ఇవిలా ఉంటే ఈ అడ్లు చాలవన్నట్టు పులి మీద పుట్ర లాగ నాకు ఫణిబాబు పరిచయమయ్యేడు. అంటే – నేనే వెదికి, వెదికి వెళ్ళి స్నేహం చేసేను. అణువులు, పరమాణువులు ఇలా పరిశోధించేవాళ్ళు ఏవేవో చదువుకుని, పరిశోధించి ఏదో కొత్త పరమాణువు ఒకటి ఉంటుంది అని రకరకాలుగా ఊహిస్తుంటారు, ప్రతిపాదిస్తారు. అలాంటివాళ్ళకి ఒక రోజు హటాత్తుగా వాళ్ళు వర్ణిస్తున్న వస్తువే నిజంగా కనిపిస్తే మరి ఒకేసారి వెర్రి సంతోషం, దుఃఖం – యురేకా! యురేకా!! లాగ. ఫణిబాబుని కలుసుకున్నాక నాపనీ అలాగే అయ్యింది. సృజనశీలి అని ఇలాగ అలాగని నేను రకరకాలుగా వర్ణిస్తూ వస్తున్నది యదార్ధంగా కళ్ళెదుటే ఉన్నట్టు ఉన్నాడు, ఊహిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, రాసుకుంటున్నాడు. అందరం కావాలనుకునేవి – చదువు, ఉద్యోగం, ఇల్లు, అంతస్థు ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా సృజన వ్యాసంగం – చదువుకోడం, రాసుకోడం, ఆలోచించడం, నచ్చితేనే మాట్లాడ్డం, వీటిమీదే ధ్యాస పెట్టుకుని బతుకుతున్నాడు. తను దర్శిస్తున్న సృజన స్వరూపం తప్ప ఇంక ఏం మర్యాదా మప్పితం లేకుండా, ప్రదర్శన, ప్రతిష్ట అంటే ఖాతరు లేకుండా ఉన్నాడు. సృజన రంగాన్నే నమ్ముకుని ఎన్ని దెబ్బలు తింటున్నా ఆ ఆటుపోట్లన్నీ తట్టుకొని కూడా ఎంత మాత్రం రాజీ పడకుండా, క్రుంగిపోకుండా ఇదే నాకు కావాలి అని భీష్మించుకున్నాడు. మర్యాద కోసమో, సామరస్యం కోసమో, ఈసు కోసమో, ఉక్రోషంతోనో, బోరుకొడితే కాలక్షేపం కోసమో కాక, తన్ని చాలా వేధించే ప్రశ్నలని అర్ధం చేసుకోవడం కోసం ఇంక విధి లేకపోతేనే చర్చ జోలికి పోతాడు. నేను కొంత కాలం ఇతను ఎలా బతుకుతాడు, ఏమైపోతాడు అని బెంగ పెట్టుకున్నాను. ఇంకొంతకాలం అతని ప్రతిభను, పట్టుదలను, వివేకాన్ని తలచుకొని కులికి చాలా సచ్చేను. ఎందుకు అంతలా చలించిపోతున్నావు? అని మా ఇంట్లోవాళ్ళూ, నన్ను నేనే పదిసార్లు, పాతికసార్లు అనుకున్నాము. ఫణిబాబునే అడిగేను. ‘ఏమో, నాకేం తెల్సండీ…’ అన్నాడు. అతనికి నేను ఊహించేవీ, చెప్పదల్చుకున్నవీ ఇంకా నోట్లో మాట బయటికి అనకుండానే అర్ధం అవుతాయి. అతను అనుకునేది నాకూ అలాగే. నేను ఇదివరకెప్పుడూ అనుకునేవాణ్ణి: ఐర్లండ్ లాంటి చిన్న చిన్న దేశాల్లోన, మొత్తం జనాభా అరకోటి కూడా ఉండని జాతుల్లో సృజన తీవ్రమైన స్వభావంగా ఉండేవాళ్ళు, సృజనకే కట్టుబడి ఉండేవాళ్ళు ఎందరో ఉన్నారు. మనం పదికోట్లన్నా జనాభా ఉంటాము, ఇంతమంది జనంలో అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో తప్పకుండా ఉండే ఉంటారు, బయటికి కనిపించరు అంతే అని. ఫణిబాబుని చూసి నేను అనుకున్నది, రాసేదీ నిజమే అని నాకే రూఢి అయ్యింది. ఆడబోయిన తీర్ధం, రాసినదానికి బహుమానం; ఇంక రాయకపోతేనేమి, ఇంక చాలు అనుకున్నాను.
