కాల్వీనో కథల నుంచి – 3

నిజానికి ఆ పిట్టగోడ మీద కాలు పెట్టి షూ లేసులు కట్టుకోడం చాలా చులాగ్గా చేయగల్గిన పని. కానీ, గోడ మీద సుఖంగా కాలు పెట్టుకొని కూడా, తడబడకుండా లేసులు ముడేసుకోవడం నా వల్ల కాలేదు. అతని చూపులు నన్ను నిశితంగా పరిశీలిస్తున్నాయనీ, అవి నా వేళ్ళ ప్రతి కదలికను ఏమరకుండా గమనిస్తున్నాయనీ నేనతనివైపు చూడకపోయినా నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంతా జరిగింతర్వాత ఇంకేముందిలే అన్న తెగింపు వచ్చేసి నాకెందుకో భయం పోయింది. కాస్త ధైర్యం గూడా వచ్చి మనసు తేలిక పడినట్లనిపించింది. సన్నగా కూనిరాగం తీస్తూ రెండు షూ లేసులనీ తాపీగా చక్కగా కట్టుకున్నాను.

అతను అలానే మౌనంగా ఉండి ఉంటే నా కథ సుఖాంతమై వుండేది. కానీ, అతను చిన్నగా గొంతు సవరించుకొని, ముందు తటపటాయించినా కాస్త స్పష్టంగానే అన్నాడు.

“ఐ బెగ్ యువర్ పార్డన్. కానీ మీరిప్పుడు కూడా షూ లేసులు సరిగ్గా కట్టుకోలేదు.”

నా కాలింకా పిట్టగోడ మీదే ఉంచి అతని వైపు తల తిప్పి చూశాను. నా మొఖం ఎర్రబడింది.

“మీకు తెలీదనుకుంటా” అన్నాన్నేను. “నాకు లేసులు కట్టుకోడం రాదు. నా వల్ల కాదు. చిన్నప్పట్నించీ అంతే. ఎవరైనా నేర్పబోయినా నేను నేర్చుకోలేదు. నేను లేసులు విప్పి కట్టుకోను ప్రతిసారీ. ముడి తీయకుండానే షూ లోకి కాలు ఎక్కిస్తాను. అవసరమైతే గరిటెకాడతో మడమను లోపలికి నెడతాను. అంతే కానీ లేసులు మాత్రం కట్టుకోలేను. గజిబిజిగా అయిపోతాను ముడేయాలంటే. నేనింతే! మీరు నమ్మినా నమ్మకపోయినా!”

కాలు కిందికి దించి అతని వైపు తిరిగి నిలబడ్డాను చేతులు నడుమ్మీద పెట్టుకొని. అతనో మాటన్నాడు. ఒక ముక్కూ మొఖం తెలియని వ్యక్తి అలా అడుగుతాడని నేనసలు ఊహించలేదు.

“మరి మీకే షూ కట్టుకోడం రాకపోతే, మీ పిల్లలకి ఎలా నేర్పిస్తారు? మీకు పిల్లలే గనక ఉంటే.”

అసలు ఊహించకపోయినా, అదేం విచిత్రమో, ఈ ప్రశ్న నన్నెవరో అడుగుతారని నాకింతకు ముందే తెలిసి, ఆలోచించి సమాధానం తయారుచేసి పెట్టుకున్నట్టు – ధీమాగా సమాధానం చెప్పాను, నాకే తెలీకుండా.

“నా పిల్లలు ఎలా షూ లేసులు కట్టుకోవాలో అది తెలిసిన వాళ్ళనుండి నేర్చుకుంటారు.”

అతను తిరిగి నాతో అన్నది, మరింత విచిత్రంగా అనిపించింది.

