మత్తకోకిల కథ

కన్నడములో మత్తకోకిల

మత్తకోకిలను కన్నడములో మల్లికామాలె, మాలికోత్తరమల్లికా గా పిలుస్తారు. మొదటి నాగవర్మ (క్రీ. శ. 990) మల్లికామాలె[4] లక్షణాలను క్రింది విధముగా వివరిస్తాడు.

జ్వాలి వాయు దినేశయు-గ్మ శశాంక పావకరెంబివర్
లీలెయిం బరె విశ్రమం – వసుసంఖ్యెయొళ్ నిలె భామినీ
నీలలోల సహస్రకుం-తళె సందుదింతిదు మల్లికా-
మాలె యెంబుదు ని-శ్చయం కవిరాజహంసవినిర్మితం (నాగవర్మ ఛందోంబుధి – 2.194)

ఓ భామినీ, నీలకుంతలా, అగ్ని (ర-గణము), వాయువు (స), ఇద్దరు సూర్యులు (జ జ), చంద్రుడు (భ), అగ్ని (ర) – వీరి గణాలతో ఎనిమిది అక్షరాలకు పాదము విరుగునట్లు కవిరాజహంస (నాగవర్మ) అమర్చగా ఏర్పడిన వృత్తమును మల్లికామాలె అంటారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమును తెలపాలి. కన్నడ భాషలో ఛందోంబుధిని వ్రాసిన నాగవర్మ, కవిజిహ్వాబంధనము వ్రాసిన ఈశ్వరకవి, నందిఛందస్సు కర్త తమ లక్షణగ్రంథాలలో భార్యలను సంబోధించి పద్యాలను వ్రాసినారు. మహేశ్వరుడు పార్వతికి ఛందశ్శాస్త్రాన్ని మొట్టమొదట బోధించినట్లు ఒక కథ ఉన్నది, దానికి అనుసరణ కాబోలు ఈ కవుల గ్రంథరచనా ప్రణాళిక.

తరువాత జయకీర్తి (పదునొకండవ శతాబ్దారంభము) సంస్కృతములో వ్రాసిన ఛందోనుశాసనములో[5] ఈ వృత్తమును గురించి ఇలాగంటాడు: మాలికోత్తరమల్లికా రసజా జ్భరైశ్చ గతాగతా. ఈ వృత్తాన్ని మల్లిక తదుపరి వచ్చే మాలిక (అంటే మల్లికామాల) అంటాడు జయకీర్తి. జయకీర్తి గణములను గురించి చెప్పాడే కాని యతిని గురించి చెప్పలేదు ఈ సూత్రములో. అంతేకాదు, మత్తకోకిల లయతో ఉండే తరల, మదనసాయక వృత్త లక్షణములను కూడ క్రింది సూత్రాలలో తెలిపాడు జయకీర్తి. వీటికి కూడ యతిని చెప్పలేదు. జయకీర్తికి నాగవర్మ ఛందోంబుధి పరిచితము, కాని అందులోని మల్లికామాలకు నాగవర్మచే యివ్వబడిన యతిని జయకీర్తి చెప్పక, యతి విషయాన్ని సందిగ్ధముగా వదలినాడు.

తరలము – అతిధృతౌ నభరాః సజౌ జగురూ తదా తరలం స్మృతం

మదనసాయకము – నగణతో భజగణౌ త్రిధా గురుపరౌ యదా మదనసాయకః

హరనర్దకము, ఉజ్జ్వల, చర్చరీ – కేదారభట్టప్రణీత వృత్తరత్నాకరములో[6] (బహుశా క్రీ.శ. 1150 ముందు) ఈ వృత్తము హరనర్దకము అని పేర్కొనబడినది. ఈ లాక్షణికుని ప్రకారము పాదము ఎనిమిది, ఐదు, ఐదు అక్షరాలకు విరుగుతుంది. హేమచంద్రుడు (క్రీ.శ. 1089 – 1172) సుమారు క్రీ.శ. 1150లో రచించిన ఛందోనుశాసనములో[7] ఈ వృత్తమును ఉజ్జ్వల అనే పేరుతో సోదాహరణముగా వివరించాడు.

సూత్రము – ర్సౌ జౌ భ్రావుజ్జ్వలం జైః రసజజభరాః జైరిత్యష్టభిర్యతిః

రసజజభర గనములతో పాదము ఎనిమిది అక్షరాలకు విరుగుతుంది.

