చారిత్రక నవలకు అతిముఖ్య లక్షణం మరొకటి వుంది. నవలలో చిత్రితమైన చరిత్ర తన గతచరిత్రే అని పాఠకునికి అనుభూతి కావాలి. గతచరిత్రకూ వర్తమానచరిత్రకూగల కార్యాకారణ సంబంధం పాఠకుని బోధపడాలి. ఆనాటి చరిత్ర అలా వున్నందువల్లనే యీనాటి చరిత్ర ఇలా వుందనే స్పృహ పాఠకునికి కలగాలి. నవలలో సాహిత్య లక్షణాలు యెన్ని వున్నప్పటికీ, చారిత్రక వాస్తవికత యెంత వున్నప్పటికీ యీ అంశం కొరవడితే, అది ఉత్తమ చారిత్రక నవల కాలేదు. యెందుకంటే వర్తమానానికి కారణం కాజాలనిది గతచరిత్ర కాలేదు. వర్తమానాన్ని సుబోధకం చేయజాలని గతాన్ని మనం స్మరింపవలసిన అవసరమూ లేదు.
రామమోహనరావుగారు రచించిన ఈ నవలలో పై లక్షణాలన్నీ యేవిధంగా సాఫల్యం పొందిందీ వివరించడం ఈ వ్యాసంలో సాధ్యంకాదు కానీ, 1920 నాటి రాజకీయ పరిస్థితులూ, సామాజిక పరిస్థితులూ పాత్రలను తీర్చడంలోనూ, సన్నివేశాలను కూర్చడంలోనూ, నిర్ణాయక పాత్ర వహిస్తాయి. రాజకీయ పరిస్థితులలో ఆంధ్రదేశ ప్రత్యేకత అనదగింది యెక్కువగా లేని మాట నిజమే. యెక్కువ ప్రత్యేకత వుండడానికి అవకాశంలేదు కూడా. బ్రిటిష్ ఆధిపత్యం కింద భారతదేశమంతా రాజకీయ ఏకీకరణ పొందిన తర్వాత రాష్ట్రాలకు రాజకీయ ప్రత్యేకత యేమీ మిగలలేదు. రాజకీయ ఏకీకరణ యేర్పడింది గనుకనే రాజకీయ స్వాతంత్ర్యం కొరకు జరిగిన మన జాతీయోద్యమం ఆవిర్భవించడానికీ, విస్తరించడానికీ, తుదకు విజయం పొందడానికీ వీలు కలిగింది. ఐనప్పటికీ 1920నాటి రాజకీయ వాతావరణంలో కొన్ని అంశాలు గమనార్హం. బెంగాల్ లోనూ, పంజాబ్ లోనూ ఆనాడు టెర్రరిస్టు ఉద్యమం బలంగా ఉండింది. ఆంధ్రదేశ రాజకీయాల్లో అది యెపుడూ ప్రవేశించనే లేదు. మహారాష్ట్ర లోను, యితర ఉత్తర భారత ప్రాంతాలలోనూ జాతీయోద్యమంలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుద్ధరణ వాద ప్రాబల్యమూ పెనవేసుకొని వుండినాయి. ఆంధ్ర రాజకీయాల్లో వాటికెప్పుడూ స్థానమే లేదు.
మతాభిమానమూ, సనాతన ధర్మమూ, బ్రిటిష్ వాళ్ళ తాబేదార్లుగా వ్యవహరించినాయే గానీ దేశభక్తులెప్పుడూ వాటిని ఆదరింపలేదు. కాంగ్రెసు మంత్రులకూ, స్వతంత్ర పార్టీ నాయకులకూ తిరుపతి దేవుడు ఇలవేలుపైనాడు గానీ, ఆనాటి జాతీయ నాయకులు తమ ఉద్యమ ఫలసిద్ధికి తిరుపతి దేవుని కెప్పుడూ ముడుపులు కట్టుకోలేదు. నిజానికి తెలుగు జాతి జీవితంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘ సంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమ రూపంలో ప్రవేశించినాయి. అనగా 1920నాటికి తెలుగుదేశంలో ఫ్యూడల్ విశ్వాసాలమీద తిరుగుబాటూ, బూర్జువా మనస్తత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై వుండింది; ఇది ఆనాటి ఆంధ్రదేశ ప్రత్యేకత అనుకోవచ్చు. యీ ప్రత్యేక లక్షణం నవలలోని వాతావరణంలో ప్రస్ఫుటంగా వుండటమే గాక, ఘటనాక్రమంలో నిర్ణాయక పాత్ర వహిస్తున్నది.
