ఈ రకమైన వూహలు మనస్సులో పెట్టుకుని, తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడనుకుంది సీత.
సీత తలవంచుకోవడం చూసి రాముడు కూడా చిన్నబోతాడు. ఇంతకాలంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్నాను, అయినా ఈవేళ ఈ విపరీతమేమిటి అని, లక్ష్మణుడు సభలో నవ్వినందుకు అతని తల తెగవేస్తానని రాముడు కత్తి ఎత్తుతాడు. సభలోని వాళ్ళంతా ఆయన్ని అడ్డుకుంటారు. మహారాజా, లక్ష్మణుడు చిన్నవాడు, అతని తల నరకడం న్యాయం కాదు అని రాముణ్ణి ఆపుతారు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి అడుగుతాడు, ‘ఓ వీరుడా, శూరుడా, తమ్ముడా, సభలో ఎందుకు నవ్వావు చెప్పు’ అని.
ఇక్కడ కొన్ని చరణాలు గజిబిజిగా కలిసిపోయి ఉన్నాయి. అయినా సమన్వయించుకొని చదివితే, లక్ష్మణుడు ఇలా అంటాడు. “మనం అడవులకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో మీకు నేను సేవ చేస్తూండగా, రాత్రి రెండు ఝాముల వేళ నిద్రాదేవి ఏడుస్తూ వచ్చింది. సతిరూపంలో వచ్చిన ఆవిడని నేనడిగాను, ‘నీవెవ్వరవు, ఎందుకేడుస్తున్నావు?’ అని. అప్పుడు నిద్రాదేవి తాను నిద్రాదేవిననీ, తాను అష్టదిగ్గజాలలోనూ, ఆదిఋషులలోనూ, వైకుంఠనాథునిలోనూ ఉంటాననీ. మానవులెవ్వరూ తన్ను గెలవలేరు కానీ నేను తనని నాదగ్గిరికి రానివ్వడం లేదనీ అంది. ఆమె ఆజ్ఞను తప్పించుకోవడం సాధ్యం కాదని గమనించి, ఆమెకు ముమ్మారు ప్రక్షిణం చేసి ‘నేను మా అన్నకి, వదినకి ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నన్ను వదిలి నా భార్య ఒక్కత్తే ఉన్నది. ఆవిడ రాత్రీపగలూ లేవకుండా ఆవిడని ఆవహించు. మళ్ళా మేం తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు, రాముడూ, ఆయన సేనలూ మంత్రులూ కొలువై ఉంటారు. అప్పుడు నన్ను ఆవహించు’ అని ఆమెకు విన్నవించాను. ఆమాట ప్రకారం, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది” అని లక్ష్మణుడు సమాధానం చెబుతాడు. తాను చేసిన పాపానికి పరిహారమేమిటని రాముడు విచారిస్తూండగా, వశిష్టుడు ఆయనతో, “అయ్యా, మీరు చేసిన పని మంచి పని కాదు. దానికి పరిహారంగా లక్ష్మణుడికి మీరు కాళ్ళు పట్టాలి,” అంటాడు. రాముడు ఆ మాటకి సంతోషించి, సేవకులని పిలిచి లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడు.
ఆ తరవాత దాదాపు పదహారు చరణాలు ఆ పక్క వర్ణన. ఆ పక్కమీద మల్లెలూ, చామంతులూ, పారిజాతాలూ, కనకరత్నాలు, కలవపువ్వులూ, జాజిపువ్వులూ అన్ని పరిచి, మొగలిపూరేకుల తలగడలు పెట్టి అందంగా ఏర్పాటు చేస్తారు. అంగదుడూ, హనుమంతుడూ, సుగ్రీవుడూ ఆ పక్క చూసి, ఆ సొంపు చూడడానికి రెండుకళ్ళు చాలవని ఆశ్చర్యపోతారు. తన పాదాల వద్ద అలిసిపోయి పడి ఉన్న లక్ష్మణుణ్ణి రాముడు ఎత్తి పక్కమీద పడుకోబెడతాడు. ఊర్మిళాదేవి తలంటుపోసుకుని, పీతాంబరం కట్టి, నగలు పెట్టుకుని, పైట జారుతూండగా వారచూపులు చూస్తూ భర్త దగ్గిరికి వస్తుంది. లక్ష్మణుడు ఆమెను వారించి, నువ్వు రావడానికి ఇది సమయం కాదు అంటాడు. తరవాత లక్ష్మణుడు నిద్రపోతాడు. అలా చాలాసేపు నిద్రపోతూంటే, ఏమిటి తమ్ముడు ఇంతసేపు నిద్రపోతున్నాడని, రాముడు హనుమంతుణ్ణి పంపుతాడు: ఊర్మిళతో సరసాలాడుతున్నాడా, జలక్రీడలాడుతున్నాడా చూసి చెప్పమని. హనుమంతుడు వెళ్ళి వచ్చి, లక్ష్మణుడు నిద్ర పోతున్నాడు, తన దగ్గిర ఎవ్వరూ లేరు అని చెబుతాడు. అప్పుడు రాముడు, శతృఘ్నునితో సహా లక్ష్మణుడి పడకగదిలోకి వచ్చి పక్క మీద కూర్చుని, తమ్ముడి పాదాలు తన తొడమీద పెట్టుకుని కాళ్ళు పట్టడం ప్రారంభిస్తాడు. నిద్రలో ఉన్న లక్ష్మణుడు కలగంటున్నా ననుకుంటాడు. తీరా కళ్ళు తెరిచి అది కల కాదు నిజమే, ఆ కాళ్ళు పట్టేవాడు శ్రీరాముడని చూసి, లేచి ఆయన పాదాలమీద పడతాడు. “నేను మీ పాదాలు వొత్తవలసిన వయసు వాణ్ణి. సమస్తదేవతలూ మీ పాదాలు పట్టుకుంటారు. అహల్యను పవిత్రురాలిని చేసిన పాదాలు మీవి. బలి శిరస్సు మీదనున్న పాదాలు మీవి. నా పాదాలు మీరు పట్టడం తగదు.” అంటాడు లక్ష్మణుడు. తన పాదాలమీది పడిన లక్ష్మణుణ్ణి రాముడు లేవనెత్తి కనక సింహాసనం మీద కూర్చోబెట్టి,
చంద్రుడు లేని రాత్రి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
దీపమ్ము లేనిల్లు యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
పతిలేని సతి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
ఉదకమ్ములేని కలశ మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
చిలుకలేని పంజర మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
అని లక్ష్మణుడిని సభకు తీసుకొనివచ్చి, ముత్యాలగద్దె మీద కూర్చుండబెట్టి తాను రత్నసింహాసనం మీద కూర్చుంటాడు.
