యాదర్శము శాతవాహన వంశమును నిష్కల్మషమొనర్చి, ప్రపంచమును విరించి యజ్ఞ యాగాదులతో దేవతాతృప్తి మానవ రక్తి ప్రసాదింప జేసి, వైదిక ధర్మమును నిరసించు బౌద్ధ జినములను నిర్మూలింపవలెనని. తుదకు ఇరువురి యాశయములు సిద్ధించును గాని చక్రవర్తి మతసహనము వల్లనే సాధ్యమవుతుంది కాని రాజగురువు మతద్వేషము వల్ల కాదు. ఈ నవలలో మూడు రకముల ప్రేమ కథలు కల్పింపబడ్డవి. విషకన్య శ్రీకృష్ణ శాతవాహనుని దైవముగా ప్రేమిస్తుంది. హిమబిందు సువర్ణశ్రీని ప్రేమించి భర్తగా భావించును. నాగబంధునికా సమవర్తుల ప్రేమ గుణసామ్యముచే పరస్పరాకృష్టలైన వారి ప్రాపంచిక ప్రేమ. పవిత్రప్రేమ సమస్తావరోధాలను అధిగమించి విజయము సాధిస్తుంది.
ముద్రారాక్షసములో విషకన్యాప్రయోగమే చెప్పబడినది. ఈ నవలలో చిన్ననాటి నుండి అభిచార హోమములయు, విషవైద్యుల యొక్కయు సహాయముచే విషకన్య ఎట్లయినదో అద్భుతముగా వర్ణింపబడినది. తుదకా విషకన్య శ్రీకృష్ణ శాతవాహనుని ప్రేమించి, తాతగారిని ప్రతిఘటించి అమృతకన్యగా ఎట్లు పరివర్తన మొందినదో అద్భుతతరముగా కల్పింపబడినది.
శ్రీ కురుగంటి సీతారామయ్య అన్నట్లు ఇందులో “బాపిరాజు ధర్మము నిర్వచించునపుడు ధర్మవేత్తయై, యుద్ధములు వర్ణించునెడల సమరశాస్త్ర విశారదుడై, ప్రేమికుల సంభాషణలలో రసమూర్తియై, శిల్పచాతుర్యము నుగ్గడించువేళ శిల్పియై, గానము పాడించునెడల గాయకుడై, బాలికల యాటల నిరూపించునెడల బాలుడై, శాస్త్రచర్చలు సల్పునెడల సకల శాస్త్రవేత్తయై, పాత్రోన్మీలనవేళలలో సహృదయుడై మొత్తముమీద నవలారచనమందు మహాకవియైనాడు!”
ఆయన మరియొక నవల అడవి శాంతిశ్రీ. ఇందులో కూడా బౌద్ధ వైదిక మతముల సంఘర్షణము చిత్రింపబడ్డది. కథ ఎక్కువ భాగము విజయపురిలో జరిగినది. నాగార్జున బోధిసత్త్వులు ధర్మబోధ చేయుచుండిన కాలమది. ఇందులో కూడా మూడు ప్రేమకథలున్నవి. కాని కథానాయిక శాంతిశ్రీ ప్రేమకథయే విశిష్టమైనది. ఆమె విజయపురి నేలిన శాంతిమూలుని పుత్రిక. ఆమె బౌద్ధ ధర్మముచే సంపూర్ణముగా ప్రభావితయై సన్యాసిని వలెనుండి ప్రేమస్వరూపమే ఎరుగనిది. తండ్రి యాజ్ఞకు బద్ధురాలై ఆమె కథానాయకుడగు బ్రహ్మదత్తుని వద్ద వైదిక ధర్మబోధ వినే శిష్యురాలవుతుంది. ఆయన ధర్మబోధ వల్ల కంటె సంఘటనల వల్ల ఆమెలో నెమ్మదిగా ప్రేమ అంకురిస్తుంది. బ్రహ్మదత్తుడు గాలివాన వల్ల కొట్టుకొనిపోయిన నౌకతో కొంతకాలము కనబడకపోగా ఆమె ఉద్విగ్నత పొందుతుంది. తర్వాత రాయబారిగా వెళ్ళిన బ్రహ్మదత్తుని పులమావి బంధించినట్లు తెలిసిన వెంటనే ఆమె వీరాంగనాసైన్యము కూర్చుకొని నిరాఘాటముగా పులమావిపై దండెత్తుతుంది. ఆ విచిత్ర కథా ఘట్టము బాపిరాజు తన ప్రతిభచే సత్యమనిపించేట్లు చేసినాడు. బౌద్ధ ప్రచారమువల్ల జనములు సన్యసిస్తూ, గృహస్థాశ్రమ విముఖులు కాగా ధర్మబద్ధమైన కామముతో వైదికము దానిని లోగొన్నదన్న భావానికి ప్రతీకగా శాంతిశ్రీ ప్రేమకథ కల్పింపబడ్డది.