కథానాయకుడైన రామనాథం రాజకీయ కారణాలవల్ల కాలేజీ చదువు మానుకోవడంతో అతని జీవితం మలుపు తిరిగినప్పటికి, అతని తదనంతర జీవితమంతా సాంఘిక దురాచారాల మీద పోరాటమే. ఆ పోరాటంలో వచ్చిన అగ్నిపరీక్షలే అతని జీవిత సర్వస్వాన్ని నిర్ణయించి, అతన్ని ఒక మనిషిగా ఒక వీరునిగా తీర్చిదిద్దుతాయి. నిజానికి కాలేజీ చదువు మానేటప్పటికే అతనికి ఫ్యూడల్ సామాజిక ధర్మాల మీద విశ్వాసం నశించింది. అప్పటికే అతనిలో జాగృతమైన బూర్జువా మనోధర్మమే అతన్ని రాజకీయ రంగంలోకి ఆకర్షించిందని కూడా చెప్పవచ్చు.
ఫ్యూడల్, బూర్జువా ధర్మాలకు జరిగిన చారిత్రక ఘర్షణే యితివృత్తంగా గల యీ నవలలో బూర్జువా ధర్మానికి రామనాథం ప్రతినిధి. బ్రాహ్మణ గ్రామమైన ముంగండను కథాస్థలం గానూ బ్రాహ్మణ యువకుడైన రామనాథానాన్ని కథానాయకుడు గానూ రచయిత స్వీకరించినాడు. తెలుగుదేశం లోని వేలాది గ్రామాలకు ఒక బ్రాహ్మణ గ్రామం ప్రతినిధి కాజాలదనీ, తెలుగుదేశం లోని లక్షలాది యువకులకు ఒక బ్రాహ్మణ యువకుడు ప్రతినిధి కాజాలడనీ అనిపించవచ్చు. కానీ, ఫ్యూడల్ ధర్మాలకూ బూర్జువా ధర్మాలకూ జరిగిన ఘర్షణను చిత్రించేటప్పుడు ఫ్యూడల్ వ్యవస్థను అత్యంత ఘనీభూతరూపంలో చిత్రిస్తే తప్ప ఆ ఘర్షణ యెక్క తీవ్రత, వ్యగ్రత వ్యక్తం కావు.
ఫ్యూడల్ ఆచారాలు, ఆలోచనలు, విశ్వాసాలు ఎంత కఠోరంగా, యెంత అమానుషంగా, యెంత మూర్ఖంగా వుండగలవో చూడాలంటే బ్రాహ్మణ గ్రామాల్లోనూ, బ్రాహ్మణ కుటుంబాలలోనూ మాత్రమే చూడగలం; జైలునుంచి వచ్చిన రామనాథాన్ని, జైల్లో కులభ్రష్టుడైనాడన్న కారణం చేత అతని తలిదండ్రులే యింట్లోకి రానివ్వరు. అతను ముట్టుకున్న బిందె మైలపడిందని కంసాలి కామయ్య, అతను ముట్టుకుంటే చేద మైలపడుతుందని పడవ సరంగూ విశ్వసిస్తారు. శివరామయ్య తల్లిది మరీ విపరీతమైన ఆచారం. వీధిలోనుండి యింట్లోకి యెవరు వచ్చినా వాకిట్లో నిలబడి చెంబెడు పేడనీళ్ళు కాళ్ళమీద చల్లుకుని రావలసిందే; లేకపోతే యిల్లంతా మైలపడుతుందని ఆమె భయం. ఇక మూడుకాళ్ళ ముసలమ్మ, నరసమ్మ, ఆచార పరాయణత్వం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఆచారాలు పుణ్యపాపాలకూ, పరలోక గతులకూ మూలమనీ సనాతనులందరూ విశ్వసిస్తారు. కానీ, ఆమె “ఏమో ఎవరు చూడొచ్చారు? పరలోకం అంటూ వుందో లేదో! దానిని నమ్ముకుని ఇక్కడ అనాచారపు బ్రతుకు గడప మంటావా?” అంటుంది. ఆమెకు ఆచారం అనేది పరలోకం కంటే కూడా విలువైనది, విశ్వసనీయమైనదీ. పరలోక గతులు కాకపోతే ఇక ఆచారానికి ప్రయోజనమేమిటని అడిగితే బహుశా ఆమె సమాధానం చెప్పలేక పోవచ్చు, చెప్పగలిగితే (virtue is its own reward) అన్న ధోరణిలో వుంటుంది. ఆచారం మంచిది, గనుక ఆచరిస్తున్నాం, దానికి ప్రయోజనమెందుకు ?” అంటుంది. ఆచారం ఆమె రక్తంలో జీర్ణించిపోయిన అలవాటు. అలవాట్లకు బానిసలైన వాళ్ళు వాటి ప్రయోజనాలను గురించి ఆలోచించరు. ఆ అలవాట్లు చిన్నప్పుడే ఊహ తెలియకముందే యేర్పడితే, ఇక ఆలోచించే శక్తి వుండదు వాళ్ళ మెదడుకు. ఆచారం గురించి ఆమె ఆలోచించదు; ఆలోచించలేదు. యెవర్నీ ఆలోచించనివ్వదు.
