ఈమాట » పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2

Expand to right
Expand to left

పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2

క్రితం సారి మనం తెలుగులో మానవ బంధుత్వ పదాల గురించి చర్చించినప్పుడు విశ్లేషించని మరి కొన్ని బంధుత్వ పదాలను ఇప్పుడు పరిశీలిద్దాం:

అల్లుడు: అల్లుడు అన్న పదానికి అల్లు వాఁడు, రెండు కుటుంబాలు అల్లుకు పోవడానికి కారణమైనవాడు వంటి వ్యుత్పత్తులు బ్రౌణ్యం, శబ్దరత్నాకరము వంటి నిఘంటువులలో కనిపిస్తాయి. అయితే, అక్క కొడుకును కూడా అల్లుడు అనే అంటారు కాబట్టి ఈ వ్యుత్పత్తి సరైనది కాదని నా అభిప్రాయం. అంతేకాక, తులనాత్మకంగా (comparatively) ఇతర భాషలలోని సజాతి పదాలను పరిశీస్తే, ఈ వ్యుత్పత్తి అంతగా పొసగదని తెలుస్తుంది. కన్నడ భాషలో అళియ అంటే అల్లుడు. తుళు భాషలో అళియె (అల్లుడు), తమిళంలో అళియన్ (మిక్కిలి ప్రేమ కలవాడు) అన్న పదాలు దీనికి సజాతి పదాలు. ఈ పదాలలో ఉన్న మూర్ధన్య ళ-కారం గమనించండి. అల్లిక అన్న అర్థం వచ్చే ‘అల్లు’ అన్న పదాలకు కన్నడ తమిళాదులలో మూర్ధన్య ళ-కారం లేదు. దక్షిణ ద్రావిడ భాషలలో ళ-కారం ల-కారం రెండూ ప్రత్యేక వర్ణాలు. ఒకవేళ అల్లుడు అన్న పదం అల్లు- (అల్లుకుపోవు) అన్న పదానికి సంబంధించిందైతే అందులో ళ-కారం ఉండేది కాదు. కాబట్టి అల్లుడు అన్న పదానికి అల్లుకుపోవడానికి సంబంధం లేదు. బ్రౌన్ కాలానికి ఇటువంటి తులనాత్మక పదజాలం అందుబాటులో లేదు కాబట్టి బ్రౌన్‌ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మధ్యకాలంలో తయారు చేసిన తెలుగు వ్యుత్పత్తి కోశం*లో కూడా అల్లుడు అన్న పదాన్ని అల్లుకుపోవడానికి సంబంధించిన పదంగా వివరించడం ఆశ్చర్యకరమైన విషయం.

అయితే, గోండి భాషలో సన్నే అంటే అల్లుడు. పర్జి భాషలో చల్లునిద్-, కొలామి భాషలో సాల్జిన్ అంటే అల్లుడు, బ్రాహుయి భాషలో సాలుమ్ అంటే అల్లుడు. ఈ భాషలలో ఉన్న పదాది చ-/స-కారాన్ని బట్టి మూల ద్రావిడంలో ఈ ధాతువులో చ-కారం ఉండేదని ఊహించవచ్చు. దక్షిణ ద్రావిడ భాషలలోనూ, తెలుగులోనూ పదాది చ-/స- కారం లుప్తమవ్వడం క్వాచిత్కంగా కనిపిస్తుంది:

  • చమియు > అవియు, అవిసిపోవు (DEDR 2341)
  • చవియల్/చావల్ > అవియల్ = దంచిన బియ్యం (DEDR 2391)
  • చాఱు > ఆఱు (six) (DEDR 2485)
  • చిరు > ఇరు > ఇరులు = చీకటి (DEDR 2552)
  • చిల్- > ఇల్ల > లే(దు) (DEDR 2559)
  • చీంతు (date-palm) > ఈంతు > ఈంచు (DEDR 2617)
  • చుప్పు > ఉప్పు (salt) (DEDR 2674)

ఈ ఆధారాలను బట్టి అల్లుడు పదానికి సంబంధించిన మూలధాతువు *చళ్- అని మనం పునర్నిర్మాణం చెయ్యవచ్చు. హింది మొదలైన భాషలలో కనిపించే సాలే (బావమరిది) కూడా ఈ పదానికి సంబంధించిందేనని ఊహించవచ్చు. మళయాళం భాషలో అళియన్ అంటే బావమరిది.

