రామారావుకు ప్రాతినిధ్య కళ నుండి నైరూప్య కళకు జరిగిన పరిణామం ఖచ్చితమైన రూపు తీసుకున్నది అతను స్లేడ్ స్కూల్‌లో వున్న చివరి సంవత్సరం (1964) లోనే. భారతీయ చిత్రకళపై మంచి పట్టు వున్న ఒక ప్రముఖుడు ఆఫ్రికా నుంచి లండన్‌కు రామారావు చిత్రాలను చూడటానికి వచ్చాడు. అప్పుడు రామారావును 4/6 అడుగుల నిడివి చిత్రాన్ని వేయమని అడిగాడు. రామారావు దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు. ఎందుకంటే అతను అప్పటి దాకా అంత పెద్ద చిత్రాన్ని అతను వేయలేదు. అంత పెద్ద కేన్వాసే అతనికి కొత్త. “ఏదో వేశాను గానీ ఆ చిత్రం నాకు తృప్తినివ్వలేదు. నా భావం అందులో సరిగ్గా వ్యక్తం కాలేదు. అయితే ఈ విఫలమైన ఈ ప్రయోగం నుంచి కూడా నాకు కొత్త సంగతులు తెలిశాయి” అని తనే నిజాయితీగా చెప్పుకున్నాడు. అందుకే, అంతటితో ఆగిపోకుండా మళ్ళీ ప్రయత్నించాడు. తన చిత్రాల్లో కొత్త ఆకృతులను నిర్మించి స్థల తలంపై పట్టు సాధించాడు. ఇది రామారావు చిత్రశైలి రూపాంతరం జరిగిన క్రమంలో మొదటి మెట్టు. 1964లో వేసిన ఈ చిత్రం (పేరు లేదు) ప్రాతినిధ్య కళ నుంచి పూర్తిగా వైదొలగి తన అభివ్యక్తతకు ఒక రూపంగా రామారావు రూపరాహిత్యాన్ని ఎంచుకున్న తీరును తెలియజేస్తుంది.
పాశ్చాత్య దేశాల్లో బాగా పేరు గడించిన, స్థిరపడిన భారతీయ చిత్రకారుల్లో అవినాశ్ చంద్ర, ఎఫ్. ఎన్. సౌజాలు రామారావు సమకాలీనులని చెప్పవచ్చు. అవినాశ్ పూర్తి స్థాయి పాశ్చాత్య శైలితో చిత్రిస్తే, సౌజా మతసంబంధ ఆధునిక ధోరణిలో చిత్రాలు వేస్తుండేవాడు. రామారావు తనదైన శైలినీ, ముద్రనూ సృష్టించుకోవాల్సి వచ్చింది. ప్రాక్పశ్చిమాలను సమ్మేళనం చేయగలనన్న ధీమా ఉన్నా, ఎలా చేయాలి అనే ప్రశ్న అతన్ని వేధిస్తుండేది. అసలు ఈ సమ్మేళనాన్ని సమర్థవంతంగా ఏ మాధ్యమం చూపగలదు? బెంగాల్ తరహా నీటి రంగులా? రాజపుత్రశైలిలో టెంపెరా తరహాలోనా? ఎటూ పాలుపోని రామారావు అవి తన మాధ్యమాలు కావని మాత్రం నిశ్చయించుకున్నాడు. కేవలం తైలవర్ణ చిత్రాలు మాత్రమే తన ఆశయాన్ని పూర్తిచేయగలవని అనుకున్నాడు. వాటర్ కలర్స్‌లో కడిగినట్లుండే నునుపుదనాన్ని ఆయిల్ కలర్స్‌లో తేవడమే తన పనిగా, అది సాధించడమే తన లక్ష్యం, తన ముద్ర అని అనుకున్నాడు. నైరూప్య చిత్రకారుడిగా తాను సృజించిన చిత్రాల్లో దీన్ని సాధించాడు. ప్రపంచ కళారంగంలోనే రామారావుది ఇపుడు ప్రత్యేక ముద్ర.
నిజానికి నీటి రంగుల్లోని పట్టు లాంటి మృదుత్వాన్ని తైలవర్ణాల్లో సాధించడం, ప్రపంచ కళారంగంలోనే ఒక గొప్ప సాంకేతిక అద్భుతం. దీన్ని సాధించిన రామారావు నైపుణ్యాన్ని పాశ్చాత్య కళాప్రముఖులు బహుధా ప్రశంసించారు. ఈ విజయాన్ని ఒక సాంకేతిక అద్భుతం గానే కాకుండా, భావప్రకాశ ధోరణికి చెందిన నైరూప్య కళలో ఒక కొత్త అధ్యాయంగా, అభివ్యక్తిగా వర్ణించారు.