రాయడంలో నాకు కనిపించే ఒకటే ప్రయోజనం ఏమిటంటే అది ఈ చదువుకున్నదాన్ని, ఆలోచించినదాన్ని అంతట్నీ ఒకచోట ప్రోది చేసుకొని, అంతా మననం కావడానికి నా ఒక్కడికే పనికొస్తుంది. అంటే Writing as thinking అని ఇదివరకు చెప్పినట్లు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు. అంతకు మించి రాసింది ఎవరికైనా పనికొస్తుందని తోచదు. ఫణిబాబు ఉన్నాడు కాబట్టి అతనితో మాటాడొచ్చు, ఇంక ఇది రాయక్కర్లేదు అనుకున్నాను. నేను రాసుకొనేవాటికి ఒకే ఒక్క పాఠకుణ్ణి నేనే. ఎందుకు రాస్తున్నావు? అంటే ఒక్క కనక ప్రసాదు కోసమే రాస్తున్నాను అని. మనం రోజూ అన్నం తినేటప్పుడు ఉన్నతమైన తెలుగు సస్యసీమల భవిష్యత్తు కోసమో, తెలుగు పిండివంటల భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపెట్టుకునో అన్నం తినము. మనకి ఆకలేస్తోంది కాబట్టి, తప్పనిసరై అన్నం – లేదూ ఏది దొరికితే అదీ తింటాము. ఎవరైనా ‘మేము, మీ పాఠకులం …’ అని బహువచనంలో రాస్తే నాకు అపనమ్మకం గాను, నౌతాలు గానూ ఉంటుంది. పగలబడి నవ్వుకుంటాను. ఎందుకంటే ఇదివరకే చెప్పుకున్నట్టు నేను ఏవీ ఒక పట్టాన చదవలేను, నొప్పెడుతుంది. ఎంతో పేరు మోసినవారి రచనలను తెచ్చి ముందు పెట్టి ‘ఇదిగో! విశ్వనాధవారి నవల, కృష్ణశాస్త్రిగారి కవిత – పెద్దవారివి, చదువు!’ అన్నా సరే నేను ముందుగా వాటి ఔద్వేగిక ఆవరణలోని పటుత్వాన్నీ, కాంతినీ, స్వఛ్ఛతనూ పరిశీలించి, ఒద్దకపోతే సాయించక ఇంక ముందుకు పోలేను. మరి నేను రాసేవీ ఇంకొకరు చదివేము అని నాతో చెప్తే ఆశ్చర్యంగా, అపనమ్మకంగా ఉంటుంది. వీళ్ళకి నొప్పెట్టదా?! అని. నేను రాసేవి పొరపాటున ఎవరైనా చదివితే వాళ్ళను నొప్పిస్తాయేమో, ఏమైనా హాని అవుతుందేమోనని, మనోభావాలు దెబ్బతింటాయేమోనని నాకు అనుమానం, దిగులు. సంపాదకుల్ని ఈ ఒక్క విషయం మాత్రం చూసి, ఏ హానీ లేదని అనిపిస్తేనే ప్రచురించండని అడుగుతుంటాను. ఎవరూ చదవకుండా ఉంటే ఈ బెంగ తీరిపోయింది. కాయితం మీద ప్రచురించకుండా ఉంటే తెల్ల కాయితం, సిరా ఇంక దేనికైనా పనికొస్తాయి; హరితవనాలు కొన్నైనా బతికిపొతాయి.