మగ/ఆడ: తమిళంలో ఆడవర్ అంటే మగవాళ్ళు అనర్థం; మగళిర్ అంటే మగువలు అని అర్థం. ఆ ఆడవరికీ మన ఆడవాళ్ళన్న పదానికీ ఏమైనా సంబంధం ఉందా అని అవినేని భాస్కర్ గారు సందేహం వెలిబుచ్చారు.

ఆడవన్/ఆండవన్ అన్న పదాలకు, ఆడ/ఆండ పదాలకు సంబంధం లేదు. అవి రెండు వేర్వేరు ధాతువులనుండి వచ్చాయి. ఆడ అన్న పదానికి మూలం ఆండ అన్న పదం. కొండ భాషలో ఇప్పటికీ ఆండు అంటే స్త్రీ. మన సాహిత్యంలో కూడా పూర్వం ఆఁడ అనే రాశారు. తెలుగు భాషాపదాల్లో అరసున్న చాలావరకు ఆ పదాల్లో ఒకప్పడు నిండుసున్నతో పలికేవారని సూచిస్తుంది. తెలుగులో దీర్ఘము మీది అనునాసికము లుప్తమవ్వడం మనకు తెలిసిన ధ్వని పరిణామమే!

  • తోంట > తోఁట > తోట
  • మూండు > మూఁడు > మూడు
  • ఏండు (year) > ఏఁడు > ఏడు
  • ఆండు > ఆఁడు > ఆఁడ

ఇప్పటికీ, బహువచనాలలో కనిపించే ఏండ్లు, ఆండ్రు (స్త్రీలు, భార్యలు) మొదలైనవి వాటి పూర్వ రూపాలలో ఒకప్పుడు నిండుసున్న ఉండేదన్న అభిప్రాయాన్ని ధృవపరుస్తున్నది.

ఆడవన్/ఆండవన్ పదాలు *యాణ్డ- (to rule, to own) అన్న ధాతువు నుండి వచ్చాయి. అయితే, య-కారముతో ప్రారంభమయ్యే మూల ద్రావిడ ధాతువులు తెలుగు వంటి దక్షిణమధ్య ద్రావిడ భాషలలో ఏ-కారంగా మారితే, తమిళాది దక్షిణ ద్రావిడ భాషలలో ఆ-కారంగా మారాయి కాబట్టి మనకు ఈ రకమైన అయోమయం ఏర్పడుతుంది.

కొన్ని ఉదాహరణలు:

  1. యాఱు ‘river’ > ఆఱు (తమిళం) - - ఏఱు (తెలుగు)
  2. యాన ‘elephant’ > ఆనై (త.) - - ఏనుగు (తె.)
  3. యాೞು ‘to cry’ > ఆೞು (త.) - - ఏೞು(చు) > ఏడుచు (తె)
  4. యాట ‘ram, she-goat’ > ఆటు (త.) - - ఏట (తె.)
  5. యాణ్ట- ‘to rule, to be the master’ > ఆణ్డ-> ఆణ్డవన్/ఆడవన్ => ruler, God - - ఏలు (తె.) => ఏలిక (ruler)

కాబట్టి తమిళంలో ఆణ్డవన్/ఆండవన్ అంటే తెలుగులో ఏలిక అని అర్థం. దానికి ఆడ పదానికి ఏ సంబంధం లేదు.

ఇక మక-/మగ- అన్న ధాతుప్రయోగాలు సంతానానికి (కొడుకు/కూతురు) వాడినట్టు ఇతర భాషల ద్వారా మనకు తెలుసు. కన్నడ, తమిళాదులలో మగ+అన్ఱు = మగన్ఱు అంటే మగబిడ్డ, మగ+ అళు- = మగళు అంటే ఆడబిడ్డ. మగన్ఱు అన్న పదంతెలుగు భాషలో మనకు ‘కొడుకు’ అన్న అర్థంలోనే కాకుండా, పురుషులందరికీ వర్తించే విధంగా మారిపోవడం, అంతేకాక మగడు అంటే భర్త అన్న అర్థంలో స్థిరపడిపోవడం తెలుగులో విశేషం.