న్యూ ఎక్స్‌పెరిమెంట్ విత్ హ్యూమన్ ఫామ్, 2011.
1967లో ప్రముఖ కళాపత్రిక ది స్టూడియో సంపాదకుడైన విలియం టౌన్‌సెండ్ లండన్‌లోని లైసెస్టర్ గ్యాలరీలో ఏర్పాటైన రామారావు ప్రదర్శనకు ముందుమాట రాస్తూ: “రామారావు చిత్రాలు ప్రపంచంలో మనకు ఎంతో ఆనందాన్నిచ్చే వాటి సరసన ఉంటాయి. ఈ చిత్రాల్లో ఉపయోగించిన రంగులు, వాటి క్రమమూ యూరోపియన్ చిత్రకారుల మాదిరిగా ఉండటం; ప్రత్యేకించి సదర్‌లాండ్, కాండిన్స్కీ లాంటి వారి తీరును గుర్తుకు తెచ్చేలా ఉండటం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఇవన్నీ ఒక భారతీయుడు వేసినవని మనకు తెలిసిపోతుంది. ఈ రంగులూ, ఈ వరస క్రమం, వాటి కలయిక, వాటి ప్రాశస్త్యం – ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కావు. ఇవన్నీ ఒక భారతీయ మహిళ మాత్రమే తన దైనందిన జీవితంలో ఎంతా దర్పంతో వేసుకునేవి. అవి ఆమెకే పరిమితం. రామారావు చిత్రాల్లో భారతీయత ఉంటుంది. తన దేశపు కోండలు, లోయలు, వాటి మధ్యగా పారే నదులు ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. వీటిలో మైదానల గతి, వైశాల్యం ప్రస్ఫుటంగా ఉంటాయి. మనం గేయాతంకంగా, లయాత్మకంగా ఆ చిత్రాల్లోకి ప్రవేసించి ఒక ప్రతీకగా ఆ ప్రదేశాలన్నిటినీ స్పృశిస్తాం.” అంటాడు. ఇలా, పారిస్, లండన్, బోస్టన్, సిన్సినాటి తదితర ప్రాంతాల కళాప్రముఖులు, విమర్శకులు ఎస్.వి. రామారావు కళ గురించి అన్న మాటలను లెక్కకు మిక్కిలిగా ఉల్లేఖిస్తూ పోవచ్చు. ఆ మాటల సారాంశమంతా టౌన్‌సెండ్ వాక్యాల్లో నిక్షిప్తమై ఉందని చెప్పచ్చు.
నైరూప్యకళలో కామన్వెల్త్ దేశాల్లోకే ప్రముఖ కళాకారుడిగా గుర్తింపు పొంది, లార్డ్ క్రాఫ్ట్ పురస్కారాన్ని పొందిన తర్వాత, రామారావు వరుసగా ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్, అమెరికాలలో ఎన్నో వన్ మ్యాన్ షోలలో పాల్గొన్నాడు. అతని చిత్రాలను, పికాసో, మీరో, బ్రేక్, డాలి లాంటి మహామహుల చిత్రాల సరసన ప్రదర్శించేదుకు ప్రత్యేక ఆహ్వానాలు అందేవి. ఇంత ప్రతిష్ఠాత్మక అవకాశం లభించిన ఒకే ఒక భారతీయ కళాకారుడు రామారావు. ఒక చిత్రకారుడిగా ఇది రామారావుకు జీవితకాలపు అత్యున్నత పురస్కారం అని చెప్పవచ్చు.
అమెరికాలో అతి ప్రాచీన కళాసంస్థ అయిన కోప్లే సొసైటీ (బోస్టన్) ప్రతి యేటా ఏర్పాటు చేసే ప్రదర్శనలకు ఎంతో పేరు, ప్రతిష్ఠ ఉన్నాయి. ఈ ప్రదర్శనలో ఎంపిక అయేందుకు చాలా ముందుగానే చిత్రకారులు తమ చిత్రాలను పంపుతూ ఉంటారు. రామారావు చాలా ఆలస్యంగా ప్రదర్శనకు కొన్ని రోజుల ముందే తన చిత్రాలను పంపినా, కోప్లే సమితి ఆశ్చర్యంగా ఆ చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేసింది. రామారావు కళకి ఇదొక మచ్చు తునక.