ఈ వ్యాసం విషయంలోన ఆ బెంగ తీరదు. నాకు దీన్ని చదువుతున్నామని ఇద్దరు, ముగ్గురు చెప్పేరు. అంతే కాక సృజన తత్వాన్ని గురించీ, జూటా అంటే ఏమిటనీ ఇలాగ ప్రశ్నలు కూడా అడిగేరు. ఆదివారం మధ్యాహ్నాలు కవితను గురించి రాస్తే అలా కాక మరి ఇంకెలా రాసి ఉండవచ్చునని, ఆ కవితను నేను ముందే చూసి ఉంటే ఏవైనా సలహాలు ఇచ్చుండేవాణ్ణి కదా అనీ ఇలాగ. ఇవి చూసి నాకు ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యీ అన్నట్టు తయారయ్యింది. ఈ రాసేదాన్ని అర్ధంతరంగా ఆపేస్తే దీన్ని చదివిన ఇద్దరు, ముగ్గురు పాఠకుల్లోనూ అనవసరంగా, అన్యాయంగా కొత్త అపోహలనూ, కొంత అయోమయాన్నీ కల్పించిన వాణ్ణవుతానని, వాళ్ళ సృజన వ్యాసంగాలకు అనవసరంగా అడ్డం వచ్చినట్టు అవుతుందనీ తోస్తున్నాది. మరీ అర్ధంతరంగా ఆపీకుండా ఈ ఒక్క ఇబ్బందినీ కొంతైనా నివృత్తి చేసుకోడానికి అవసరమైనది మాత్రం రాసి, కనీసం కామా పెట్టినట్టు అయ్యేక ఇంక ఊరుకుందామని అనుకున్నాను.
“A creative writer is one for whom writing is a problem.”
– Ronald Barthes
ఇప్పటివరకు స్పృశిస్తూ వస్తున్నవి రస చర్చకు, సౌందర్య శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు. రసం, సౌందర్యం అనే మాటలు ఇంగ్లిష్‌లో Affect అనే మాటకు సమానార్ధకాలుగా అనుకుంటున్నవి. వీటికి విమర్శతోను, మంచి రచనలు ఎలా చెయ్యాలి (How to…), మంచి సాహిత్యం భవిష్యత్తు ఎలా కాపాడుకుందాము? వంటి చర్చ తోను ప్రత్యక్షమైన సంబంధం లేదు. వాటిమీద నాకు ఆసక్తి లేదు. సృజనల్లో నేను వెతుక్కొనేది నైసర్గికమైన, పరిపూర్ణమైన సౌందర్యాన్ని, affectను. ఎందుకు? అంటే ఏమో నాకు తెలీదు. తప్పనిసరిగా ఇలా వెతుక్కొని రాసుకున్న వాళ్ళు ఉన్నారు. స్థూలంగా ఇలాంటి వివేచనను Aesthetics అనుకోవాలి; కాబోలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఇలాంటి ప్రశ్నల్నే కొన్నింటిని విశేషంగా చర్చించేరు – కవి మనఃస్థితి ఏమిటి, కవికీ పండితుడికీ తేడాలేమిటి, కవికి కవిత్వం ఎందుకు తప్పనిసరి, కవికీ లోకానికీ సంఘర్షణ ఎందుకు – ఇలాంటి ప్రశ్నలు. ఆయనకు సాంప్రదాయికమైన చదువే ఉంది. ఆధునిక విజ్ఞానాన్నీ, శాస్త్రాలనూ ఆయన చదువుకోలేదు, ఇంగ్లిష్ చదువుకోలేదు. ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలూ కొత్తగా, లోతుగా ఉన్నా పరిభాష పాతదే ఉంటుంది – రసం, ఆత్మానందం, ఋషి, బ్రహ్మానందం, ధ్వని, వక్రోక్తి, సమాధి ఇలాగ. ఇలాంటి పరిభాషకు విజ్ఞానశాస్త్ర పరమైన ప్రాతిపదకలు లేవు, ఏ ఉనికీ లేదు కాబట్టి ఆధునికులకు ఇప్పుడివి చిత్రంగా, చాదస్తంగానూ తోస్తాయి. కాని ఆ పరిభాష వెనుక ఆయన వంటి వాళ్ళు చేసిన ప్రతిపాదనలకూ ఇప్పుడు సృజన చుట్టూ ఆధునిక విజ్ఞానం లోన కొత్తగా ప్రతిపాదిస్తున్న సంగతులకూ అంగీకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శాంటాయన (George Santayana) అని ఉండేవారు. ఆయనా అలాగే వెదుక్కొని The Sense of Beauty అని చాలా కాలం వివేచించి, రాసుకున్నాడు. పుట్టపర్తి నారాయణాచార్యులుగారు ఇలాంటి వెదుకులాటను తీవ్రమైన రసదృష్టి