అయితే, ఆ నివేదికల్లో బయటకు రాని విషయం ఒకటుంది. అది కెప్టెన్ పాఠీలను, లెఫ్టినెంట్ వేదీలను కలవరపెడుతున్నది. అదేమిటంటే, చదివేకొద్దీ పుస్తకాల సంఖ్య తగ్గకపోగా మరింతగా, ఇంతింతగా పెరిగిపోతోంది. తవ్వేకొద్దీ ఇంకా పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. నిజానికి సోమయాజిగారు ఎప్పటికప్పుడు సహాయం చేస్తుండక పోయుంటే ఈపాటికి వాళ్ళంతా ఎప్పుడో ఆ లైబ్రరీలో దారి తప్పిపోయేవారే. ఒకసారి నారాయన్ పాత్రో ఉన్నట్టుండి చదువుతున్న పుస్తకం నేలకేసి విసిరి కొట్టి, “ఈ పుస్తకం అంతా అబద్ధం. సామ్యతంత్ర దేశంలో కరువుకి కారణం మా సామ్యవాద నాయకులు కానే కాదు. మా సామ్యవాదులెప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు!” అని అరిచాడు. వెంటనే సోమయాజిగారు పాత్రో దగ్గరికి వచ్చి, సౌమ్యంగా – “అదొక్కటే కాదండీ, సామ్యతంత్ర దేశ రాజకీయాల్లో సామ్యవాదుల పాత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే, ఇదిగో ఈ పుస్తకం, ఈ పుస్తకం, ఇంకా ఈ రెండు పుస్తకాలు చదవండి. మీరు మీ సమీక్షలో రాయడానికి ఇంకొంచెం వివరాలు దొరుకుతాయి.” అని ఆ పుస్తకాలు వెతికి చూపించాడు. పాత్రో ఆ పుస్తకాలు తిరగేస్తూ, “ఓ! అవునా! ఈ సంగతి నాకిప్పటిదాకా తెలీదే! అరె! ఇలా కూడా జరిగిందా, చాలా ఆసక్తిగా ఉందే! అబ్బ, ఏం వింత పుస్తకాలు బాబూ! చదువుతుంటే ఎన్ని కొత్త సంగతులు తెలుస్తున్నాయో!” అంటూ కోపం అంతా పోయి, ఆశ్చర్యపడిపోతూ మళ్ళీ శ్రద్ధగా చదవడం సాగించాడు.
యుద్ధాలు, శాంతి ఒడంబడికలు, దేశాలు, సమితులు, దొంగనాయకులు, నాయకదొంగలు, కులాలు, మతాలు, వాటి మధ్య అల్లర్లు, వాటి రాజకీయాలు, చదువులు, పదవులు, సాహిత్యం, విప్లవాలు, సాహిత్య విప్లవాలు, విప్లవ సాహిత్య రాజకీయాలు, – ఇలా ఒకటేమిటి, ఏ పుస్తకం గురించైనా, ఏ శాస్త్రమైనా, ఏ సందర్భమైనా సోమయాజిగారు సైనికులు అడిగీ అడగక ముందే, అలసటనేది లేకుండా, ముఖం మీద చిరునవ్వు వాడకుండా సైనికులు చదువుతున్న పుస్తకానికి సంబంధించిన పుస్తకాలు మరిన్ని చూపిస్తుండేవాడు. సైనికులు మరింతగా లీనమైపోయి చదివేస్తుండేవారు.