“సరే, బాగుంది. ఉదాహరణకు మహాప్రళయం వచ్చి ఉన్నట్టుండి ఈ విశ్వమంతా ముణిగిపోయిందే అనుకుందాం. జీవరాశి అంతా నశించిపోయి కేవలం మీరు, మీ పిల్లలు మాత్రమే సృష్టి మొత్తంలో రక్షింపబడి మిగిలిపోయిన మానవులు అనుకుందాం. అప్పుడేం చేస్తారు మీరు? అప్పుడు మీ పిల్లలకి షూ లేసులెలా కట్టుకోవాలో ఎలా నేర్పిస్తారు? ఎప్పుడైనా ఆ విషయం గురించి ఆలోచించారా? ఒకవేళ అలానే జరిగితే మళ్ళీ ఎన్ని యుగాలు రావాలో, ఎంత కాలం పడుతుందో ముడి అనేదాన్ని మనుషులు ఇంకోసారి కనుక్కోడానికి, ముడి అంటూ ఎలా వేయాలో నేర్చుకోడానికీ, ఎప్పుడైనా ఊహించారా?”

మహాప్రళయమెక్కడ, నా షూ లేసుల ముడెక్కడ! ఈ తలా తోకా లేని అసందర్భపు ప్రశ్నలేమిటి? నాకు సరిగ్గా అర్థం కాలేదు. అలా అని నేను ఊరుకోనూ లేదు.

“ఏం, నేనే ఎందుకు రక్షింపబడాలి? నేనేమైనా అవతార పురుషుడినా? నాకు షూ లేసులు కట్టుకోడం కూడా రాదే? మరి అలాంటి నేను, నేనే కారణ జన్ముణ్ణి ఎందుకు కావాలి?” మొండిగా ఎదురు తిరిగాను.

ఎండ ఏటవాలుగా అతని మొఖం మీదుగా మా మధ్యపడుతోంది. ఆ వెలుగులో అతను మానవుడి అవతారమెత్తిన దేవతలా కనిపిస్తున్నాడు. నాకెందుకో ఒళ్ళు జలదరించింది.

“నేనే ఎందుకు? మీరంతా అడిగే ప్రశ్నే ఇది. ఆలోచించే తీరే ఇది. ప్రతీ వాడి కాలికీ ఒక ముడి ఉంటుంది. అయినా ఎవరికీ అది ఎలా కట్టుకోవాలో తెలియదు. ఈ చేతకాని తనమే మనుషుల్ని ఒకళ్ళ నొకళ్ళకు దగ్గరగా చేరుస్తోంది. ఈ చేతకాని తనమే వారిమధ్య బంధుత్వం కలుపుతోంది. ఈ కొరగాని తనపు పునాదుల మీద, అరాకొరా సమర్ధతలకి అసమానతలకి ఎలా కుదిరితే అలా కుసి వేసి నిలబెట్టిన చితుకుల మేడ మీ నాగరికత. మరి మహాప్రళయమే వచ్చి ఈ విశాల ప్రపంచమంతా పూర్తిగా నాశనమైపోతే, ఒక్కడంటే ఒక్కడు, మళ్ళీ ప్రపంచాన్ని తిరిగి నిర్మించడం దాకా ఎందుకు, కనీసం ఆవైపుగా ఒక చిన్న ప్రయత్నం కూడా చేయలేడు. తనంతట తానుగా ఇసుక గూడు లాంటిది కట్టుకొని మొదటి అడుగు కూడా కనీసం వెయ్యలేడు. తనని తానే బ్రతికించుకోలేడు. దేవతలు మొట్టమొదట పుట్టించిన మనిషి మనువు. ఒంటిచేత్తో ఓడను తయారు చేసుకొని, మహాప్రళయం వచ్చి భూమి ముణిగిపోతున్నప్పుడు, సమస్త జీవరాశిని కాపాడుకొని పోగొట్టుకున్న తన ప్రపంచాన్ని మళ్ళీ నిర్మించుకున్నాడు. కేవలం ఒక మనిషి. ఒక సమర్ధుడైన మనిషి. అలాంటి మనిషి ఒక్కడంటే ఒక్కడు ఇప్పుడెంత ప్రయాసపడినా దొరకడు. కాదా? మీరే చెప్పండి. మీకు లేసులు ముడేసుకోడం రాదు. ఇంకొకడికి చక్రం తిప్పడం రాదు. ఒకడికి చెక్కపని చేయడం రాదు, ఇంకొకడికి బంకమన్ను పిసకడం చేతకాదు. ఒకడికి చదవడం రాదు, ఇంకొకడికి దుక్కి దున్నటం రాదు. ఎవరికీ ఒకటొస్తే ఇంకోటి రాదు. ఎన్నేళ్ళ నుంచి వెతుకుతున్నానో ఒక్క మనిషి కోసం, మీకేం తెలుసు? ఈ వెతుకులాట ఎంత కష్టం, నిజంగా! ఇది ఎంత పెద్ద కష్టమో మీకు అర్థం కాదు కదూ? నా ప్రయత్నం ఇలా వృధా ప్రయాసగా మిగిలిపోతుంటే ఎంత బాధగా ఉందో మాటల్లో చెప్పలేను. మీరంతా ఇంతే. ఒక గుడ్డివాడు, వాడి భుజాలమీదొక కుంటివాడు ఒకడు లేకుండా ఇంకొకడు ఎటూ కదలలేనట్టే, మీరంతా కూడా. కానీ పెడసరిగా వాదించడంలో మాత్రం ఏమీ తీసిపోరు. అదొక్కటే మీ అందరికీ చాతనయింది. నాకు తెలుసు. మహా ప్రళయం వస్తే మానవజాతి సమూలంగా నాశనమైపోతుంది. పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది. ఖచ్చితంగా ఇదే చివరికి జరిగేది.”

