ఈమాట » హోమగుండం: కథ నచ్చిన కారణం

Expand to right
Expand to left

హోమగుండం: కథ నచ్చిన కారణం

కథ: హోమగుండం
రచన: జరుక్ శాస్త్రి
కథాకాలం: 1945


శరత్ పూర్ణిమ, 1981.

జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరు చెప్పగానే కొందరికి మహాప్రస్థానానికి చెలం రాసిన యోగ్యతాపత్రం గుర్తుకి రావచ్చు. యెందుకటే చెలాన్ని, “ఇదేమిటి, ఈ మూల స్త్రీలకోసం ఇట్లా మూలుగుతున్నారు? శ్రీశ్రీ పద్యాలవేగంతో ప్రపంచపు పాతదుమారమంతా వూడ్చుకు పోతూ వుంటే!” అని ఆప్యాయంగా హెచ్చరించిన వాడు ఆయనే! లేదూ, విశ్వనాథ సత్యనారాయణగారిని ‘పాషాణపాకప్రభూ!’ అని సంబోధించిన వాడిగా మరికొందరికి స్ఫురించవచ్చు. ఇవేవీ గుర్తు రాకపోయినా తెలుగులో రమ్యమైన పేరడీలు రాసిన వాడిగా అందరికీ గుర్తుంటాడు. పేరడీ శాస్త్రిగా, జరుక్‌ శాస్త్రిగా, రుక్కాయిగా, ఎందరో మహాకవులకి, రచయితలకీ మంచి స్నేహితుడు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. ‘సిందూరం రక్తచందనం …కావాలోయ్ నవకవనానికి’ గీతానికి,

“మాగాయీ కందిపచ్చడీ ఆవకాయీ పెసరప్పడమూ
తెగిపోయిన పాత చెప్పులూ పిచ్చాడి ప్రభావం, కోపం
వైజాగ్ లో కారాకిళ్ళీ సామానోయ్ సరదాపాటకు”

అని పేరడీ రాసి, ఆ తరువాత శ్రీశ్రీ రాసిన రుక్కుటేశ్వర శతకం అంకితం పుచ్చుకున్న వాడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి.

అయితే, ఆయన చక్కని కథలు చాలా రాశారని చాలా మందికి తెలియక పోవచ్చు. రకరకాల మారుపేర్లతో ఆయన రాయబట్టి అన్ని కథలూ సంపాదించడం సులువైన పని కాదు. రమణారెడ్డి ఆధ్వర్యంలో, 1934 నుంచి 1963 వరకూ ఆయన రాసిన కథల్లో దొరికిన 20కథలు పోగుచేసి శరత్ పూర్ణిమ అనే సంకలనం 1981లో నవోదయవాళ్ళు అచ్చువేశారు. ఈ ఇరవై చక్కని కథలే! అందులో నాకు నచ్చిన ఒక కథ గురించి ఇక్కడ ముచ్చటిస్తాను.

హోమగుండం 1945 లో అచ్చయిన కథ.

“స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది. కథా వస్తువు ముందుగానే తెలిసిపోతుంది. కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.

టూకీగా కథ ఇది:

హనుమంతరావు భార్యని దహనం చేసి నెల తిరక్కండా శరణాలయం పంచన పడివున్న నరసమ్మను పెళ్ళి చేసుకుంటాడు. నరసమ్మకి పుట్టిన బిడ్డ పోయిన పంతొమ్మిది రోజులకే తనని ఎవరో ఒకరు పెళ్ళి చేసుకుంటారని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది, హనుమంతరావు రావటం, తను తనగురించి అన్ని విషయాలూ చెప్పటం, అతను తనని పెళ్ళి చేసుకోటానికి ఒప్పుకోవటం - హనుమంతరావులో ఆమెకు ‘దైవాంశ’ కొట్టవచ్చినట్టు కనపడిందంటే ఆశ్చర్యం లేదు.