పాణిపాదవిలోచనా-నన పద్మకాననశాలినీ
నిమ్ననాభి మహాహ్లదా – త్రివలీతరంగవిభూషితా
కుంకుమారుణ పీవర-స్తన చక్రవాకయుగాంచితా
కేలిసింధురివోజ్జ్వలా – మదనస్య రాజతి కామినీ (హేమచంద్రుని ఛందోనుశాసనము – 2.313)

తామరపూవులవలె చేతులు, పదములు, కన్నులు, ముఖము గలదానా, లోతైన బొడ్డుగలదానా, అలలా ఉండే త్రివళితో శోభించుదానా, కుంకుమలా ఎఱ్ఱని చక్రవాకములవలె గుండ్రని వక్షోజములు గలదానా, కేళీసముద్రములో ఉజ్జ్వలమైనదానా, సంయోగములో భాసించుదానా!

ప్రాకృతపింగళకారుడు (14వ శతాబ్దపు ప్రథమ భాగము) దీనిని చర్చరీ[8] అనే పేరుతో వ్యవహరించాడు. పింగళఛందస్సు[1] అధఃసూచికలో ఇందులోని ఉదాహరణ ఇవ్వబడినది. చర్చరీ కామదహన పండుగ (హోలీ) సమయములో కృష్ణుని చుట్టు చేరి గోపికలు చేసే ఒక నాట్యవిశేషము అంటారు. ఈ చర్చరీ నటనలను గురించిన ప్రస్తావన హర్షుని రత్నావళిలో[9] కూడ ఉన్నది.

తెలుగులో మత్తకోకిల

తెలుగులో ఈ వృత్తమును నన్నెచోడుడు కుమారసంభవములో[10] ముద్రాలంకారముతో వాడినాడు. ఆ పద్యము –

మెత్త మెత్తన క్రాలు దీవు స-మీరణుండ, మనోభవుం
డెత్తకుండఁగ వేగకూడఁగ – నెత్తు, మెత్తక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని – చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లారమిం గడు – మాసరంబగు నామనిన్ (నన్నెచోడుని కుమారసభవము – 4.108)

అందమైన ఆమనివేళలో ఆ తోటలోని మత్తకోకిలలు “ఓ పవనమా, నీవేమో మెల్లమెల్లగా వీస్తున్నావు. మన్మథుడు నీపై దండయాత్ర చేయకముందు నీవే త్వరగా వానిపై దండెత్తు, అలా చేయకపోతే వసంతుడు నిన్ను చంపుతాడు, జాగ్రత్త సుమా” అని హెచ్చరించేటట్లు ధ్వనులు చేసినవి.

కవిజనాశ్రయకర్త (రేచన లేక భీమకవి) నన్నయ నన్నెచోడుల పిదప జీవించి ఉంటాడు. మత్తకోకిల లక్షణాలను[11] ఇలా చెప్పాడు –

శ్రావకాభరణాంక విన్ రస-జాభరేఫల దిగ్విరా-
మావహంబుగ మత్తకోకిల – యండ్రు దీనిఁ గవీశ్వరుల్

ఇందులో ఇతడు నిస్సందేహముగా పాదము పది అక్షరాల (దిశా యతి) తరువాత పదునొకండవ అక్షరముపైన అని చెప్పినాడు. అంతే కాక దీనికి మత్తకోకిల అని పేరు అన్నాడు. ఈ మత్తకోకిల పేరు బహుశా నన్నెచోడుని నుండి గ్రహించి యుండవచ్చును. కన్నడములోని చంపకమాలె తెలుగులో చంపకమాల అయినది, అదే విధముగా ఉత్పలమాలె ఉత్పలమాల అయినది. కాని మల్లికామాలె మల్లికామాలగా ఎందుకు తెలుగులో వ్యవహరించబడలేదు? నా ఉద్దేశములో దీనికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చును. మల్లికామాల అని ముద్రాలంకారయుక్తముగా వాడదలచినప్పుడు ఆ పదము ఒక పాదము చివరినుండి వేరొక పాదము మొదట వస్తుంది. ఒకే పాదములో మల్లికామాల అని వ్రాయుటకు వీలుకాదు. కాని మత్తకోకిల అనే పదమును ఒకే పాదములో మూడు చోటులలో వ్రాయవచ్చును – మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల మత్తకో. ఇది సామాన్య కారణము. మత్తకోకిల అందమైన తాళబద్ధమైన వృత్తము. బహుశా ఆ కాలములో ఈ వృత్తమును నాట్యములో, సంగీతములో వాడేవారేమో? ఒక రకమైన వీణకు కూడ మత్తకోకిల అని పేరు. సంగీతములోని ఈ వృత్తపు ప్రాశస్త్యాన్ని తెలియబరచుటకై దీనికి మత్తకోకిల అని పేరు పెట్టారేమో? అదియును గాక కోకిల పంచమస్వరమును పలుకుతుంది గదా?