మా కొండల్లో ఎక్కడా బడి లేదు. పై చదువుల కోసం దేశంలోని మైదానాల్లోకి నన్ను పంపించింది అమ్మ. అక్కడ ఓ చిన్న ఊరిలో నాకు బాబాయి వరసయ్యే ఒకాయన ఇంట్లో చేరాను. మొదటి సారిగా నేనూ, అమ్మ వేర్వేరు ఇళ్ళల్లో పడుకున్నాం. నాకూ అమ్మకి మధ్య ఎడబాటు, ఆ దూరం మరింత పెరిగాయి.
నా చదువు బాగా సాగింది. నేను ఖాట్మాండు వెళ్ళి కాలేజి చదువులు చేపట్టాను. అమ్మా, నేను పైకి సంతోషంగానే ఉన్నాం – ఎందుకంటే మా ప్రణాలిక సత్ఫలితాలనిస్తోంది, మేము మా లక్ష్యం దిశగా సాగుతున్నాం కాబట్టి! కానీ నాకు లోలోపలంతా బాధ. అమ్మకీ నాకూ మధ్య ఎడబాటు మొదట్లో ఒకే ఒక్క కోణంలో ఉండేది, అది ఇప్పుడు పెరిగిపోవడమే కాకుండా, బహుకోణాలలో విస్తరించింది. ఇప్పుడు ఎన్నో విషయాలలో నేనూ, అమ్మ వేర్వేరయిపోయాం. చదువులో వచ్చిన ర్యాంకులు, సర్టిఫికెట్లు, డిప్లొమాలు, ఇలా సాధించుకున్న విద్వత్తు, ఔన్నత్యంతో నేను పెరిగిపోతే, నా ముందు అమ్మ మరీ చిన్నదైపోయింది, తెలివితేటలు లేకుండా మొద్దుగానే ఉండిపోయింది. నా ప్రపంచంలో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే నాకెవరో అలాగే చెప్పారు. అమ్మ లోకంలో సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అది కూడా అమ్మకి ఎవరో చెప్పిన సంగతే. నేను సంభాషణలో కఠినమైన పదాలు, జటిలమైన శబ్దాలు, ఉత్కృష్టమైన ఆంగ్ల పదాలు వాడుతుంతే, అమ్మ సరళమైన గ్రామీణ నేపాలీ భాష మాట్లాడుతుంది. నేను చాలా వేగంగా పాశ్చ్యాత్యీకరణం చెందుతున్నాను. మా సంస్కృతులు మారిపోయాయి, భిన్న మతాల వాళ్ళలా మారిపోయాం. మా మధ్య దూరం యోజనాలు పెరిగింది.
తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. అక్కడ నా పైచదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నేను అమ్మకే కాదు, మాతృభూమికి సైతం దూరమయ్యాను. దూరం దిశదిశలా వ్యాపించినా, మా అమ్మ హృదయంలోనూ, నరనరాలలోనూ శరీరంలోని ప్రతీ కణంలోనూ నాకిప్పటికీ స్థానం ఉంది. ఈ విషయంలో మాత్రం ఏమీ తేడాలు లేవు. కేన్సర్ అమ్మ ఊపిరితిత్తుల నుంచి, ఇతర శరీర భాగాలకి అతి త్వరగా వ్యాపించింది. ఇప్పుడీ కేన్సర్ అమ్మ హృదయంలోంచి, నరనరాల్లోంచి, శరీరంలోని ప్రతీ కణం నుంచి నన్ను తప్పించి, నా స్థానాన్ని అది అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అమ్మలో నావంటూ ఉన్న అన్ని గుర్తులను చెరిపేయాలని చూస్తోంది. మా మధ్య మరో కొత్త దూరాన్ని సృష్టించాలని చూస్తోంది. కానీ అమ్మ ఊరుకుంటుందా? అవసరమైతే తను బలైపోతుందేమో గానీ, నా చోటుని మాత్రం ఇంకొకరికి అప్పగించదు.
ఉన్నట్టుండి అమ్మ ఆయాసపడడం మొదలుపెట్టింది. “ఏమైందమ్మా?” అని అడిగాను. అతి కష్టం మీద మాట పెగుల్చుకుంటూ, ” ఏదో ఇబ్బందిగా ఉందిరా…” అని అంది.