ఆర్యసమాజం వివాహవేదిక మీద తలవంచుకొని కూర్చుంటే, తన మొదటి పెళ్ళి తతంగం అంతా గుర్తుకొచ్చింది: “తోలినకొద్దీ మూగి, దోమలు సంగీతం పాడి కుట్టినట్లు.”

మొదటి భర్త జబ్బు చేసి హటాత్తుగా చనిపోవటం, తలచెడి ఓ మూల చాపచుట్టలా పడి ఏడుస్తున్న దాన్ని మరిది మాయమాటలతో దగ్గిరకి తీయడం, గర్భిణీ కావడం, సంధికొట్టి బిడ్డ పోవడం, హనుమంతరావు తన జీవితంలోకి రావడం, సినిమాలా జరిగిపోయింది.

హనుమంతరావు మొదట్లో బాగానే ఉన్నాడనిపించింది. అతనిలో మార్పు అతి త్వరలోనే కనిపించింది. హనుమంతరావు కొడుకు, చిన్న పిల్లడు, కిష్టుణ్ణి, మేనమామ గుమ్మంలో దింపి పోయాడు. నరసమ్మ వాడిని బుజ్జగించి, లాలించి అతి గారాబంగా చూసుకోవటం వరకూ కథ చాలా సజావుగా నడిచిందనిస్తుంది. అయితే, హనుమంతరావులో నరసమ్మ పరంగా ఎందుకు అసహ్యం కలిగిందో చెప్పటం కష్టం. అతనికి చిరాకు పెరగటం, చివరకి నరసమ్మని కొట్టడం కూడా జరుగుతూంది; అనుమానంతో!

“ఏదో ఇంట్లో పడి వుండటం” కోసం నరసమ్మని పెండ్లానని అనడంతో నరసమ్మకి వెగటు మొదలైనా, భర్త అధికారానికి అడ్డుచెప్పగల ధైర్యం ఎక్కడినుంచి వస్తుంది? అయినా నరసమ్మ హిందూ స్త్రీ. భర్తని సుఖపెట్టడమే తప్ప తనకి వేరే ఏ విధమైన సరదాలూ ఉండటం నిషిద్ధం.

హనుమంతరావులో మార్పు, నరసమ్మ ఓర్పు కథకుడు రమ్యంగా చిత్రించడం ఈ కథకి ఆయువు పట్టు. అదే శిల్పం అని అంటే నాకు తగవు లేదు. మరొక విషయం. కథలో ఏ ఒక్క వాక్యం తీసెయ్యలేము. నరసమ్మ కిష్టుణ్ణి తన స్వంతకొడుక్కన్న మిన్నగా చూసుకుంటుంది. ఆ చిన్న వాడికి కథలు చెప్పుతుంది. హనుమంతరావుకి అదీ నచ్చదు. నరసమ్మ అలంకరించుకోవటం, బీచిలో తనకి అంటిపెట్టుకొని నడవడం, ఇవన్నీ అతనికి ఎందుకో ఇష్టం లేదు.

తేలిగ్గా ఆమెపై చెయ్యి చేసుకుంటాడు. అతని అనుమానానికి కారణాలు వెతకటం కష్టం. అయితే, తనే ఆవిడని అనవసరంగా నానా హింసలూ పెడుతున్నానని “నేను రాక్షసుణ్ణి” అని బాధపడతాడు. ఆర్యసమాజపు సంస్కర్తలని విమర్శిస్తున్నాడో, సమాజంలో గొప్ప కోసం వేసుకున్న అభ్యుదయపు ముసుగులో ఇమడలేక నలిగిపోయే అసమర్థులను ఎత్తిచూపుతున్నాడో - రచయిత ఉద్దేశ్యం మనకు అర్థం కాదు.

నరసమ్మ కడుపుతో ఉంది. వేవిళ్ళు. ఫలానాది కావాలని చెప్పుకోలేదు. సహనం హద్దు మీరుతుంది; ఎవరికైనా సరే!