అని చెప్పుకొనేవారు. దీన్ని విమర్శ కోసం, సలహా సంప్రదింపుల కోసం డైరెక్టుగా అన్వయించుకొనే ప్రయత్నం చేస్తే అది పదుగురి సృజన వ్యాసంగానికి ఇబ్బంది, అంటే disservice అయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు చేత్తో, చేతి వేళ్ళతోనే వేలాది పనులు, వృత్తులన్నిట్నీ నిర్వహించుకుంటాము. చెయ్యి ఎలా పని చేస్తుంది, వేళ్ళెలా పని చేస్తాయి? అనేది ఒక ప్రత్యేకమైన వివేచన. అది కుండలు ఎలా చేస్తారు? కుట్లు ఎలా అల్లుతారు? వంటి నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి పనికిరాదు. అలాగే సృజన ప్రక్రియను, తత్వాన్నీ గురించిన వివేచన నుండి నిర్దిష్టమైన సృజనల్ని గురించి సలహా, విమర్శ, మూల్యాంకనం, బేరీజు, దిద్దుబాటు ఇలా ఏమీ ఆశించలేము. రచనల మంచి చెడ్డలని విచారించే పని – అంటే విమర్శను, దిద్దుబాటును, సిఫారసును నాకు అప్పగిస్తే చాల పొరపాటు అవుతుంది. అనవసరంగా నొప్పెడుతుంది. నాకు ఉన్నవి ఏవీ ఒక పట్టాన నచ్చవు. ఉండీలేనిదేదో వెతుక్కుంటాను.
రక రకాల జీవితానుభవాలతో, ఆసక్తితో రాద్దామని ప్రయత్నం, సాధన చేసేవాళ్ళు, రాసేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు, ఆత్రంగా చదువుకునేవాళ్ళు వీళ్ళందరూ ‘కవులే’. అంతే కాక, సృజన ఆవిష్కరణలో కవి ఒక్కడికే కాకుండా, తొలి పాఠకుడు, సమీక్షకుడు, సంపాదకుడు, ప్రచురణకర్త, ముద్రాపకుడు వీళ్ళందరి ప్రమేయం, ప్రభావం విశేషంగా ఉంటాయి. సృజన మీద, అభ్యాసం మీద ధ్యాస ఉన్న కవులు వ్యక్తిగతంగా జవాబులు వెదుక్కొనే ప్రశ్నలు ఏమంటే నేను ఈ కవిత రాసేను, కధ రాసేను. ఇది బాగుందా, లేదా? దీన్ని ఎలా మెరుగు పెట్టుకోవాలి? ఇది పూర్తయ్యిందని నాకెలా తెలుస్తుంది? దీన్ని ప్రచురించేదా వద్దా? ఇలాంటివి. అసలు దీన్ని రాయాలన్న కోరిక ఎందుకు నాకు? అనీ. ఇవి వ్యక్తిగతమైన ప్రశ్నలు. అలాగే, సామాజిక స్థాయిలోన అభ్యుదయ సాహిత్యం, మార్క్సిస్ట్ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం వంటివి లేవనెత్తేవీ మనుగడకు అనివార్యమైన ప్రశ్నలు. అవి ప్రాతినిధ్యం వహించే సృజన అవసరంగా, అనివార్యంగా వెలువడేది. అవి మానవ సమాజాల్లోన అత్యధికుల స్థితినీ, వేదననూ చిత్రిస్తున్నాయి. వాటికి తమవే ప్రత్యేకము, నిర్దిష్టమైన సృజన సాంప్రదాయం, విమర్శ సాంప్రదాయం ఉన్నాయి. మొదటిది కనీస అవసరాలు తీర్చుకోవడమే పెద్ద కష్టం, ప్రశ్న అయినవాళ్ళ దుఃఖం నుండి అవసరంగా వెలువడేది. రెండవది ఆడవాళ్ళ కష్టం నుండి అవసరంగా వెలువడేది. అవి చిత్రించే దుఃఖం, వేదన, నొప్పీ కోట్లాది మనుషులవి మౌలికం, అతివేలమైన ఔద్వేగిక అనుభవాలు. సృజన మౌలికమైన తత్వాన్ని, స్వరూపాన్ని గురించి మాత్రం ఇక్కడ చర్చించే ప్రశ్నలు మనుషులందరికీ సామాన్యం, మౌలికమైన స్ఫురణ అనుభవానికి చెందినవి. వాటికీ పైన పేర్కొన్న ప్రత్యేకమైన సృజన పద్ధతులకూ మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. అవి ఒకదాన్నొకటి రద్దు చేసుకోవు. ఇక్కడ లేవనెత్తినవి Authenticity వంటి ప్రశ్నలు ఈ రెండు పద్ధతుల్లోనూ ఇదివరకే చర్చింపబడినవి.