తమ్ముడు డాక్టరుని వెదుకుతూ వెళ్ళాడు. కొద్ది క్షణాలలో ఒక డాక్టరు, ఒక నర్సు వచ్చారు. నర్స్ అమ్మకి ఆక్సిజన్ ఇచ్చింది. గంట రెండు గంటల తర్వత, అమ్మ శ్వాస సాధారణ స్థితికి వచ్చింది.
బాగా పొద్దుపోయింది. తన ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోమని, అమ్మ దగ్గర తనుంటానని తమ్ముడు చెప్పాడు. తమ్ముడు ఇక్కడే ఖాట్మాండులోనే ఉద్యోగం చేస్తాడు. అమ్మకి వైద్యం కోసం గ్రామం నుంచి ఇక్కడికి పిలిపించుకున్నాడు. అలాగేనని నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళాను. అన్ని గంటల విమాన ప్రయాణం, పొద్దున్నుంచి ఆసుపత్రిలో కూర్చుని ఉండడం వల్ల బాగా అలసిపోయాను. ఏదో కాస్త తిన్నాననిపించుకుని, పక్కమీద వాలాను. నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నా, నా బాల్యం, అమ్మ జ్ఞాపకాలు నన్ను నిద్రపోనీయడం లేదు.
ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు గానీ, ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది. అవతలి వైపు మా తమ్ముడు. అమ్మ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వెంటనే బయల్దేరి రమ్మని చెప్పాడు. అప్పుడు దాదాపు అర్థరాత్రయింది. టాక్సీ వెంటనే దొరకలేదు. చివరికి ఓ టాక్సీ డ్రైవర్‌కి మాములుగా అయ్యేదానికన్నా రెట్టింపు చెల్లించి ఆసుపత్రికి చేరాను. తుఫాను వేగంతో అమ్మ గదిలోకి పరుగెత్తాను. తమ్ముడు గదిలో నేల మీద కూర్చుని ఉన్నాడు. నన్ను చూస్తూనే అతని కళ్ళలోంచి నీళ్ళు జలజలా కారాయి. నా కళ్ళు కూడా కన్నీళ్ళతోనే బదులు చెప్పాయి. అంతా అయిపోయింది. నాకూ మా అమ్మకి మధ్య అన్ని రకాలా దూరం హద్దులు లేకుండా పోయింది. అనంతమై పోయింది. ఇంకెన్నటికి కుంచించుకుపోని విధంగా!
మర్నాడు ఉదయం పశుపతినాథ్ మందిరం పక్కగా ప్రవహిస్తున్న భాగమతీ నది ఒడ్దున అమ్మ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. రోడ్డుకి ఓ మూలగా ఉన్న పార్కింగ్ వైపు నడుస్తున్నాను.
“బాబూ” అంటూ వెనుక నుంచి ఎవరిదో కేక వినిపించింది. ఆ గొంతు మా అమ్మ గొంతులానే అనిపించింది.
వెయ్యి వోల్టుల పిడుగు నెత్తిన పడినట్లుగా, చటుక్కున తల వెనక్కి తిప్పి చూసాను. ఓ పసిపిల్లాడు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళ అమ్మ వెనుక నుంచి అరుస్తూ పరిగెత్తుకొస్తోంది. మరో వైపు నుంచి ఓ కారు వేగంగా వస్తోంది, ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు. కారు పిల్లాడికి దగ్గరగా వచ్చాకగానీ ఆగలేక పోయింది. కుర్రాడి అమ్మ వేగంగా వచ్చి, పిల్లాడిని చివాలున ఎత్తుకుని వాటేసుకుంది. పిల్లాడు అమ్మని గట్టిగా కరుచుకొనిపోయాడు.
(హిందీ మూలం: శివ్ గౌతం వ్రాసిన అంతరాళ్ కథ. హిందీ ఆన్‌లైన్ పత్రిక గర్భనాల్ సంచిక జూన్ 2012లో ప్రచురితం. పే 47-49.)