ఫ్యూడల్ వ్యవస్థలోని ప్రథమసూత్రం అదే. ఆలోచించకుండా ఆచారాలకూ, అధికారాలకూ తల వొగ్గడమే దైవభక్తి. రాజభక్తి, పతిభక్తి, పితృభక్తి, మతం, చాతుర్వర్ణ్యం, సమాజంలో ప్రకృతి సిద్దమైన అంతస్థులు, దైవదత్తమైన తర తమ భేదాలు – యేదో ఒక పేరుతో మనుషులను ఆలోచించనీయకుండా అణకువా, విధేయతా, ఆఙ్ఞాపాలనా, బానిసబుద్ధి మొదలైన సద్గుణాలను ఉగ్గుపాలతో నేర్పేదే ఫ్యూడల్ వ్యవస్థ. ఈ వ్యవస్థ యొక్క పరమమైన (absolute) రూపం చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాల్లోనే సాధ్యమౌతుంది. ఫ్యూడల్ బూర్జువా వ్యవస్థలను వాటి పరమమైన రూపాలలో చిత్రించినప్పుడే వాటి పరస్పర సంఘర్షణ యెంత భయంకరంగా, యెంత భీభత్సజనకంగా వుండేదీ వ్యక్తమౌతుంది. ఆ సంఘర్షణలో చిక్కుకున్న వ్యక్తులకు అది యెంత మర్మవిదారకంగా వుండేదీ అప్పుడే పాఠకులకు అనుభూతమౌతుంది. అందుకే రచయిత ముంగండను కథారంగంగానూ, రామనాథాన్ని కథానాయకునిగానూ, యెన్నుకున్నాడు.
రామనాథం మామ నారాయణమూర్తిని పోలీసు ఇన్స్‌పెక్టర్‌గా చిత్రించడంలోని అంతర్యం కూడా అటువంటిదే. అల్లుని ప్రభుత్వ వ్యతిరేకి ఐన సత్యాగ్రహి గానూ, మామను ప్రభుత్వపు బంటు ఐన పోలీసు ఉద్యోగి గానూ చిత్రించడం మరీ నాటకీయంగా (dramatic) వుందనీ, సగటు వాస్తవ జీవితానికి దూరంగా వుందనీ యెవరైనా నిందించవచ్చు. కానీ ఒక చారిత్రక యుగాన్ని మానవ హృదయానుభూతుల పరిభాషలోకి అనువదించ వలసినపుడు చరిత్రను నాటకీకరించక తప్పదు. సుమారు అరశతాబ్దం పాటు సాగిన మన జాతీయోద్యమం కేవలం ఇంగ్లీషు వాళ్ళకూ, భారతీయులకూ మధ్యనే సాగిన పోరాటం కాదు. అది మొత్తం భారత దేశాన్నే జాతీయవాదులూ – ప్రభుత్వ పక్షపాతులూ అనే రెండు కూటాలుగా చీల్చింది. ఫ్యూడల్ బూర్జువా శక్తుల పరస్పర సంఘర్షణ కూడా యీ జాతీయ సంగ్రామంతో పెనవేసుకొని పోవడంతో యీ చీలిక మరింత గాఢంగానూ, మరింత సంక్లిష్టం గానూ, మరింత సర్వకాష్టం గానూ జరిగింది. తత్ఫలితంగా మన జాతీయ పోరాటంలో అంతర్యుద్ధ స్వభావం ప్రగాఢంగా వుండింది. నిజానికి ఫ్యూడల్ వ్యవస్థ మీద బూర్జువా శక్తుల పోరాటం ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా మొదలైన అనేక దేశాలలో అంతర్యుద్ధ రూపంలోనే సాగింది.