శాంతిమూలుడు వైదికమతనిష్ఠుడు. ఆయన పత్నులు బౌద్ధమత నిష్ఠులు. తుదకు అమరావతిలో శాతవాహనవంశ మంతరింపగా శాంతిమూలుడు సమస్తజనుల అభ్యర్థనము పాటించి, నాగార్జునుల ఆశీర్వాదముతో చక్రవర్తి పదవి స్వీకరించి ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు కావడంతో నవల ముగుస్తుంది. పై రెండు నవలలలోను బాపిరాజుకు బౌద్ధమందు అభిమానమూ, వైదికమందు గౌరవమూ ద్యోతమవుతవి.
ఆయన ‘గోన గన్నారెడ్ది’ కాకతీయ రుద్రాంబ కాలానికి సంబంధించిన కథ. రుద్రాంబ అంతరంగిక విప్లవములను అడచి, మహారాష్ట్రుల దండయాత్ర నెట్లు ప్రతిఘటించినదో దీనిలో వర్ణితమైనది. బాపిరాజు రచనలన్నిటిలో రెండు లక్షణములు ప్రాధాన్యము వహించును. మొదటిది ప్రేమికుల ప్రేమ. రెండవది అపరిమితమైన ఆంధ్రాభిమానము. ఈ నవలలో ఆ రెండు గుణాలు ప్రత్యేకముగా కానవస్తవి.
6
శ్రీ నోరి నరసింహశాస్త్రి ప్రకృతి ఒకవిధంగా బాపిరాజు ప్రకృతికి విరుద్ధమైనది. బాపిరాజు ఉత్సాహము నిరంకుశంగా పొంగులెత్తుతుంది. నోరి ఉత్సాహము సంయమనంతో నిండి ఉంటుంది. బాపిరాజుకు ఆంధ్రాభిమాన మెక్కువ. నోరికి మహాభారతాభిమాన మెక్కువ. బాపిరాజు నాయికానాయకులు ప్రేమావేశములతో తబ్బిబ్బులవుతారు. నోరి నాయికానాయకుల ప్రేమ సాంసారిక మాధుర్య మనుభవించే వారిది గానో, వీరనారులకు వీరులకు సంబంధించినది గానో ఉంటుంది. బాపిరాజుకు బౌద్ధమం దభిమానము, వైదికమందు బలవంతపు గౌరవము. నోరికి వైదికమతమందు నిష్ఠ, బౌద్ధాది సకల మతములందు ద్వేషములేని సహనము. దురాచారము లెవరిలో ఉన్నా సహించడు.
ఆంధ్రదేశము ఉత్తరదక్షిణ భారతములకు సంధి ప్రదేశముగా ఉన్నందున యావద్భారతమును ఏకముఖము చేయగల లక్షణాలు ఆంధ్రభూమిలో ఎక్కువ ఉన్నందుకే నోరికి ఆంధ్రదేశాభిమానముగాని తానీ జన్మలో అక్కడ పుట్టినందుకు కాదు. ఆంధ్రకవులకు పూజ్యతమమైన గ్రంథము కవిత్రయము ఆంధ్రీకరించిన వ్యాస మహాభారతము. కవిత్రయము కాలములు చిత్రించుచు నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి అనే నవలాత్రయము రచించినాడు. శ్రీనాథ కవిసార్వభౌముడు విద్యానగరయాత్ర చేసి డిండిమభట్టును జయించి ఆయన కంచుఢక్కను పగులగొట్టించిన వృత్తాంతము కవిసార్వభౌముడులో వర్ణించినాడు.
నారాయణభట్టు క్రీ. శ. 1053 సం. వృత్తాంతము. అప్పుడు ఉత్తరభారతము ఛిన్నాభిన్నమై విదేశీయుల దండయాత్రలకు అనుకూలముగా ఉన్నది. అప్పుడు దక్షిణమున చోళచక్రవర్తులు దక్షిణభూమిని ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చి భారతీయధర్మము పరిరక్షించుచున్నారు. గంగవరకు విజయయాత్ర చేసిన గంగైకొండ చోళుని అల్లుడగు రాజరాజనరేంద్రుడు కలికాల కలంకపంకము హరించుచు రాజమహేంద్రవరములో రాజ్యము చేయుచున్నాడు. అప్పుడు ఆంధ్రభూమి లోని బౌద్ధ సంఘారామములు తాంత్రిక దురాచారాలకు ఆటపట్టులై రాజకీయవిప్లవము సాగింపగా దానిని సకాలములో అడచి వేసి, సామాన్య ప్రజలకు సంస్కృత భాషలో నున్నందున అందుబాటులో లేని మహాభారత ధర్మమును మహాభారతాంధ్రీకరణముతో అందుబాటులోనికి తెచ్చుటతో ఈ నవల ముగియుచున్నది.