ఆఖరి వాక్యం పూర్తి అయీ కాకముందే అతను వీధిలోకి అడుగేసి మాయమైపోయాడు. అంతే, ఇక మళ్ళీ నాకెప్పుడూ అతను కనిపించలేదు. అతనో పిచ్చివాడైనా అయి వుండాలి లేదూ ఏ దేవతైనా అయి వుండాలి అని అనుకున్నాను. కాకపోతే ఇలా ఏళ్ళ తరబడి ప్రపంచమంతా తిరుగుతూ మన మధ్యలో రెండో మనువు కోసం వెతికేవాడిని ఇంకెవరని అనుకోను?

(Good for Nothing, 1945-46.)

2. పడిగాపులు

ఎండాకాలంలో రాత్రులు బాగుంటాయి, ఆకాశాలు చుక్కలతో నిండిపోయి మిలమిల్లాడుతుంటాయి. తోకచుక్కలు మా ఊరి ఆకాశంలో పడమటి దిక్కున పెద్ద నక్షత్రం పక్కనుంచి తూర్పు వైపుగా దూసుకొని పోతుంటాయి, కొన్ని అటునుంచి ఇటు వస్తుంటాయి. కాకుంటే అవి తోకచుక్కలు కావు. మిసిలీలు.

మా తండా బతికేది ఇప్పటికీ పూరిగుడిసెల్లోనే; మట్టి గోడలు, కొబ్బరిమట్టలతో నేసిన పైకప్పులు. మా బతుకుతెరువు అడవి కొబ్బరికాయలు కొట్టుకురావడం. పగలంతా అడవిలో తిరిగి కొబ్బరికాయలు కొట్టుకొచ్చి అలసిపోయి సాయంకాలం తండాకి రాగానే, మా గుడిసెల ముందు చేరగిలపడిపోయి ఆకాశాన్ని చూడ్డం మాకు అలవాటు. కొందరు గుమ్మాల మీద కూర్చుని, కొందరు చింకిచాపలేసుకుని వాటి మీదా, ఇంకొందరు గొంతుక్కూర్చుని, మా మధ్య గోసిమొలతో బానపొట్టలేసుకుని పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆకాశం కేసి శుక్లాలు పాకిపోయిన కళ్ళేసుకుని మేమంతా అలా ఆకాశం కేసి చూస్తూ వుంటాం. ఇదేమీ మాకు కొత్త కాదు. ఎన్నో తరాలుగా మా తండా అలా ఆకాశం కేసి చూస్తూనే ఉంది. ఒకప్పుడు మరీ ఇంతగా కాదు కానీ ఆకాశంలో తోకచుక్కల హడావిడి ఎక్కువైన దగ్గర్నుంచీ మేము చూడ్డం కూడా ఎక్కువైంది. విమానాలు, తెల్లగా పొగతో గీతలు గీసుకుంటూ రాకెట్లతో మొదలైంది. ఇప్పుడు తోకచుక్కల్లా మిసిలీలు కూడా. అవి ఎంత ఎత్తులో పోతాయో, ఎంత వడిగా పోతాయో తెలీదు కానీ, పడమర ఆకాశంలో కింది అంచున పెద్ద నక్షత్రం పక్కగా కళ్ళు