కథ ఎలా ముగుస్తుందో చెప్పడం సబబు కాదు.

ఇద్దరి పాత్రల్లో వైవిధ్యం - మంచితనం, చెడ్డతనం రెండూ అందరిలోనూ ఎలా పెనవేసుకొని పోతాయో -కథకుడు సంభాషణల ద్వారా పాఠకుడికి బోధపరుస్తాడు. వ్యక్తులు, -స్త్రీలు కానీయండి, పురుషులు కానీయండి - కొన్ని సందర్భాలలో ఎంత అర్థం పర్థం లేకండా ప్రవర్తిస్తారో కళ్ళకు కట్టినట్టు రాస్తాడు శాస్త్రి గారు. కథ తర్కానికి అందదు. జీవితం తార్కికంగా జరగదు. కథ మాత్రం తార్కికంగా ఎందుకు నడవాలి? అందుకని ఈ కథ నాకు నచ్చింది; చదువుతున్నంతసేపూ, కళ్ళల్లో నీళ్ళు నిండినా కూడా!

కథ పూర్తయిన తరువాత మనలో అణిగి ఉన్న ‘విమర్శకుడు’ తార్కికంగా కథని బేరీజు వేయడానికి ప్రయత్నిస్తాడు; అది ఎంత శుష్కప్రయత్నమైనా సరే! తమాషాగా లేదూ!

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. ఆర్.దమయంతి. అభిప్రాయం:

    August 15, 2012 2:09 am

    స్త్రీ సహనానికి అగ్ని గండం
    ఈ హోమ గుండం!

    ముందు మాట:

    జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి గురించి నేనింతకు ముందు కొంత విన్నాను. కొందరు ప్రముఖులు ఆయన గురించి రాయగా చదివాను. కానీ, నేనెప్పుడూ ఆయన రచించిన పుస్తకాన్ని చూడలేదు. చదవలేదు.
    అలాంటి జరుక్ శాస్త్రి గారు! ఎంత మంచి కథ రాసారూ!? అని ఆశ్చర్యమైంది, అబ్బురమైంది- నాకు. ఈ కథ పూర్తిగా చదివాక, నా మనసుకేమీ తోచనట్టైంది. ఉక్కపోతేసింది. కాసేపు చల్ల గాలి కావాలనిపించింది. కారణం -ఆ స్త్రీ మూర్తి నా కళ్ళ ముందే - మంటల్లొ పడి కాలిపోయిన భావన వల్ల కావొచ్చు. అలా అని ఈ కథ బాగుంది అని పొగిడినా, లేదా -, ఈ రచయిత ఆ కారెక్టర్ ని భలే అద్భుతంగా చిత్రీకరించాడని సంబర పడ్డా, అది చాలా దుర్మార్గ గుణమై పోతుంది.

    కారణం - ఇది కథ కాదు. జీవితం. ఇందులోనివి పాత్రలూ కావు. అవి అచ్చు- పోత పోసిన మనం. మన్లోని మన మొచ్చి ఇక్కడ మనకెదురుగా కనిపిస్తున్నట్లుంటాయి. ఎప్పుడూ ఎవరమూ చూడని సంకుచితాలు హనుమంతునిలో తాండవమాడుతున్నట్టుంటాయి.

    ఈ రచనలో పాఠకులని కదిలించే విషయం ఏమిటంటే: ‘పెళ్ళినాడే మొగుడు. ఆ తర్వాత యముడు..’ అనే పెద్దల పెద్ద సూక్తి మనకుచప్పున స్ఫూరణకొస్తుంది- ఈ రచన చదివాక! ఆనాటి హనుమంతరావు - అప్పట్నుంచీ కథలోనే కాదు, ఇప్పటికీ ఈ సమాజంలో (చావకుండా) ఇంకా ఇంకా బ్రతికే వున్నాడు. విషాదమేమంటే - అప్పట్నుంచి వరసగా చస్తోంది కేవలం నరసమ్మ లాంటి భార్యలు మాత్రమే! పెళ్ళి పేరు మీద హోమ గుండానికి ‘ పవిత్ర బలి’ అవుతున్న నరసమ్మ వంటి ఇల్లాళ్ళు నానాటికీ సంఖ్యా పరంగా పెరుగుతున్నారే తప్ప తరగడం లేదనేది అక్షర సత్యం. కాదు, అంకెల సాక్ష్యం.

