మత్తకోకిల కథ

సంస్కృతములో మత్తకోకిల

సంస్కృతములో ఈ వృత్తములో వ్రాయబడిన పద్యాలను వెదుకగా నాకు దొరికినవి రెండు మాత్రమే. ఒకటి చంద్రశేఖరాష్టకము ( వాచకము, గీతము), మరొకటి శ్రీకృష్ణాష్టకము (వాచకము, గీతము). చంద్రశేఖరాష్టకము కొందరు శంకరాచార్య విరచితమని అంటారు, కాని దీని రచయిత మార్కండేయుడట. ఇది పురాణపురుషుడైన మార్కండేయుడైతే, తప్పక యిది అతని పేరిట మరొక కవి వ్రాసినది. లేకపోతే మార్కండేయుని పేరుతో వేరొక కవి ఉన్నాడేమో? ఏది ఏమైనా, ఇతని కాలము మనకు తెలియదు. అందులోనుండి ఒక పద్యము:

రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వై యమ

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం (మార్కండేయ కృత చంద్రశేఖరాష్టకం)

శ్రీకృష్ణాష్టకమును వ్రాసినది వాదిరాజయతి. ఇతడు వ్యాసరాయల సమకాలికుడు, వారి శిష్యుడు కూడ. ఇతని కాలము శ్రీకృష్ణదేవరాయల నాటిది, అనగా ఇతడు 16వ శతాబ్దములో జీవించాడు (ఇతని ఆయుర్దాయము 120 సంవత్సరాలట). శ్రీకృష్ణాష్టకమునుండి ఒక పద్యము:

మధ్వమానసపద్మ భానుసమం స్మరప్రతిమం స్మర
స్నిగ్ధ నిర్మల శీతకాంతి లసన్ముఖం కరుణోన్ముఖం
హృద్యకంబుసమానకంధర మక్షయం దురితక్షయం
సిద్ధసంస్తుత రౌప్యపీఠకృతాలయం హరిమాలయం
పాలయాచ్యుత పాలయాజిత పాలయా కమలాలయ
లీలయా ధృతభూధరాంబురుహోదర స్వజనోదర (వాదిరాజయతి, శ్రీకృష్ణాష్టకము)

లీలాశుకుడు ఆంధ్రుడే(నా)?
ఇంతకంటె ముందుగా, లీలాశుకుడు వ్రాసిన శ్రీకృష్ణకర్ణామృతములో మొదటి శతకములో ఈ వృత్తములోని ఒక పద్యము క్రింద యివ్వబడినది.

పల్లవారుణ పాణిపంకజ – సంగి వేణురవాకులం
ఫుల్ల పాటల పాటలలీ పరి-వాది పాద సరోరుహం
ఉల్లసన్మధురాధరద్యుతి – మంజరీ సరసాననం
వల్లవీ కుచకుంభ కుంకుమ – పంకిలం ప్రభు మాశ్రయే (1.09)

ఈ పద్యములోని ఒక విశేషమేమంటే ఇందులో ద్రావిడ భాషలవలె ప్రాస ఉన్నది. లీలాశుకుడు అన్ని పద్యాలను ఇలా ప్రాసతో వ్రాయలేదు. ఇందులో అన్నిపాదాలు 10, 8 అక్షరాలుగా విడదీయబడ్డాయి. రెండవ, మూడవ పాదాలు ఎనిమిది అక్షరాలకు విరిగినా, మొదటి (పం-కజ), నాలుగవ (కుం-కుమ) పాదాలు అలా విరుగలేదు. కావున లీలాశుకుడు మత్తకోకిలవలన ప్రభావితుడయ్యాడా? లీలాశుకుని ఆంధ్రులు, కేరళదేశస్థులు, ఉత్తరములోని మథురాపురవాసులు తమ దేశములో పుట్టినాడు[12] అంటారు. సంస్కృతములో పాదము ఎనిమిది అక్షరాలకు విరుగుతుందని చెప్పినప్పుడు ఇతడు ఆ నిబంధనను పాటించక తెలుగు (లేక తమిళ) యతిని ఎందుకు ఉంచినాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ వృత్తమే కాకుండా లీలాశుకుడు చంపకమాలను బోలిన నర్కుటకవృత్తాన్ని (మొదటి శతకము, ఐదవపద్యము) కూడ ఉపయోగించాడు. చంపకమాల కన్నడ తెలుగు భాషలకు మాత్రమే పరిమితము. పై రెండు కారణాలవలన లీలాశుకుడు బహుశా ఆంధ్రుడేమో? రజనీకాంతరావు తన వాగ్గేయకారుల చరిత్రములో[13] లీలాశుకుడు ఆంధ్రుడై ఉంటాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జయదేవలీలాశుకుల వంటివారి కీర్తి, సంగీతసాహిత్యాది లలితకళలపై వారి ప్రభావము వారు ఆంధ్రులైనా కాకపోయినా యెప్పుడూ శాశ్వతమే. ఛందోవిధానముగా నా నిర్ణయము ఒక చారిత్రక సత్యమును నిరూపించటానికి తోడ్పడగలదనే ప్రయత్నము మాత్రమే.

