వీళ్ళేదో అడవుల్లోంచి కొబ్బరికాయలు కొట్టుకొచ్చే తండా, వీళ్ళకింతకన్నా ఏం తెలుసు అనుకుంటున్నారేమో. అబ్బే, మాకన్నీ తెలుసు. బైట లోకంలో ఏం జరుగుతున్నయో మాకు బాగా తెలుసు. పెద్ద పెద్ద పట్నాల్లో గొప్పోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, వాళ్ళ నాయకులు ఉంటారనీ, వాళ్ళు చాలా లావాదేవీలు చేస్తారనీ తెలుసు. మాకు రాకెట్లు, విమానాలు వుంటాయని తెలుసు. అణ్వాయుధాలని ఉంటాయని, వాటిని మోస్కెళ్ళి ముందుగా చెప్పిన చోటన మాత్రమే పడేసే మిసిలీలుంటాయని కూడా తెలుసు. అవి చాలా ఖరీదని కూడా తెలుసు. ఇంకా చాలా చాలా తెలుసు. మీకింకో విషయం చెప్పనా. ఆ మిసిలీలు పడ్డప్పుడు పోయేది ఆ ఒక్కచోటే కాదు, ఆ చుట్టుపక్కలంతా కూడా దోకుడుపారతో దోకినట్టుగా మొత్తం ఊడ్చిపెట్టుకుపోతుందని మాకే కాదు, మా తండా గురువులకీ తెలుసు. అవి పిశాచ శక్తులనీ అవి చేసే నాశనం అంతా ఇంతా కాదనీ తెలుసు కాబట్టే, వాళ్ళకలా దేవుడు మరి చెప్పాడు కాబట్టే, మా గురువులు అవి కనిపించగానే పెద్దగా తిడుతూ వాటికి శాపాలు పెడుతుంటారు, ఒక్క క్షణం కూడా అవేదో మంచి చేసేవని మేమెవరమూ నమ్మం. కాకపోతే, ఆ మిసిలీనే దేవుడు కలలో చెప్పిన చెప్పిన తోక చుక్క శకునం అయుండచ్చునేమో అనేది మా స్వాములు కూడా కాదనలేని నిజం. ఏదేదో మాకైతే తెలీదు. మరి, ఆ పోయేది తోకచుక్కే అనుకుంటే కాస్తలో కాస్త ప్రాణం ఊరట పడుతుంది కదా. అది ఆ తోకచుక్కేమో అనే నమ్మకం చాలుగా మాకు మా కష్టాలు మర్చిపోడానికి, ఈ రోజు గడిచిపోడానికి, మళ్ళీ నిద్దర్లేచి అడవిలోకి పోడానికి.
మరి మంచి రోజులింకా ఎందుకు రాలేదా? పడమటి నక్షత్రం పక్కనుంచి మెరుపు మెరిసి తూర్పు వైపుకు తోకచుక్కో మిసిలీనో పోయిన కాసేపటికే అటునించి ఇంకో తోకచుక్కో మిసిలీనో పడమటి వైపు కొస్తుంది. ఇలా జరగడం ఈ మధ్య మరీ ఎక్కువైంది. ఇది అపశకునంట. పడమటినుంచి తూర్పుకెళ్ళే తోకచుక్క మంచి శకునమైతే, తూర్పు నుండి పడమటికొచ్చేది చెడ్డ శకునం కాక మరేమౌతుంది? అది చేయబోయే మంచిని ఇది మింగేసి ఆపైన ఇంకా చెడు చేస్తుందట. అందుకే మాకు ఉన్నట్టుండి ఆనందం, వెంటనే ఏడుపూ వస్తుంటాయి. మా స్వాములు చెప్పేదాకా మేమంతా ఇలా అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ పోయే మిసిలీలలో మా మంచిరోజుల్ని వెతుక్కుంటూ ఆకాశంవైపు చూస్తూ రోజులు గడుపుతుంటాం. మేం తొందరపడి, ఏడ్చి దిగులు పెట్టుకుని చేయడానికేమీ లేదు. నిండా పెద్దడవి కప్పుకున్న కొండలకీ చివరకున్న తండా మాది. ఇక్కడేదీ మారదు, కొండలకు అటువైపుగా ఏమైతోందో గానీ ఇటు మావైపు మాత్రం ఎప్పుడూ ఏమీ మారలేదు, దేవుడు చెప్పిన జోస్యం నిజమైతే తప్ప ఏదీ మారదు కూడా.