మగడు/పెళ్ళాం: మగ- శబ్దం నుండి మగడు అన్న అర్థం సాధించడం పైన చూశాం. పెళ్ళాం అన్న పదం స్త్రీ అన్న అర్థం ఉన్న *పెణ్- అన్న మూల ధాతువునుండి వచ్చింది. పెండిలి/పెండ్లి అన్న పదం కూడ *పెణ్- అన్న పదానికి సంబంధించిందే. పెనిమిటి అంటే *పెణ్- + *మేటి/మిటి = స్త్రీ పై అధికారి/స్వామి అంటే భర్త.

మనుమడు/మనుమరాలు: మనుమ- అన్న పదాంశానికి -అండు అన్న పురుషవాచక ప్రత్యయము, -ఆలు అన్న స్త్రీ వాచక ప్రత్యయము జతచేయడం ద్వారా ఈ పదాలను సాధించవచ్చు. అయితే, మనుమ- అన్న పదాంశం మను- (= జీవించు, వృద్ధి నొందు) అన్న ధాతువుకు సంబంధించిందో కాదో అంత సులభంగా వివరించలేం. నిజానికి మఱు- అన్న ఉపసర్గకు మగండు (కొడుకు) అన్న ధాతువు చేర్చడం ద్వారా మఱుమగండు అయ్యిందని, అది మనుమండు గా ఆపై మనుమడుగా రూపాంతరం చెందిందని చెప్పడం సులభం. తమిళంలో మేనల్లుడిని మరుమకన్ లేదా మరుమాన్ అని అంటారు.

వియ్యంకుడు/వియ్యంకురాలు: వియ్యము అన్న పదం పెళ్ళికి సంబంధమైనది. నెయ్యము, కయ్యము లాగా ఇది కూడా ద్రావిడ పదమేనని అనిపిస్తుంది కాని, వివాహ- అన్న సంస్కృత పదం వియాహా అని వియ్యఆ అన్న ప్రయోగాల రూపంలో ప్రాకృతంలో కనిపించడంతో ఇది వివాహ- శబ్దభవమనే చెప్పుకోవాలి. నెయ్యము అన్న పదం కూడ స్నేహ- అన్న సంస్కృతపదం నుండి నిష్పన్నం చేసే వాదాలున్నాయి. దాని గురించి మరెప్పుడైనా.

సడ్డకుడు/సడ్డకురాలు: తెలంగాణాలో తోటి అల్లుడిని సడ్డకుడు/షడ్డకుడు అని, తోటి కోడలును సడ్డకురాలు అని అంటారు. దీనికి మూలం సంస్కృతం లోని సడ్ఢకః- శబ్దం అని చెబుతారు కానీ సడ్ఢకః అన్న పదానికి ధాతువును సంస్కృతంలో వివరించడం కొంచెం కష్టం. ఈ పదానికి అసలు మూలం మరో దేశభాష అయ్యే అవకాశం ఉంది.


ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత అని మీకు తెలుసా? దెబ్బ తాకితే ‘అమ్మో!’ అంటాము. జాలి చూపడానికి ‘అయ్యయ్యో!’ అంటాము. అలాగే ఆశ్చర్యానికి ‘అబ్బో!’ అంటాము. పని పూర్తి కాగానే ‘అమ్మయ్య!’ అని నిట్టూరిస్తాము. ఏదైనా వింత విషయం చెప్పి బుగ్గలు నొక్కుకోవడానికి ‘ఔరా, అమ్మక్కచెల్లా’ అని అమ్మను, అక్కను, చెల్లిని తలచుకుంటాము. ‘అన్నన్నా ఎంతమాట!’ అంటాం. అలాగే, ‘అమ్మో’, ‘అబ్బో’, ‘అబ్బా’, ‘అబ్బబ్బా’, ‘అబ్బే’, ‘అయ్యబాబోయ్’, ‘అయ్యారే’ అంటూ తల్లిదండ్రులను తలచుకుంటూనే ఉంటాం.

దీని గురించి మా వేలూరిగారు ఎప్పుడూ చెప్పే సరదా కథ: మాస్కోలో ఒకసారి ఒక తెలుగువాడు స్విమ్మింగ్ పూల్ పక్కనుండి నడుస్తూ వెళ్తూ కాలు జారి స్విమ్మింగ్ పూలులో పడ్డాడట. వాడికీత రాదు. పడగానే వాడు భయంతో పెద్దగా “వామ్మోవ్, నాన్నోవ్, చస్తినోవ్” అని అరిచాడట. అక్కడే ఉన్న ముగ్గురు రష్యన్లు గబగబ వచ్చి వాణ్ణి రక్షించి పైకి తీశారట. ఆ తర్వాత వాణ్ణి అడిగారట: “సరే గానీ, నీకు మా పేర్లెలా తెలుసు?”