చికిలించి జాగ్రత్తగా చూస్తే ఉన్నట్టుండి ఒక చిన్న రవ్వలాగా, మిణుక్కుమని మెరిసి తూర్పు వైపుకు రయ్యిమని దూసుకుంటూ పోయి మాయమై పోతుంటాయి. మా తండాలో వయసెళ్ళినవాళ్ళు ఆ మెరుపును చూస్తే చాలు, దాని గురించి చెప్పగలరు, “ఒరే! ఈ మిసిలీది కనీసం గంటకు వెయ్యి మైళ్ళ వడిరా! నా లెక్క తప్పుకాకపోతే పోయిన గురువారం మిసిలీ కంటే కొంచెం వేగిరంగానే పోతున్నట్టుంది.”; “పోయిన మాసికంలో, అమాశ రోజు పోయిందిరా అదీ మిసిలంటే, కడిమికి చూసుకున్నా కనీసం రెండువేల మైళ్ళుంటదేమో దాని వడి.” ఇలాగా మాట్లాడుకుంటారు.

ఈ మిసిలీలంటే మాకు బోల్డంత ఉత్సాహం. ఎందుకంటే, మా తండా స్వాములు ఎప్పణ్ణుంచో మాకు చెప్తుందొకటే. వాళ్ళకొకసారి దేవుడు కనిపించి చెప్పాడట ఒక మంచి శకునం కోసం ఎదురు చూడమని. ఏదో ఒకరోజు పడమటి ఆకాశంలో పెద్ద నక్షత్రం పక్కగా ఒక తోకచుక్క మెరుపులా మెరిసి తూర్పు దిక్కు వెళుతుందిట. అదిట ఆ మంచి శకునం. అప్పుడు తండాకి మంచిరోజులొస్తాయిట. తరతరాలుగా వస్తున్న ఈ దరిద్రం వుండదట. ఈ కోండలూ, ఆ ఏరు పారే లోయా, ఇవన్నీ మా సొంతమైతాయట. అలా అని దేవుళ్ళంతా వరమిచ్చారట. ఈ జోస్యం మా తాతలూ నమ్మారు, మా నాన్నలూ నమ్మారు. వినీ వినీ మాకూ నమ్మకం పడిపోయింది. అందుకేనేమో, ఇప్పుడున్న దరిద్రం నుంచి బైట పడ్డానికి ఇంక దారి వెతుక్కోవచ్చేమో అని కూడా తట్టదు మాకు. ఎందుకూ అనవసరంగా ప్రయాస! మా స్వాములకు ఎట్లానూ తెలుసు, ఆ తోక చుక్క ఏదో, అది ఎప్పుడొస్తుందో. వచ్చినప్పుడే చెప్తారు మా అందరికీ. ఇప్పటికైతే మనం చేయగలిగింది ఆకాశం కేసి చూస్తుండటమే. మా తండాలో మాత్రం అందరికీ ఇప్పుడదే ధ్యాస. అందరూ మిసిలీల గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకపక్క కొడవళ్ళు, మడ్డుకత్తులతో అడవి కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు కూడా మా మాటలన్నీ మిసిలీల గురించే.