మేఘ సందేశం అనే వర్ణ చిత్రం, చీకటిలో వెలుగు రేఖలు అన్న చిత్రం – ఈ రెండూ కూడా వాటిలోని వర్ణ సమ్మేళనంలో, విషయంలో, గాంభీర్యంలో ఒకదానికొకటి సాటిగా నిలబడతాయని నా వ్యక్తిగత అభిప్రాయం. నైరూప్య చిత్రాల ద్వారా అంతరంగంలోని ప్రతిధ్వనులను వ్యక్తం చేయగలమన్న ఆత్మ స్థైర్యం రామారావులో కనిపిస్తుంది. అతను తన చిత్రాల ద్వారా ఈ విషయం సమర్థవంతంగా రుజువు చేశాడు కూడా. ఒక చిత్రకారుడు నైరూప్య చిత్రాన్ని వేయాలంటే అతను తన ఆత్మను విస్తృతం, ఉన్నతం చేసుకోవాల్సి ఉంటుందన్న సంగతి రామారావుకు కచ్చితంగా తెలుసు. అప్పుడు మాత్రమే, ఆ స్థితిలో మాత్రమే చిత్రకారుడు వర్ణాల మధ్య సమతౌల్యం పాటించగలడు. వాటిని సమర్థవంతంగా తూచగలడు. అప్పుడు మాత్రమే చిత్రకళలో అతనొక నిర్ణాయక శక్తిని పొందుపరచ గలుగుతాడు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా ఎదిగిన ఒక భారతీయుడిగా, బహుముఖ ప్రతిభాశాలిగా పేరు పొందిన రామారావును వ్యక్తిగా చూస్తే ఎవరూ అతన్ని గురించి అలా అనుకోరు. ఒక సామాన్యమైన మనిషిగా నిరాడంబరమైన మనసుతో ఉండగలగడం, రామారావు అన్ని మతాల నుండీ గ్రహించిన సారాంశపు ఫలితమేమో అనిపిస్తుంది.
తన చిత్రాల్లో రామారావుకు బాగా ఇష్టమైనది రేస్ ఆఫ్ హోప్ ఇన్ డార్క్‌నెస్ (చీకటిలో వెలుగు రేఖలు) అన్న చిత్రం. నిస్సందేహంగా అది ఒక అద్భుత కళాఖండం. ఇందులో ఒక నైరూప్య భావప్రకాశ చిత్రకారుడిగా అతని ప్రగతినీ, పరిపక్వతనూ చూడవచ్చు. పారదర్శక వర్ణాలను వాడిన తీరు, కాన్వాస్‌పై అడుగడుగునా కుంచె కదిలిన తీరు, తారాస్థాయికి చేరుకున్న రామారావు ప్రతిభకు తార్కాణాలు. పరిణతి సాధిస్తున్న కొద్దీ మనిషిలో సత్వగుణం ఎలా అలవడుతుందో అదే తీరులో ఈ చిత్రంలో రంగుల వేగాన్ని అత్యంత నైపుణ్యంతో నియంత్రించగలిగాడు. ఇంతకు ముందటి చిత్రాల్లో రంగులు గుర్రాల్లా పరుగెడుతుండేవి. ఈ చిత్రం వేస్తున్న కాలం లోనే రామారావు జెన్ బౌద్ధం పట్ల ఆసక్తుడై ఆ తత్వాన్ని తీవ్రంగా చదువుతుండేవాడు. ఆ ప్రభావం ఈ చిత్రంలో లీలామాత్రంగా కనిపిస్తుంది. వివిధ మతాల గురించి చదవటం, తెలుసుకోవటం వల్లే తనలోని చిత్రకారుడికి సమగ్రత చేకూరి దృశ్యాదృశ్యాలను వ్యక్తం చేయగల శక్తి సమకూరిందని రామారావు నమ్మిక.
ఎంతటి చిత్రకారుడైనా తన చిత్రాల్లో నలుపుని నియంత్రించేటప్పుడు కొంచెం జంకుతారు. కానీ, అతి కష్టమైన ఈ పనిని రామారావు సమర్థవంతగా సాధించగలిగాడూ, ఇతర వర్ణాలతో మేళవించి నలుపుని అదుపులోకి తెచ్చుకోగలిగాడు. నలుపుని తన ప్రతిమారూప చిత్రాల్లో అదేపనిగా ఉపయోగించిన ఫ్రెంచ్ ఇంప్రెషనిస్ట్ చిత్రకారుడు డెగాను ఈ విషయంలో తరచూ జ్ఞాపకం చేసుకుంటుంటాడు.
రామారావు చిత్రాలు ఇప్పుడు ప్రపంచం నలు దిక్కులా వ్యాపించి ఉన్నాయి. న్యూఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ మొదలుకొని లండన్ లోని విక్టోరియా అంద్ ఆల్బర్ట్ మ్యూజియం, టెట్ గ్యాలరీ, న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్, ది నేషనల్ గ్యాలరీ ఆఫ్ న్యూజీలాండ్, న్యుఫీల్డ్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాలు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్రభుత్వా చిత్రకళా ప్రదర్శన శాలల్లోనూ, ఇంకా ఎన్నెన్నో చోట్ల రామారావు చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి.