ఎన్ని రోజులో పట్టకుండానే, కల్నల్ సర్వగ్యాని రేడియో ద్వారా కూటమికి ఇచ్చే రోజువారీ నివేదికలో చదివేసిన పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ, పుస్తకాల అర్హత తేల్చి చెప్పడం రాన్రానూ తగ్గిపోతూ వచ్చింది. సర్వగ్యాని రబ్బరు స్టాంపులకి పని తక్కువైంది. ఒకరోజు కల్నల్ ఒక పుస్తకాన్ని చూసి లెఫ్టినెంట్ చతుర్వేదిని “ఈ పుస్తకం ఎలా మంచిదనుకున్నావ్? దీంట్లో సేనాపతులకంటే సైనికులే గొప్ప అని రాసుంది. అసలు రాసినవాడికి సైన్యం గురించి తెలుసా!” అని గద్దించాడు. చతుర్వేది వెంటనే, త్రిపాఠి, ముఖర్జీలని పిలిపించాడు. ఆ పుస్తకం మంచిదే అనడానికి గల కారణాలు చెపుతూ, ఇంకో ఆరు పుస్తకాల పేర్లు ముఖర్జీ ఏకరువు పెట్టాడు. అందులో మూడు పుస్తకాలు రాజకీయ శాస్త్రానికి, రెండు పుస్తకాలు ఆర్థిక శాస్త్రానికి, ఒకటి సామాజిక శాస్త్రానికి సంబంధించినవి. దాంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఇలా కొన్ని సార్లయేటప్పటికి ఒక్క పుస్తకాన్ని బేరీజు వేయడానికి కూడా గంటల తరబడి చర్చలు, వాదోపవాదాలు జరుగుతుండేవి. చడీ చప్పుడూ లేకుండా ఏ మూలనుండి వచ్చేవాడో సోమయాజిగారు తెలియదు కానీ చర్చ బాగా వేడిగా సాగుతున్నప్పుడు ఆ చర్చకు సంబంధించిన ఇంకో పుస్తకం ఏదో సిఫారసు చేసేవాడు. దాంతో సర్వగ్యాని నిర్ణయం తీసుకోవడం మరింతగా ఆలస్యమౌతుండేది.
అర్హత బేరీజు వేయాల్సిన పుస్తకాలు అలా పేరుకుపోవడంతో, సైనికులకి పని లేకుండా పోయింది. వారికేం చేయాలో తోచలేదు. గోళ్ళు గిల్లుకుంటూ ఎంతసేపని కూర్చోగలరు వాళ్ళు మాత్రం? ఒకరోజు విద్యాచరణ్ శుక్లా అనే సైనికుడు వచ్చి చదువుకోడానికి ఏదైనా పుస్తకం ఇప్పించమని అడిగాడు. అప్పటికే రబ్బరు స్టాంపేయించుకున్న పుస్తకం ఇద్దామనుకొన్నాడు గానీ, ద్వివేదికి ఇంకా చదవని పుస్తకాలు అన్నేసి ఉన్నప్పుడు, ఒకసారి చదివిన పుస్తకాన్నే ఇవ్వడం పని దండగ అనిపించింది. అలా అని ఏ పుస్తకం పడితే అది అందులో ఏం రాసుందో తెలీకుండా ఇవ్వలేడు కూడా. సోమయాజిగారి సిఫారసుతో ఒక చిన్న నవల లాంటిదేదో శుక్లాకి దక్కింది. ఒకట్రెండు రోజుల్లో మిగతా సైనికులు కూడా అలానే పుస్తకాలు తెచ్చుకున్నారు. చదవడం రాని నటేశన్ కోసం స్వామినాధరెడ్డి పుస్తకాన్ని పెద్దగా చదివేవాడు. అతని చుట్టూ ఇంకో నలుగురు సైనికులు గుమిగూడేవారు. ఎవరిలోనో ఏదో ప్రశ్న తలెత్తేది. దానికి నాలుగు రకాల సమాధానాలొచ్చేవి. అది వాదనగా మారేది. ఇలా సైనికులంతా కూడా గుంపులుగా చేరి పుస్తకాలు చదివి చర్చించుకోడం మొదలైంది. ఇంకొన్ని రోజులకు వాళ్ళు పాఠీలు, వేదీల చర్చల్లో కూడా చేరిపోయారు. ఇప్పుడు లైబ్రరీలో ఎప్పుడు చూసినా సైనికులు, అధికారులు అందరూ చర్చలు చేస్తూ కనిపిస్తున్నారు. సోమయాజిగారు ఎప్పట్లానే చిరునవ్వుతో వారికి అవసరమైనప్పుడల్లా మరిన్ని పుస్తకాలందిస్తూ సహాయం చేస్తున్నాడు.