యూలండ్ (Brenda Ueland) అని ఉండేవారు; 1938లో ఆవిడ ఒక పుస్తకం ప్రచురించేరు: If You Want to Write: a Book about Art, Independence and Spirit అని. ఆ పుస్తకాన్ని సృజన ఒక తప్పనిసరి స్వభావంగా, అవసరంగా ఉండీ దాన్ని ఎలా నిర్వహించుకోవాలో, ఏం చెయ్యాలో, అసలు రాయాలో వద్దో అని ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యేవాళ్ళు చాలా నెత్తిన పెట్టుకుంటారు, ఈ నాటికీ. ఆవిడ శైలి బాగా నాటకీయంగా, 1930ల నాటి వాతావరణానికి అనువుగా ఉషారు మాటలు (pep talk) లాగ ఉంటుంది. కాని ఆవిడ పుస్తకంలోని విషయాలు సృజనకారులకు ఈనాటికీ పనికిరావచ్చు. ఇలాగని చదివిన వాళ్ళందరూ, ఔత్సాహిక రచయితలు కృతజ్ఞతతో చెప్పుకుంటుంటారు. మచ్చుకి కొన్ని విషయాలు. త్రిపుర, నారాయణరావుగారు చెప్తున్నట్టే ఆవిడ కూడా రాయాలని ఉత్సాహం ఉన్నవాళ్ళు అందరూ ఎలాంటి సంకోచం, బెరుకు లేకుండా తప్పకుండా, నిరభ్యంతరంగా రాసుకోవాలని పదే పదే చెప్తారు. రాయాలి అని అనిపించడమే ప్రధానమనీ, రాసుకోవడం చాల అవసరమైన, ఆరోగ్యకరమైన పని అనీ ఎందుకో వివరించి చెప్తారు. ప్రజాస్వామ్యవాదం కూడా ఇలాంటి నిర్ధారణలనే ప్రతిపాదిస్తుంది. అంటే – మనుషులందరూ సమానం కాబట్టి అందరికీ రాసే హక్కు, భావ ప్రకటనా స్వేఛ్ఛా ఉన్నాయి కాబట్టి, అందరూ రాయాలి, అవన్నిటినీ అందరం గౌరవించాలి అని. లెఖ్ఖల పరీక్షలో ఒక్కొక్కసారి తెలివైన విద్యార్ధులు జటిలమైన ప్రశ్నలకి తప్పుడు పద్ధతుల్ని అనుసరించి కూడా సరైన సమాధానాన్నే కనుక్కుంటారు చివరికి. అంటే అసంగతమైన ప్రాతిపదికల మీదుగా చివరికి సరైన జవాబునే రాసి చూపిస్తారు. జవాబు సరైనదే కాబట్టి పట్టి చూడకుండా ఉంటే అలాంటి జవాబులకీ మంచి మార్కులే పడుతుంటాయి. సృజన వివేచనలో మేధావులైన ప్రజాస్వామ్యవాదీ, లౌక్యుడైన వ్యవహర్తా, రాజనీతిజ్ఞుడి ప్రతిపాదనలు ఇదిగో ఈ తెలివైన విద్యార్ధుల తప్పు లెఖ్ఖల్లాంటివి. ఎందుకంటే అవి సృజన అనుభవం ప్రాతిపదికగా కనుక్కున్న సమాధానాలు కావు. అలాంటి నిరుపయోగమైన మర్యాద ప్రాతిపదికగా కాకుండా, సృజన అనుభవం, కళాత్మకమైన అభ్యాసం ప్రాతిపదికలుగా ఇలాంటి ప్రశ్నలతో ఎలా సమాధానం పడవచ్చునో యూలండ్ వివరిస్తారు.