ఇక్కడితో ఈ పాట అయిపోయింది. కానీ అచ్చుపుస్తకంలో ఈ పాట ఇంకో పాటతో కలిసిపోయి ఇంకా దీర్ఘంగా సాగుతుంది.
ఇంతకీ ఈ పాటవల్ల మనకి తెలిసేదేమిటి? ఇందులో భాష, మాటల వాడుక, చరణాలు కూర్చే తీరు ఇవన్నీ చూస్తూంటే, ఇది స్త్రీలు పాడుకునే పాటే కాకుండా, ఎవరో స్త్రీ రాసిన పాట కూడా అని తెలుస్తుంది దురదృష్టవశాత్తూ, రకరకాల అనాదరణలు కారణంగా అచ్చులో గజిబిజిగా వచ్చింది. అయినా, పాటలో అర్థం బోధపరచుకోడానికీ అది పెద్ద అడ్డంకి కాదు. అందుకని, ఈ పాట ఉద్దేశించిన సంగతుల్ని బోధపరచుకోవడానికి ప్రయత్నిద్దాం.
నవ్వు నాలుగందాల చేటు అనే మాట వల్ల ఎక్కువగా తమ సంతోషాలని అణగదొక్కుకుని లోపలుండే నవ్వుల్ని పెదవుల అంచుల దగ్గరే ఆపేసి ఉంచుకోవలసిన ఆడవాళ్ళు నవ్వు గురించి రకరకాలుగా ఊహించిన పాట ఇది. దాంతో పాటు పైకి ఎంతో గంభీరంగా కనిపించే ప్రపంచంలో చాలామంది నవ్వుని ఎందుకు వెంటనే అపార్థం చేసుకుంటారో మనకి నవ్వొచ్చేలా చెప్పే పాట ఇది. ఇంకొంచెం ముందుకెళితే ప్రపంచంలో అందరూ, దేవుళ్ళ దగ్గరి నించీ మామూలు మనుషుల దాకా పైకి నిబ్బరంగా కనిపించే వాళ్ళే కానీ, లోపల ప్రతి వాళ్ళకీ ఏదో ఒక లొసుగు ఉంది. ఆ లొసుగు, ఎవరికీ తెలీదనుకుని బతికేస్తూంటారు కానీ, అది తెలిసిపోయిందనే అనుమానం వస్తే వాళ్ళు గాలి తీసిన బుడగల్లా ముడుచుకుపోతారు. ఈ ప్రపంచపు తరహా అది. ఈ సంగతి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే ఎక్కువ తెలుసు అని చెప్పే పాట కూడా ఇది. వాళ్ళని నవ్వకుండా చేసే ఈ ప్రపంచం ఎందుకు నవ్వకుండా చేసిందో వాళ్ళ కర్థమయిందని మరీమరీ చెప్పే పాట ఇది.
ఈ పాట మొత్తం మీద లక్ష్మణుడి నవ్వు వల్ల తలవంచుకోనివాడు రాముడొక్కడే. కానీ ఆ రాముడే అందరికన్నా ఎక్కువగా తలవంచుకోవాల్సిన తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించి చివరికి తమ్ముడి కాళ్ళు పట్టుకోవలసిన శిక్షకి గురి అవుతాడు.
నామాట విని నవ్వండి, నవ్వు వల్ల ఏ చేటూ రాదు, ఎవరి నవ్వూ ఎవరి లోపాన్నీ చూపించదు, మీరు రకరకాల అర్థాలు చెప్పుకోకుండా మీరూ నవ్వండి. నవ్వితే అందరూ సంతోషంగా అందంగా ఉంటారు, అని చెప్పే చక్కని పాట ఇది.
మరిది లక్ష్మణుడు ఆడవాళ్ళందరికీ దగ్గిరవాడు. అతను నవ్వితే లోకమంతా నవ్వుతుంది.