రాన్రానూ కమీషన్ పని ఎంతవరకూ వచ్చిందో కూటమికి అర్థం కాకుండా పోయింది. పైగా అప్పుడప్పుడు క్రమం తప్పుతూ చివరికి శీతాకాలం గడిచేటప్పటికి రోజువారీ నివేదికలు పూర్తిగా ఆగిపోయినై. మేధోకూటమి అధ్యక్షుడికి లైబ్రరీలో ఏం జరుగుతోందో తెలియక కంగారు పడ్డాడు. పెట్టిన గడువు కల్లా పని పూర్తి చేసుకుని ఒక కూలంకషమైన నివేదికతో రమ్మని సర్వగ్యానికి కబురు పంపించాడు. కబురు మోసుకొచ్చిన కల్నల్ బిభూతికి సైనికులంతా మారిపోయినట్టుగా కనిపించారు. ఒకపక్క వారికి పుస్తకాలు చదవడం, రోజూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఎన్నడూ ఊహించనన్ని పుస్తకాలు చదువుతున్నారు. ఇంకో పక్క త్వరగా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలని, బైట ప్రపంచంలోకి, వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలనీ ఉంది. కొత్తగా నేర్చుకున్న జ్ఞానం వారికి బైట ప్రపంచాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. కానీ, త్వరలోనే లైబ్రరీ వదిలి వెళ్ళిపోయే రోజు తలచుకుంటే చెప్పలేని బెంగ పుడుతోంది. అందరి తలల్లోనూ ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు, ఎన్నో వింత వింత ఊహలు – ఇదమిత్థంగా ఇదీ అని చెప్పలేకుండా ఉన్నారు.
మలి సంజె వేళకి అందరూ లైబ్రరీ లోకి చేరేవారు. కిటికీకవతల అప్పుడప్పుడే కొత్తగా చిగురేస్తున్న మొక్కల్ని, ఆకులమీద, చెట్ల మీద, వీధి దీపాలను కమ్ముకుంటూ రాలుతున్న పొగమంచుని, చీకటి దుప్పటిని మెల్లిగా కప్పుకుంటున్న ఊరినీ చూస్తున్నప్పుడు, ఎవరో లాంతరు సన్నని వెలుగులో ఏ పుస్తకంలోంచో ఒక కవిత గొంతెత్తి చదివేవాడు. అందరూ నిశ్శబ్దంగా వింటుండేవారు. ఒక్క కల్నల్ సర్వగ్యాని తప్ప.
గడువు ముగిసేలోగా నివేదిక పూర్తిచేయాలన్న పట్టుదలతో కల్నల్ సర్వగ్యాని అతని గది నుంచి బైటికి రాటల్లేదు. ఎవరూ ఆయన ఏకాగ్రత చెడగొట్టకూడదని ఉత్తర్వులు జారీ చేశాడు. కానీ అప్పుడప్పుడూ సర్వగ్యాని గదిలోంచి సోమయాజీ అని పిలుపు వినిపించేది. కేవలం సోమయాజిగారొక్కరికే ఆ గదిలోకి పోడానికి అనుమతి ఉన్నది. ఆయనని సర్వగ్యాని ఏదో అడగడమూ, సోమయాజిగారు లైబ్రరీ లోంచి ఏదో పుస్తకం తీసుకొని మళ్ళీ గదిలోకి పోవడమూ, ఇదే తంతు. సోమయాజిగారి సహాయం లేకుండా సర్వగ్యాని నివేదిక రాసే స్థితిలో లేడు. చివరికి ఇద్దరూ కలిసే ఆఖరి నివేదికను తయారు చేశారు.