భామినీ షట్పది

కన్నడ దేశి ఛందస్సులో సుప్రసిద్ధమైన భామినీషట్పదికి మత్తకోకిలకు పోలికలు ఉన్నాయి. దీనిని చూపుటకై మత్తకోకిలకు రెండు మార్పులను చేసి రెండు వృత్తాలను నేను సృష్టించినాను. అవి మాలా, ప్రతిమా వృత్తాలు. మాలావృత్తానికి మత్తకోకిల పాదము చివర ఒక గురువును చేర్చాను, ప్రతిమా వృత్తానికి మత్తకోకిల పాదములోని చివరి రెండు అక్షరాలను తొలగించినాను. మాలావృత్తమును అట తాళములో లేక త్రిపుట తాళములో పాడవచ్చును. ఈ వృత్తముల ఆకృతిని, లయను క్రింది ఉదాహరణముల ద్వార పరిశీలించవచ్చును –

మాల – ర స జ జ భ ర గ, యతి (1, 11), 19 అతిధృతి 93019

అటతాళ యుక్తముగా –
పాడుమా నవ రాగ మాలిక – భవ్యమై యతి నవ్య రీతిన్
చూడుమా నవ మేఘ మాలిక – శోభతో గగనాన బ్రీతిన్
నేడెగా నవ హర్ష మాలిక – నిండుగా మనమందు లేచెన్
మేడలో విరిపాన్పుపై మెల – మెల్లగా చలి గాలి వీచెన్

త్రిపుటతాళ యుక్తముగా –
నిన్న రేతిరి పూట మెల్లగ – నిద్రలో గల యొండు వచ్చెన్
సన్న జాజుల తావి జల్లుచు – చంద్రకాంతులు వన్నె దెచ్చెన్
కన్నుదోయియు జూడజాలని – కాంతి చాపము లెందు నిండెన్
తెన్ను లెన్నియొ క్రొత్త క్రొత్తగ – దేలి నా కగుపించుచుండెన్

ప్రతిమా – ర స జ జ భ గ – యతి (1, 11), 16 అష్టి 27483

సుందరా హృదయాంతరాంతర – సుందరప్రతిమా
స్యందనమ్మున స్వర్ణచక్రపు – చక్కనౌ సడులన్
నందనందన యిందుశీతల – నన్ను గావ సదా
ముందు రా మృదుహాసకాంతుల – మోహనాకృతితో

ఇప్పుడు మాలావృత్తమును ప్రాసయతితో మొదటి పాదముగా, ప్రతిమావృత్తమును అక్షరసామ్య యతితో రెండవ పాదముగా వ్రాస్తే మనకు భామినీ షట్పదిలోని ఒక ప్రత్యేకత లభిస్తుంది.

భామినీ షట్పది ప్రత్యేకత: బేసి పాదాలు – మాల, ప్రాసయతి (1, 11); సరి పాదాలు – ప్రతిమా, యతి (1, 11)

కాలి దామర నొండు చిన్నని – గేల దామర యందు నుంచుచు
లీల ముచ్చట మోముదామర – లెస్స నుంచెనుగా
శ్రీలతోడను సోయగమ్మున – మేలు నీయగ నవ్వు జిందెడు
బాలకృష్ణుని దల్చ నా మది – పల్లవించెనుగా

భామినీ షట్పదికి ఆఱు పాదములు ఉంటాయి. మొదటి మూడు పాదములవలె చివరి మూడు పాదములు ఉంటాయి. మొదటి రెండు పాదాలలో 3, 4; 3, 4 మాత్రలు, మూడవ పాదములో 3, 4; 3, 4; 3, 4, 2 మాత్రలు. ఇలాగే 4, 5, 6 పాదాలు. మొత్తము 102 మాత్రలు పద్యములో. మూడవ, ఆఱవ పాదములలోని చివరి గురువును లఘువుగా కూడ వ్రాస్తారు, కాని పాడేటప్పుడు అది గురుతుల్యము.

కామలతలో పుష్పలత లీ
యామనిన్ నవ నూత నాశల
నా మనస్సున లేపి గూర్మిగ – నాదముల నింపె
భామినీ షట్పదిని గనుమా
యా మహోజ్జ్వల వర్ణములతో
భూమిజమ్ముల కుసుమములపై – మూగి మ్రోగె సుమా