[*ఎనమిది సంపుటాలుగా ఆచార్య లంకసాని చక్రధర రావు గారి ఆధ్వర్యంలో వెలువడిన తెలుగు వ్యుత్పత్తి కోశాన్ని నాకోసం ఎంతో శ్రమకోర్చి సంపాదించి పెట్టిన సుజాత బెడదకోట గారికి, ఆ సంపుటాలను ఇండియా నుండి మోసుకొచ్చిన నాగరాజు పప్పు గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు.]

 

(10 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Siddineni Bhava Narayana అభిప్రాయం:

    May 1, 2012 8:45 am

    ‘’యాట ‘ram, she-goat’ > ఆటు (త.) - - ఏట (తె.)'’
    ram ఆంటే male goat/sheep [uncastrated] గదా? అచ్చు తప్పనుకుంటాను.
    ‘చవియల్/చావల్ > అవియల్ = దంచిన బియ్యం’
    హిందీ లో కనిపించె చావల్ ద్రవిడ జన్యమా?

  2. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    May 1, 2012 9:58 am

    @Siddineni గారు: ’యాట’ అన్న పదానికి ram, she-goat అని ఇచ్చిన అర్థాలు పునరుక్తి కాదు. ’యాట’ అన్న ధాతువు, దాని తద్భవ రూపాలను కొన్ని ద్రావిడ భాషలలో గొఱ్ఱె (మగ గొఱ్ఱె) అన్న అర్థంలోనూ, మరి కొన్ని భాషలలో ఆడుమేక గాను ఉపయోగిస్తారు.

    వివిధ భాషలలో ఈ ధాతువుకు సంబంధించిన సజాతి పదాలు వాటి అర్థాలు:

    తమిళం: యాటు, ఆటు goat, sheep; ఆట్ట్-ఆళ్ shepherd.
    మళయాళం: ఆటు goat, sheep; ఆట్టుకారన్ shepherd.
    కోత:. అర్ goat.
    తొద: ఒడ్ goat.
    కన్నడ: ఆడు goat
    కొడగు: అడి
    తుళు: ఏడు
    తెలుగు: ఏడిక, ఏట
    గొండి: యేటీ, ఏటి she-goat (Voc. 376).
    పెంగొ: ఓడ goat.
    మండ: ఊడె
    కుయి: ఓడ
    కువి: ఓడా, ఓడ
    కూరుఖ్: ఏరా she-goat.
    మాల్తో: ఏరె
    బ్రాహుయి: హేట్
    సంస్కృతం: ఏడ, ఏడక, ఏడీ a kind of sheep;
    (Turner, CDIAL, no. 2512., DEDR 5152)

    చావల్ అన్న పదం ఏ భాష జన్యం అన్న విషయం గురించి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. అది కచ్చితంగా సంస్కృత జన్యము కాదు (సంస్కృత పదమైన శ్యామల జన్యమని వాదించేవారు లేకపోలేదు). అది ద్రావిడ భాషా జన్యమైనా అయ్యిండాలి. లేదా లుప్తమైన ఉత్తరాది దేశభాషల నుండి హిందీలోకీ ద్రావిడ భాషలలోకి ప్రవేశించైనా ఉండాలి.

  3. nagamurali అభిప్రాయం:

    May 2, 2012 5:39 am

    సురేశ్ గారూ, ఏమిటో ఈ పదాల మూలాలు తెలుసుకోడానికి మీరెంత కష్టపడుతున్నారో కదా అనిపిస్తుంది ఒక్కోసారి. ‘కంఠాభరణం’ నాటకంలో ఒక సులభమైన సూత్రం చెప్పారండీ. మీకు ఉపయోగపడొచ్చని ఆశిస్తున్నా.

    “ఈ ‘సర్కసు’ శబ్దమేభాష అని మీ మతము?”
    “ఒక సూత్రము చెప్పెదను వినుము. కఠినమైన శబ్దమేదియైననూ సంస్కృతమే.”