ఇంతకు ముందైతే అప్పుడప్పుడు పెద్ద లారీ వెంటేసుకోని ఒకాయనొచ్చేవాడు. ఆయన రాకపోతే ఇంకొకాయన. మేం కొట్టుకొచ్చిన అడవి కొబ్బరి కాయలు కొనుక్కొనిపోడానికి. కొన్నిసార్లు ధర తక్కువ చెప్పి వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తే కొన్నిసార్లు ఓటి కాయలు కలిపేసి మేం వాళ్ళని మోసం జేసేవాళ్ళం. వచ్చినప్పుడే వచ్చేవాళ్ళు. ఎన్నుంటే అన్నే తీస్కొని పోయేవాళ్ళు. ఇప్పుడలా జరగట్లేదు. ఆదివాసీ సంక్షేమ సమితి అని ఒకటొచ్చింది. అడవుల్లో తండాలు కొట్టుకొచ్చే కాయలు, గింజలు, పూలు అన్నీ కొనుక్కుపోయే వాళ్ళంతా కలిసి తండాల మంచి కోసం పెట్టుకున్నదట. అందుకని మా తండా వైపుకింకెవరూ రాకూడదట. వాళ్ళొక్కళ్ళకే మేమమ్మాలట. వాళ్ళే అన్నీ చూసి ధర చెప్తారట. మా కాయలన్నీ గుత్తగా తీస్కుంటారట. సరేననక ఏం జేశాం? ఇప్పుడు వాళ్ళెంత చెప్తే అంతే. అంతకు ముందు కంటే మాకు పనెక్కువైంది కూడా. వాళ్ళు ఎన్ని కాయలు, ఏ రోజుకల్లా కావాలంటే, అన్నీ కొట్టుకురావల్సిందే, ముందే ఒప్పుకొన్నట్టు. పగలూ రాత్రుళ్ళు కూడా అడవిలోకి పోతున్నాం చాలా సార్లిప్పుడు. అయినా సరే, మా తండాలో కొందరికి దేవుడు చెప్పిన మంచిరోజులు దగ్గర్లోనే ఉన్నాయని గట్టి నమ్మకం. ఆకాశంలో జోస్యం నిజమైతుందని కాదట. ఆ సమితి వాళ్ళు అన్నీ పన్లూ మిషిన్ల తోటే చేస్తారు గదా. వాటికొక రోజు రోగమొస్తుందట. అవి ఉన్నట్టుండి పని చేయవట. కానీ తండా కలాంటి మిషిన్లు లేవు కాబట్టీ, మనమాటే చివరకు నెగ్గి మనకు తొందర్లో మంచి రోజులొస్తాయట.
చెప్పడానికేం కబుర్లే కదా! ఎన్నయినా చెప్పచ్చు. కానీ సమితి బాబుల మాటకెదురే లేదు. మునపటిలా కాదు. వాళ్ళిక్కడికి రారు. ఇప్పుడు మేము కొట్టుకొచ్చిన కాయల్ని మేమే ఏటి గట్టు దాకా మోస్కెళ్ళి ఇచ్చిరావాలి. అక్కడేగా వాళ్ళ ఓడ ఉండేది. ఎప్పుడెళ్ళి చూసినా చలువ కళ్ళద్దాలు పెట్టుకొని, టేబుళ్ళ మీద దర్జాగా కాళ్ళు చాపుకొని, చేతిలో సీమసారా గ్లాసులతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. “ఓ! మై! రాత్రి పోయిన మిసైల్ స్పీడ్ మినిమం వెయ్యి మైళ్ళేనా ఉంటుంది. ఇఫ్ అయాం నాట్ రాంగ్, పోయిన గురువారం చూసిన మిసైల్ కంటే కొంచెం వేగం ఎక్కువే అనుకుంటా.”; “లాస్ట్ మంత్, అమావాశ్య రోజు పోయింది చూడూ, బాయ్! ఓ బాయ్! అదీ మిసైల్ అంటే. హీనపక్షం రెండు వేల మైళ్ళుండదూ దాని స్పీడ్.” ఇలా వాళ్ళూ మిసిలీల గురించే మాట్లాడుకుంటారు. మాకూ, వాళ్ళకూ ఇదొక్కటే పోలిక, మేమంతా మాట్లాడుకొనేది వాటి గురించే. సమితి బాబులైనా, మా తండా స్వాములైనా అనుకునేది ఆ తోకచుక్కల మీదే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయని కాబోలు.
నేను కూడా, అప్పుడప్పుడూ నా గుడిసె ముందు పడుకుని రాత్రిళ్ళు ఆకాశం కేసి చూస్తూ, నక్షత్రాల మధ్య వాటిమల్లేనే మిణుక్కుమని మెరిసి దూసుకెళ్ళే తోకచుక్కలని గమనిస్తూ ఉంటాను. ఈ మిసిలీలన్నీ వెళ్ళి సముద్రంలో పడి చేపలన్నిటినీ చంపేస్తాయని, సముద్రం అంతా విషమైపోతుందనీ నాకెందుకో ఊహలొస్తుంటాయి. పెద్ద పెద్ద పట్నాల్లో మిసిలీకీ మిసిలీకీ మధ్యలో అవి ఒకళ్ళ మీద ఒకళ్ళేసుకొనే పెద్దోళ్ళంతా కలిసి, మీరు బాగున్నారా అంటే మీరెలా ఉన్నారంటూ, సమితి బాబుల్లా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారనీ, నాకెందుకో అనిపిస్తూ ఉంటుంది. అందరూ అనుకునేట్టుగా ఈ తోకచుక్కలేనేమో చివరికి మా తండా బతికుంటుందో, తుడిచిపెట్టుకుపోతుందో చెప్పేది. దేవుడు మా తండాకు రాసిపెట్టింది ఈ తోకచుక్కల్లో నిజంగానే ఉందనే నాకూ అప్పుడప్పుడూ నమ్మాలని ఉంటుంది. ఇవన్నీ ఆలోచించేకొద్దీ వీటన్నిటి గురించి నాకింకా చాలా నేర్చుకోవాలని, ఎంతో తెలుసుకోవాలని ఉంటుంది.
…కానీ, ఒక్క నిజం మాత్రం నాకిప్పటికే తెలిసిపోయింది; తోకచుక్కల మీదనే పూర్తిగా నమ్మకం పెట్టుకుని బతికే మా తండా, అవెప్పుడొచ్చి ఏం మంచి చేస్తాయో తెలిసినా తెలీకపోయినా, అది ఉన్నంత కాలం అడవికొబ్బరికాయలను అమ్మాల్సిన ధరకంటే చాలా తక్కువకే అమ్ముకుంటుందని.
(The tribe with its eyes in the sky, 1957.)