ఫెళ్ళుమని ఎండ కాస్తున్న ఆ మే 4వ తేదీ ఉదయం, మేధోకూటమి, త్రిదళాధిపతులు, రాజ్యాధ్యక్షులు అందరూ సమావేశమైనారు. సర్వగ్యాని నివేదికలో ఏముందో తెలుసుకోడం కోసం ఊపిరి బిగబట్టుకొని మరీ ఎదురు చూస్తున్నారు. గంట కొట్టగానే ఠంచనుగా సర్వగ్యాని తన నివేదికని వినిపించడం మొదలుపెట్టాడు. అతని ఉపన్యాసం మనిషి పుట్టిన నాటి నుంచి నేటి దాకా మానవ విజ్ఞాన సర్వస్వాన్ని పరిచయం చేస్తూ మొదలయింది. ప్రజాతంత్ర రాజ్యంలో అప్పటిదాకా ప్రజల మంచికని నమ్మబలికి ప్రజాధ్యక్షులు ఒంటిపోకడలో తీసుకున్న నిర్ణయాలని తప్పుపట్టింది. ప్రజల కష్టాలకి కారణం ప్రభుత్వమూ, పురపాలకులే అని తేల్చి చెప్పింది. ప్రజలు అజ్ఞానంలో పడి అనవసరంగా యుధ్ధాలు, విప్లవాలలో బలి అయిపోయిన వారిని, త్యాగధనులు, అమరవీరులు అని పొగుడుకుంటున్నారని, అసలు నిజం అది కాదనీ స్పష్టం చేసింది. ప్రజల అజ్ఞానానికి కారణం ప్రభుత్వమే అని వేలెత్తి చూపింది. అలా అని ఉపన్యాసం పూర్తిగా స్పష్టంగా కూడా లేదు. కొత్తగా ఏదైనా నేర్చుకున్నవాళ్ళు, లేదూ ఒక కొత్త వాదాన్ని తలకెత్తుకున్నవాళ్ళు సమస్యలని నలుపూ తెలుపుల్లో పైపైనే చూసేసి అభిప్రాయాలేర్పరచుకుంటారే, అలాగే, సర్వగ్యాని నివేదికలో కూడా అక్కడక్కడా ఒకదానికొకటి సరిపోని తీర్మానాలు, వివరణలూ ఉన్నై. కొన్ని తప్పులూ ఉన్నై. కానీ సర్వగ్యాని ఉపన్యాసపు సారాంశంలో మాత్రం ఏ సందేహమూ లేదు.
వింటున్న అధ్యక్షులు, త్రిదళాధిపతులు అవాక్కయినారు. స్థాణువులైనారు. కాసేపటికే తేరుకున్నారు. గొంతెత్తి బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. సర్వగ్యాని నివేదిక చదవడం పూర్తయేదాకా కూడా ఎవరూ ఆగలేదు. రాజద్రోహ నేరం కింద కల్నల్ సర్వగ్యానిని విచారించాలని, అతన్ని శిక్షించాలనీ అందరూ అరిచారు. కానీ అలా చేస్తే ప్రజలకు అనుమానం వచ్చి తిరుగుబాటు చేస్తారేమో, సైన్యం కూడా తోడవుతుందేమో అన్న భయం వారిని నిలువరించింది. కల్నల్ సర్వగ్యాని, అతని లెఫ్టినెంట్లు ఏకవేది, ద్వివేది, త్రివేది, చతుర్వేదులను ఆ క్షణం నుండే ఆరోగ్యకారణాల వల్ల సైన్యం నుంచి విడుదల చేస్తున్నామని, దురదృష్టవశాత్తు విధినిర్వహణలో ఒత్తిళ్ళ వలన వారికి మానసిక స్థిమితం తప్పిపోయిందని, వారి అకుంఠిత దీక్షను, దేశభక్తిని పొగుడుతూ పత్రికా ముఖంగా ప్రకటించారు.
మామూలు బట్టల్లో, భుజానికి సంచీలు వేలాడేసుకుని, చలికి శాలువా కప్పుకొని ఆ ఐదుగురూ పొద్దున్నే ఆ పాత లైబ్రరీకి పోవటం ఇప్పుడు తరుచుగా కనిపించేదే. అక్కడ వీళ్ళ కోసం పుస్తకాలు ఏరిపెట్టి సోమయాజిగారు రోజూ ఎదురుచూస్తూ ఉంటారు కదా.
(A general in the library, 1953.)
2. అవేకళ్ళు
రోజులాగానే తెలిసిన దారిలోనే నడుస్తున్నా ఏదో చెప్పలేని ఇబ్బంది. తనల్నెవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా, ఒళ్ళంతా తూట్లు పొడుస్తున్నట్టుగా, ఏదో తెలియని చిరాకు. ఆసిఫ్ ఉన్నట్టుండి ఆగి తల వెనక్కి తిప్పి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అంతా మామూలుగానే ఉంది.