ఇతర కారణాలతో పాటు, మనదేశంలోని బూర్జువా విప్లవం జాతీయ పోరాటరూపం ధరించిన ప్రధాన కారణం చేత, అందులోని అంతర్యుద్ధ స్వభావాన్ని మనం సరిగా గుర్తించడం లేదు. మొత్తం జాతినే రెండు శిబిరాలుగా చీల్చిన అంతర్యుద్ధం అంతటితో ఆగలేదు. అనేక లక్షల కుటుంబాలను – ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను కూడా రెండు శిబిరాలుగా చీల్చింది. జాతీయ పోరాటంలో పాల్గొన్న వాళ్ళూ, ఫ్యూడల్ నిరంకుశ శాసనాలనూ, వికృత సనాతన ధర్మాలనూ యెదిరించిన వాళ్ళూ, యెన్ని లక్షలమంది యువతీ యువకులు తమ తలిదండ్రులను ధిక్కరించవలసి వచ్చిందో, తమ ఆలుబిడ్డల సంక్షేమాన్ని తృణీకరించవలసి వచ్చిందో, తమ ఆత్మీయుల హృదయాలలో అగ్ని రగిలించవలసి వచ్చిందో, తత్ఫలితంగా తామే ఎంత మనోవేదనకు గురి కావలసి వచ్చిందో మనకు తెలుసు; చరిత్రకారులు చెప్పకపోయినా మనం ఊహించుకోగలం. మరి ఒక అంతర్యుద్ధానికి నవలారూపం ఇవ్వవలసి వచ్చినప్పుడు, ఒక చారిత్రకదశలో చారిత్రక కారణాల వల్ల స్త్రీ పురుషులలో కలిగిన హృదయ సంతాపాన్నీ, హృదయ సంక్షోభాన్నీ (ఈనాటి) పాఠకులకు కళా పరిభాషలో అందజేయవలసి వచ్చినప్పుడు, కుటుంబాలనే అంతర్యుద్ధ రంగస్థలంగా చిత్రించక తప్పదు, చరిత్రను నాటకీకరించక తప్పదు.
నవల లోని మరొక ఘటనను కూడా యిక్కడే స్పృశించడం న్యాయంగా వుంటుంది. నారాయణమూర్తి ఇంట్లోకి వచ్చి తన కూతురుతో మాట్లాడుతున్న అల్లుని చూసి, యెవరో తుంటరి తన కూతురును అల్లరి పెడుతున్నాడనే అపోహతో వెనక ముందులు ఆలోచించకుండా తక్షణమే చేతిలోని కొరడాతో పశువును బాదినట్లు అల్లుని బాదుతాడు. ఆ సన్నివేశం Melodramatic (అతిశయ నాటకీయం, లేక క్షుద్ర నాటకీయం)గా వుందనే విమర్శ రావడం సహజమే. అంతేగాక ఆ ఘటన ఒక చిన్న పొరపాటు వల్ల జరిగిన యాదృచ్ఛిక ఘటన; అటువంటి యాదృచ్ఛిక ఘటనమీద తదనంతర కథాగతి ఆధారపడడం ఉత్తమ కళా లక్షణం కాదనే విమర్శ కూడా ఈ నవల మీద వుంది.
ఈ ఘటన అతిశయ నాటకీయంగా కనపడే మాట నిజమే. కానీ నారాయణమూర్తి వ్యక్తిత్వం (Character) దృష్ట్యా అది అసహజమేమీ కాదు. అతను దురహంకారీ, అధికార గర్వీ మాత్రమే కాదు; యెదటి వాళ్ళను పురుగును చూసినట్లు హీనంగా చూడడమూ, ముందువెనకలు చూడకుండా కొరడాలూ, లాఠీలూ ప్రయోగించడమూ అతనికి అలవాటు. అల్లుడు కాలేజీ చదువు మానుకొని జాతీయవాదిగా మారిన వార్త విన్నప్పుడు అతను అల్లుని “గూళ్ళు విరగబొడిచేసి బొక్కలో తోసేస్తే” రోగం కుదురుతుందని వియ్యంకుని తోనే అనగలిగిన కిరాతకుడు. అల్లుని దారిలోకి తెచ్చుకోడానికి కూతురుకు కార్యం చేసే ఆలోచనలో వున్న భార్యతో ఆ శుభకార్యం తన ఇంట్లో జరగడానికి వీల్లేదని నిషేధిస్తూ, “నా ఉద్యోగానికి సంబంధించినంతవరకూ అల్లుడూ లేడు, కూతురూ లేదు. ఆ కుర్రవాడు నా యింట అడుగుపెట్టడానికి వీలులేదు. ఓ చీరపెట్టి పిల్లని పంపించెయ్యి. ఆ శుభకార్యం వాళ్ళింట్లోనే చేసుకుంటారు” అని అనగలిగిన వట్టి కర్కోటకుడు అతను. బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశ సందర్భంలో వలంటీరుగా పనిచేస్తూ రైలుస్టేషనులో వున్న ఒక పడుచును (స్వరాజ్యం) కేవలం కక్షతో, ఆమె ’మగవాళ్ళ వేటకోసం’ వచ్చిన పడుపుకత్తె అనే నెపం పెట్టి ఆమెను యీడ్చుకు రమ్మని హెడ్ కానిస్టేబుల్‌ను పంపిన కేవలం పోలీసు జంతువు అతను. కనుక అతను అల్లుణ్ణి కొరడాతో బాదడంలో అసహజత్వమూ లేదు, అతిశయ నాటకీయతా లేదు.