    అందుకే ఈ కథ 60 యేళ్ళ తర్వాత చదువుతున్నా, - ఈ రచన ఈ కాలందే అని తోస్తుంది. ఇప్పుడే తాజాగా రాసినట్టుంటుంది. రాతి యుగం నుంచి, నేటి యుగం దాకా మానవ జీవనం లో ఎన్నెన్ని ఆధునిక మార్పులు జరిగినా, మారంది మాత్రం ఒకటే - స్త్రీ సామాజిక స్థితి. “స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకానికి నిజమైన సమాధానం వుందా? వుంటుందా? ఈ అంశం మీద రాసిన కథే ఈ హోమ గుండం. కథకి భాష్యం ఈ వాక్యం.

    ‘కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి. - అని మీరన్నారు కానీ, నా కైతే ఈ కొటేషన్ ఆరంభం లో వుండటమే నూటికి నూరు పాళ్ళు సమంజసమనిపించిందండీ! (కారణం. వ్యక్తి గతం కావొచ్చు. నాక్కూడా ఇలా ప్రముఖుల జీవన సత్యాల సూక్తుల్ని ముందుంచి కథలు రాయడం అంటే ఎందుకో ప్రియం! కథకి మంచి పట్టు వుంటుందనిపిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత ఇష్టం మాత్రమే.)

    ఇది మాత్రం నిజం: మీకు నచ్చిన కథగా ఇది ఈమాట లో చదవకుంటే అస్సలకీ కథ నేనెప్పటికీ చదివే అవకాశం నాకు వచ్చుండేది కాదు. నరసమ్మ- నా కళ్ళల్లో కన్నీరై మిగిలేదీ కాదు. ఇది మాత్రం నిజం.
    ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే ఈ కథ మీకు నచ్చిన వైనాన్ని చదివి, ఇంప్రెస్సయి - అప్పుడు కథలోకి వెళ్ళాను. ఆ వివరణే లేకుంటే ఈ శాస్త్రి గారి కథ చదవడాన్ని పోస్ట్ పోన్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత చదవనూ చదివేదాన్ని కాదు. ఇంత గుర్తైన జ్నాపకం మిగిలేదీ కాదు. ఇది వాస్తవం.

    అసలు కధ లో కొస్తే: హనుమంత రావు లాంటి మగాళ్ళు కొందరు గొప్ప కోసం ఇలాంటి సాహసాలు చేసి ఆ తర్వాత తెగ పశ్చాత్తాపంలో ముణిగి తేలుతారు. ఆ మూణ్ణాళ్ళ ముచ్చట తీరాక ‘ఆపరేషన్ తర్వాత వెన్నుకి పొడిచిన మత్తు వొదిలి, కేవలం నొప్పి మాత్రమే మిగిలిన పేషెంట్ లా గిలగిలా కొట్టుకుంటాడు. ఆశయం కోసం ప్రయాసగా ఆశ్రయించిన కరుణా, జాలి, ఉన్నత తత్వం అంతా కూడా దయ్యం వొదిలినట్టు వొదిలి, ఇహ అసలు స్వరూపం చూపిస్తారు. ఇట్లా! హనుమంతునిలా! ఇతగాడు పెళ్ళి చేసుకోకుంటే నరసమ్మ గారు ఏ పాచిపనో చేసుకుని హాయిగా బ్రతికుండేది కాదూ? ఈయనగారూ చేసుకున్న ‘వెధవ వివాహం వల్ల కాదూ’ దహనమై పోయిందీ!? అనే నిజాన్ని నిగ్గు తేల్చారు శాస్త్రి గారు!