  4. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    May 2, 2012 11:19 am

    @nagamurali “అలాగా? మరి ఈ ‘సర్కసు’ శబ్దమునకు అర్థముమాట?” అని అడిగితే, పానుగంటి వారు సరైన సమాధానం ఇవ్వలేదు కానీ నా సమాధానం ఇలా ఉండేది:

    నాయనా, ఈ శర్కస్- శబ్దము అతి ప్రాచీనమైనది. ఈ రకమైన కసరత్తులను నెరపడంలో శర్కరాక్షుడనే మహర్షి మహాప్రసిద్ధిని చెందినవాడు. కావుననే, ఆతని పేరిట వీటిని శర్కరాక్ష ప్రక్రియలు అని పిలిచేవారు. ఆయుర్వేదాన్ని నిర్వచించిన పెక్కు మహర్షులలో ఆయన ఒకరని చరకసంహిత మనకు చెబుతుంది::

    కాంకాయనః కైకశేయో ధౌమ్యో మారీచకాశ్యపౌ
    శర్కరాక్షో హిరణ్యాక్షో లోకాక్షః పైంగిరేవ చ
    (చరకసంహిత సూత్ర స్థానః 1.12)

    ఈ మ్లేచ్ఛులకు శర్కరాక్ష ప్రక్రియలు అనుటకు నోరు తిరగక వాటిని శర్కస్ అనియు సర్కస్ అనియు మార్చుకున్నారు. చూసావా నాయనా, తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?

    :-).

  5. Srinivas Vuruputuri అభిప్రాయం:

    May 2, 2012 1:00 pm

    “ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత అని మీకు తెలుసా?”

    నిజంగా తెలియదు మీరు చెప్పేదాకా. తమిళులు “అబ్బాడీ, అమ్మాడీ” అని ఆశ్చర్యపోవడం చూసాను. హిందీలో సైతం బాప్‌రే బాప్‌ అని గుండెలు బాదుకుంటారు కదా? :-)

    సురేశ్‌ గారూ, మరో మాట - సంఖ్యాపదాల మీద రాసిన వ్యాసంలో మీరు - “ఏడుకొండల గురించి అన్నమయ్య” ప్రస్తావించాడా ఏ పదంలోనైనా?” అని అడిగారు. కొండలరాయడు, కొండలయ్య అనే మాటలను చూసిన జ్ఞాపకం. కానీ ఏడుకొండలు అనే మాట ఆయన వాడినట్లు అనిపించలేదు. అది ఇటీవలి పదబంధమా?

  6. Chinthu అభిప్రాయం:

    May 5, 2012 6:08 pm

    చింతు అంటే date-palm? నిజమా?

  7. Siddineni Bhava Narayana అభిప్రాయం:

    May 6, 2012 12:46 am

    సురేశ్ గారూ,

    ధన్యవాదాలు. ‘’ram” ని she goat అనడం అచ్చు తప్పేమోనని, పునరుక్తి ఆని కాదు!

    చావల్ ద్రవిద భాషల్లో ఉనికిలో ఉందంటారా/ తణ్దుల విషయం? భియ్యం అనే అర్ధం లో ‘వ్రిహి’ కి స్పష్టత వుంది.

    The case of rice in Sanskrit is believed to be a loan from Proto Dravidian, first appeared in Yajurveda, and the sanskritised term, via The Avestan is the source for all the European languages.

    Yajurveda vrihi/vrihis > vrize {Avestan/Old Persian]>oryza [Greek] >riso[Latin ]

    All the European languages are believed to have borrowed the term either from Greek or from Latin.

    Reis in German,
    Riz in French,
    reis in welsh,
    ryz in Polish,
    Rice in English
    Riza in Polish.
    Riso [Italian].

    But the origin and growth of’ tandula ‘and ‘chaval’ are yet to be probed into..

    Etymological Dictionary of Sanskrit by Mayrhofer and The Linguistic History of Sme Indian Domestic Plants by Michael Witzel, give relevant data.

    విధేయుడు,
    సిద్దినెని భావ నారాయణ.