కాకపోతే, నారాయణమూర్తి పాత్ర కల్పన లోనే ఆ లక్షణాలు వున్నాయని యెవరయినా ఆక్షేపించవచ్చు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన 20 యేండ్ల తర్వాత కూడా మన పోలీసు అధికార్ల అత్యాచారాలూ, అమానుషత్వమూ చూస్తున్న మనం 1920 నాటి పోలీసు అధికార్లలో పశుత్వం మూర్తీభవించినందుకు ఆశ్చర్యపడనక్కరలేదు. నారాయణమూర్తి ప్రవర్తన కేవలం కథా సౌకర్యం కోసం కల్పించింది కూడా కాదు. ఆనాటి పోలీసు ఉద్యోగుల పశుత్వం గురించి రచయితకున్న నిశ్చితమయిన అవగాహనలో నుండి ఉద్భవించిన మూర్తే నారాయణమూర్తి పాత్ర. దాన్ని గురించి సందేహం గానీ, అస్పష్టత గానీ మిగిలించలేదు రచయిత. ఆనాటి పోలీసు మనస్తత్వం లోని పశుత్వమూ, నీచత్వమూ నవల ప్రారంభంలోనే పాఠకునికి పరిచయమౌతాయి. రామనాథానికి పడవ ప్రయాణంలో ఒక పోలీసు జవానుతో ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ చిన్నదే ఐనా పోలీసు జులుం చవిచూసిన రామనాథం “చదువుకొని ఈ దుర్మార్గులకీ, దుష్టులకీ సహాయం చేయడమే కదా మా ఆశయం. ఆ ఉద్యోగమే బ్రతుక్కి పరమార్థం అనుకొన్నాం. మా పూర్వులు చేసిన పుణ్యకార్యాలూ, మా భార్యలు చేసిన పూజలూ మాచేత ఈ లుచ్ఛాలకి చేతులు నలిపించడం కోసమేనా, ఓరి దేవుడా!” అంటూ ఆక్రోశంతో, ఆత్మగ్లానితో, అభిశంసనతో కంఠం రుద్ధమై నిలువునా
కృంగిపోతాడు.
ఇక అల్లుని కొట్టడం అనే యాదృచ్ఛిక ఘటన కథాగతికి ఆధారభూతం కావడం కళాభంగం అనే విమర్శవుంది. అది యాదృచ్ఛిక ఘటన అన్నమాట నిజమే కానీ, తదనంతర కథాగతికి ఆధారమైందనడం (స్థూలదృష్టికి అలా అనిపించినా) సూక్ష్మపరిశీలనకు నిలిచేది కాదు. మామ చేత దెబ్బలు తిన్న తర్వాత కూడా రామనాథం తన భార్యను తెచ్చుకోడానికీ, వీలైతే మామగారి కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించడానికీ సకల ప్రయత్నాలు చేసినాడు. కాని నారాయణమూర్తి లోని పోలీసు తత్వమే ఆ ప్రయత్నాల నన్నిటినీ కాలదన్నింది. రాజద్రోహి అయినవాడు అల్లుడయినా తన్ని జైలుకు పంపించిన రాజభక్తి తత్పరుడనే ప్రశంసల ముందు అతనికి అల్లుడనే అభిమానం గానీ, కూతురు భవిష్యత్తు సర్వనాశనమౌతుందనే కనీస వివేకం గానీ మిగల్లేదు. కాబట్టి కథాగతి ఆ యాదృచ్ఛిక ఘటన మీద ఆధారపడిందనడం నిజం కాదు. కథ అంతా ఆనాటి చారిత్రక సన్నివేశంలో అల్లుడు జాతీయవాది, మామ పోలీసు ఉద్యోగి కావడం అనే కీలక పరిస్థితి మీదా, ముఖ్యపాత్రల మనోధర్మాల మీదా సంపూర్ణంగా ఆధారపడింది.