    ఏ కాలం కథా? ఇదెప్పటి కథా!? ఈ హోమ గుండం 1945 కాలం నాటిదైతే మాత్రమేం ఈ నాటి పురుషహంకార ప్రపంచానికి చక్కగా మచ్చ లేని అద్దంలా నిలుస్తుంది.

    వేలూరి గారి మాటల మీద నాదొక మాట: ‘అయితే, హనుమంతరావులో నరసమ్మ పరంగా ఎందుకు అసహ్యం కలిగిందో చెప్పటం కష్టం. అతనికి చిరాకు పెరగటం, చివరకి నరసమ్మని కొట్టడం కూడా జరుగుతూంది; అనుమానంతో!‘ అని మీకు అనిపించింది కానీ నాకైతే ఆ కారణం శుభ్రంగా కళ్ళక్కట్టినట్టు కనిపించనూ కనిపించింది.

    * ఎవరో దోస్త్ ఏదో అనుంటాడు. ‘తొందర పడ్డావురా. వ్రతం చెడ్డా ఫలం దక్కాలని. ఎలాగూ ఆదర్శ వివాహం చేసుకునే వాడివి. పెళ్ళం వెనక కాసింత వున్న దాన్ని చేసుకుంటే కష్టాలుండేవి కావుగా అంటూ ఫలానా వారమ్మాయిని ఉదహరించి వుండొచ్చు. లేదా ఆ బుధ్ధి హనుమంతుని లోనే కలిగీ వుండొచ్చు. (కోతి కదా!, పురుషుణ్ని కాదు నేనంటోంది. అతని బుధ్ధిని.)

    ఆర్యసమాజపు సంస్కర్తలని విమర్శిస్తున్నాడో, సమాజంలో గొప్ప కోసం వేసుకున్న అభ్యుదయపు ముసుగులో ఇమడలేక నలిగిపోయే అసమర్థులను ఎత్తిచూపుతున్నాడో - రచయిత ఉద్దేశ్యం మనకు అర్థం కాదు. ‘- వేలూరి గారు.

    * ఎవర్ని విమర్శించినా, ఇంచకున్నా ఒక కుత్సిత మనస్కుణ్ని మన ముందుంచారు రచయిత. ఇంకా నిజం చెప్పాలంటే - ఒక స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోగల మనస్తత్వం కేవలం ఒక పురుషునికి మాత్రమే సాధ్యం అనే నాలాంటి వారి ఒక అంచనాని, ఇక్కడ ఈ రచయిత అక్షర సాక్షిగా నిరూపించారు.

    రచనలో రవ్వల్లాంటి మాటలివి:

    * నా కోసం అనే ముక్క ప్రేమ ఉన్న చోట యెంత దివ్యాస్త్రమో, కాని చోట అంత విషం. (నాకెంతో అద్భుతం అ నిపించిన కొటేషన్ ఇది.)
    * కోపం మీద ఉన్నప్పుడు సర్వేంద్రియాలు బెదిరిన ఫుర్రల్లాగా పనిచేస్తై.
    * తాను ఏంచేసినా తప్పే అవుతోంది. పోనీ - యిది చెయ్యి. నాకు యిలాగ వుండాలి అనడు. తన బుధ్ధికి తోచినట్లు చేస్తే - పురుగేరినట్లు మాట్లాడతాడు. (దరిదాపు ఈ కథ రాసి అరవై యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ సగటు మగవాని మనస్థత్వం ఈ పంధా లోనే సాగుతోంది)
    * బందిలి దొడ్లో పడ్డా ఆవులాగా ఆమె ఆ రాత్రి ఏమీ తినలేదు. సుఖపెట్టి సుఖపడదామంటే- లోకంలో చోటు తక్కువా.
    * దేవుడి పఠాలకు హారతి వెలిగిస్తుంటే- చీర అంటుకుని నరసమ్మ చచ్చిపోయిందటా అనుకున్నారు! (భార్యని చంపేసిన - ప్రతి మొగుడూ చెప్పే కారణం ఇలాగే వుంటుంది.)