  8. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    May 6, 2012 5:40 am

    @Srinivas Vuruputuri గారు: నాకు తెలిసి అన్నమయ్య ఏడుకొండలు అని గానీ, ఏడుకొండల రాయడు అనిగానీ ఎక్కడా ప్రస్తావించలేదు. శాండిల్య సారథ్యంలో విడుదల చేసిన కాసెట్లలో మాత్రం “ఎండగానీ, నీడగానీ” అన్న పాటలో “కొండలరాయడే మా కులదైవము, ఏడు కొండలరాయడే మా కులదైవము” అని పాడారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన సాహిత్యంలో ఈ పాటలో “కొండలరాయడే మా కులదైవము” అని మాత్రమే ఉంది. ఏడుకొండలు, ఏడుకొండల రాయడు అన్న పదబంధాలు ఈ మధ్య కాలంలోనివనే నా అభిప్రాయం.

    @Chintu గారు: చీంతు అంటే date-palm. తెలుగులో అది ఈఁత, ఈఁతాడ (సంస్కృతం: హింతాళ).

    @సిద్దినెని గారు: Mayrhofer నిఘంటువు చాలా పాతది. అందులో ఎన్నో ధాతు నిర్ణయాలు ఇప్పుడు ప్రశ్నార్థకం. Witzel పేపరుతో పాటు, Fuller పేపర్లు, ఆయన బ్లాగులో చర్చలు, ఈ సంవత్సరమే వచ్చిన Southworth పేపరు కూడా చూడండి. Southworth ప్రతిపాదించిన విషయాలన్నీ నేను ఒప్పుకోను (ముఖ్యంగా బ్రాహుయి, ఈలమైట్ భాషల సంబంధం గురించి).

    1. Rice in Dravidian, Franklin Southworth, RICE Volume 4, Numbers 3-4 (2011), 142-148, DOI: 10.1007/s12284-011-9076-9
    2. Fuller, D.Q. Indian Archaeobotany watch: Lahuradewa 2008
    3. Fuller, D. Q. A dialog on rice in Indian cultural history

    ధాన్య సంబంధమైన పదాల గురించి వివరంగా మరెప్పుడైనా చర్చించుకుందాం.

  9. ఆర్.దమయంతి అభిప్రాయం:

    June 28, 2012 8:25 am

    “తెలంగాణాలో తోటి అల్లుడిని సడ్డకుడు/షడ్డకుడు అని, తోటి కోడలును సడ్డకురాలు అని అంటారు.” అని అన్నారు. నేనెక్కువగా విన్నది మాత్రం - ‘యారాలు’ అని. (ఇది తెలుగు పదం కాకపోవచ్చు కానీ, వాడుకలో ఈ పదాన్నే ఎక్కువగా విన్నాను.)

    ‘పలుకుబడి’ లో ఎన్నో తెలీని సంగతులు తెలియచేస్తున్నందుకు ధన్య వాదాలు సురేశ్ గారూ!

    అభినందనలతో-
    ఆర్.దమయంతి.

  10. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    June 28, 2012 7:07 pm

    అవునండి. తెలంగాణలో తోటికోడలు అన్న అర్థంలో యారాలు (ఏఱాలు) అన్న మాటే ఎక్కువగా వాడుతారు. గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. ఏఱాలు అన్నది అచ్చతెలుగు పదమేనండి. చివర్లో ఉన్న -ఆలు అన్న పదమే అది అచ్చతెలుగు పదమని చెబుతుంది. ఏఱాలు అన్న పదం వేఱాలు అన్న పదం నుండి వచ్చింది.

    ఏఱాలు < వేఱాలు < వేఱు + ఆలు = వేరే భార్య/కోడలు

    ఇంటిలో ఉండే వేఱే కోడలు కాబట్టి ఆ స్త్రీ ని వేఱాలు అని పిలిచారని చెప్పుకోవచ్చు. సవతిని కూడా ఏఱాలు అని పిలుస్తారు. వేఱు అన్న పదం ఇలాంటి అర్థంలోనే ప్రయోగించడం తమిళంలో కూడా కనిపిస్తుంది: వేఱ్ తాయి (=వేఱే తల్లి) అని సవతి తల్లిని పిలుస్తారట.

    సవతి అన్న పదం మాత్రం సంస్కృతం లోని సపత్ని (ఒకే భర్తగల స్త్రీలు) నుండి ప్రాకృతంలో సపత్తిగా మారి ఆపై సవత్తి అయి తెలుగులో సవతి అయ్యింది. తమిళంలో ఇప్పటికీ సవతిభార్యను సవత్తి/చవత్తి అనే అంటారు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a