మత్తకోకిలకు యతి
మత్తకోకిలకు యతిని మూడు విధాలుగా ఉంచవచ్చును. ఈ వృత్తపు గురు లఘువులు –
UI UII UI UII UI UII UIU.
ఇందులో మొదటి ఎనిమిది, చివరి ఎనిమిది అక్షరాల గురులఘువులు ఒకే విధముగా ఉన్నాయి. అందువలన పాదమును ఎనిమిది-పది అక్షరాలుగా, పది-ఎనిమిది అక్షరాలుగా విడదీయడానికి వీలవుతుంది.
U I U I I U I U I I
U I U I I U I U
అనగా, అక్షర సామ్య యతిని (వడిని) తొమ్మిదవ అక్షరముతోగాని, పదునొకండవ అక్షరముతో గాని ఉంచుకొనవచ్చును. సంస్కృతములో, కన్నడములో ఎనిమిది-పది యతి ఉంటే, తెలుగులో, తమిళములో పది-ఎనిమిదిగా యతి ఉన్నది. మరొక మూడవ విధము ఏమనగా, ఇది తాళవృత్తము కాబట్టి మొదటి అక్షరానికి పదవ అక్షరానికి ప్రాసయతిని ఉంచవచ్చును. ఈ మూడు విధాలను క్రింది పద్యములో చూడ వీలగును –
మత్తకోకిల – యతి (1, 11)
వందనమ్ముల నిత్తు నే భవ – బంధనమ్ముల ద్రుంచరా
సింధుజాహృదయేశ్వరా సిరి – చిందుతో కరుణించరా
నందనందన పుష్పముల్ నవ – నందనమ్మున బూఛెరా
అందగాడని యందురా హరి – యందమౌ మది వేచెరా
మత్తకోకిల – యతి (1, 9)
వందనమ్ముల నిత్తు నే – భవ బంధనమ్ముల ద్రుంచరా
సింధుజాహృదయేశ్వరా – సిరి చిందుతో కరుణించరా
నందనందన పుష్పముల్ – నవ నందనమ్మున బూఛెరా
అందగాడని యందురా – హరి యందమౌ మది వేచెరా
మత్తకోకిల – ప్రాసయతి (1, 11)
వందనమ్ముల నిత్తు నే భవ
బంధనమ్ముల ద్రుంచరా
సింధుజాహృదయేశ్వరా సిరి
చిందుతో కరుణించరా
నందనందన పుష్పముల్ నవ
నందనమ్మున బూఛెరా
అందగాడని యందురా హరి
యందమౌ మది వేచెరా
రామాయణములో మత్తకోకిల
మత్తకోకిల గణస్వరూపములో ఒక అద్భుతమైన ఆకృతి దాగియున్నది. ఇంతవరకు దీనిని ఎవ్వరు చర్చించినట్లు లేదు. మొదటి ఎనిమిది చివరి ఎనిమిది అక్షరాలు ఒకే విధముగా ఉన్నవని ఇంతకు ముందే చెప్పియున్నాను. అంత మాత్రమే కాదు, మరో రెండు అమరికలు కూడ దాగి యున్నవి వీటిలో. అవి:
(1) ఈ ఎనిమిది అక్షరాలు అనుష్టుభ్ శ్లోకములోని సరి పాదాలకు సరిగా సరిపోతాయి. ఐదు నుండి ఏడవ అక్షరాలు జ-గణముగా ఉండాలి శ్లోకములోని సరి పాదాలలో. మత్తకోకిల మొదటి, చివరి ఎనిమిది అక్షరాలకు ఇది చక్కగా సరిపోతుంది.
వాల్మీకి రామాయణమునుండి ఒక ఉదాహరణ –
మత్త కోకిల సన్నాదైః
నర్తయన్ ఇవ పాదపాన్
శైల కందర నిష్క్రాంతః
ప్రగీత ఇవ చాऽనిలః (4-1-15)
మత్తకోకిలలు పాడుతూ ఉంటే గాలి ఊచగా కదిలే చెట్లు ఆ పాటకు నాట్యము వలె కనబడుతున్నది.
ఇందులో నర్తయన్ ఇవ పాదపాన్ అనే శ్లోకపు రెండవ పాదము మత్తకోకిల పూర్వోత్తరార్ధములవలె ఉన్నవి.
(2) ఈ ఎనిమిది అక్షరాలలో కూడ మొదటి మూడు అక్షరాలు చివరి మూడు అక్షరాలవలె ఉన్నవి. అనగా మాత్రుష్కా బొమ్మలవలె సౌష్ఠవములో మరొక సౌష్ఠవము మనకు గోచరిస్తుంది ఈ వృత్తములో. ఈ మూడు అక్షరాలకు అంత్య ప్రాస నుంచితే పాడుకోడానికి బాగుంటుంది. క్రింద రెండు ఉదాహరణలు:
ఇందులో ఉత్తరార్ధములో ర-గణములకు అంత్యప్రాస నుంచి వ్రాసినాను –
పూవు లీ వని రంగు రంగుల బూచెనే మది నూచెనే
తావు లీ వనిలోన గాలులు దాచెనే మది దోచెనే
రావె యిప్పుడు జీవనమ్మున రాగమై యనురాగమై
మోవి నానుము మోద మొందగ భోగముల్ సురయోగముల్
ఇందులో పూర్ణముగా ప్రాసయతియే, అదనముగా అంత్యప్రాసలు –
పూవుగా వికసించుమా నొక
తావిగా ప్రకటించుమా
భావిగా నరుదెంచుమా చిఱు
దేవిగా కరుణించుమా
భావమై మది జేరుమా రస
రావమై నను గోరుమా
హావమై నడయాడుమా నవ
జీవమై నను గూడుమా