ఆదిలో ఒక రూపం తరువాతి క్రమ పరిణామంలో ఒక విలోమ రూపమై, సంస్కరింపబడిన రూపమై క్రమంగా చివరికి రూపరాహిత్యాన్ని చేరుకోవడం నైరూప్యతకు అత్యున్నత దశ. ఇదే హిందూమతంలోని నిర్గుణుడూ, అనంతుడూ అయిన దేవుడికి అర్థం. విచిత్రమేమిటంటే, నైరూప్య భావన తాత్వికంగా భారతీయమైనదే అయినా, నైరూప్య కళ మాత్రం పూర్తిగా పాశ్చాత్యమైనది. కానీ ఈ తేడా ఇప్పుడు లేదు. రామారావు చిత్రాలలో ఈ ప్రాక్పశ్చిమాలు కలిసి ఒకటైపోయాయి.
రామారావు సుమారు 15 సంవత్సరాల పాటు ఒక్క బొమ్మ కూడా గీయలేదు. నిజమైన కళాకారులు ఇలా మారడం సాధారణమే! ఏదో ప్రేరణ, కొత్త సృజనకి ఉత్తేజం తోడు అవసరం. 2001లో రామారావుకి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదాన్నిచ్చింది. మళ్ళీ కుంచె పట్టుకోవటానికి బహుశా నిజంగా అది నిజమైన ప్రేరణ కాదు. ఇండియా వెళ్ళడం, అక్కడి ప్రదర్శనాలు విరివిగా చూడటం, చాలా మంది కళా విమర్శకులతో మంతనాలు చెయ్యడం, షికాగో స్నేహితుల ప్రోద్బలం – తూర్పు పడమరలని మళ్ళీ మరికొన్ని కొత్త పద్ధతులలో కళాత్మకంగా కలపడానికి ప్రోత్సహించాయి.
రామారావు గత పది సంవత్సరాలుగా బొమ్మలు వెయ్యడం మొదలుపెట్టాడు. బోర్డులు వదిలిపెట్టి, పెద్ద పెద్ద కేన్వాసులపై నైరూప్య చిత్రాలు వేయడం మొదలు పెట్టాడు. నైరూప్యభావప్రకాశకతకు ఒక రకమైన సహజత్వం, లేదూ భారతీయ సహజత్వం అనండి, తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాడు. 2005లో మద్రాసులో ఒక ప్రదర్శన జరిగింది. అక్కడ 30 పైచిలుకు కొత్త తైలవర్ణచిత్రాలు ప్రదర్శించాడు. ఇది బహుశా రామారావు కళాజీవిత నాటకంలో రెండవ నాంది. తరువాత, ప్రతి సంవత్సరం కనీసం ఆరు నెలలపాటు ఇండియాలో ఉంటూ, నూతన ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఢెల్లీ లోను, కలకత్తా లోను, బెంగులూరు లోనూ, కళా ప్రదర్శనలు జరగనున్నాయి.
నైరూప్యం నుంచి సారూప్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలగక పోదు, అతను వేసిన కొన్ని వర్ణచిత్రాలు, ముఖ్యంగా స్త్రీ చిత్రం, స్టిల్ లైఫ్ చిత్రం చూస్తే. అయితే, ఇప్పటికీ నలుపు ఒక ముఖ్యమైన రంగుగా, ధైర్యం చేసి వాడగలిగిన వాడు రామారావే; కాన్‌డిన్‌స్కీ తరువాత!
(ఆధునిక చిత్రకళలో స్త్రీ చిత్రాలు అనే మరొక వ్యాసం కొద్దినెలల్లో ఈమాట ద్వారా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఫిజిక్స్ డిగ్రీ వచ్చింతరువాత కొన్నాళ్ళపాటు నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం వచ్చి, ఊసుపోక ఆడిట్ చేసిన మోడర్న్ ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సులు బహుశా ఇప్పుడు నాకు పనికి రావచ్చు. – వీవీఆర్.)
[ఈ వ్యాసం Poems in Pigment అనే ఇంగ్లీషు వ్యాసం కొన్ని సవరణలతో అనువదించబడి మొదట 1995లో తానా తెలుగు వెలుగులో ప్రచురించబడింది. కొత్తగా మార్పులూ చేర్పులూ చేసిన వ్యాసం ఈమాటలో ఇప్పుడు ప్రచురించాము – సం]