ఆసిఫ్ రోజూ ఆ గల్లీలోంచే నడుచుకుంటూ వస్తాడు, మెయిన్ రోడ్ మీదకి. ఇంటినుంచి బస్టాపుకు రావడానికదే దారి. అలా అదురుపాటుతో వెనక్కి తిరిగి చూసినందుకు ఆసిఫ్‌కి తన మీద తనకే కోపమొచ్చింది. కాయర్ కహీఁకా! అని తనని తానే తిట్టుకొని మళ్ళీ నడక సాగించాడు. కాసేపటికే మళ్ళీ, అదే ఇబ్బంది, ఎవరో అదేపనిగా తనని గమనిస్తున్నట్టు. తన మెడపైనే చూపు నిలిపి సడీ చప్పుడూ లేకుండా ఎవరో తనకు దగ్గర దగ్గరగా వచ్చేస్తున్నట్టు. ఆసిఫ్ సన్నగా వణికాడు.
ఈ గల్లీలోంచి బైటపడి మనుషుల్లో పడితే కానీ ఈ చిరాకు పోదేమో. మెయిన్ రోడ్ మీదకి తిరుగుతూ మళ్ళీ చుట్టూ చూశాడు. కొత్తగా ఏమీ కనపడలేదు. తనను చూసి ఎవరూ దాక్కోలేదు. స్కూల్ యూనిఫాంలో వున్న కుర్రాడెవరో సైకిల్ తొక్కుకుంటూ పోతున్నాడు. ఒకామె వీధి దాటుతోంది. కార్నర్ ఇరానీ కేఫ్‌లో ఇంకా ఎవరూ లేరు. తల తిప్పుకుంటుంటే వీధికవతలవైపు అచ్చం తనలాగే తల తిప్పుకుంటున్న ఇంకొకతను కనపడ్డాడు. ఇద్దరూ ఒకేసారి, చటుక్కున ఒకరినుంచి ఒకరు చూపు తిప్పేసుకున్నారు, ఇంక వేరే దేని కోసమో చూస్తున్నట్లు. ‘ఈ భయం నా ఒక్కడికే కాదేమో. నాలానే అతనిక్కూడా ఇలాగే అనిపిస్తున్నట్టుంది’ అనుకుంటూ ఆసిఫ్ బస్టాప్ గోడ కానుకుని నిలబడ్డాడు.
మెయిన్ రోడ్ మీద అటూ ఇటూ నడుస్తూ, సైకిళ్ళు, స్కూటర్ల మీద పోతూ మనుషులు, ఎవరి ముఖంలో చూసినా ఏదో చిరాకు, ఏదో తత్తరపాటు, నొసళ్ళు చిట్లించుకొని ఏదో తరుముకొస్తున్నట్టు వస్తూ పోతున్నారు. ‘షాయద్ ఆజ్ సబ్‌కీ తబీయత్ కుచ్ వైసీ హైఁ, క్యా కచ్‌డా దిన్ హైఁయే రే!’ అనుకుంటూ అప్పుడే వచ్చిన బస్సు ఫుట్బోర్డ్ మీదకి ఎగిరి కాలుపెట్టి కమ్మీ పట్టుకొన్నాడు. బస్సు పూర్తిగా ఆగకుండానే మళ్ళీ బయల్దేరింది. గుమ్మాన్ని పట్టుకు వేళ్ళాడుతున్న వాళ్ళని తోసుకుంటూ బస్సు లోపలికి వచ్చి నిలబడ్డాడు ఆసిఫ్, మళ్ళీ మళ్ళీ ‘క్యా కచ్‌డా దిన్ హైఁయే రే! క్యా కచ్‌డా దిన్!’ అనుకుంటూనే. ‘అరే! పొద్దుగాల్నే వంద నోట్ పట్కోనొస్తే చిల్లరెక్కడ్నుంచి నూక్క రావాలె?’ కండక్టర్ ఎవర్నో అరుస్తున్నాడు. ఇవేమీ పట్టనట్టు తాపీగా పాన్ నములుకుంటూ, అదేపనిగా హారన్ మోగించుకుంటూ సైకిళ్ళు, ఆటోల మధ్యలోంచి డ్రైవర్ బస్సు తోలుకుంటున్నాడు. హాండిల్ బారుని, దానికి వేలాడుతున్న తోలు పటకాలనీ పట్టుకుని నిలబడిన వాళ్ళంతా పడవలో ప్రయాణీకుల్లా అటూ ఇటూ బస్సుతో పాటూ ఊగుతున్నారు.