    ముగింపు - స్త్రీ లోకాన్ని ఆవేశానికి గురి చేస్తుంది. ఆలోచింప చేస్తుంది. పొరబాటున హనుమంతుడి వంటి వాణ్ణి వివాహమాడినా నరసమ్మలా చావకూడదు అనే నిజాన్ని చెబుతుంది.

    నా కితాబు: కథలందరూ రాస్తారు. అందరు రాసేవీ అవే అక్షరాలు. కాని, కొందరి చేతుల్లోనే అవి జీవితాలవుతాయి. గుండె మీద రాలి పడే కన్నీటి పుష్పాలవుతాయి.

    ముగింపు: రచయిత శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ( జరుక్ శాస్త్రి ) గారికి అంజలి ఘటిస్తూ.. తనకు నచ్చిన ఈ అపురూప కథని ఈ మాట పాఠకులకందించి, సాహిత్య పిపాసుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారికి కృతజ్ఞాభినందనలు తెలియ చేసుకుంటూ,

    నమస్సులతో -
    అభిమాన పాఠకురాలు
    -ఆర్.దమయంతి.

  2. lyla yerneni అభిప్రాయం:

    March 1, 2013 7:24 am

    “స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది.

    “కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.” -వేలూరి వేంకటేశ్వర రావు

    That, fiction writers are heartless bastards, and they kill their characters mercilessly is known to readers. Writers are more licensed to kill, than 007, or any Doctor, and they get paid rather well for it. As a reader, one really has to look hard for a writer who never killed in the course of writing. Off hand, I can’t even name one, with a clean blemishless record. The reasons behind any author’s killing spree - keep changing. Which of their characters, the fiction writers kill, why, and when - are still up for grabs.

    As for this Telugu writer - ‘జరుక్,’ the writer of ‘హోమగుండం,’ bless his Charles Dickens heart, his whole story telling is gloom, gloom and more gloom heaped on gloom. I have never seen such an appropriate title for a short story so far.

    I haven’t even read two sentences, my eyes widened. Man! for a short story writer, this writer is swift. He killed the hero’s first wife, he killed heroine’s first husband, with quick stokes, he killed two infants of hers, one infant obtained by marriage, another thru rape. Gives even a little glimpse of home for widows. A few silly Krishna/Yasoda like scenes with a step-kid, Ramayana too is dragged in, and the hero all of a sudden is acting out like a mad cap -almost like Gopichand’s hero, while the heroine, what’s her name? starts thinking a bit like -Chalam’s heroine. My God! in the very little spare time she has, the heroine is pregnant again,( who is the father? suspicion! Dear God!) Blast! the writer does his final killing.

    This is where we readers of this short story should all rise together and ask - Is there an injustice that ‘జరుక్’ had not done to us readers, the chorus will be - No, Sir! He did it all.

    This is one fired up writer, ‘జరుక్.’ He opened with fire, ended with fire. True, he is a fine documentarian of an existing Telugu society. It’s a hell hole. True, he is well versed of its custom, creed, symbols, sayings, proverbs. They are all so cruel, ugly, crude. “హయ్యో రాత!” the language (”భాష సంస్కృతికి నిధి.”) is the pits. Definitely there is not even a whiff of elegance. True, There isn’t much chance of -giving or living- happiness, in this society. That includes the writer. He does not have slightest inclination of giving joy to any one, including himself, by writing this story.

    Yes Sir, to the holocaust museum of the Telugu short story, this writer also has contributed his incinerated, his immolated. Is this writing a prose version of Sri Sri’s poetry line - “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను”?:-)

    లైలా

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a